మెయన్ ఫీచర్

వేధింపుల నిరోధానికి సమగ్ర చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేధింపులకు పాల్పడేవారికి కఠిన శిక్షలకు సంబంధించిన సమగ్ర చట్టం భారతదేశంలో లేదనే చెప్పాలి. వేధింపులకు శిక్షలు ఉన్నా, వేధింపులు జరిగినట్టు రుజువు చేసేందుకు సాక్ష్యాధారాలు లేకపోవడంతో అవన్నీ కోర్టుల ముందు నిలవలేకపోతున్నాయి. పోలీసు కస్టడీలో నాలుగు గోడల మధ్య జరిగే వేధింపులను బాధితుడు రుజువు చేసుకునే స్థితి ఎన్నడూ లేకపోవడంతో యధేచ్ఛగా వేధింపులు జరుగుతున్నాయి. అంతా తెలిసినా చట్టం ముందు సరైన ఆధారాలను చూపలేక బలహీనులుగా ఉండిపోతున్నారు. న్యాయస్థానాలు సైతం ఏదో జరిగిందనే భావనతో ఉన్నా శిక్షలు వేసేందుకు సరిపడా ఆధారాలు లేక నిస్సహాయంగా ఉండిపోతున్నాయి.
ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్-1872, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ -1973 (సిఆర్‌పిసి) , ఇండియన్ కాంట్రాక్టు యాక్ట్ -1872 లలో వేధింపులకు పాల్పడిన వారికి శిక్షలకు సంబంధించి వివరణ ఉన్నా, అసలు వేధింపు అంటే ఏమిటి? దాని తీవ్రత ఎంత? ఏ తీవ్రత ఉన్న అంశాన్ని వేధింపులుగా పరిగణించవచ్చనే చర్చతో కూడిన సమగ్ర చట్టం దేశంలో లేదు. జైళ్లలో సహజ మరణాలు, లాకప్‌డెత్‌లు, ఖైదీలను వేరే ప్రాంతానికి తరలించినపుడు జరుగుతున్న మరణాలు కోకొల్లలు, కోర్టు మెట్లు ఎక్కకుండానే ఆ కేసులు చచ్చిపోతున్నాయి. ఎంతో కొంత పరిహారం చెల్లించి ఆ కేసులను బుట్టదాఖలు చేస్తున్న అనుభవాలు ఇప్పటివి కావు, దశాబ్దాలుగా అన్ని రాష్ట్రాల్లోనూ జరుగుతున్నాయి. పనిభారంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న సిబ్బందికి సంబంధించి బాధ్యులను తేల్చే చట్టాలు కూడా మన దేశంలో లేవు. గత మూడేళ్లలో కనీసం ఆరుగురు పోలీసు సిబ్బంది ఆత్మహత్యకు పాల్పడటం దానికి ఉన్నతాధికారుల వేధింపులే కారణమనే ఆరోపణలు రావడం మనకు తెలిసిందే. కొన్నిమార్లు ఖైదీలను తరలిస్తున్నపుడు జరుగుతున్న ఎన్‌కౌంటర్లు కూడా చూస్తున్నాం, బేడీలు వేసిన ఖైదీలు తప్పించుకునే ప్రయత్నం చేశారని పోలీసులు చెప్పినపుడు పత్రికలు ఘోషించడమే తప్ప వాటి సాక్ష్యాధారాలను విచారించేందుకు అవసరమైన చట్టాలు లేనే లేవు. లాకప్‌డెత్‌లు జరిగినపుడు ఆ అంశాలు సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగినపుడు కూడా సహేతుకమైన పరిష్కారాన్ని కనుగొనేందుకు రాజ్యాంగంలోనూ చట్టాలలోనూ అవసరమైన నియమనిబంధనలు లేవని సుప్రీంకోర్టు గుర్తించింది. 2016లో రిట్ పిటిషన్ సివిల్ 738 కేసు విచారణ సందర్భంగా ఐక్యరాజ్య సమితి వేధింపుల నియంత్రణ మార్గదర్శకాలను భారత్ పాటించడం లేదనే చర్చపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ అంశంపై అధ్యయనం చేసి తగిన మార్గదర్శకాలను భారత్ ప్రభుత్వానికి ఇవ్వాలని లా కమిషన్‌ను ఆదేశించింది. ఆ మేరకు లా కమిషన్‌కు 2017 జూలై 8న వచ్చిన ఆదేశానుసారం రిపోర్టు 273ని రూపొందించి కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ బి ఎస్ చౌహాన్ కేంద్ర న్యాయ శాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్‌కు అందజేశారు. ఈ నివేదికలో వేధింపుల నియంత్రణ ముసాయిదా చట్టం ప్రతిని కూడా పొందుపరిచారు.
కొత్త చట్టం అనివార్యం
చట్టాలను నవీకరించడం, సవరించడంతోపాటు ఐక్యరాజ్య సమితి మార్గదర్శకాలను పాటించడం, సిఆర్‌పిసి, ఎవిడెన్స్ యాక్ట్‌లలో ఉన్న లొసుగులు సరిదిద్దడం చాలా ముఖ్యమని కూడా లా కమిషన్ సూచించింది. సెక్షన్ 357బిలో పరిహారం చెల్లింపును చేర్చాలి. ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 326ఎ, సెక్షన్ 376డి ఉన్న పరిహారానికే పరిమితం కాకుండా జరిమానా కూడా విధించాలి. ఎవిడెన్స్ యాక్ట్ -1872లో కూడా సవరణలు అవసరమని లా కమిషన్ పేర్కొంది. గతంలో లా కమిషన్ ఇచ్చిన రిపోర్టు 113లోనూ, 152లోనూ పేర్కొన్న అంశాలను ఎవిడెన్స్ యాక్ట్‌లో 114 బిలో చేర్చాల్సి ఉంది. పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తి గాయపడితే దానికి పోలీసులే బాధ్యులుగా గుర్తించి గాయాలకు కారణాలను పోలీసులే రుజువు చేసుకోవల్సి ఉంటుంది. దీంతోపాటు గాయాలకు చికిత్సకు, మానసిక క్షోభకు కూడా జరిమానాలు విధిస్తూ నివేదికను సమర్పించింది. ఈ నివేదికపై జస్టిస్ బి ఎస్ చౌహాన్‌తో పాటు సభ్యులు జస్టిస్ రవి కె త్రిపాఠి, ప్రొఫెసర్ ఎస్ శివకుమార్, డాక్టర్ సంజయ్ సింగ్, సురేష్ చంద్ర, డాక్టర్ జి నారాయణ రాజు సంతకాలు చేశారు.
టోక్యో ప్రకటన
ప్రపంచ మెడికల్ అసోసియేషన్ 1975లో చేసిన టోక్యో ప్రకటనతో వేధింపు అంశానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యత ఏర్పడింది. మహ్మద్ నయ్యర్ అజాం వెర్సస్ స్టేట్ ఆఫ్ ఛత్తీస్‌గఢ్ కేసులో వేధింపు అంటే ఏమిటో నిఘంటు నిర్వచనాన్ని న్యాయస్థానం ఉటంకించింది. ఏ రకమైన గాయమైనా, గాయపడితే చాలు అది వేధింపు కిందకు వస్తుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. 2002లో రాజ్యాంగం సమీక్షకు ఏర్పాటు చేసిన జాతీయ కమిషన్ సైతం వేధింపులను నియంత్రించాల్సిందేనని పేర్కొంది. ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 21(2)లో ఇందుకు సంబంధించిన నిబంధనలను చేర్చాలని పేర్కొంది. జీవించే హక్కు ఆర్టికల్ 21 కింద ఎవరూ వేధింపులకు గురికాకుండా రక్షణ కల్పించబడిందని కూడా సుప్రీంకోర్టు గతంలో పలు సందర్భాల్లో పేర్కొంది. 1948 అంతర్జాతీయ మానవ హక్కుల డిక్లరేషన్‌ను సుప్రీంకోర్టు గుర్తుచేసింది. ఆర్టికల్ 5,7 కింద ఐసిసిపిఆర్ సైతం వేధింపులను నిరోధిస్తోంది. పోలీసు కస్టడీలో వేధింపులపై లా కమిషన్ గతంలో ఇచ్చిన 113వ రిపోర్టు, కస్టడీ నేరాలపై ఇచ్చిన 152వ రిపోర్టు, అరెస్టులు చేయడంలో ఉల్లంఘనలపై లా కమిషన్ ఇచ్చిన 177వ రిపోర్టు, ఎవిడెన్స్ యాక్ట్‌లో చేయాల్సిన సవరణలపై ఇచ్చిన 185వ రిపోర్టులో లా కమిషన్ సమగ్రమైన పలు సూచనలు చేసింది. ఆ తర్వాత బెయిల్‌కు సంబంధించి కూడా తన 268వ రిపోర్టులో ప్రస్తావన చేసింది. నేషనల్ పోలీసు కమిషన్ -1980లో ఇచ్చిన నాలుగో రిపోర్టులో కూడా కస్టడీ మరణాలపై ప్రస్తావన చేసింది. ఇండియన్ పీనల్ కోడ్ -1860 సెక్షన్ 330-331 కింద వేధింపులు శిక్షార్హమేనని అందుకు శిక్షలను కూడా ఖరారు చేసింది. అయితే వేధింపు జరిగినట్టు రుజువులు మాత్రం లభించకపోవడంతో అలాంటి కేసులు న్యాయస్థానాల ముందు నిలవడం లేదు.
వేధింపు అంటే ఏమిటి దాని పరిమితి, నిర్వచనం, తీవ్రత, పరిణామాలను పేర్కొంటూనే ప్రపంచవ్యాప్తంగా వేధింపులకు సంబంధించి ఉన్న చట్టాలు, సూచనలు, మార్గదర్శకాలు, నియమనిబంధనలు కూడా లా కమిషన్ తన సిఫార్సుల్లో పేర్కొంది. వేధింపు స్వచ్ఛందంగా చేసేది కావచ్చు, కావాలని చేసేది కావచ్చు, అది భౌతికంగానో, మానసికంగానో, శారీరకంగానో ప్రభావితం చేయవచ్చు, లేదా దీర్ఘకాలికంగా మనసుపై ప్రభావితం చేసేది కావచ్చని పేర్కొంది. వివిధ కమిషన్లు వేధింపులకు సంబంధించి చేసిన సూచనలు, సిఫార్సులు అదే విధంగా రాజ్యాంగంలో ఉన్న నియమాలు, న్యాయవ్యవస్థ వివిధ సందర్భాల్లో స్పందించిన తీరు, మరణాలకు సంబంధించి పరిహారంపై ఉన్న నిబంధనలు కూడా వివరించింది. తుదకు 10 సూచనలు కూడా చేసింది.
ఇదీ నేపథ్యం
రాజ్యాంగంలో ఆర్టికల్ 20(3)లో నేరారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తి తనకు తానుగా సాక్షిగా నిలవడానికి వీలు లేదని స్పష్టం చేసింది. విచారణ సమయంలో వౌనంగా ఉండాలే తప్ప తనకు తానుగా వాదిగా మారడానికి వీలు లేదు. యోగీందర్ కుమార్ జైస్వాల్ వెర్సస్ స్టేట్ ఆఫ్ బిహార్ (ఎఐఆర్ 2016 ఎస్‌సి 1474)కేసులో న్యాయస్థానం ఈ విషయం స్పష్టం చేసింది. అలాగే పాలిగ్రాఫీ ద్వారా, బ్రెయిన్ ఫింగర్ ప్రింటింగ్ పరీక్షల ద్వారా వచ్చినా ఆధారాలు సాక్ష్యాలుగా పరిగణిస్తున్నా ఆర్టికల్ 20(3) ప్రకారం అవి చెల్లవు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ -1872 సెక్షన్ 27 ప్రకారం నిందితుడిని వేధించి సేకరించిన సాక్ష్యాలు కూడా న్యాయస్థానం ముందు నిలవవు. నిర్ణీత పద్ధతిలో చట్టాన్ని పాటించకుండా చట్టం ఉల్లంఘిస్తూ ఏ వ్యక్తికీ జీవించే హక్కును నియంత్రించేందుకు మన రాజ్యాంగంలోని ఆర్టికల్ -21 అంగీకరించబోదు. సునీల్ భత్ర వెర్సస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ కేసులో (ఎఐఆర్ 1980 ఎస్సీ 1579, ఎఐఆర్ 2016 ఎస్సీ 993)లో కూడా సుప్రీంకోర్టు జీవించే హక్కుపై చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. ఆర్టికల్ 22(1), 22(2)ల ప్రకారం కొన్ని కేసుల్లో అరెస్టు కాకుండా ఉండే భద్రత కూడా రాజ్యాంగం కల్పించింది. అరెస్టు తప్పనిసరైతే అందుకు సంబంధించిన కారణాలను తెలియజెప్పాల్సి ఉంటుంది. నరహరసింగ్ యాదవ్ వెర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎఐఆర్ 2011 ఎస్సీ 1549), ఇంద్రజిత్ వెర్సస్ ఉత్తరప్రదేశ్ (ఎఐఆర్ 1979, ఎస్సీ 1867), ఎకె గోపాలన్ వెర్సస్ స్టెట్ ఆఫ్ మద్రాస్ (ఎఐఆర్ 1950, ఎస్సీ 27) పిటీషన్లలలో కూడా సుప్రీంకోర్టు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 లోని సెక్షన్ 24 గురించి వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంతోనే లా కమిషన్ తాజా నివేదికను రూపొందించింది.
ప్రధాన సూచనలు
వేధింపులకు పాల్పడే ప్రభుత్వ అధికారులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించాల్సిన అవసరం ఉందని లా కమిషన్ అభిప్రాయపడుతోంది. విదేశాల్లో తలదాచుకునే నేరస్థులను మన దేశానికి తీసుకు రప్పించడంలో ఎదురవుతున్న అవరోధాలను అధిగమించేందుకు వీలు కల్పించే ఐక్య రాజ్య సమితి ఒప్పందాన్ని ప్రభుత్వం ఆమోదించాలనేది లా కమిషన్ ప్రధాన సూచన. వేధింపుల నిరోధానికి సంబంధించిన ఐక్యరాజ్య సమితి ఒప్పందంలో భారత ప్రభుత్వం చేరాలని నిర్ణయించుకుంటే ప్రభుత్వ అధికారుల వేధింపులను నివారించేలా వివిధ చట్టాలను సవరించాలని అందుకు వీలుగా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని న్యాయ మంత్రిత్వశాఖకు సమర్పించిన ప్రతిపాదనలో పేర్కొంది. వేధింపులకు పాల్పడే వారికి యావజ్జీవ శిక్షతో పాటు కొంత జరిమానా విధించాలని అందుకు వీలుకల్పించేలా వేధింపుల నిరోధక బిల్లు 2017 ముసాయిదాను రూపొందించారు. వేధింపులకు పాల్పడిన వారికి ఐపిసి కింద జరిమానా విధించడంతో పాటు బాధితులకు పరిహారం కల్పించేందుకు వీలుగా కొన్ని నిబంధనలను సవరించాల్సి ఉంది. భారతీయ సాక్ష్యాల చట్టంలోనూ కొన్ని సెక్షన్లను కొత్తగా చేర్చాల్సి వస్తుంది. అపుడు పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తికి ఏమైనా గాయమైతే అవి ఎందుకయ్యాయో కూడా వివరించాల్సి వస్తుంది. ఆ బాధ్యత సంబంధిత అధికారులపైనే ఉంటుంది. గాయాల తీవ్రత, అది చూపే ప్రభావం, మానసిక వేదన తదితరాలను పరిగణనలోకి తీసుకుని న్యాయస్థానాలు సహేతుక నష్టపరిహారాన్ని నిర్ణయిస్తాయి. బాధితులని సామాజిక ఆర్థిక పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకుని వైద్య ఖర్చులను భరించడానికి, పునరావాసానికి వీలుగా పరిహారాన్ని నిర్ణయించాల్సి ఉంటుంది. ఈ చట్టం అమలులోకి వస్తే సుప్రీంకోర్టు భావిస్తున్నట్టు చిట్టచివరి భారతీయ పౌరుడికి సైతం న్యాయం జరిగినట్టవుతుంది.

-బి.వి.ప్రసాద్