మెయన్ ఫీచర్

ఆ వైఫల్యం ఎవరి ఖాతాలో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరిగ్గా వారం క్రితం కృష్ణమ్మ ఒడిలో కేరింతలు కొడుతున్న పర్యాటకులను నిర్లక్ష్యమనే రక్కసి మింగేసిన వైనం ఇంకా జనం స్మృతిపథం నుంచి చెరిగిపోలేదు. 23 మంది అమాయకుల ప్రాణాలు జలగర్భంలో కలిసిన తర్వాత కదిలిన సర్కారు, వారి ప్రాణాలకు షరామామూలుగా ఖరీదు కట్టినా, పోయిన ప్రాణాలయితే తిరిగి రావు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటున్నట్లు అమాయకుల ప్రాణాలను కబళించిన ఆ నిర్లక్ష్యంపై విచారణలు, కమిటీలు, నివేదికలు ఎన్ని వేసినా వైఫల్యమయితే దాచినా దాగనిది. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకూ సాగిన మృతదేహాల వెలికితీతలో బయటపడిన ఒక్కో మృతదేహం పర్యాటక, జలవనరుల శాఖ వైఫల్యాన్ని ఎత్తిచూపింది. ఆ ఘటన తాలూకు విషాదపు ఛాయలు కృష్ణమ్మను చూసిన ప్రతిసారీ గుర్తుచేస్తూనే ఉన్నాయి. 23మందిని మింగేసిన ఆ ప్రాంతంలో పూజాదికాలెన్ని చేసినా జరిగిన దుర్ఘటనను అవి కప్పిపుచ్చలేవు. సంప్రోక్షణలయితే చేశారు గానీ, ఆ పాపానికి బాధ్యులెవరన్నది, ఆ వైఫల్యం ఎవరి ఖాతాలోకి వెళుతుందన్నది మాత్రం ఇప్పటివరకూ తేల్చకపోవడం క్షంతవ్యం కాదు.
చేపలు పట్టే బోటును మనుషులను ఎక్కించుకునే బోటుగా మార్చుకుని బేపర్వాగా నడిపిస్తున్న సంస్థల అరాచకాలు, లై‘సెన్సు’లేకుండానే కొనసాగిస్తున్న కిరాతకాలు, నరబలి తర్వాత గానీ గుర్తించలేదంటే, ధృతరాష్టప్రర్వం ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతూనే ఉంది. ఆ ఘటనలో ఏడుగురిని గుర్తించి వారిని సస్పెండ్ చేసి, జైలుకు పంపించి కథ ముగించే ప్రయత్నాలు చేయడం దారుణం. ఒక నేరం చేయడం ఎంత తప్పో, దానిపై వౌనంగా ఉండటం కూడా అంతే తప్పన్న చట్ట సూత్రాన్ని ఇక్కడ పాలకులకు గుర్తుచేయటం నైతిక ధర్మం. వందల సంఖ్యలో అనుమతి లేని బోట్లు బేఖాతరుగా తిరుగుతున్నా, వాటిపై చర్యల కొరడా ఝళిపించలేనంత మొహమాటంలో కుమ్మక్కుపర్వం ఉందన్నది మనం మనుషులం అన్నంత నిజం.
ఇలాంటి ఘటనలపై సీరియస్‌గా స్పందించి తన, పర తేడాలు లేకుండా చర్యలు తీసుకోవలసిన ముఖ్యమంత్రి ఆ దిశగా అడుగులు వేయకపోవడం విచారకరం. తన ఇంటికి కూతవేటు దూరంలో వందల బోట్లు అనుమతి లేకుండా పర్యాటకుల ప్రాణాలతో పరాచకాలాడుతున్న వైనం 23మందిని బలి తీసుకున్న తర్వాత కూడా, వాటి వెనుక సూత్రధారులపై వేటు వేయకుండా రాజకీయ మొహమాటాలు ప్రదర్శించడం వల్ల దెబ్బతినేది ఆయన వ్యక్తిగత ప్రతిష్ఠనే! ఎందుకంటే టీడీపీ అనే బండి బాబు ఇమేజీపైనే నడుస్తోంది కాబట్టి!!
ఎందుకంటే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇంకొందరు ప్రముఖుల అవినీతి విశృంఖలమవుతున్నా ప్రజలు ఇంకా చంద్రబాబు నాయకత్వాన్ని విశ్వసిస్తున్నారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని సమస్యల ఒడ్డు నుంచి బయటపడేస్తారని నమ్ముతున్నారు. ఆ దుర్ఘటనకు ఇద్దరు మంత్రులు కారణమని సర్కారీ మిత్ర పత్రికలు సహా కోడై కూస్తున్నాయి. అందులో ఒక మంత్రి గారి సతీమణి బోట్ల నిర్వహకులకు అభయమిచ్చారన్న వార్తలూ వస్తున్నాయి. కృష్ణా జిల్లా మంత్రి గారే బినామీలతో బోట్లు నడిపిస్తున్నారని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి.
మంత్రులు పుల్లారావు, దేవినేని ఉమ హస్తాలు కనిపిస్తున్నాయని విపక్షాలు బహిరంగంగానే ఘోషిస్తున్నప్పుడు, వారిని ఇంకా కొనసాగించడం విజ్ఞత అనిపించుకోదన్నది విజ్ఞుల మనోగతం. ఆరోపణలు వచ్చిన ఆ ఇద్దరినీ తప్పించి, విచారణలో వారు పులుకడిగిన ముత్యాలయితే మళ్లీ క్యాబినెట్‌లోకి తీసుకుంటే సర్కారు ప్రతిష్ఠ పెరిగి ఉండేది.
అలాకాకుండా వారిద్దరినీ వెనుకేసుకు వచ్చి, ఏడుగురు నిందితులతో కథ ముగించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వాస్తవం ప్రజలు అర్ధం చేసుకుంటే దానివల్ల మంత్రులు, ఎమ్మెల్యేలకు వచ్చిన నష్టమేమీ లేదు. పోయేదల్లా ముఖ్యమంత్రిపై ఇప్పటివరకూ ప్రజల్లో ఉన్న దార్శనికత, సమర్థత, అనుభవంపై నమ్మకమే! పెద్ద గద్దల దన్ను లేకుండా ఒక సామాన్య బోటు ఆపరేటర్లు అంత అడ్డగోలుగా, నిబంధనలను కాలరాసి జలప్రళయం సృష్టించడం సాధ్యం కాదన్న సామాన్యుల అనుమానాలకు తెరదించి, తమ చేతులు శుభ్రంగా ఉన్నాయన్న సంకేతాలివ్వాల్సింది ప్రభుత్వమే.
అటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ మంత్రి గారి తనయుడు ముచ్చటపడి అక్కడ రిసార్టులు నిర్మించాలనుకున్న స్థలంలో దేవతావిగ్రహాలున్నా వాటిని కూల్చివేయించిన ఘటన సర్కారు ప్రతిష్ఠను మంటకలిపేదే. ఇది జరిగి రోజులవుతున్నా ఎవరిపైనా చర్యలు లేవు. ఇవన్నీ ముఖ్యమంత్రికి సంబంధం ఉండకపోవచ్చు. దానికి ఆయనను బాధ్యులను చేయలేం. కానీ వెలుగుచూస్తున్న ఆరోపణలను నిగ్గుతేల్చి, వ్యవస్థను చక్కదిద్దకుండా, ఆ పనిచేస్తే తమ పార్టీ వారే దోషులుగా తేలితే అది రాజకీయంగా నష్టమనో, ప్రతిపక్షాలకు అస్త్రం ఇచ్చినట్టవుతుందనే ప్రతిష్ఠకు పోవడం వల్ల దెబ్బతినేది ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రతిష్ఠనే. ఎందుకంటే ఆయనపై ప్రజల్లో ఇంకా నమ్మకం సడలలేదు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి కోసం సీఎం తన ప్రతిష్ఠ, నమ్మకాన్ని పణంగా పెడుతున్నారన్న విమర్శలు, వ్యాఖ్యలు మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్న ఆయనకే మంచిదికాదు.
* * *
‘బిడ్డా లగడపాటి. తెలంగాణ వచ్చుడు ఖాయం. నీమీద విచారణ జరిపితీరుడు ఖాయం. నిన్ను ఊచలు లెక్కిబెట్టిస్తం. తెలంగాణ వస్తే తన అక్రమాలను విచారిస్తుందనే తెలంగాణను అడ్డుతుండు. తెలంగాణకు పయ్యావుల కేశవ్ శిఖండిలాగా అడ్డుపడుతున్నాడు. మీ సీమ నకరాలు ఈ గడ్డమీద ఉడకయి. మీ రాయలసీమోళ్లంతా మా తెలంగాణ భూములు ఆక్రమించుకున్నారు.’
ఇవన్నీ అటుకులు బుక్కి, పస్తులుండి, నీళ్లు తాగి పేగులు మాడ్చుకుని, దెబ్బలు తిని, జైళ్లకు వెళ్లి తెలంగాణ కోసం ప్రాణత్యాగానికి సైతం లెక్కచేయక పోరాడిన, నాటి తెలంగాణ ఉద్యమ సమయంలో ఇప్పటి తెలంగాణ పాలకులు చేసిన హెచ్చరికలు. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు అదే లగడపాటిలు, అదే కేశవులూ తెలంగాణ పాలకుల సౌధాలకు వెళ్లి తమ ఇంట జరిగే పెళ్లిళ్లకు రావాలని ఆహ్వానిస్తున్నారు. తాజాగా లగడపాటి, కేశవ్ స్వయంగా కేసీఆర్‌ను కలసి తమ ఇంట జరిగే శుభకార్యాలకు హాజరుకావాలంటూ, పెండ్లికార్డులు ఇచ్చిన అద్భుతమైన దృశ్యాలపై సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చూసిన వారికి, రాజకీయాలపై ఒక అవగాహన వచ్చేసే ఉండాలి. సరే ఈపాటికే కేసీఆర్ పరిటాల కొడుకు పెళ్లికి వెళ్లి, రవి సమాధికి నివాళులర్పించి, గతంలో తెలంగాణ సైంధవుడిగా తామే ముద్రవేసిన కేశవును పక్కకుతీసుకువెళ్లి పదినిమిషాలు పర్సనల్‌గా మాట్లాడిన అపురూప దృశ్యకావ్యాన్ని అటు తెలంగాణ సమాజం, ఇటు సీమాంధ్ర చూసి పులకరించిపోయిందనుకోండి అది వేరే విషయం!
అయితే, ఇక్కడ తత్వం అర్ధం చేసుకోవలసింది తెరాస ప్రత్యర్థులే! ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వనరులన్నీ ఆంధ్రా కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారని, అలనాటి ‘ఉద్యమ తెరాసీయులు’ ఆరోపించినా మళ్లీ ఇప్పుడు అదే ఆంధ్రా కాంట్రాక్టర్లనే అందలం ఎక్కిస్తూ ఉండవచ్చు. తమ పార్టీ వారిని అనైతికంగా రాజకీయ వ్యభిచారంతో సమానమైన ఫిరాయింపులకు పాల్పడితే, ప్రజలు చీరి చింతకు కడతారని ఆవేశపడి ఉండవచ్చు. తెలంగాణ ఉద్యమాన్ని రోడ్డెక్కించిన కోదండసారుకు ఇప్పటివరకూ అపాయింటుమెంటు ఇవ్వకుండా లగడపాటిలు, కేశవులకూ అపాయింట్‌మెంట్ ఇచ్చి ఉండవచ్చు. అయితే కేసీఆర్ మూడున్నరేళ్ల క్రితమే చెప్పినట్లు తమది ఇప్పుడు ఉద్యమపార్టీ కాదు. ఫక్తు రాజకీయ పార్టీ అన్న విషయాన్ని మర్చిపోయి, ఆయనపై విమర్శలు రువ్వడమే తప్పు. ఎందుకంటే ఫక్తు రాజకీయాల్లో ఇవన్నీ సహజం కాబట్టి!
* * *
ప్రతిభకు పట్టం కట్టాల్సిన సినిమా నందుల వ్యవహారం దారి తప్పి, ‘కుల’కులం రేగుతోంది. నంది అవార్డులొచ్చిన తర్వాత ఈ స్థాయిలో కుల అసహనం రేగడం ఇదే తొలిసారి. ప్రతిష్ఠాత్మకమైనవనుకుంటున్న నంది అవార్డులు కులపరమైన స్థాయికి దిగజారడం విచారకరం. ఆ‘నందులు’లలో ఎక్కువమంది కమ్మ వర్గానికే చెందిన వారేనని, అవార్డుల్లో కళాత్మకం కంటే కమ్మదనమే కనిపిస్తోందని రోడ్డెక్కి చేస్తున్న విమర్శలు వాటిపై ఉన్న విశ్వసనీయతను దెబ్బతీసేవే. జ్యూరీ సభ్యుడి పోస్టింగు చూస్తే, ఎంతటి మహానుభావులను జ్యూరీలో నియమించారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మెగా ఫ్యామిలీని పట్టించుకోలేదన్నది ఇంకో విమర్శ. అయితే, బాబు సీఎంగా ఉన్నప్పుడు కమ్మకులానికి చెందని చిరంజీవి, కమల్, కృష్ణంరాజు, త్రివిక్రమ్, సుద్దాల, అల్లు అర్జున్, పిసి రెడ్డి, నారాయణమూర్తికి అవార్డులు ఇచ్చినందున అందులో కులదర్శనం చూడలేమన్నది మరో వాదన. రుద్రమదేవిని తెలంగాణకు పరిమితం చేసి ఆ సినిమాకు అవార్డు ఇవ్వకపోవడం తప్పు. పైగా సీఎం చంద్రబాబు అమరావతి శంకుస్థాపనలో రుద్రమదేవి మూలాలున్న అమరావతి శంకుస్థాపన నా చేతులమీదుగా జరగడం తన అదృష్టమని చెప్పిన విషయాన్ని జ్యూరీ సభ్యులు గుర్తుంచుకోకుండా, అదే రుద్రమదేవి జీవితచరిత్ర ఆధారంగా తీసిన సినిమాకు అవార్డు ఇవ్వకపోవడంపై ఆక్షేపణలు రావడంలో వింతేముంది? ఆ సినిమాకు తెలంగాణ సర్కారు పన్ను మినహాయింపు ఇచ్చినా, ఏపి సర్కారు ఇవ్వకపోవడాన్ని గుణశేఖర్ ప్రశ్నించడాన్ని ఎవరూ ఆక్షేపించరు. రుద్రమదేవి ‘టామీ’పాటి చేయదా అన్న ప్రశ్నకు జవాబేదీ? స్వయంగా బాహుబలి సినిమా సెట్టింగులు, అందులోని మాహిష్మతి డిజైన్లను చూసి మురిసిపోయి, అదే తరహాలో రాజధాని నిర్మించాలని కోరుకుంటున్న ప్రభుత్వం, అదే బాహుబలి హీరోకు ఉత్తమ అవార్డు ఇవ్వకపోవటం ఎవరికి నామోషీ? నంది అవార్డులు పచ్చపార్టీ తమ కార్యకర్తలకు కండువాలు కప్పినట్లుంది. అవి ప్రభుత్వం తరఫున కాకుండా పార్టీ తరఫున ఇస్తే బాగుండేదన్న నిర్మాత శివకుమార్ వ్యాఖ్యలకు కారణాలు అనే్వషించి, ఈసారైనా అలాంటి పొరపాట్లు దొర్లకుండా చూస్తేనే ఆ అవార్డులకు శోభ!

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 97053 11144