మెయన్ ఫీచర్

పాలనలో జిల్లాలదే ప్రధాన భూమిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అపర మేధావిగా, సంస్కర్తగా, హైదరాబాద్ రాజ్యాన్ని సుస్థిర పరచిన వాడిగా, చరిత్రపుటల్లోకి ఎక్కిన సాలార్జంగ్ ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో, 1865లో ‘‘జిల్లా బందీ’’ విధానా న్ని అమల్లోకి తెచ్చారు. అప్పటి హైదరాబా ద్ రాజ్యాన్ని 16 జిల్లాలుగా విభజించారు. ప్రస్తుతం ఉన్న జిల్లాల వ్యవస్థ, రెవెన్యూ పాలనా వ్యవస్థకు సాలార్జంగ్ అలా పునాదులు వేసి, ఒక ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చి శాశ్వతంగా వుండిపోయేలా చేశాడు. వీటిలో తెలుగు మాట్లాడే 8 జిల్లాలు, హైదరాబాద్‌తో సహా, నేటి తెలంగాణ ప్రాంతం లో వుండేవి. దరిమిలా 1953లో వరంగల్ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న ఖమ్మజిల్లా వేరే జిల్లాగా ఏర్పాటైంది. జిల్లాల సంఖ్య 9కి పెరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో హైదరాబాద్ జిల్లాలో భాగంగా ఉన్న కొన్ని తాలూకాలను కలిపి రంగారెడ్డి జిల్లా గా ఏర్పాటు చేయడంతో తెలంగాణ ప్రాం తంలో జిల్లాల సంఖ్య పదికి చేరుకుంది. ఇక అప్పటినుంచి ..అంటే గత మూడున్నర దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతంలో పది జిల్లాలలోనే పాలన సాగుతోంది.
ఈ నేపథ్యంలో 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల ప్రణాళికలో, తెలంగాణ పునర్వ్యవస్థీకరణలో భాగంగా, ప్రస్తుతమున్న పది జిల్లాల సంఖ్యను పెంచి మొత్తం 24 జి ల్లాలుగా ఏర్పాటు చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి పేర్కొనది. అధికారం చేపట్టిన తర్వాత ఆ దిశగా చర్యలు చేపట్టింది. సగటున ఒక్కో జిల్లా జనాభా కొన్ని రాష్ట్రాల మాదిరిగా మరీ ఎక్కువ కాకుండా, మరి కొన్ని రాష్ట్రాల వలె మరీ తక్కువ కాకుండా, మధ్యే మార్గాన్ని అనుసరిస్తామని కూడా ఎన్నికల ప్రణాళికలో చెప్పడం జరిగింది. చేసిన వాగ్దానానికి అనుగుణంగానే కొత్తగా మరో 14 లేదా 15 జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. సీఎం చెప్పినట్లు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక చారిత్రక ఘట్టం. అలానే పాలనా సౌలభ్యం కోసం అదనంగా కొత్త జిల్లాల ఏర్పాటు మరో చారిత్రక ఘట్టం.
అనాదిగా భారతదేశంలో పరిపాలనా సౌలభ్యానికి వెసులుబాటు కల్పించడంలో జిల్లాలు ముఖ్య భూమిక వహిస్తూ వస్తున్నాయి. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రజాస్వామిక ప్రభుత్వాలు కార్యక్రమాలు రూపొందించడం, జిల్లాలకు ప్రాధాన్యత పెరిగి అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేందుకు మరింత కీలకమైన పాత్ర పోషించడం మొదలైంది. క్షేత్రస్థాయిలో జిల్లాలు ఒక యూనిట్‌గా కార్యక్రమాల అమలులో ప్రధాన పాత్ర పోషించడం తదనుగుణంగా పరిపాలనా విధివిధానాలు బేరీజు వేసుకోవడం చాలాకాలం నుంచి అమల్లో వున్న ప్రక్రియ. జిల్లాల పరిపాలనా బాధ్యతలు ఐఏఎస్ స్థాయి అధికారులైన జిల్లా కలెక్టర్లు నిర్వహిస్తుంటారు. న్యాయపరమై బాధ్యతలు కూడా వారి అదుపులోనే వుంటాయి. భద్రతాపరమైన అంశాలు, ఐపీఎస్ అధికారైన జిల్లాల పోలీసు సూపరింటెండెంట్‌లకు అప్పజెప్పబడతాయి. సాధారణంగా జిల్లా కలెక్టర్‌కు మూడు ముఖ్యమైన బాధ్యతలు ఉంటా యి. ఒకటి ఆర్థికపరమైన (రెవెన్యూ)), రెండు న్యాయపరమైన, మూడు అభివృద్ధిపరమైన బాధ్యతలు. భౌగోళికంగా ఎక్కువ విస్తీర్ణంలో ఉండి, పదిహేను లక్షల కన్నా ఎక్కువ జనసాంద్రత కలిగిన జిల్లాలలో అన్ని కోణాలలో దృష్టి సారించి, ప్రతీ అంశంలో ఏకాగ్రతతో విధులు నిర్వర్తించడం ఆయా జిల్లాల కలెక్టర్లకు దుస్సాధ్యమే అవుతుందనాలి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రెండు పడకగదుల ఇళ్లు, గ్రామజ్యోతి, హరితహారం, భూ సమీకరణ-కొనుగోళ్లు, దళితులకు భూపంపిణీ, జిల్లా స్థాయిలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతి పర్యవేక్షణ లాంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో జిల్లాల విస్తృతి, ప్రస్తుత పరిమాణం కన్నా తక్కువ ఉంటే సులభతరం, సుసాధ్యం అవుతుంది.
ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానం అమలు దిశగా, కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ప్రాథమిక స్థాయిలో వివరాలు సేకరించి, నివేదికలు రూపొందించింది. ఈ కమిటీ నివేదికలు పరిశీలించిన మీదట ప్రస్తుత 10 జిల్లాల స్థానే అధిక సంఖ్యలో జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మొదలైంది. టిఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 24 లేదా 25కు పెరిగే అవకాశముంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ప్రతి జిల్లాకు 15 లక్షల జనాభా మించకుండా జిల్లాల విభజన ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుత గణాంకాల ప్రకారం మనదేశంలోని 29 రాష్ట్రాల్లో 681 జిల్లాలున్నాయి. ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలుండాలి? ఎంతమంది జనాభాకు ఒక జిల్లా ఉండాలి? అనే విషయంలో నిర్దిష్ట ప్రామాణికాలు లేవు. ఆయా రాష్ట్రాల పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లాలను ఎంచుకున్నారు. అలాగే లోక్‌సభ స్థానాల సంఖ్యకు, శాసనసభ స్థానాలకు ఎటువంటి ప్రామాణికం లేదు. జనాభా ప్రా తిపదికన, జిల్లాల ప్రాతిపదికన, లోక్‌సభ, శాసనసభ స్థానాల ప్రాతిపదికన నిష్పత్తులను పరిశీలించినట్లయితే ఇలాంటి వ్యత్యాసాలు స్పష్టంగా కనబడతాయి.
రాష్ట్రాల జనాభా నాటి సంఖ్యాపరమైన వ్యత్యాసాలు గమనించినట్లయితే వైవిధ్యాలు ఇట్టే కనబడతాయి. ఉత్తర ప్రదేశ్ జనాభా 20 కోట్లు కాగా (దేశ జనాభాలో 16.49%), సిక్కిం జనాభా 6 లక్షలు (దేశ జనాభాలో 0.05%) మాత్రమే. అదేవిధంగా లోక్‌సభ స్థానాల సభ్యులు ఉత్తర ప్రదేశ్ నుంచి 80 మంది ఉండగా, సిక్కిం నుంచి కేవలం ఒకే ఒక్క సభ్యుడు మాత్రమే ప్రాతినిధ్యం వహించడం విశేషం. ఆశ్చర్యం కలిగించే మరో అంశం ఏంటంటే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నుండి 80 పార్లమెంట్ సభ్యులకు గాను 404 అసెంబ్లీ సెగ్మెంట్లు కేటాయం చగా, అదే సిక్కిం నుంచి కేవలం ఒక్క పార్లమెంటు సభ్యుడికి 32 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండటం విచిత్రం. ఏ లెక్కన ఈ ఏర్పాటు జరిగిందో తెలియదు. అలాగే వివిధ రాష్ట్రాల్లోని లోక్‌సభ, అసెంబ్లీ సెగ్మెంట్ల నిష్పత్తుల్లోని వైవిధ్యాలు గమనిస్తే: ఉత్తర ప్రదేశ్‌లో ఒక్క లోక్‌సభ స్థానానికి ఐదుగురు ఎమ్మెల్యేలుండగా, నాగాలాండ్‌లో ఒక్క ఎంపీ నియోజకవర్గ పరిధిలో అరవైమంది శాసన సభ్యులున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ సెగ్మెంట్లకు 404 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా, ఈశాన్య రాష్ట్రాలన్నీ కలిపి, మొత్తం అసెంబ్లీ సెగ్మెంట్లు 412 కాగా లోక్‌సభ సెగ్మెంట్లు 13 మాత్రమే! ఏవిధంగా ఇది న్యాయబద్ధమో తెలియదు. వివిధ రాష్ట్రాల్లో నిష్పత్తి తేడాలు పరిశీలించినట్లయితే ఉత్తర ప్రదేశ్ 1:5 కాగా, ఉత్తరా ఖండ్, జమ్మూకశ్మీర్‌ల నిష్పత్తి 1:14. ఎక్కువ శాతం రాష్ట్రాల్లో అసెంబ్లీ, లోక్‌సభ నిష్పత్తి 1:7గా ఉండటం విశేషం. జిల్లాల సంఖ్య నిర్ణయంలో కాని, ఆయా లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల సంఖ్య నిర్ణయంలో కాని సరైన ప్రామాణికాలను పాటించకపోవడం గమనించాల్సిన అంశం.
వివిధ రాష్ట్రాలలోని జిల్లాల సంఖ్యను తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల సంఖ్యతో పోల్చి చూసినట్లయితే చాలా తేడాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. హిమాచల్ ప్రదేశ్‌లో కేవలం 68 లక్షల జనాభాకు 12 జిల్లాలు ఉండటం, నలుగురు లోక్‌సభ సభ్యులు, 68 మంది శాసనసభ సభ్యులు ప్రాతినిధ్యం వహించడం విశేషం. ఉత్తరా ఖండ్‌లో కోటి జనాభాకు గాను 13 జిల్లాలు, 5గురు లోక్‌సభ సభ్యులు, 70 మంది శాసన సభ్యులు ఉన్నారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో కోటీ 25 లక్షల జనాభాకు, 22 జిల్లాలు, 6గురు లోక్‌సభ సభ్యులు, 89 మంది శాసనసభ్యులు ఉన్నారు. హర్యానా రాష్ట్రంలో 2.53 కోట్ల జనాభాకు 21 జిల్లాలు, 10 మంది లోక్‌సభ సభ్యులు 90 మంది శాసనసభ సభ్యులున్నారు. అలాగే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 2.55 కోట్ల జనాభా ఉండగా, 27 జిల్లాలు 11 మంది లోక్‌సభ సభ్యు 91 మంది శాసనసభ్యులు ఉన్నారు. పంజాబ్ రాష్ట్రంలో 2.77 కోట్ల జనాభాకు 22 జిల్లాలు, 13 మంది లోక్‌సభ సభ్యులు, 117 మంది శాసనసభ సభ్యులు ఉన్నారు. అస్సాం రాష్ట్రంలో 3.12 కోట్ల జనాభాకు 32 జిల్లాలు, 14 మంది లోక్‌సభ సభ్యులు 126 మంది శాసనసభులు ఉన్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో 3.29 కోట్ల జనాభాకు 24 జిల్లాలు, 14 మంది లోక్‌సభ సభ్యులు, 81 మంది శాసనసభ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఈ లెక్కన చూస్తే తెలంగాణ రాష్ట్రంలో 3.53 కోట్ల మంది జనాభాకు కేవలం 10 జిల్లాలు, 17 మంది పార్లమెంట్ సభ్యు లు 119 మంది శాసనసభ్యులు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పైన పేర్కొన్న ఎనిమిది రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో లోక్‌సభ, శాసనసభ స్థానాలతో సహా, జిల్లాల సంఖ్య తక్కువ ఉండటం గమనార్హం. అత్యంత చిన్న రాష్ట్రాలయిన అరుణాచల్ ప్రదేశ్‌లో సైతం 14 లక్షల జనాభాకు 19 జిల్లాలు, నాగాలాండ్‌లో 20 లక్షల జనాభకు 11 జిల్లాలు, మేఘాలయలో 29 లక్షల జనాభాకు 11 జిల్లాలు ఉన్నాయి.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మధ్యప్రదేశ్‌లో 28 లోక్‌సభ సెగ్మెంట్లకు 51 జిల్లాలు, ఒడిశా రాష్ట్రంలో 21 లోక్‌సభ సెగ్మెంట్లకు 30 జిల్లాలు, రాజస్థాన్‌లో 25 లోక్‌సభ స్థానాలకు 33 జిల్లాలు, కర్ణాటకలో 28 లోక్‌సభ సెగ్మెంట్లకు 30 జిల్లాల, గుజరాత్‌లో 26 లోక్‌సభ సెగ్మెంట్లకు 33 జిల్లాలున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో 80 లోక్‌సభ సెగ్మెంట్లకు 75 జిల్లాలు, బిహార్‌లో 40 లోక్‌సభ సెగ్మెంట్లకు 38 జిల్లాలు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో లోక్‌సభ సెగ్మెంట్ల సంఖ్యకు ఇంచుమించు సరిసమానంగా జిల్లాల సంఖ్య ఉండటం గమనార్హం. కాగా మహారాష్టల్రో 48 లోక్‌సభ సెగ్మెంట్లకు గాను 36 జిల్లాలు, పశ్చిమ బెంగాల్‌లో 42 లోక్‌సభ సెగ్మెంట్లకు గాను 20 జిల్లాలు, తమిళనాడులో 39 లోక్‌సభ సెగ్మెంట్లకు 32 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ సెగ్మెంట్లకు 13 జిల్లాలు, కేరళలో 20 లోక్‌సభ సెగ్మెంట్లకు 14 జిల్లాలు ఉన్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రానికి పది జిల్లాలు, 17 లోక్‌సభ సెగ్మెట్లు మాత్రమే ఉన్నాయి. మొత్తంమీద ఈ అరు రాష్ట్రాల్లో జనాభాకు సంబంధం లేకుండా తక్కువ సంఖ్యలో జిల్లాలు, లోక్‌సభ సెగ్మెంట్ల సంఖ్య ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కూడా చిన్న దేశాల మేనేజ్‌మెంట్ తేలిక అనే విషయం అవగత వౌతున్న నేపథ్యంలో మన రాష్ట్రంలో కూడా జిల్లాలు చిన్నవిగా వుండటం సమంజసం.
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల సంఖ్యతో పాటు, మండలాలను, రెవెన్యూ డివిజన్లను అసెంబ్లీ సెగ్మెంట్ల సంఖ్యను వీలున్నప్పుడు లోక్‌సభ స్థానాలను పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ విధంగా మార్పు రావడం జరిగితే ఎన్నికల ముందు చేసిన వాగ్దానాల పరంపరలో మరో మైలురాయిని అధిగమించినట్లవుతుంది. మరో చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టినట్టవుతుంది.

-వనం జ్వాలా నరసింహారావు సెల్: 8008137012