మెయన్ ఫీచర్

తెలుగు మహాసభల చుట్టూ తెలుగు భాష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరివి, ఎవరివి ఈ సభలు?
జలగం బలగంవి ఈ సభలు!
ఎందుకు, ఎందుకు ఈ సభలు?
దొరల విందులకు ఈ సభలు!
అంటూ మొదటి ప్రపంచ తెలుగు మహాసభల్ని నిరసిస్తూ శ్రీశ్రీ రాసిన కవితలోని పంక్తులివి. 1975లో ఎమర్జెన్సీకి నెల ముందున ఏప్రిల్ 12-18 దాకా ఉగాదిన మొదలై వారం రోజులపాటు హైదరాబాద్‌లో జరిగిన ఈ సభల సందర్భంగా రవీంద్రభారతి ముందు నిరసన చేపట్టిన శ్రీశ్రీతోపాటు, అనేకమందిని నాటి వెంగళ్‌రావు ప్రభుత్వం అరెస్టు చేసింది. నాటి సంఘటన నేడు ఎంతమందికి గుర్తుందో తెలియదుగాని, నాటి నిరసనలో పాల్గొన్న కొందరు నేటి ప్రభుత్వ పాలనలో భాగస్వాములయ్యారు. అలాగే తెలంగాణ ఉద్యమకాలంలో ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికై తిరుపతిలో 2012 డిసెంబర్‌లో 27-29 మధ్యన కిరణ్‌కుమార్ రెడ్డి జరిపించిన 4వ ప్రపంచ తెలుగు మహాసభల్ని బహిష్కరించాలని పిలుపునిచ్చినవారు సైతం నేటి పాలకపక్షంలో చేరిపోవటం జరిగింది. అయితే ఇందులో అభిశంసించాల్సిన అంశం ఏంటని అనుకుంటే, నాటికి, నేటికి గల తేడా ఏంటనేదే నేటి ప్రశ్న!
తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటాలని (కాపాడాలని కాదు..) పాలకులు పాకులాడడం కొత్తేమీ కాదు. అధికార భాష సంఘంతో పాటు, తెలుగు అకాడమి, తెలుగు విశ్వవిద్యాలయం, సాహిత్య అకాడమీలు కూడా మనకున్నాయి. వీటికి తోడు తెలుగు భాష రక్షణ పేరున ఏదో కార్యక్రమం, సభలు, సమావేశాలు జరుగుతూనే వుంటాయి. మొదటిసారి 1974లో నిజాం కాలేజీ ఆవరణలో రాష్ట్ర స్థాయి తెలుగు మహాసభలు మొదలు, 1975లో మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు, 1981లో కౌలాలంపూర్‌లో, 1990లో మారిటస్‌లో, దుబాయిలో రెండవ, మూడవ మహాసభలు జరిగాయి. తిరుపతిది నాలుగవ మహాసభ అయితే, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం జరపబోయేది అయిదో మహాసభ అవుతుంది. పై సభల్ని తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 15-19లలో జరపబోయే సభల సందర్భంగా గుర్తిస్తుందా అనేది మరో ప్రశ్న! మొదటి మహాసభల సందర్భంగా వెంగళ్‌రావు ప్రభుత్వం 40 లక్షలకుపైగా ఖర్చుచేయడం వృధా ప్రయాస అనేది నాటి ఆలోచనాపరుల నిరసనకు కారణం కాగా, నిధులు దుర్వినియోగం కావడం తెలిసిందే! ఈ సభల సందర్భంగానే ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ..’ అనే రాష్ట్రీయ గీతాన్ని శంకరంబాడి సుందరాచార్యతో రాయించడం జరిగింది. దీన్ని ఆలపించడానికై నాటి నటి, గాయకురాలు అయిన టంగుటూరి సూర్యకుమారిని లండన్ నుంచి రప్పించడం జరిగింది. తెలంగాణ ఉద్యమకాలంలో ఈ పాట కూడా వివాదాస్పదం అయింది తెలిసిందే! నాటి విద్యామంత్రి మండలి వెంకట కృష్ణారావు ప్రోద్బలంతో జరిగిన ఈ సభల్లో ఎం.ఎస్.రామారావు సుందరకాండను వినిపించడం కూడా జరిగింది. ప్రభుత్వ స్థాయిలో తెలుగుకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఇవ్వకుండా ఆడంబరంగా జరిపే ఇలాంటి మహాసభలతో దుబారా (ప్రస్తుతం 55 కోట్లు) తప్ప తెలుగు భాషకు ఒరిగేది ఏమీ లేదనేది తెలుగు భాషా అభిమానుల ఆరోపణలు!
ఈ నేపథ్యంలోనే నాడు కిరణ్‌కుమార్‌రెడ్డిని విమర్శించడం జరిగింది. అయినా, తెలంగాణకోసం గళం విప్పిన కొందరు చాటుమాటున తిరుపతి వెళ్లి సన్మానాల్ని మెడలో వేసుకొని రావడం కూడా తెలిసిందే. ఇలాంటి తంతు కార్యక్రమాల్ని ప్రభుత్వాలు జరపడం కొత్తేమీ కాదు. వీటి నేపథ్యంలో విదేశాల్లో వున్న తెలుగువారిని, తెలుగు తేజాల్ని (రాష్ట్రానికి, భాషకు జరుగుతున్న అన్యాయం గూర్చి మాట్లాడనివారు..) ఒక వేదికపైకి తీసుకురావాలనే ముసుగులో విదేశీయానం చేయడం రాజకీయవాదులకు, వీరి వీరాభిమానులకు ఓ సరదా! ఈ చర్యలతో తెలుగు భాషకు ఒరిగింది, ఒరుగుతున్నది, ఒరుగబోయేది శూన్యమని, నేటి తెలుగు భాష దుస్థితిని చూస్తే తెలియడం లేదా? ఈ చర్యలన్నీ, తెలుగు భాషను పాఠ్య ప్రణాళికలనుంచే దూరం చేసాయి తప్ప కాపాడలేకపోయాయి. చివరికి, తెలంగాణ భాషకు అన్యాయం జరిగిందని ఉద్యమకాల ఎజెండాగా భావించిన తెరాస ప్రభుత్వం, అధికార భాషా సంఘాన్ని పునరుద్ధరించి, అనుంగుల్ని అధికారమెక్కించిందేగానీ, తెలుగు భాషను కనీసంగా ప్రభుత్వ స్థాయిలో కచ్చితంగా అమలుచేయాలని, ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలని నిర్దేశించలేకపోయింది. పైగా, ఆంగ్ల మాధ్యమం పాఠశాలల్ని ప్రభుత్వ రంగంలోనే ప్రారంభించడం, సిబియస్‌ఇ సిలబస్‌ను అమలు చేస్తామని బాహాటంగా ప్రకటించడం కొసమెరుపు!
నిజానికి, ఏ భాష అయినా ప్రజల నాలుకలనుంచే జాలువారుతుంది. బతికి బట్టకడుతుంది. రక్షించబడుతుంది. కాని, ఆ భాషను శాశ్వత సమాధి చేయడానికి, ఆ నాలుకల్ని తెగకోయడానికి ప్రభుత్వమే పూనుకుంటే ఏమనాలి?
ప్రాచీనకాలం నుంచి రాచరిక వ్యవస్థ దాకా, వలసవాదుల కాలంలో, చివరికి నైజాంల కాలంలో తెలుగుకున్న ప్రాధాన్యత, ప్రజాస్వామ్య ముసుగు తొడుక్కున్న అభినవ పాలకుల హయాంలోనే క్రమంగా తగ్గడం శోచనీయం? క్రీ.పూ.350-200 మధ్యన శాతవాహనుల కాలంలో తెలుగు ప్రాకృత భాషగా వెలుగొందినట్లు, నాటి నాణేలపై వాడినట్లు కోటిలింగాల దగ్గర తవ్విన తవ్వకాల్లో బయటపడింది తెలిసిందే! అలాగే క్రీ.శ.575-1022 మధ్యన ఏలిన ఆంధ్ర ఇక్ష్వాకుల కాలంలో, తిరిగి కృష్ణదేవరాయల కాలంలో తెలుగు ఓ వెలుగు వెలిగినట్లు చరిత్ర పుటలు తిరగేసేవారికి తెలుస్తూనే వున్నది. అలాగే ఆరవ శతాబ్దంలో గుణాడ్యుడనే కవి ప్రాకృతంలోనే మొదటి కావ్యం రాసిండని, అవి గుర్తింపునకు నోచుకోకపోవడంతో అగ్నికి ఆహుతి ఇచ్చాడని కథనాలు! ఇలాంటి తెలుగు కవిత్రయంతో ఓ వెలుగు వెలిగి, గిడుగు, గురజాడ లాంటి వారితో ఆధునీకరించబడి, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్‌గా కీర్తించబడుతూనే, తెలుగుకు ప్రాచీన హోదాను సాధించడంలో తమిళులకన్నా, కన్నడీయులకన్నా వెనుకబడడం ఏమనాలి. 2004లో తమిళులు, 2008ల కన్నడిగులు పట్టుపట్టి వారి భాషలకు ప్రాచీన (క్లాసికల్) హోదాను సాధించుకుంటే, విధి లేక మన పాలకులు గొంతు కలిపారు. ఇప్పుడన్నా తెలివి వచ్చిందా అంటే, అదీ లేదు. తెలుగు పీఠాన్ని ఏర్పాటుచేయడానికి నాటి రోశయ్య ప్రభుత్వం, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో, కన్నడ భాషతోపాటు తెలుగు పీఠాన్ని బెంగుళూరులో ఏర్పాటుచేయాల్సిన దుస్థితి దాపురించింది. పోనీ తెలంగాణ ఏర్పడిన తర్వాతనన్నా ఈ విషయంగా ఏమైనా ప్రయత్నం జరిగిందా అంటే అదీ లేదు.
హిందీ, బెంగాలి తర్వాత దేశంలో అత్యధికంగా ప్రజలు మాట్లాడే భాష తెలుగేకాక, ప్రపంచ స్థాయిలో వివిధ జాతులు మాట్లాడుకునే భాషల జాబితాలో తెలుగు 15వ భాషగా గుర్తించబడిందంటే, ప్రజలు ఇంకా తెలుగును ఎలా కాపాడుకుంటున్నారో తెలుస్తున్నది. అమెరికాలో మాట్లాడే భారతీయ భాషల్లో హిందీ, గుజరాతి తర్వాత తెలుగేనని ఈమధ్యన వార్తా కథనాలు. ఇంతగా ప్రాధాన్యత గల తెలుగుకు ప్రభుత్వ పరంగా, పాలనా పరంగా, పాఠ్యాంశాల పరంగా సమాధి కడుతూ తెలుగు భాషకు తామే సంరక్షకులమని కోట్లాది రూపాయల్ని కుమ్మరించి మహాసభల్ని జరపడం ఎవరికోసమో నిజమైన తెలుగు భాషాభిమానులు అర్థం చేసుకోవడమే కాదు, నిలదీయాల్సిన అవసరం కూడా వుంది. ఈ సందర్భంగా రెండాకులు ఎక్కువే చదివిన చంద్రబాబు కూడా ఇలాంటి సభల్ని ఏ స్థాయిలో నిర్వహిస్తారో ఊహించుకోవచ్చు! కనీసం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు పక్క రాష్ట్రాలవలే ప్రభుత్వ కార్యకలాపాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు విధిగా తెలుగులోనే సాగాలని ఆదేశించినా అభినందించేవాళ్ళం. పాఠశాల విద్యలో సిబియస్‌ఇ పాఠశాలలతో సహా అన్ని ప్రైవేట్ పాఠశాలలలో మొదటి భాషగా తెలుగును అమలుచేయాల్సిందేనని నిర్దేశించలేని ప్రభుత్వాలు మనవి. తెలుగు మహాసభల్ని దృష్టిలో పెట్టుకొనే కావచ్చు, 12వ తరగతి దాకా అన్ని పాఠశాలలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలుగును ఓ భాషగా ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రభుత్వం బహుశా ఆదేశించి వుంటుంది. అప్పటికి ఈ మహాసభలు ముగుస్తాయి, తర్వాత వచ్చేదంతా ఎన్నికల కాలమే కాబట్టి, అమలు జరిగినా, జరక్కపోయినా ఫర్వాలేదనేది ప్రభుత్వ ధీమా కావచ్చు! ఇలాంటి ఉత్తర్వుల్ని గతంలో చాలా ప్రభుత్వాలు ఇచ్చి, పట్టించుకోని వైనం తెలిసిందే! పుస్తకాల భారం తగ్గించాలని ఈమధ్యనే తెరాస ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు, ఫీజుల్ని నియంత్రిస్తూ ఇచ్చిన జీవోలు ఎలా అమలవుతున్నాయో కూడా అనుభవంలో వున్నవే!
పైగా మొదటి ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా నిర్దేశించిన తొమ్మిది మిషన్సుల్లో మూడో పాయింటు, ప్రభుత్వ స్థాయిలో, విద్యాలయాల్లో, సమాచార శాఖలో విధిగా తెలుగును వాడాలని వుంది. నాలుగు దశాబ్దాలు గడిచాయి. అప్పట్నుంచి రాష్ట్రం విడిపోయేదాకా దాదాపు డజన్ ముఖ్యమంత్రులు మారారు. కొందరు రెండు దఫాలుగా పాలించారు. ఇందులో తెలుగు గూర్చి కొంచెం ఎక్కువగా మాట్లాడింది ఎన్‌టిఆరే! చివరికి ఉద్యోగాల్లో తెలుగు మాథ్యమంలో చదువుకున్నవారికి రిజర్వేషన్ ఇవ్వాలనే ఆలోచన చేయడం, తెలుగులో పరిపాలన వ్యవహారాలు సాగాలని కోరినా, ఆంగ్ల భాషకు మరిగిన అధికార బృందం వాటిని సాగనీయలేదు. పోనీ, ఇప్పుడన్నా ఈ ఆలోచనలు తిరిగి రూపుదిద్దుకుంటున్నాయా అంటే, కనీస దూరంలో ఇరు రాష్ట్రాల్లో కానరాని వైనం! ఇప్పుడైతే హిందీ రాష్ట్రాల తర్వాత, తెలుగును మాట్లాడే ప్రాంతాలు యానాంతో కలుపుకొని మూడుకు పెరిగాయి. ఇది బలుపేకాని, వాసి కాదని తెలిసినా మాతృభాషకు మరణదండన విధిస్తున్న పాలకుల్ని నిలదీయకపోవడం మన నిర్లక్ష్యం కాదా? గిడుగు జన్మదినాన్ని తెలుగు భాషా దినోత్సవంగా, ఫిబ్రవరి 21ని మాతృభాషా దినోత్సవంగా ప్రభుత్వాలు మొక్కుబడిగా జరిపి తెలుగు భాషను రక్షిస్తున్నట్లు నటిస్తున్నంతకాలం భాష బలిపీఠంపైనే వుంటుంది. ప్రజలు మాట్లాడినంతకాలం భాషకు మరణం లేదని నమ్మినా, ప్రజలు మాట్లాడకుండా ప్రభుత్వమే మాయచేస్తుంటే ప్రపంచంలో కనుమరుగైపోతున్న భాషల్లో తెలుగు చేరిపోవటంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ఈ ప్రమాద ఘంటికలు వినపడుతూనే వున్నాయి. సరదాకు కవిత్వాన్ని రాయడానికో, సాహిత్య సృష్టికో తెలుగును వాడి, ఇంట్లో మాట్లాడడానికి ఇబ్బందిపడే రచయితలు కూడా తెలుగును సమాధి కడుతున్నట్లు కాదా! వీరి రచనలు పాఠకులు చదవాలని, సన్మానాలు, సత్కారాలు దండిగా జరగాలని కోరుకునే ఇలాంటివారే ఈ సభలకు దోహదపడటం మరో వింత! ఇలాంటి వారిని ప్రోత్సహించి, ప్రభుత్వం భుజాలపై మోయాలనుకుంటే, అందుకే ఈ మహాసభలైతే బతికేది తెలుగు భాష కాదు, బతకడం తెలిసిన ఓ వర్గమే!

- డా. జి.లచ్చయ్య సెల్: 94401 16162