మెయన్ ఫీచర్

హద్దుకు మించి రిజర్వేషన్లు సాధ్యమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా చాలా రాష్ట్రాలు కోటాకు మించి కొన్ని కులాలకు, మతాలకు రిజర్వేషన్లు కల్పించాలనే ప్రతిపాదనలు వివాదాస్పదం అవుతున్నాయి. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు మొత్తం కోటాలో 50 శాతం మించరాదు. తమిళనాడులో 69 శాతం, కర్నాటకలో 73 శాతం, రాజస్థాన్ సహా మరి కొన్ని రాష్ట్రాలు 68 శాతం మేర రిజర్వేషన్లను ప్రతిపాదించాయి. ఇప్పటికే ఇలాంటి ప్రయోగాలు వల్ల ఆ అంశాలు న్యాయవివాదాల్లో చిక్కుకున్నాయి. రాజస్థాన్‌లో గుజ్జర్లకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని శాసనసభలో బిల్లు పెట్టింది. హైకోర్టులో కేసు తేలేవరకూ రిజర్వేషన్లు అమలుచేయరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజస్థాన్‌తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరికొన్ని ఇతర రాష్ట్రాలు కొత్త కులాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు రిజర్వేషన్లను 50 శాతం దాటించేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. గతంలో వైఎస్ ప్రభుత్వం ముస్లింలకు బిసి కోటాలో 5 శాతం రిజర్వేషన్లు ప్రకటించి, 50 శాతం నిబంధన దాటుతుందనే 4 శాతానికి తగ్గించారు. తాజాగా కెసిఆర్ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లను ఓబీసీ కోటా కింద అమలు చేస్తామని అంటున్నారు. తమిళనాడు తరహాలో 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించేందుకు ఆ అంశాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూలులో చేర్చాలని కోరుతామని చెబుతున్నారు.
రిజర్వేషన్లు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన కులాలు, వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కు. దీనిని ఎవరూ కాదనరు, కాని పరిమితికి మించి రిజర్వేషన్లు కల్పించడం వల్ల సమాజం నిట్టనిలువునా చీలి కొత్త సంఘర్షణలకు తావిస్తోంది. అదెంత వరకూ వెళ్లిదంటే చివరికి ఎస్సీ వర్గీకరణ జరగాలనే పట్టుదల పెరిగింది.
రాజ్యాంగంలో రిజర్వేషన్ల అమలుకు సంబంధించి చాలా స్పష్టంగా ఉంది. ఈ అంశంపై వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు నిర్వచించడంతో రిజర్వేషన్లపై మరింత స్పష్టత వచ్చింది. అధికరణం 14 ప్రకారం రాజ్యాంగ పరిధిలో చట్టం ముందు అందరూ సమానులే. చట్టం నుండి ప్రజలందరికీ రక్షణ లభిస్తుంది. పౌరులకు ఉన్న ఈ హక్కును ప్రభుత్వం ఎవరికీ నిరాకరించరాదని రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. విద్యాసంస్థల్లో, ఉద్యోగాల్లో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం ప్రత్యేక కోటాను కేటాయించారు. ఐదేళ్ల తర్వాత పరిస్థితిని సమీక్షించాలని రాజ్యాంగం సూచించింది. కాని ఆ తర్వాత ఆ కాలాన్ని ప్రభుత్వాలు ఎప్పటికపుడు పొడిగిస్తూ వస్తున్నాయి.
ప్రెసిడెన్సీ ప్రాంతాలు, విద్యాపర్వతాలకు దక్షిణంగా ఉన్న అనేక సంస్థానాల్లో స్వాతంత్య్రానికి ముందే వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. ఛత్రపతి శివాజీ , మహారాష్టల్రో కొల్హాపూర్ మహరాజ్ 1902లో వెనుకబడిన తరగతులకు మద్దతుగా రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు. 1882లో హంటర్ కమిషన్ దేశంలో నియామకం జరిగిన వెంటనే జ్యోతిరావుపూలే వంటివారు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్, ఉచిత నిర్బంధ విద్యను డిమాండ్ చేశారు. 1891లో ట్రావెన్‌కోర్ ప్రభుత్వ సేవల్లో అర్హత ఉన్న స్థానికులే కాకుండా స్థానికేతరుల నియామకాలకు వ్యతిరేకంగా ఆనాడే పెద్ద ఉద్యమం చెలరేగింది. 1901లో మహారాష్ట్ర, కొల్హాపూర్ రాజులు రిజర్వేషన్లు అమలులోకి తెచ్చారు. 1921లో బ్రాహ్మణేతరులకు 44 శాతం, బ్రాహ్మణులకు 16 శాతం, ముస్లింలకు 16 శాతం, ఆంగ్లో ఇండియన్లకు, క్రైస్తవులకు 16 శాతం, షెడ్యూల్డు కులాలకు 8 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మద్రాస్ ప్రెసిడెన్సి వర్గజీవోను జారీ చేసింది. 1935లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పూణే ఒప్పందం పేరుతో ఒక తీర్మానాన్ని ఆమోదించారు. దీనిలో అణగారిన వర్గాలకు ప్రత్యేక ఎన్నికల నియోజకవర్గాలను కేటాయించాలని నిర్ణయించారు. 1942లో బి ఆర్ అంబేద్కర్ షెడ్యూల్డు కులాల పురోగతికి మద్దతుగా అఖిల భారత అణగారిన వర్గాల సమాఖ్యను ఏర్పాటు చేసి, విద్యలో, ఉద్యోగాల్లో ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. 1946లో భారతదేశ మంత్రివర్గ సంఘం అనేక సిఫార్సులతో పాటు సమంజసమైన ప్రాతినిధ్యాన్ని ప్రతిపాదించింది. 1947లో స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీకి చైర్మన్‌గా అంబేద్కర్ నియమితులయ్యారు. తర్వాత రాజ్యాంగం అమలులోకి రావడం, రిజర్వేషన్లు వర్తింపు జరిగింది.
అధికరణం 15 కుల, మత, లింగ వివక్షకు తావు లేదని స్పష్టం చేస్తుంది. కేవలం మతం, జాతి, కులం, లింగం, జన్మస్థలం లేదా వాటిలో కొన్నింటి ప్రాతిపదికపై ఏ వ్యక్తినీ ప్రభుత్వం వివక్షకు గురిచేయరాదు. క్లాజు -2 కింద కేవలం మతం, జాతి, కులం, లింగం, జన్మస్థలం లేక వాటిలో కొన్నింటి ప్రాతిపదికపై పౌరులెవరికీ హక్కులు నిరాకరించడం గానీ నియంత్రించడం గానీ అర్హత లేకుండా చేయడం గాని చేయరాదని పేర్కొంది. దుకాణాలు, పబ్లిక్ రెస్టారెంట్లు, హోటళ్లు, బహిరంగ వినోద ప్రదేశాల్లో లోనికి ప్రవేశించే హక్కు, ప్రభుత్వ ధన సహాయంతో లేకా ప్రజలందరి ఉపయోగానికి నిర్దేశించిన బావులు, చెరువులు, స్నానఘట్టాలు, రహదారులు, బహిరంగ విహార ప్రదేశాలు ఉపయోగించుకునే హక్కు అందరికీ సమానంగా ఉంది. ఈ అధికరణం కింద ఏమీ పేర్కొనపోయినా స్ర్తిలు, పిల్లలకు సంబంధించి ప్రత్యేక నిబంధనలను ప్రభుత్వం రూపొందించవచ్చు. ఈ అధికరణం లేదా 29వ అధికరణం క్లాజు -2లో ఏమీ పేర్కొనపోయినా సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వారు లేదా షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల వారి అభ్యున్నతికి ప్రత్యేకమైన నిబంధనలను ప్రభుత్వం జారీ చేయవచ్చు. ఈ 4వ క్లాజును మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 1951లో చేర్చారు. దీనికి మరింత విస్తృతమైన అవగాహనను అధికరణం -16 చేకూరుస్తుంది. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు పొందే విషయంలో పౌరులు అందరికీ సమాన అవకాశాలు ఉండాలి. క్లాజు -2లో ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల విషయంలో కేవలం మతం, వర్ణం, కులం, లింగం, వంశ పారపర్యం, పుట్టిన ప్రదేశం, నివాసస్థలం ప్రాతిపదికపై ఏ పౌరుడి పట్ల వివక్ష చూపించరాదు. ఉద్యోగ నియామకాలు జరిపే సందర్భంలో సంబంధిత రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన వారై ఉండాలనే నిబంధన విధిస్తూ పార్లమెంటు శాసనం చేసే వీలుంది. అలాగే క్లాజు-4 కింద కొన్ని వెనుకబడిన తరగతుల వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో సరైన ప్రాతినిధ్యం లేదని రాష్ట్ర ప్రభుత్వం భావించిన పక్షంలో వారికి రిజర్వు చేస్తూ ఆ ప్రభుత్వం నిబంధనలు రూపొందించవచ్చు. 4-ఎ ప్రకారం కొన్ని ఉద్యోగాల పదోన్నతులను కల్పించడంలో ఆయా వర్గాలకు కొంత రిజర్వేషన్ కల్పిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను రూపొందించుకోవచ్చు. 2002 ఏప్రిల్ 1న 85వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ క్లాజును సవరించారు. , 4-బి అయితే ఒక సంవత్సరంలో క్లాజు 4 , 4 ఎ లలో ఉదహరించిన విధంగా రిజర్వేషన్ కోటా భర్తీ కాకపోవచ్చు. అదే విధంగా భర్తీకాని ఖాళీలు మరుసటి సంవత్సరం, ఆ పై సంవత్సరాలకు సంబంధించిన రిజర్వేషన్ల కోటాలో కలపాలి. ఒక సంవత్సరం రిజర్వేషన్ శాతం 50కి మించిందా లేదా అన్న విషయాన్ని నిర్ధారించడంతో పాటు ఆ సంవత్సరం రిజర్వేషన్ కోటాలో కలిసి ఉన్న, గత సంవత్సరాల్లో భర్తీ కాకుండా మిగిలిపోయిన ఖాళీల సంఖ్యను పరిగణనలోకి తీసుకోరాదు. 2000 సెప్టెంబర్ 6న 81వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ క్లాజును చేర్చారు. ఇక నియోజకవర్గాల రిజర్వేషన్లకు సంబంధించి 334వ అధికరణం చాలా స్పష్టంగా వివరించింది. సాంస్కృతిక విద్యా హక్కు విభాగంలో అధికరణం -29 కింద అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాల పరిరక్షణకు సంబంధించి రెండు క్లాజులు, అధికరణం -30 కింద మరో రెండు క్లాజులు వివరిస్తున్నాయి. అధికరణం -29 కింద ఒక విలక్షణమైన భాషను, లిపిని లేదా సంస్కృతిని కలిగి ఉన్నట్టయితే వారు ఆ భాష, లిపి, సంస్కృతిని పరిరక్షించుకునే హక్కు కలిగి ఉంటారని స్పష్టం చేసింది.
1953లో కాలెల్కర్ సంఘం ఏర్పాటైంది. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల పరిస్థితి అంచనా వేసేందుకు ఈ కమిటీ ఏర్పాటైంది. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి ఇచ్చిన నివేదికను ప్రభుత్వం ఆమోదించింది. ఒబిసి వర్గాలకు సంబంధించి చేసిన సిఫార్సులను తిరస్కరించింది. 1980లో కమిషన్ చేసిన సిఫార్సుల ప్రకారం కోటాలను 22 శాతం నుండి 49.5 శాతానికి పెంచుతూ మార్పులు చేసింది. 2006 నాటికి బిసి జాబితాలో కులాల సంఖ్య 2297కు పెరిగింది. మండల్ కమిషన్ తయారుచేసిన సమూహ జాబితాలో నుండి 60 శాతం పెరిగింది. 1990లో విపిసింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ సిఫార్సుల మేరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలుచేశారు. 1992లో ఇందిరా సావ్నే కేసులో ఇతర వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను సుప్రీంకోర్టు సమర్ధించింది. 1995లో పార్లమెంటు రాజ్యాంగ అధికరణ 16-4(ఎ)లో 77వ రాజ్యాంగ సవరణ ద్వారా పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను అనుమతించింది. సీనియారిటీకి 85వ సవరణ ద్వారా మరో మార్పు చేశారు. 1998లో వివిధ సామాజిక సమూహాల ఆర్ధిక విద్యాస్థాయిని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో దేశవ్యాప్త అధ్యయనాన్ని నిర్వహించింది. 2005 ఆగస్టు 12న ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పిఎ ఇనాందార్- ఇతరుల కేసులో ప్రభుత్వ సాయం లేని ప్రైవేటు కాలేజీల్లో రిజర్వేషన్లను అమలుచేయనక్కర్లేదని పేర్కొంది. దాంతో 2005లో 93వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రైవేటు విద్యాసంస్థల్లో ఇతర వెనుకబడిన తరగతులకు, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించారు. అయితే ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎం నాగరాజు- ఇతరులు కేసులో అధికరణ 16-4(ఎ), 16-4(బి) మరియు 335 అధికరణ నిబంధన రాజ్యాంగ చెల్లుబాటును తర్వాత సుప్రీంకోర్టు సమర్ధించింది. దీంతో 2006 నుండి ఓబిసిలకు రిజర్వేషన్లు అమలులోకి వచ్చాయి. 2007లో కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఒబిసి రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు స్టే విధించింది. 2008 ఏప్రిల్ 10న ప్రభుత్వ నిధులు పొందే సంస్థల్లో రిజర్వేషన్లను 27 శాతం మేర అమలుచేసేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సంపన్నశ్రేణిని తొలగించాలని మాత్రం పేర్కొంది.
రాజ్యాంగం కల్పించిన హక్కు అమలులో ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు లేకున్నా కేవలం కొన్ని వర్గాలకే పేదరికం పరిమితం కాలేదు. అన్ని కులాలు, మతాల్లో కూడా నిరుపేదలున్నారు. వారంతా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కూడా పేదరికంలోనే ఉన్నారు. చాలా దేశాల్లో లేని రిజర్వేషన్లు భారత్‌కే ఎందుకు ఉన్నాయని ప్రశ్నించేవారు లేకపోలేదు. ఈ సందర్భంగా సచార్ కమిటీ సిఫార్సులను కూడా మననంలోకి తీసుకోవాలి. రిజర్వేషన్లు కోరేవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. వారందరికీ రిజర్వేషన్లు కల్పించడం జరిగే పనేనా?

-బి.వి.ప్రసాద్