ఎడిట్ పేజీ

మోదీకి గుజరాత్ పరీక్ష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుజరాత్ అసెంబ్లీకి వచ్చే నెలలో జరుగనున్న ఎన్నికలపై ఇప్పుడు దేశ ప్రజలందరి దృష్టి మరలింది. పుష్కర కాలంపాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా దేశ ప్రజల దృష్టి ఆకట్టుకొని, ప్రధానిగా ఎదిగిన నరేంద్ర మోదీకి ముఖ్యంగా ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాకరంగా మారాయి. బహుశా 2002 తరువాత మోదీ ఎన్నడూ ఇంతటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు కనబడటం లేదు.
ఇప్పటివరకు అన్ని సర్వేలు తిరిగి బిజెపి అధికారంలోకి రావడం తథ్యం అంటూ స్పష్టం చేస్తున్నాయి. అయినా అధికారపక్షంలో అలజడి పెరుగుతున్నది. ముఖ్యంగా రాజకీయాలకు పనికిరాడని సొంత పార్టీవారే భావిస్తున్న రాహుల్‌గాంధీ సభలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతూ వుండటం, మరోవంక బిజెపి నాయకులు ఎవ్వరు భారీ బహిరంగసభలు పెట్టలేక పోవడంతో ప్రధాన మోదీ స్వయంగా పార్టీని గెలిపించే బాధ్యతను తన భుజంపై వేసుకోవలసి వచ్చింది.
పంజాబ్‌లోని ప్రతి పదిమంది యువతలో ఏడుగురు మాదకద్రవ్యాలకు బానిసలయ్యారని 2012 అక్టోబర్‌లో చండీగఢ్‌లో రాహుల్‌గాంధీ చెప్పినప్పుడు ఆయనపై అంతా, సొంత పార్టీవారు కూడా విరుచుకుపడ్డారు. రాజకీయ పరిపక్వత లేని ఒక నాయకుడిగా అప్పటి నుంచి వీలు చిక్కినప్పుడల్లా అందరూ అవహేళన చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ప్రధాని మోదీ రాహుల్ ప్రస్తావన చేసినప్పుడల్లా అవహేళన చేస్తూనే వస్తున్నారు. కానీ పంజాబ్‌లో పదేళ్ల అకాలీ-బిజెపి పాలనను డ్రగ్ మాఫియా పేరుతోనే కాంగ్రెస్ కూల్చగలిగింది. ఇప్పటికి రాహుల్‌ను ‘పప్పు’ అంటూ అవహేళన చేస్తున్నా ఆయన ఒక చిన్న ట్వీట్ ఇచ్చినా మోదీ ప్రభుత్వం కలవరపడుతున్నది. ప్రస్తుతం గుజరాత్‌లోగాని, 2019లో కేంద్రంలోగాని బిజెపిని ఓడించగల సామర్ధ్యం రాహుల్‌కు ఉన్నట్లు ఎవ్వరూ భావించడంలేదు. అయినా రాహుల్ పేరు చెబితేనే ఎందుకంత ఉలికిపాటు?
మోదీ ప్రధాని పదవి చేపట్టి సంవత్సరం కాకముందే దేశ విదేశాలలో ఆయన తిరుగులేని నాయకుడిగా చెలామణి అవుతున్న సమయంలో ‘సూట్ బూట్‌కి సర్కార్’ అని అనగానే బిజెపి ఉలిక్కిపడింది. అప్పటి నుంచి పేద ప్రజలనుద్దేశించి ఎన్నో పథకాలను మోదీ ప్రభుత్వం చేబడుతూ వస్తున్నది. తాజాగా జీఎస్టీని ‘గబ్బర్‌సింగ్ టాక్స్’ అనగానే రాహుల్‌ను ఎగతాళి చేస్తూనే ప్రభుత్వం కొన్ని వర్గాల ప్రజలు తమకు దూరం అవుతున్నారని తెలుసుకొంది. హడావుడిగా ఒకేసారి 177 వస్తువులపై జీఎస్టీ భారం తగ్గించారు. జీఎస్టీకి గరిష్ఠ పరిమితి 18 శాతం ఉండాలని అంటున్న కాంగ్రెస్‌తో కనీసం ఆ విషయమై సంప్రదింపులకు కూడా ప్రభుత్వం సిద్ధపడకపోవడం కారణంగానే రెండేళ్లపాటు జీఎస్టీ అమలులో జాప్యం జరిగింది. ఇప్పుడు ఈ విషయంలో గుజరాత్ ఎన్నికల కోసం మొత్తం వెనుకడుగు వేసి 50 వస్తువులకు మినహా మిగిలిన అన్ని వస్తువులకు 18 శాతాన్ని గరిష్ఠంగా చేసారు.
గుజరాత్‌లో బిజెపి 22 ఏళ్లుగా అధికారంలో ఉంది. కేంద్రంలో మూడున్నరేళ్లుగా గుజరాత్‌కు చెందిన మోదీ అత్యంత ప్రజాకర్షణగల నేతగా ప్రధానిగా కొనసాగుతున్నారు. తమ ప్రభుత్వాలు సాధించిన విజయాలను ప్రజల ముందుంచి సునాయాసంగా ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేయాలి. అయితే ప్రతిపక్షాల నుంచి ఫిరాయింపుదారులను ప్రోత్సహించడం, ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న వర్గాలలో చీలికలు తీసుకువచ్చి, వారిలో కీలక నాయకులను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేయవలసిన పరిస్థితులు ఏర్పడటం దురదృష్టకరం.
తాజా ఎన్నికల సర్వే ప్రకారం బిజెపి-కాంగ్రెస్‌ల మధ్య ఓట్ల తేడా ఆరు శాతం మాత్రమే ఉండటం బిజెపి నాయకత్వానికి కలవరం కలిగిస్తున్నది. రెండున్నర నెలల క్రితం కాంగ్రెస్ ఓట్ల శాతం 12 శాతం పెరుగగా, బిజెపి 12 శాతం పోగొట్టుకున్నది. ఈ పరిస్థితి ఒకవిధంగా బిజెపి నాయకులలో అసహనం కలిగిస్తున్నట్లు పలు సంఘటనలు స్పష్టమవుతున్నాయి.
బిజెపికి రెండు దశాబ్దాలకుపైగా కొండంత అండగా వుంటున్న పటీదారులలో ఏర్పడిన అసంతృప్తికి కేంద్ర బిందువైన హార్దిక్ పటేల్‌కు సంబంధించిన సెక్స్ వీడియోలు వెలుగులోకి రావడం ఎన్నికల ఎత్తుగడలు ఎంత పతనావస్థకు దారితీస్తున్నాయో అని ఆందోళన కలిగిస్తున్నది. ఈమధ్య వరకు హార్దిక్‌తో కలిసి పనిచేసి, ఇప్పుడు బిజెపికి మద్దతు ఇస్తున్న అశ్వని పటేల్ అనే వ్యక్తి బహిరంగంగా ఒక జాతీయ న్యూస్ ఛానల్ ముందుకు వచ్చి హార్దిక్ కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తే మరో ‘సాక్ష్యం’ బైటకు వస్తుందని హెచ్చరించారు.
పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒక యువతిని లైంగికంగా ఉపయోగించుకుని మోసం చేసాడని, ఇప్పుడా యువతి బయటకు వచ్చి చెబుతుందని అంటున్నాడు. హార్దిక్ మాత్రమేకాదు ప్రజాజీవనంలో వున్నవారెవరైనా ఇటువంటి అనైతిక పనులకు పాల్పడటాన్ని భారతీయ సమాజం జీర్ణించుకోలేదు. ఇటువంటి చర్యలను ఎండగట్టడంలో తప్పులేదు. కానీ రెండేళ్లనాడు జరిగిన సంఘటనలకు సంబంధించిన సిడీలను ఇప్పుడు ఎన్నికల సమయంలో బయటపెట్టి బెదిరించే ప్రయత్నం చేయడం దారుణమైన అంశం.
రాష్ట్ర ప్రభుత్వంపట్ల రాష్ట్రంలో కేవలం పటీదార్లు, దళిత్‌లు, ఓబిసిలు, గిరిజనులలోనేకాదు అనేక వర్గాలలో అసంతృప్తి కనిపిస్తున్నది. ముఖ్యంగా బిజెపికి మద్దతు ఇస్తూ వస్తున్న వ్యాపార వర్గం ఇప్పుడు చీలిపోయింది.
ఎక్కడ ఎన్నికల సర్వే జరిపినా సాధారణంగా అధికారంలో వున్న ముఖ్యమంత్రి తిరిగి అధికారంలోకి రావాలని కనీసం 25 శాతం మంది కోరుకుంటూ వుంటారు. కానీ గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్‌రూపాని గురించి కేవలం 18 శాతం మంది మాత్రమే ఆవిధంగా అంటున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్రదిష్టకు గురైవున్నదో వెల్లడి అవుతున్నది. గుజరాత్‌లో 22 ఏళ్ల బిజెపి పాలన అనంతరం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినట్లు భావించవలసి వస్తున్నది. అందుకనే రైతాంగంలో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నది.
మొదటి నుండి నరేంద్ర మోదీకి యువత, మహిళలు గట్టి మద్దతుదారులుగా ఉంటూ వస్తున్నారు. గుజరాత్‌లో ఇప్పటికి మహిళలు పెద్ద సంఖ్యలో బిజెపి మద్దతుదారులుగా ఉంటున్నా యువతలో మాత్రం అసహనం, అసంతృప్తి వ్యక్తం అవుతున్నది. ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రధాని మోదీ ఎంతో శ్రమకు ఓర్చి, ఎన్నికల షెడ్యూల్ ప్రకటనను సహితం వాయిదా వేయించినా చెప్పుకోదగిన ఫలితం కనబడటంలేదు.
ప్రధాని ప్రతిష్టగా భావిస్తున్న బులెట్ ట్రైన్ పట్ల చెప్పుకోదగిన సుముఖత వ్యక్తం కావడంలేదు. అంత భారీ వ్యయంతో ఆ రైలు కోసం ఆరాటపడేదానికన్నా ఉన్న రైల్ సదుపాయాలను మెరుగుపరచడం అవసరం అని 56 శాతం మంది భావిస్తున్నారు. ఇక ఎన్నికల షెడ్యూల్ ప్రకటనని వాయిదా వేయించి ప్రకటించిన రూ.11వేల కోట్లకుపైగా విలువగల అభివృద్ధి పథకాల ప్రకటన కేవలం ఎన్నికల కోసం చేసినదే అని 46 శాతం మంది భావిస్తున్నారు.
బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా కుమారుడు జైషాపై వచ్చిన ఆర్థిక సంబంధ అక్రమాల ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని 55 శాతం మంది ప్రజలు కోరుతున్నారు. వెంటనే కాంగ్రెస్‌ను అందలం ఎక్కించడానికి గుజరాత్ ప్రజలు సిద్ధంగా వున్నారని చెప్పలేము. ముఖ్యంగా బిజెపిపట్ల ఆగ్రహంగా వున్న పటీదార్లలో పెద్దలు ఇప్పటికీ కాంగ్రెస్ వ్యతిరేకతను విడనాడడానికి సిద్ధంగా లేరు. అయితే బిజెపిపట్ల విశ్వాసం మాత్రం గణనీయంగా తగ్గుతున్నట్లు వెల్లడి అవుతున్నది.
నోట్ల రద్దును విజయవంతమైన ఆర్థిక సంస్కరణగా మోడీ ప్రభుత్వాన్ని సమర్ధిస్తున్న ఆర్థికవేత్తలు ఎంతగా చెబుతున్నా సాధారణ ప్రజలలో మాత్రం విశ్వాసం నింపలేకపోతున్నారు. ప్రభుత్వం చెప్పినవిధంగా అవినీతిని అరికట్టారా, ఉగ్రవాదులకు ఆర్థిక వనరులను కట్టడి చేశారా, నల్లధనాన్ని వెలికితీసారా, దొంగనోట్ల సరఫరాను అరికట్టారా.. వంటి ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానాలు దొరకడంలేదు.
రాజకీయ ఎత్తుగడల ద్వారా తాత్కాలికంగా ప్రజలలో ఆవేశాలను రగిల్చి ప్రయోజనం పొందవచ్చు. కానీ దీర్ఘకాలంలో సుపరిపాలన ద్వారా, ప్రజల నిజజీవితాలలో గుణాత్మక మార్పు తీసుకురావడం ద్వారా మాత్రమే ప్రజల అభిమానం పొందగలమని బిజెపి గుర్తించలేకపోతున్నది. రోజుకొక్క సరికొత్త ఉద్వేగభరిత అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నది.
దేశంలో ఇప్పుడు బిజెపి పాలిత రాష్ట్రాలు 20కి చేరుకోబోతున్నాయి. ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు కేంద్రంలో రాజకీయ సుస్థిరతపై ఎటువంటి ప్రభావం చూపలేవు. బిహార్ వంటి పెద్ద రాష్ట్రంలో ఘోర పరాజయం ఎదురైనా బిజెపిలో ఎటువంటి తొట్రుపాటు కనిపించలేదు. కానీ గుజరాత్‌ను అంత తేలికగా తీసుకోలేరు. ఇక్కడ బిజెపికి అనుకోకుండా పరాజయాన్ని ఎదుర్కొనవలసి వస్తే దాని ప్రభావంతో వచ్చే సంవత్సర కాలంలో ఎన్నికలు జరిగే కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలలో సహితం పరాజయం ఎదుర్కోవలసి వస్తుంది. అన్నింటికన్నా మించి మోదీకి బలమైన ప్రత్యర్ధిగా రాహుల్‌గాంధీ జాతీయస్థాయిలో నిలబడే పరిస్థితి ఏర్పడుతుంది. 2019 ఎన్నికలపై వేసుకున్న అంచనాలు తలకిందులయ్యే అవకాశం లేకపోలేదు. దానితో ఎట్టిపరిస్థితులలో గుజరాత్‌లో పరాజయాన్ని బిజెపి ఊహించలేదు. అందుకనే ప్రధాని మోదీ ప్రతిష్టగా తీసుకొని తానే మొత్తం ప్రచార బాధ్యతను భుజంపై వేసుకొంటున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన ముందు వరకు అనేక నూతన ప్రాజెక్టులకు అంకురార్పణ చేయడంలో మునిగివున్న ప్రధాని ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి సమాయత్తం అవుతున్నారు.
మొత్తం 32 జిల్లాల్లో జిల్లాకు ఒక బహిరంగ సభ చొప్పున, అన్ని ప్రధాన నగరాలలో రోడ్‌షోలతో గుజరాత్ మొత్తం కలియతిరగడానికి ప్రణాళికలు సిద్ధం చేసారు. బహుశా ఇప్పటివరకు ప్రధానమంత్రి ఎవ్వరూ కూడా ఒక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో ఇంత విస్తృతంగా పాల్గొన్న ఉదంతం లేదు. ఆయనతోపాటు బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 20 మంది వరకు కేంద్ర మంత్రులు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు.
మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో పార్టీని, ప్రభుత్వాన్ని నడిపిస్తున్న అమిత్ షా ఇప్పుడు ఒక విధంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఫిరాయింపులను ప్రోత్సహించినా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజకీయ సలహాదారుడు అహ్మద్‌పటేల్‌ను రాజ్యసభ ఎన్నికల్లో ఓడించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తాజాగా అహ్మద్‌పటేల్ ట్రస్టీగా వున్న ఒక ఆసుపత్రిలో ఇస్లామిక్ స్టేట్ సానుభూతిపరుడిని నియమించారని బిజెపి ఆరోపణలు చేసింది. అయితే అతని నియామకం సమయానికి పటేల్ ఆ ట్రస్ట్ నుండి తప్పుకున్నారని, పైగా బిజెపికి సన్నిహితంగా వుండే ఒక నాయకుని సిఫార్సు లేఖపైననే అతనిని నియమించారని వెల్లడి కావడంతో అమిత్‌షాకు చుక్కెదురైంది.
మరోవంక గుజరాత్ ఎన్నికల ముందే రాహుల్‌గాంధీకి పార్టీ నాయకత్వం అప్పగించాలని అనుకున్న సోనియాగాంధీ ఇప్పుడు ఆ విషయమై మాట్లాడటంలేదు. హిమాచల్‌ప్రదేశ్‌తోపాటు గుజరాత్‌లో సహితం కాంగ్రెస్‌కు చుక్కెదురు కావచ్చనే ఆందోళన అందుకు కారణంగా కనిపిస్తున్నది. మొత్తం మీద గుజరాత్ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలలో పెనుమార్పులకు కారణం కానున్నాయని చెప్పవచ్చు.

-చలసాని నరేంద్ర 9849569050