మెయిన్ ఫీచర్

శివభక్తి, శివానీశక్తి...కేంద్రం అరుణాచలమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరుణాచల క్షేత్రంలో స్వయంభువుగా వెలసిన ఈశ్వరుని పేరే ఆ నామంలో వుంది. దివ్యాతి దివ్యమైనది. స్మరించినంతనే ముక్తినొసగే పవిత్రక్షేత్రం అరుణాచలం. తమిళనాట అరుణాచలేశ్వరుడు పర్వత సానువునందుండగా, ఆ పర్వతాన్ని ‘అణ్ణామలై’, ‘తిరువణ్ణామలై’ అని కీర్తిస్తారు. ఈశ్వరుని అర్థాంగి ఆపీతాకుచాంబ. నాలుగు దిక్కులా ఎతె్తైన గోపురాలతో, విశాలమైన ప్రాంగణంతో శివ కుటుంబం కొలువై వున్న అరుణాచల ఆలయ ప్రాంగణం దేశంలోని వివిధ ప్రాంతాలనుండి వచ్చే భక్తులతో నిత్యం కళకళలాడుతూ వుంటుంది. శివ పరివారమంతా కొలువై ఉన్న క్షేత్రం. శివ పార్వతులతోపాటు గణపతి, స్కందుడు సదా తల్లిదండ్రుల చెంతనే ఉంటున్నారు. అరుణాచలం పంచభూతలింగా లింగాలలో ‘అగ్ని’ లింగానికి ప్రతీక. శోణపర్వతంగా పిలుస్తారు. ఆ పర్వతం మీద స్కందుని నివాసం. కృత్తికలు పెంచి పోషించిన కార్తికేయుడే స్కందుడు, జ్ఞానస్వరూపుడు. ఈనాడు అరుణాచలం పేరు విన్నంతనే గుర్తుకు వచ్చేది భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవితాంతం గడిపిన శోణగిరిని ఆనుకుని ఉన్న రమణాశ్రమం. ‘‘ఇల్లు విడువలాగి లోనింటిలో జొచ్చి మొగినీదు నిలుజూపితి వరుణాచలా’’- నన్ను నా యింట్లోంచి లాగి నీ హృదయమనే గుహలో దూర్చు అరుణాచలా! నీ ఇల్లు చూపావు. ఆనాటినుంచి అతనక్కడే ఎందరినో అరుణాచలేశ్వరుని సన్నిధికి త్రోవ చూపిస్తున్నారు. ‘అరుణాచలమంటూ స్మరించువారల అహము నిర్మూలింపు మరుణాచలా’ అంటూ ‘సోహం’గా అందరూ ఉండిపోవాలని కోరుకున్నారు మహర్షి. అరుణాచలం చెట్లు, పుట్టలు, రాయి, రప్పలతో కూడిన కొండకాదు-సాక్షాత్తూ పరమేశ్వరుని ప్రతీకగా నిలచిన క్షేత్రం. పర్వత రూపంలో నిలచిన పరమ శివుని స్వరూపం. సృష్టికి పూర్వమే అగ్నిస్తంభంగా (మహాగ్ని లింగం) ఆవిర్భవించిన సదాశివునికి సంకేతం. అందుకనే ఈ పర్వతానికి ‘గిరి ప్రదక్షిణం’ చేసి శివ విభూతులు అనుగ్రహాన్ని పొందడానికి వేలాది భక్తులు నిత్యం గిరి ప్రదక్షిణం చేస్తారు.
సృష్టికి పూర్వం ఉన్నది మహాజ్యోతి. పరాశక్తి. ఆమె ప్రసరించేది తేజస్సు. సదాశివుడు ప్రసరించేది వెలుగు (శక్తి) అరుణం. జ్యోతిని విడువని కాంతివలె శివుని వీడని జగన్మాత అరుణ. అతడు అచలుడు. ఆతని నుండి ప్రసరించే శక్తి విలాసమే ఈ ప్రపంచం. అందుకే ఆ తల్లిని అరుణ అన్నారు. లలిత సహస్రనామాలో అరుణకు ప్రతీకయైన నామాలెన్నో వున్నాయి. కనుక ఈ పర్వతం శివశక్త్యాకృతి. శ్రీచక్రాకృతి కలిగినది అరుణాచలం. తొమ్మిది కోణాలు కలిగి వుంటుంది. శివశక్తుల అనుగ్రహం కోసమే గిరిప్రదక్షిణం. ‘అరుణగిరి భూమికి హృదయస్థానం. సత్యస్వరూపం. జ్ఞాన తేజస్సు. శ్రేష్ఠతమం’ అన్నది ఋగ్వేదం. అంతటి ప్రముఖమైన అరుణాచలంలో ముఖ్యమైన పర్వదినాలు ఎన్నో ఉన్నాయి. వసంత ఋతువులో వసంతోత్సవం, అశ్వయుజంలో నవరాత్రి ఉత్సవాలు, వినాయక నవరాత్రులు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.
శివరాత్రి పర్వదినం ప్రముఖమైనది. ఆ రోజున పగలు రాత్రి అనే తేడా లేకుండా గిరి ప్రక్షణలు చేస్తారు. అరుణాచలేశ్వరునికి రోజంతా అభిషేకాలు, అర్చనలు జరుగుతాయి. అర్థరాత్రి లింగోద్భవ సమయంలో గుడి గంటలన్నీ ఒక్కసారి మ్రోగా హారతులిస్తారు. ఈ దృశ్యాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలవు. స్వామి ఆలయంలో వేలాది భక్తులు భజనలతో, శివనామస్మరణతో జాగరణ చేస్తారు. అరుణాచలేశ్వరునికి జరిగే ఉత్సవాలలో అతి ప్రధానమైనది శివుని జ్యోతిగా దర్శించి అర్చించే కృత్తికా మహోత్సవం. కార్తీకపూర్ణిమనాడు బ్రహ్మోత్సవాల సందర్భంగా చివరి రోజున అంటే కార్తీక పూర్ణిమ నాడు నిర్వహిస్తారు. అరుణాచలేశ్వరునికి కార్తీక శుద్ధ పంచమి నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కార్తీకమాసమంతా ఊరూ వాడా దీపకాంతులతో వెల్లివిరుస్తాయి. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా అరుణాచలేశ్వరుని ప్రాంగణం, అక్కణ్ణుంచి రమణాశ్రమం వరకు విద్యుత్ కాంతులు పలు రంగుల్లో ప్రకాశిస్తూ మిరుమిట్లు కొల్పుతాయి. ప్రపంచమంతటినుంచి రమణ మహర్షి భక్తులు ఆశ్రమానికి విచ్చేసి బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకుంటారు. దివ్యమైన అనుభూతిని పొంది జన్మ సార్థకం చేసుకుంటారు.‘అరుణగిరి వాసం, అక్కడ మరణం ముక్తిదాయకం. గొప్ప శివక్షేత్రమైన అరుణాచలంలో శివుని స్మరించినంత మాత్రాన ముక్తి కలుగుతుందని’ శివపురాణంలో సాక్షాత్తు శివుని వచనం. శివభక్తికి, శివాని శక్తికి ప్రధానమైన క్షేత్రం అరుణాచలం. అత్యంత ప్రాచీనమైన క్షేత్రాలలో అరుణాచలంకు ప్రత్యేక స్థనం ఉంది. అక్కడ జరిగే కార్తీక దీపోత్సవానికి సాటియైనది వేరొకటి లేదని, ఆ ఉత్సవాన్ని తిలకించడానికి అశేష జన సమూహం బ్రహ్మోత్సవాలకు విధిగా వెళ్లి, ఉత్సవాలను తిలకించి, జ్యోతిని దర్శించి జన్మ సార్థకం చేసుకుంటున్నారు.
అరుణాచల శివా! అరుణాచల శివా!

-ఎ.సీతారామారావు