మెయిన్ ఫీచర్

అమెరికాలో మన ప్రతిభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలప్రగడ ప్రతిభ అమెరికాలో యువ పారిశ్రామికవేత్తగా ఎదిగిన భారతీయురాలు. ఉన్నత చదువుల కోసం ఆమెరికా వెళ్లి పారిశ్రామికవేత్తగా ఎదిగిన తెలుగమ్మాయి. ఎందరికో ఉపాధి చూపిస్తున్నారు. కూచిపూడి, ఫొటోగ్రఫీ ఆమెలో దాగివున్న కళలు. ఖాళీ సమయాల్లో కూచిపూడి నృత్యం నేర్పిస్తోంది. ముగ్గురు బిడ్డల తల్లయినప్పటికీ మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థ స్థాపించి పలువురికి ఉపాధి కల్పిస్తున్న ఆమెకు కృషికి గుర్తింపుగా వాషింగ్‌టన్ పారిశ్రామికవేత్త అవార్డును పొందారు.
నేషనల్ సైన్స్ స్కాలర్‌షిప్‌తో చదువు..
పోలప్రగడ ప్రతిభ కాకినాడలో పుట్టారు. అక్కడే పాఠశాల విద్యాభ్యాసం చేశారు. విశాఖపట్నంలోని గీతం యూనివర్శిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. జార్జి వాషింగ్‌టన్ యూనివర్శిటీలో ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్ డిగ్రీ చేశారు. విదేశాలలో చదువుకోవాలని చిన్నప్పటి నుంచి కలలు కనేవారు. ఆ కలను సాకరం చేసుకోవటానికి తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహంతో అమెరికా వెళ్లి నేషనల్ సైన్స్ స్కాలర్‌షిప్‌తో చదువుకున్నారు. వంశీ మోహన్‌తో వివాహం అయింది. వాషింగ్‌టన్‌లో స్థిరపడ్డారు.
స్టార్టప్‌లో కెరీర్‌లో ఆరంభం..
ప్రతిభ తొలుత బిజినెస్ ఇంటిలిజెన్స్ స్టార్టప్‌లో కెరీర్ ఆరంభించారు. ఆ వృత్తిలో ఎంతో సంతృప్తి ఉండేది. వృత్తిరీత్యా ఎన్నో దేశాలకు వెళ్లాల్సి వచ్చేది. 2006 ఉద్యోగంలో ఉన్నతి సాధించారు. అయితే ఆమెకు మొదటి బిడ్డ పుట్టడంతో ప్రసూతి సెలవు అయిపోయిన తరువాత మళ్లీ ఉద్యోగంలో చేరారు. కాని చిన్నపిల్లను వదలి వెళ్లటం ఇష్టం లేక రెండు వారాలు ఉద్యోగం చేసి రిజైన్ చేశారు.
తొలి అడుగు..
ఇంట్లో నాలుగు నెలల బిడ్డను చూసుకుంటూ సొంతం వ్యాపారం ఎలా చేయాలా అని ఆలోచించారు. ఇందుకోసం అనే్వషణ ఆరంభించారు. కుటుంబ సభ్యులు, భర్త ప్రోత్సాహంతో ‘మై పిక్ టేల్స్’ అనే కంపెనీని ఆరంభించారు. పెద్ద ప్రచురణ విభాగాన్ని నెలకొల్పాలని ప్రతిభ ఆశయం. కాని మార్కెట్లో వచ్చే ఆటుపోట్లను తట్టుకోనే ధైర్యం ఉండాలి. అందుకే ‘మై పిక్ టేల్స్’లో కాఫీ టేబుల్ బుక్స్, పర్సనల్ కార్డ్స్, క్యాలెండర్స్, పోస్టర్స్, గోడలకు అంటించుకునే స్టిక్కర్లు, ఫొటోలు, బ్లాగులు తదితర డిజిటల్ విభాగానికి చెందిన వాటిని తయారుచేసి మార్కెట్ చేసేవారు. వ్యాపారం ప్రారంభించిన సంవత్సరానికే పెట్టుబడి మొత్తం తిరిగిరావటం ఉత్సాహాన్ని అందించింది. రెండవ సంవత్సరంలో ఈ వ్యాపారంలో మరింత పెట్టుబడిని పెట్టి కస్టమర్లను ఆకర్షించారు. రెండవ సంవత్సరంలో ఈ సంస్థకు ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ ఇండస్ట్రీ అవార్డు రావటం ఆమె కృషికి తగిన గుర్తింపుగా చెప్పవచ్చు. అనేక అంతర్జాతీయ ఎక్స్‌పోస్‌లోనూ, ట్రేడ్ షోలలో ఈ సంస్థకు మంచి గుర్తింపు దక్కింది. ఆన్‌లైన్ టాప్ టెన్ అవార్డులు ఈ సంస్థకు దక్కేవి. ఏడేళ్ల పాటు నిర్విరామంగా కృషి వల్ల మై పిక్స్ టేల్స్‌కు గుర్తింపు లభించింది.
మళ్లీ ఉద్యోగంలోకి..
సొంత వ్యాపారంలో రాణిస్తుండగానే ఏడేళ్ల తరువాత మళ్లీ ఉద్యోగంలో చేరారు. సోషల్ మీడియాలో విభిన్న హోదాల్లో పనిచేశారు. మార్కెటింగ్, డిజిటల్, ఆర్కిటెక్చర్ తదితర రంగాల్లో తన సేవలు అందించారు. ఆమెకు ఎంతో ఇష్టమైన ఫొటోగ్రఫీలో మాత్రం తన మక్కువను కోల్పోలేదు. మెటర్నర్టీ, నవజాతి శిశువుల ఫొటోలు తీయటం ఆమెకు ఎంతో ఇష్టం. ఫొటోగ్రఫీలోనూ ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. అపుడే పుట్టిన పిల్లల్లోనూ ప్రత్యేక వ్యక్తిత్వం దాగి ఉంటుంది. అలాగే గర్భిణీల కదలికలు, వారి హావాభావాలను ఫొటోగ్రఫీలో బంధించటం అనేది సవాల్‌తో కూడుకున్న పని. ఈ సవాల్‌ను స్వీకరించి ఎన్నో అవార్డులను తీసుకోవటం ఆమె సృజనాత్మకతకు నిదర్శనం. నిత్యం సృజనాత్మకమైన ఆలోచనలతో పనిలోనే స్ఫూర్తి పొందుతాను అని చెబుతుంది. అదే ఆనందాన్ని ఇస్తుంది అని ఆమె నమ్మకం. మన సమస్యలే మనల్ని శక్తిమంతులుగా తీర్చిదిద్దుతాయి. నైపుణ్యం సాధించాలంటే సహనం అవసరమని నమ్మే ప్రతిభ అమెరికాలో ఇంకా తన సామర్థ్యంతో మరింత రాణించేందుకు ముందుకు సాగుతుంది.

-హరిచందన