మెయన్ ఫీచర్

ఆసియాలో సరికొత్త పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనా కమ్యూనిస్టు పార్టీ 19వ జాతీయ కాంగ్రెస్‌తో ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ బలమైన నాయకుడిగా ఎదగడం, రాజకీయ, సైనిక అధికారాలపై మరింత పట్టు సాధించడం, అంతకుముందే జపాన్ ప్రధానమంత్రిగా షింజో అబే మరింత బలమైన నాయకుడిగా తిరిగి ఎన్ని కావడం గమనిస్తే ఆసియాలో సరికొత్త ఆధిపత్య పోరుకు రంగం సిద్ధమైనట్లు స్పష్టం అవుతున్నది.
ఐదేళ్లకు ఒకసారి జరిగే చైనా కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్‌లో సాధారణంగా యువ నేతలకు ఉన్నత అవకాశాలు కల్పించడం ద్వారా అధికార కేంద్రీకరణ ఒక వ్యక్తి చేతిలో జరుగకుండా వివిధ స్థాయిలలో వారసుల ఎంపికను సంస్థాగతం చేసుకొంటూ వచ్చారు. ముఖ్యంగా డెంగ్ క్సిఅవుపింగ్ కాలం నుండి ఇటువంటి ప్రయత్నం జరుగుతూ వస్తున్నది. అయితే జీ జిన్‌పింగ్ సారథ్యంలో ఈ పర్యాయం యువ నేతలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. 60 ఏళ్ళు పైబడిన వారినే కీలక పదవులలో కొనసాగించి తన ఆధిపత్యాన్ని పెంచుకోగలిగారు. ఇప్పుడు, ఆ తరువాత మరో ఐదేళ్లపాటు కొనసాగే విధంగా తనకు మరెవ్వరూ అడ్డు లేకుండా చేసుకొనే ప్రయత్నం చేసినట్లు స్పష్టం అవుతున్నది. సాధారణంగా చైనా అధ్యక్షులు ఎవ్వరు పదేళ్లుమించి ఉండటం లేదు.
జీ జిన్‌పింగ్ ఆలోచనలను రాజ్యాంగంలో చేర్చడం ద్వారా మార్క్సిజం, మావోజెడొంగ్ ఆలోచనలకు నూతనత్వాన్ని జోడించినట్లు అయింది. 50 ఏళ్ళ ప్రాయంలో ఉన్న తనకు నమ్మకస్తులైన చెన్ మినెర్, హు చుంహుత్‌లకు పదోన్నతి కల్పిస్తారని భావించినా భవిష్యత్తులో నాయకత్వానికి పోటీ కాగలరనే భయంతో వదలివేశారు. పార్టీ అగ్ర నాయకత్వంలో ఆయనతోపాటు పట్ట్భాషేకం చేసిన ఆరుగురు కూడా 60 ఏళ్ళకు పైబడినవారే కావడం గమనార్హం. ఐదేళ్ల తరువాత తనకెవ్వరు పోటీ లేకుండా చేసుకోవడం కోసమే ఈ విధంగా చేసినట్లు అర్థం అవుతుంది. చైనా సామ్యవాదంలో నూతన యుగానికి జిన్‌పింగ్ సారథ్యంలో అడుగు వేయనున్నట్లు ఈ సందర్భంగా ఆమోదించిన తీర్మానంలో పేర్కొన్నారు. వాస్తవానికి జిన్‌పింగ్ ఐదేళ్ల పాలనలో చైనా ఆర్థికంగా, సైనికంగా పలు సంక్షోభాలకు గురవుతూ వస్తున్నది. వృద్ధి రేట్ మందగించడం, ఉపాధి అవకాశాలు తగ్గడం, మతపరమైన ఘర్షణలు పెరగడం చైనా ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నది. భారత్‌తో యుద్ధానికి దిగే ప్రయత్నం చేయడం కూడా పలు విమర్శలకు దారితీసింది. యుద్ధం అంటూ జరిగితే చైనా ఆర్థిక పరిస్థితి మరింత సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉన్నదని నిపుణులు భావించారు.
అయినా రాజకీయంగా తనకు ఎటువంటి అడ్డు లేకుండా చేసుకోగలిగారు. అందుకోసమే డొక్‌లాం విషయంలో భారత్‌పై కాలు దువ్వి ఒక్కడుగు వెనుకకు వేశారు. ఈమధ్యకాలంలో కీలక అధికారాలను తన చేతిలో కేంద్రీకరించుకోగలుగుతున్నారు. చైనా మిలటరీ కమిషన్ చైర్మన్ పదవిని చేపట్టి సైన్యంలోని అత్యున్నత జనరల్స్ నలుగురిలో ముగ్గురిని ఈ కాంగ్రెస్‌లో మార్చివేశారు. సైన్యంలో తనకు అనుకూలంగా వుండే పలువురిని కీలక పదవులలో నియమించారు. ఈ కాంగ్రెస్‌కు హాజరైన మిలటరీ ప్రతినిధులతో 90 శాతం మంది కొత్తవారే కావడం గమనార్హం.
అగ్రశ్రేణి సైనిక శక్తిగా లక్ష్యం
ఈ విధంగా జిన్‌పింగ్ రాజకీయ, సైనిక అధికారాలను కేంద్రీకరింప చేసుకోవడం భారతదేశంపై, ఇతర ఆసియా దేశాలపై, అంతర్జాతీయంగా కూడా పెను మార్పులకు దారితీసే అవకాశం ఉంది. చైనా సైనిక బలగాలను అత్యాధునికం కావించే ప్రణాళికను కాంగ్రెస్‌లో వెల్లడించారు. సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చేయడం కోసం పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఆయుధాల విషయంలో ఉన్న అంతరాన్ని రష్యాతో పదేళ్లలో, అమెరికాతో 2050 నాటికి భర్తీ చేయాలని లక్ష్యంగా ప్రకటించారు. అంటే ప్రపంచంలోనే అగ్రశేణి సైనిక శక్తిగా 2050 నాటికి ఎదగాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.
చైనా అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకోవడం, సైనిక బలగాలని ఆధునీకరించడం ఆసియాలో ఆయుధ పోటీని పెంపొందింపజేస్తుంది. సహజంగానే పొరుగున వున్న భారత్‌పై ఈ పరిణామాలు మరింత ఒత్తిడిని పెంచగలవు. మన సైనిక బలగాలను ఆధునీకరించడం, అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకోవడం పట్ల మరిన్ని నిధులను భారత్ వెచ్చించవలసి రాగలదు.
ఇదే సమయంలో జపాన్‌లో జాతీయవాదిగా పేరొందిన ఇనుమడించిన బలంతో షింజో అబే తిరిగి ప్రధానిగా ఎన్నిక కావడంతో చైనా సవాల్‌ను తీవ్రంగా పరిగణించే అవకాశం వుంది. కొద్ది నెలల క్రితం తీవ్రమైన ప్రజా వ్యతిరేకతతో, ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలతో షింజో రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. అయితే అనూహ్యంగా గత నెలలో మధ్యంతర ఎన్నికలకు వెళ్లడం, పార్లమెంట్‌లో ఉన్న 465 సీట్లలో అధికార కూటమి మూడింట రెండు వంతులకు పైగా సీట్లు గెలుపొందడం, షింజో పార్టీ లిబరల్ డెమోక్రాటిక్ పార్టీకి భాగస్వామ్య పక్షాల అవసరం లేకుండానే ఆధిక్యత లభించడంతో ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేని రాజకీయ సుస్థిరత నేడు జపాన్‌లో నెలకొన్నదని చెప్పవచ్చు.
దానితో చైనా సవాల్‌ను ఎదుర్కోవడానికి జపాన్ తన సైనిక శక్తిని పెంపొందించుకోవడంపట్ల దృష్టిని కేంద్రీకరించనున్నది. ఎన్నికల ఫలితాలు రాగానే దృఢమైన స్వరంతో వెంటనే తన దృష్టిని ఉత్తర కొరియా రెచ్చగొట్టే చర్యల వైపు సారింపనున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటికే ఉత్తర కొరియాపై దాడులకు కాలు దువ్వుతున్న ట్రంప్ దక్షిణ కొరియా ఆయుధ సంపత్తిని పెంపొందించడం అనివార్యం కాగలదు. ఆసియాలో ఈ విధంగా ఆయుధాల పోటీ జరగడం భారత్‌కు ఇబ్బందికర పరిణామం కాగలదు. వౌలిక వసతుల అభివృద్ధి నుండి దృష్టి మళ్లించవలసిన పరిస్థితులు ఏర్పడవచ్చు.
ఆసియాలో ఉద్రిక్తతలు
ముఖ్యంగా దక్షిణ చైనాలో సైనికాధిపత్యం కోసం జిన్‌పింగ్ చేస్తున్న ప్రయత్నాలు ఆసియాలో ఉద్రిక్తతలకు దారితీస్తుంది. అదే సమయంలో ఆక్రమిత కాశ్మీర్ గుండా చైనా నిర్మింపచూస్తున్న ఒన్ బెల్ట్ ఒన్ రోడ్ సహితం భారత్ భద్రతకు సవాల్‌గా మారనుంది. ఆర్థిక వ్యవస్థలో చేపట్టిన వ్యవస్థాగత మార్పులనుండి రక్షణ రంగంవైపు భారత్ వనరులను మళ్లించవలసిన పరిస్థితులు ఏర్పడే అవకాశం వుంది. స్పష్టమైన మెజారిటీతో తిరిగి అధికారం చేపట్టిన షింజో తన పూర్వపు విధానాలను మరింత దృఢంగా కొనసాగిస్తారు. అమెరికాతో పొత్తును బలోపేతం చేసుకోవడం, చైనా విషయంలో మరింత క్రియాశీల రక్షణ, విదేశాంగ విధానాలు చేపట్టడం, ద్రవ్య విధానాన్ని మెరుగుపరచుకోవడం కాగలవు. పార్లమెంట్ ఉభయ సభలలో స్పష్టమైన ఆధిక్యత నెలకొనడంతో యుద్ధాన్ని తిరస్కరించే విధంగా ఉన్న జపాన్ రాజ్యాంగంలోని 9వ ఆర్టికల్‌ను సవరించే అవకాశం వుంది. ఆర్టికల్ 9 ప్రకారం భూ, నావికా, వైమానిక దళాలను పెంచుకోవడంపై సాంకేతికంగా జపాన్ రాజ్యాంగ నిషేధం విధిస్తున్నప్పటికీ స్వయం రక్షణ దళాల పేరుతో జపాన్ ప్రభుత్వాలు దేశ రక్షణ పట్ల దృష్టి సారిస్తున్నాయి. చైనా ప్రాంతీయ దురహంకార ధోరణులు పెరుగుతూ ఉండటం, ప్రాంతీయ భద్రత కోసం గతంలో వలే అమెరికా అండగా ఉంటుందనే నమ్మకాలు తొలగుతూ ఉండటంతో ఈ ఆర్టికల్‌ను తొలగించాలనే వాదనలు పెరుగుతున్నాయి. 2020 నాటికి జపాన్ రాజ్యాంగాన్ని మార్చివేయనున్నట్లు షింజో ప్రకటించారు. అయితే ఈ విషయంలో జపాన్‌లో భిన్నాభిప్రాయాలు తీవ్రంగా నెలకొన్నాయి.
ట్రంప్ విదేశాంగ విధానంలో అస్పష్టత
అంతర్జాతీయ ఆర్థిక, సైనిక శక్తిగా ఎదగడం కోసం జిన్‌పింగ్ సారథ్యంలో చైనా దృఢంగా అడుగులు వేస్తున్నందున నూతన సమీకరణాలు ఆసియాలో అనివార్యం కానున్నాయి. ట్రంప్ ఆసియాలో తన అధికార పర్యటనలో మొదటగా జపాన్‌లో అడుగుపెట్టినా ట్రంప్ అనుసరిస్తున్న విదేశాంగ విధానంలో నెలకొన్న అస్పష్టత కారణంగా ఆసియా భద్రతపట్ల అమెరికా ఇప్పటి వరకు ఇస్తున్న భరోసా సహితం అగమ్యగోచరంగా మారనుంది.
ఒక వంక ట్రంప్‌తో ప్రగాఢమైన స్నేహం జరపడం ద్వారా ఆసియాలో అమెరికా క్రియాశీల పాత్ర వహించేటట్లు చేయడంతో పాటు నూతన భాగస్వాముల కోసం అబే దృష్టి సారిస్తున్నారు. ఈ సందర్భంగా అబే దృష్టి భారత్‌పై పడుతున్నది. ఆసియాలో పొరుగున ఉన్న అన్ని దేశాలకన్నా జపాన్ బలోపేతం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేసే ఏకైక దేశం బహుశా భారత్ మాత్రమే.
ఇప్పటికే షింజో అబే, భారత ప్రధాని నరేంద్ర మోడీల మధ్య పటిష్టమైన స్నేహం ఏర్పడింది. ఈ ఇద్దరు నాయకులు ఆర్థిక, రక్షణ, అణు రంగాలలో రెండు దేశాలమధ్య గత మూడేళ్లుగా కీలకమైన ఒప్పందాలు చేసుకున్నారు. ఆసియా - పసిఫిక్ ప్రాంతంలో సుస్థిరమైన అధికార స్థిరత్వం కోసం భారత్ జపాన్ బంధం కీలకం కానున్నది. ఆసియా - పసిఫిక్‌లో భారత్, జపాన్ ఉమ్మడిగా వ్యవహరించాలని అబే భావిస్తున్నారు.
ముఖ్యంగా చైనా విస్తరణ వాదాన్ని కట్టడి చేయడం కోసం అమెరికా ఆస్ట్రేలియా వంటి భావసారూప్యం గల దేశాలతో కలిసి సరికొత్త అంతర్జాతీయ కూటమి ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. 2012లోనే అబే ఇటువంటి ఆలోచనలను వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికాలోని హవాయి రాష్ట్రం కలిసి హిందూ మహాసముద్రం నుండి పశ్చిమ పసిఫిక్ ప్రాంతం వరకు సముద్ర ప్రాంతంలో భద్రతా వ్యవస్థ ఏర్పాటుకు ఉమ్మడిగా వ్యవహరించాలని సూచించారు. ఇప్పుడు చైనా దూకుడుగా వ్యవహరిస్తూ ఉండడంతో ఈ అవసరం మరింతగా పెరిగింది.
భారత్, జపాన్ దేశాలు పరస్పరం పలు రంగాలలో సహాయకారిగా ఉండగలవు. భారతదేశంలో జపాన్ పెట్టుబడులు పెరుగుతూ ఉండగా, వౌలిక వసతుల రంగంలో జపాన్ సాంకేతిక నైపుణ్యం కూడా అవసరం వుంది. భారత ప్రభుత్వ నైపుణ్య అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మూడు నుండి ఐదేళ్లలో మూడు లక్షలమంది యువతను నైపుణ్య శిక్షణ కోసం జపాన్‌కు పంపుతున్నది. జపాన్ అందిస్తున్న విదేశీ సహాయంలో ఆత్యధికంగా భారత్‌కే అందుతున్నది. అణు నిరోధక ఒప్పందంపై సంతకం చేయని దేశాలతో అణు శక్తిరంగంలో వ్యాపారం చేయరాదని నిబంధనలను భారత్ విషయంలో జపాన్ సడలించుకున్నది. త్వరలో జరగనున్న అబే-మోడీ శిఖరాగ్ర చర్చలలో ‘ఆసియా ఆఫ్రికా గ్రోత్ కారిడార్’లో భాగస్వాములు కావాలని రెండు దేశాలు నిర్ణయించుకోనున్నాయి. అందుకోసం జపాన్ 30 బిలియన్ డాలర్లు, భారత్ 10 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతున్నాయి.
కాగా, జిన్‌పింగ్ ఆధిపత్య ధోరణులపట్ల చైనాలోని కీలక సంస్థలు ఏ విధంగా స్పందించగలవో పరిశీలించవలసి ఉంది. మొదటినుండీ చైనాలో తన నిఘా వ్యవస్థను పెంపొందింపచేసుకోవడం భారత్‌కు పెను సవాల్‌గా మారింది. ఇపుడు జిన్‌పింగ్ హయాంలో మరింత కష్టంకానున్నది.
చైనానుండి ఎదురయ్యే సైనిక ఆధిపత్యపు సవాళ్లను ఎదుర్కోవడానికి రక్షణ రంగంపై కేటాయింపులను తీవ్రంగా పెంచడం ద్వారా ఆర్థికాభివృద్ధిని నిర్లక్ష్యం చేయడంకన్నా చైనాకు వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు పట్ల దృష్టి సారించడం వ్యూహాత్మకంగా, దౌత్యపరంగా కూడా భారత్‌కు ప్రయోజనం చేకూరగలదు. ముఖ్యంగా జపాన్, ఆస్ట్రేలియాల భాగస్వామ్యం పెంపొందింప చేసుకోవడం అత్యవసరం కాగలదు.

-చలసాని నరేంద్ర 9849569050