ఎడిట్ పేజీ

విద్రోహ మాధ్యమం.. ‘పద్మావతి’ చిత్రం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రేతాయుగం నాటి రఘురాముని భార్య సీతను కించపరిచే యత్నాలు జరిగాయి, ద్వాపర యుగం నాటి పాండవ పత్ని ద్రౌపదిని ‘జారిణి’గా ప్రచారం చేయడానికి కుట్రలు కొనసాగాయి. భారతదేశాన్ని బద్దలుకొట్టడానికి హైందవ జాతీయ చరిత్రను వికృతపరచడానికి విబుధ దైత్యులు శతాబ్దులుగా కొనసాగిస్తున్న బౌద్ధిక బీభత్సకాండ- ఇంటలెక్చువల్ ఫార్మ్ ఆఫ్ టెర్రరిజమ్‌లో ఇలాంటి అబద్ధ ప్రచారాలు భాగం. ఈ విబుధ దైత్యులు- చదువుకున్న రాక్షసులు మన దేశంలోకి విదేశాలనుంచి చొరబడినవారు, అలా చొరబడినవారికి ‘వారసులు’గా కొనసాగుతున్న వారు! అందువల్ల కలియుగం నాటి మేవాడ్ మహారాణి పద్మినీ దేవి సౌశీల్యాన్ని భంగపరచడానికి ‘సృజనాత్మకత’ పేరుతో చలన చిత్ర రంగంలోని బౌద్ధిక బీభత్సకారులు యత్నించడంలో ఆశ్చర్యం లేదు! ఈ బౌద్ధిక బీభత్సకాండను సమూలంగా నిర్మూలించడానికి బీభత్సకాండకు ఒడిగడుతున్న ‘అక్షర రాక్షసుల’ను శిక్షించడానికి వీలుగా సమగ్రమైన శాసకీయ వ్యవస్థ ఏర్పడకపోవడమే దశాబ్దులుగా దేశ ప్రజలను విస్మయచకితులను చేస్తున్న వైపరీత్యం! తనను కామించిన తురుష్క ముష్కరుడు, జిహాదీ బీభత్సకారుడు అల్లా ఉద్దీన్ ఖిల్జీ అనేవాడికి దొరకకుండా ‘అగ్నికుండం’లో దూకిన మహారాణి పద్మినీదేవి- పద్మావతి- తన సౌశీల్యాన్ని రక్షించుకొంది. క్రీస్తుశకం పదునాలుగవ శతాబ్ది ఆరంభం నాటి ఈ మేవాడ్ మహారాణి భీమ్‌సేన్ రతన్‌సింగ్- భీమ్‌సింగ్- భార్య! ఈ మాతృమూర్తి ‘‘ప్రాణంవాపి పరిత్యజ్య మానమేవాభి రక్షయేత్, అనిత్యో భవతి ప్రాణః మానయా చంద్ర తారకమ్..’’ అన్న భారత జాతీయ సంప్రదాయానికి మరో అజరామర ప్రతీక.. ప్రాణాన్ని వదలిపెట్టి అయినా సరే మానాన్ని - సౌశీల్యాన్ని- పరిరక్షించుకోవాలి, ప్రాణం తాత్కాలికమైనది, సౌశీల్యం చంద్రుడు, నక్షత్రాలు ఉన్నంతకాలం నిలిచి ఉంటుంది! భీమ్‌సింగ్ అర్థాంగి పద్మినీ దేవి ఈ సంప్రదాయాన్ని సంరక్షించింది. చిత్తోడ్ కోటను వంచనతో వశపరచుకున్న అభినవ ‘కీచకుడు’ అల్లా ఉద్దీన్ ఖిల్జీకి మహారాణి పద్మావతి దొరకలేదు. జిహాదీలకు కోటలోని వేలాది యువతులు, గృహిణులు చిక్కలేదు. మహారాణి పద్మిని- పద్మావతి- వేలమంది హైందవ యువతులు, గృహిణులు అగ్నికుండాలలో దూకి ‘జోహార్’ చేశారు, అగ్నిజ్వాలలకు ఆహుతైపోయారు. భారతీయ సౌశీల్య పరంపరను అజరామరం చేశారు! ప్రవరుడు, కచుడు, రఘురాముడు, యదుకృష్ణుడు, కురుకుల అర్జునుడు, ఛత్రపతి శివాజీ, వివేకానందుడు, అరుంధతి, అనసూయ, పద్మావతి, లక్ష్మీబాయి వంటివారు అసంఖ్యాక సౌశీల్యమూర్తులు భారత జాతీయ చరితను సముజ్వలం చేశారు. ఈ వెలుగును ఆర్పివేయడానికి బౌద్ధిక బీభత్సకారులు యత్నిస్తున్నారు. ఈ కుట్రలో భాగంగానే పద్మావతి అన్న హిందీ చలనచిత్రంలో ‘‘మేవాడ్ మహారాణి పద్మినికి జిహాదీ బీభత్సకారుడైన అల్లా ఉద్దీన్ ఖిల్జీకి మధ్య శృంగార భావం ఏర్పడినట్టు’’ అబద్ధాన్ని కల్పించారట! కీచకుడికీ ద్రౌపదికీ మధ్య, సీతకు రావణుడికీమధ్య శృంగార భావాలను సృష్టించిన మాతృదేశద్రోహుల చర్యలకు ఇది కొనసాగింపు..
ఇలా ‘పద్మావతి’- అన్న పేరుతో ‘వయాకమ్ మోషన్ పిక్చర్స్’ వాణిజ్య సంస్థవారు నిర్మించిన హిందీ చలన చిత్రం దేశంలో కొనసాగుతున్న ఈ బౌద్ధిక బీభత్సకాండంలో భాగం! ఈ చిత్రాన్ని ప్రదర్శించడానికి, విడుదల చేయడానికి అనుమతించరాదన్నది ఈ చలన చిత్రాన్ని వ్యతిరేకిస్తున్న వారి లక్ష్యం. ఈ వ్యతిరేక ఉద్యమం రాజస్థాన్‌లో సృష్టించిన చిటపటలు వివిధ ప్రాంతాలలో పటపటలుగా ప్రతిధ్వనిస్తున్నాయి! ‘శ్రీరాజపుత్ర కరణీసేన’- ఎస్‌ఆర్‌కెఎస్- అన్న సంస్థ ఈ ‘సినిమా’ను వ్యతిరేకిస్తోంది. ‘సేన’ అడుగుతున్న ప్రశ్నలకు చిత్ర నిర్మాతలు సరైన సమాధానం ఇవ్వడంలేదు! ఈ చిత్రంలో మహారాణి పద్మావతి నృత్యం చేసిందట! చరిత్రలో మహారాణి ఇలా బహిరంగంగా నృత్యం చేయలేదు. ‘చిత్రం’లో చేసిందట! ‘‘మహారాణి భర్త వద్ద నృత్యం చేసిందని’’చిత్ర నిర్మాతల సమాధానం! కానీ ‘‘మహారాణి పద్మినికీ బీభత్సకారుడైన ఖిల్జీకి మధ్య ‘శృంగార భావోద్వేగాన్ని’ సృష్టించే ప్రయత్నం ‘చిత్రం’లో జరిగిందా?’’ అన్న ప్రశ్నకు మాత్రం చిత్ర దర్శకుడు సంజయ్‌లీలా బన్సాలీ అనే వాడు కాని నిర్మాతలు కాని సమర్థకులు కాని ఇంతవరకు ఎందుకు సమాధానం చెప్పలేదు? అందువల్ల ‘రాజపుత్ర సేన’ చేస్తున్న ఆరోపణలు నిజమన్నది సర్వత్రా వ్యాపించిన అభిప్రాయం. డిసెంబర్ ఒకటవ తేదీన ‘సినిమా’ను విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించడం నిజానికి శాసన ధిక్కారం. చలనచిత్రాన్ని మొదట ‘కేంద్రీయ చలనచిత్ర అనుమతి ప్రధాన సంస్థ’- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ సర్ట్ఫికేషన్’- సిబిఎఫ్‌సి వారు తిలకించాలి, వారు అనుమతి ప్రసాదించిన తరువాతనే ప్రచార మాధ్యమాలవారికి ఇతరులకు చూపించాలి. విడుదల సమయాన్ని ప్రకటించాలి! కాని ‘సిబిఎఫ్‌సి’ వారి అనుమతిని పొందక ముందే నిర్మాతలు ఈ ‘పద్మావతి’ చిత్రాన్ని ఎంపిక చేసుకున్న మాధ్యమ ప్రతినిధులకు, ఇతరులకు ప్రదర్శించి చూపించారు! ‘‘ఇలా శాసన ధిక్కారం జరిపిన నిర్మాతలను దర్శకుడిని సిబిఎఫ్‌సి అధ్యక్షుడు ప్రసూన జోషి అభిశంసించడం చిత్ర బృందంవారి నికృష్ట ప్రవర్తనకు తిరుగులేని సాక్ష్యం! ఇలా సిబిఎఫ్‌సి అభిశంసించిన తరువాత చిత్రం విడుదలను వాయిదా వేస్తునట్టు నిర్మాతలు ప్రకటించారు! ‘‘మీరు ఈ చిత్రాన్ని చరిత్ర ప్రాతిపదికగా నిర్మించారా? లేక ఇది కల్పిత కథనమా?’’ అన్న ప్రశ్నకు నిర్మాతలు ‘దరఖాస్తు’ పత్రంలో సమాధానం చెప్పలేదు. ఆ ‘కుడ్యస్థలాన్ని’- కాలమ్‌ను- నిర్మాతలు ఖాళీగా వదలివేసినట్టు ప్రసూన జోషి వెల్లడించడం నిర్మాతల నికృష్ట వికృత వ్యూహానికి మరోసాక్ష్యం... పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగడానికి యత్నించింది! ఈ ‘సినిమా’ను ‘రాజపుత్ర సేన’ సంస్థాపకుడు లోకేంద్రసింగ్ కల్వీ, అధ్యక్షుడు మహేంద్రసింగ్ మక్రాణా తదితర ‘సేన’ ప్రతినిధులకు చూపిస్తామని నిర్మాతలు మాట ఇచ్చారట! మాట తప్పారు! ‘ఆరోపణ’లు నిజమే కావచ్చునన్నదానికి ఇది మరో సాక్ష్యం!
జరగవలసిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు ‘సినిమా’ను నిషేధిస్తారా? లేక ‘సిబిఎఫ్‌సి’ వారు, ఉద్యమకారులు సూచించిన మార్పులను నిర్మాతలు అంగీకరిస్తారా? అన్నది ప్రాధాన్యం కోల్పోయిన ప్రశ్నలు. మేవాడ్ మహారాణిని కించపరచిన ఆమె చరిత్రను హననం - కారెక్టర్ అస్సాసినేషన్ - చేసిన దృశ్యాలను తొలగించవచ్చుగాక! కాని పనికట్టుకుని అలాంటి దృశ్యాలను చిత్రీకరించడమే బౌద్ధిక బీభత్సంలో భాగం... ఇలా సన్నివేశాలు చిత్రంలో ఉన్నట్టు ప్రచారం కావడమే చిత్ర నిర్మాణంలో ముడి ఉన్నవారి లక్ష్యం! వారి లక్ష్యం నెరవేరింది! ఇది దశాబ్దులుగా సాగుతున్న కుట్ర! భారతీయ మహాపురుషుల మాతృమూర్తుల ఔన్నత్యాన్ని తగ్గించడం, ఈ దేశాన్ని దురాక్రమించి ఆర్థిక, భౌతిక, సామాజిక, ధార్మిక, సాంస్కృతిక బీభత్సకాండను సాగించిన విదేశీయ దుర్జనులను ప్రశంసించడం ఈ కుట్రలో భాగం. భారతీయతతో హైందవ జాతీయ తత్త్వంలో ముడివడిన ప్రతి అంశాన్ని కించపరచడం ఈ కుట్రలో భాగం, విదేశీయ దురాక్రమణకారులను, సర్వమత సమభావ వ్యతిరేకులైన జిహాదీలను, మతం మార్పిడి మూకలను పొగడడం ఈ విష వ్యూహం! గ్రీకు బీభత్సకారుడు అలెగ్జాండర్‌ను ‘గ్రీకువీరుడ’ని ప్రచారం చేయడం ఈ బౌద్ధిక బీభత్సకారుల జీవన ‘విలాసం’- ఫాషన్- అయిపోయింది. ఛంగిస్‌ఖాన్, గజనీ, ఘోరి, అల్లాఉద్దీన్ ఖిల్జీ, మొఘలాయి బాబర్, జహంగీర్, షాజహాన్ వంటి ప్రత్యక్ష బీభత్సకారులను మొఘలాయి అక్బర్ వంటి ప్రచ్ఛన్న బీభత్సకారులను గొప్పవారిగా చిత్రీకరిస్తు ‘బ్రిటన్’ చరిత్రకారులు కథలను కల్పించారు! సమాంతరంగా భారతీయుల గరిమను తగ్గించడం బ్రిటన్ చరిత్రకారుల లక్ష్యం! ఈ కుట్ర కొనసాగుతూనే వుంది. అక్షర మాధ్యమాలలోను, దృశ్యమాధ్యమాలలోనూ ఈ కుట్ర నిహితమై ఉంది!
‘జిహాదీ’లు పాలకులుగా చెలామణి అయిన సమయంలో తమ ఘనకార్యాల గురించి వారు ఘనంగా ప్రచారం చేసుకున్నారు! ఇస్లాం మతేతరులను చంపడం, ఇస్లామేతర మతాల మహిళలను లైంగిక బీభత్సకాండకు గురిచేయడం, ఇస్లామేతరులను బలవంతంగా ఇస్లాంలోకి మార్చడం, తరిమివేయడం వంటి చర్యలు గొప్పవని వివిధ శతాబ్దులలోని ‘జిహాదీ’లు భావించారు. ఈ భావనతో సామాన్య ముస్లింలకు సంబంధం లేదు. కానీ ‘జిహాదీ’లు ఈ బీభత్సకాండను ఇస్లాం వ్యాప్తికోసం మాత్రమే కొనసాగించడం చరిత్ర. ఈ చరిత్ర కారణంగానే బలవంతంపు మతపు మార్పిడులు కారణంగానే ఇప్పటి పాకిస్తాన్‌లో క్రీస్తుశకం 712 నాటికి ‘సున్న’ శాతం ఉండిన ఇస్లాం మతస్థుల సంఖ్య 1947 నాటికి మూడున్నర కోట్లకు చేరింది. మిగిలిన అన్ని మతాల వారిని మట్టుపెట్టి ఇస్లాంను ప్రపంచంలో ఏకైక మతంగా ప్రతిష్ఠించడం ‘జిహాదీ’ల లక్ష్యం! ఈ లక్ష్యసాధన కోసమే ‘జిహాదీ’లు 712 నుంచి మన దేశంలో బీభత్సకాండ సాగించారు, సాగిస్తున్నారు. అల్లాఉద్దీన్ ఖిల్జీ ఇలాంటి బీభత్స జిహాదీ హంతకుడు! కీచకుడిని, సైంధవుడిని, రావణుడినీ ఇంకా ఇలాంటి లైంగిక బీభత్సకారులను మన చరిత్రకారులు గొప్పవారుగా కీర్తించలేదు! కానీ అల్లాఉద్దీన్ ఖిల్జీ గొప్పవాడని గొప్ప పరిపాలకుడని బ్రిటన్ దొరలు వ్రాసిపోయారు. ఎందుకంటే బ్రిటన్ వారికి భారతదేశం మాతృభూమి కాదు! బ్రిటన్ చరిత్రను జర్మనీ నియంత హిట్లర్ వ్రాయించినట్టయితే ఎలా ఉండేది? అలా తయారైంది బ్రిటన్ వారు రూపొందించిన మన చరిత్ర.. రామాయణాన్ని వాల్మీకి మహాకవి కాక రావణాసురుడు వ్రాసి ఉంటే ఎలా ఉండేది?
ఇలా బ్రిటన్ దొరలు వక్రీకరించిన మన చరిత్రను మరింతగా వికృతపరచడానికి ప్రస్తుతం ప్రయత్నం జరుగుతోంది. ఈ ప్రయత్నంలో భాగం ఈ ‘పద్మావతి’ సినిమా! అన్యమతాల ఉనికిని సహించలేని జిహాదీలకు, సర్వమత సమభావ సంపుటమైన భారత జాతీయతకు లేదా హైందవ జాతీయతకు మధ్య క్రీస్తుశకం 712 నుంచి పోరాటం జరుగుతోంది. 712లో దేశంలోకి చొరబడి సింధులోని దేవల పట్టణంలోని మొత్తం హిందువులను హత్య చేసిన మహమ్మద్‌బిన్ కాసిమ్ అనే అరబ్బీ బీభత్సకారుడు వేలాది యువతులను ‘బానిసలు’గా చేసి అరబ్ ప్రాంతాలకు తరలించడంతో ఈ పోరాటం మొదలైంది! ఈ శతాబ్దుల సంఘర్షణలో మహారాణి పద్మిని వంటి లక్షలాది హైందవ మహిళలు బలిదానం చేశారు, లక్షల హైందవ మహిళలు లైంగిక అత్యాచారాలకు గురి అయ్యారు! పాకిస్తాన్ ఏర్పడిన వెంటనే 1947లో వేలమంది హిందూ యువతులను జిహాదీలు లైంగిక అత్యాచారాలకు గురిచేయడం పరాకాష్ఠ..
క్రీస్తుశకం పదునాలుగవ శతాబ్ది నాటి అల్లాఉద్దీన్ ఖిల్జీ ఈ జిహాదీ పరంపరకు చెందినవాడు! తండ్రిని చంపి ఢిల్లీలో గద్దెనెక్కిన ఈ బీభత్సకారుడు కాకతీయుల ఓరుగల్లు కోటను ఆరుసార్లు ముట్టడించి పరాజయం పాలయ్యాడు. ఏడవసారి జిహాదీలు వంచనతో కాకతీయ సమ్రాట్టు ప్రతాప రుద్రదేవుని ఓడించి, ఆ తరువాత ఆంధ్ర దేశమంతటా భయంకర బీభత్సకాండ జరిపారు! చిత్తోడ్ దుర్గాన్ని ఖిల్జీ ముట్టడించడం సమాంతర విపరిణామం!

-హెబ్బార్ నాగేశ్వరరావు 9951038352