మెయన్ ఫీచర్

భాషకు పట్టం కట్టేదెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మేము అట్టడుగు గిరిజన జాతికి చెందినవారం. మా భాషలో మాట్లాడటం అవమానంగా భావిస్తాం!’ అంటూ ఉత్తరాఖండ్ పర్వత శ్రేణుల్లో నివాసముండే వన్‌రాజ్ (వన్‌రావత్) గిరిజన తెగకు చెందిన మదన్‌సింగ్ అనే గిరిజనుడు ఓ పత్రికా జర్నలిస్టుతో అన్న మాటలివి. వారి భాష ‘రాజీ’ అంటారు. కాని, ఉపాధి, బతుకు తెరువు నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో, తమ మాతృభాషలో మాట్లాడడానికి వారు ఇష్టపడడం లేదు. కారణం, ఆ ప్రాంతాల్లో నడిచే బడుల్లో హిందీ మాతృభాషగా కొనసాగడం, అందులో పనిచేసే ఉపాధ్యాయులు హిందీతోపాటు, స్థానిక భాష కుమావోని(kumaoni) లో మాట్లాడడంతో రాజీ భాషను వారు జంగ్లీ భాష (పేరుకు ఆటవిక భాష అనే అర్థం వచ్చినా జంగ్లీ అనేది అనాగరిక అనే అర్థాన్నిస్తుంది) అని ముద్ర వేయడం, ఇతర ప్రాంతాల వారు కూడా గిరిజన భాషలో మాట్లాడితే అసహ్యంగా చూడడంతో విధిగా వారి సంస్కృతిలో భాగమైన మాతృభాషను వారికైవారే చంపుకుంటున్నారు.
ఇలాంటి ఘటనలు ఈనాడు దేశవ్యాపితంగా కనపడుతాయి. ఉమ్మడి రాష్ట్రాల విషయంగా చూసినప్పుడు తెలుగు, ఉర్దూతోపాటు దాదాపు 60 లక్షలకుపైగా వివిధ గిరిజన తెగలు 20-25 రకాల భాషల్ని మాట్లాడుతారు. అయితే వీరి మాతృభాషలో నేటికీ విద్యా బోధనను స్వతంత్ర భారత్ అందించలేక పోయింది. తొంబయవ దశకందాకా తెలుగు మాధ్యమంలో, ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఆంగ్ల మాధ్యమంలో పాఠశాల విద్య దిశను మార్చుకుంది. ఈ ప్రాంతాల పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, గిరిజన ఉపాధ్యాయులతోసహా, గిరిజన పిల్లలు, వారి తల్లిదండ్రులు వారి మాతృభాషలో మాట్లాడడాన్ని అసహ్యించుకోవడం, కించపర్చడం జరుగుతూ వున్నది. తెలుగు మాధ్యమం పాఠశాలల్లో విధిగా పిల్లలు తెలుగులో మాట్లాడాలని భావించిన నిన్నటి రోజులు, నేడు ఆంగ్ల మాధ్యమం పాఠశాలలుగా మారుతూ, తెలుగు మాట్లాడడాన్ని కూడా అవమానంగా భావిస్తున్నాయి. ఈ సంధి కాలంలో ఉపాధ్యాయులు కూడా ఆంగ్ల భాషా ప్రావీణ్యత లేక గొంతులో వెలగపండు ఇరికిన చందంగా భావిస్తున్నారు. గిరిజనుల తిరుగుబాటుకు, ఆర్థిక కారణాలతోపాటు, సాంస్కృతిక, సామాజిక కారణాలని గుర్తించిన హైమన్‌డార్ఫ్ సూచన మేరకు ఏడవ నిజాం, ఆదిలాబాద్ జిల్లాలో గోండి భాషలో, మిగతా ప్రాంతాల్లో ఆయా గిరిజన భాషల్లో పాఠశాలల్ని ప్రారంభించడం, పాఠ్య పుస్తకాల తయారీకి పూనుకోవడం, అంతలోనే హైదరాబాద్ స్టేట్‌ను భారత్ యూనియన్‌లో కలపడంతో ఆ పథకం అక్కడితోనే ఆగిపోయింది. అలా ముందు ప్రాంతీయ భాష తెలుగును, ఇప్పుడు ఆంగ్లంను గిరిజనులు బలవంతంగా నేర్చుకోవాల్సి వస్తోంది. దీంతోపాటు నిన్నటిదాకా అడవికే పరిమితంగా వున్నవారి జీవనశైలి, మైదాన ప్రాంతాల గిరిజనేతరులతో కలవాల్సి రావడంతో విధిగా మాతృభాషను కాదని, ప్రాంతీయ భాషలో మాట్లాడాల్సి వస్తున్నది. ఇలా ప్రజలు భాషాపరంగా పెనం పైనుంచి కుంపటిలోకి, తర్వాత మండే పొయ్యిలోకి పడుతూ, సంస్కృతికి ప్రాణప్రదమైన భాషను మాట్లాడకుండా జాగ్రత్త పడుతున్నారు.
ఇలా భాషాపరంగా, జనాభాపరంగా కొన్ని జాతులే అంతరించి పోవడం చూస్తూనే వున్నాం. యునెస్కో ఇలాంటి వాటిని, జాతుల్ని ప్రత్యేకంగా కనుమరుగవుతున్న గిరిజన తెగలు (particularly vulnerable tribal groups - PVTG) అని, వారి భాషలు అతి శీఘ్రంగా తెరమరుగవుతున్నా (అంతరించు) (severely endangered) భాషలని హెచ్చరిస్తున్నది. దాదాపుగా దేశవ్యాపితంగా రాజ్యాంగం గుర్తించిన 22 భాషలతోపాటుగా మరో తొమ్మిది భాషలు వివిధ రాష్ట్రాల్లో అధికారిక హోదాను కలిగివున్నాయి. ఇవి కాకుండా దేశవ్యాపితంగా వివిధ తెగలు, జాతులు మాట్లాడే భాషలు దాదాపు 800 దాకా వుంటాయి. ఇందులో పది శాతం భాషలు శీఘ్రంగా అంతరించే భాషల జాబితాలో చేరిపోయాయి. తెలుగు భాష దుస్థితి ఈ విధంగానే కొనసాగితే తెలుగు కూడా ఈ జాబితాలో చేరడానికి అతి దగ్గరలోనే వుందని యునెస్కో గతంలో ఓసారి హెచ్చరించడం తెలిసిందే!
వినడం, గలగల మాట్లాడడం రావడంతో పిల్లల్ని పాఠశాలల్లో చేర్పించిన తల్లిదండ్రులకు మొదటగా ‘...మీ పిల్లలకు భాషరాదు, దిద్దరు, రాయరు, చదవరు..’ అంటూ ఉపాధ్యాయులు చేసే ఫిర్యాదు మొదటిది. ‘మాట్లాడితే తోలు తీస్తాం..’ అంటూ మూతిపై వేలు పెట్టించడం రెండోది. దీంతో వచ్చిన భాషను కూడా మాట్లాడని వైనం పిల్లలది. ఇక మాతృభాషేతర మాధ్యమ పాఠశాలల పిల్లలైతే, ఇంట్లో కూడా పరభాషలో (అధికంగా ఆంగ్ల) మాట్లాడాలని, (తల్లిదండ్రులకు రాకున్నా) లేనిచో నాలుకపై చురుకులు పెడతామని తల్లిదండ్రుల హుకుం! ఈ దేశంలో పాఠశాల పేరున భాషల్ని అందిస్తున్న విధానం ఇది.
ఇక భాషా బోధకుల, అవధానుల, కొంతమంది రచయితల తీరే వేరే! వీరే భాషకు కర్తలమని, అసలు భాష బతుకుతున్నదంటే తమ పాండిత్యమేనని సవాళ్లు విసురుతూ వుంటారు. పాలకులు కూడా ఇదే నిజమని, ఈ వర్గాన్ని పెంచి పోషిస్తూ వుంటారు. వీరెవరూ భాషల మూలాల్లోకి వెళ్లినవారు కారు. పైగా భాషల పుట్టుకకు తామే కారణమని, జన్మనిచ్చామని భావిస్తూ వుంటారు. ఇదే నిజమైతే దేశవ్యాపితంగా, ప్రపంచ వ్యాపితంగా ఒకే భాష వుండాలి. కాని ఇది జరగలేదు. జరగని పని కూడా! అలాగే వీరెవరు కొత్త భాషను సృష్టించిన దాఖలాలు లేవు. కాబట్టి భాషకు కర్త, కర్మ, క్రియలు ఆయా ప్రజల సమూహాలు, జాతులే కారణం! ప్రకృతితో సహజీవనం చేస్తున్న కాలంలో, పంచభూతాల, పశుపక్ష్యాదుల శబ్దాలతో గొంతులు కలిపిన ఆదిమానవుల సృష్టే నేటి ప్రపంచ వ్యాపిత వివిధ భాషలు! ఈ భాషల్ని మాట్లాడే సమూహాల సంఖ్యనుబట్టి, తర్వాత కాలంలో గణాలకు ఆధిపత్యం వహించిన ఠీవినిబట్టి, రాజ్యాల స్థాపనను బట్టి ఆయా భాషల ఔన్నత్యం పెరిగింది. ఆధిపత్యాన్ని సంతరించుకున్నాయి. రాచరిక భాషగా చలామణిలోకి వచ్చాయి. ఒక రాజ్యం మరో రాజ్యంపై ఆక్రమించిన సందర్భాలలో కొన్ని భాషలు నిరాదరణకు గురికావడంతో, అక్షర రూపం దాల్చకపోవడం, కొన్ని సమూహాలకే పరిమితి కావడం జరిగింది. ఆ శబ్దాలకే వారు రాళ్లపైన, చెట్లపైన, నేలపైన కొన్ని గుర్తుల్ని గుర్తించడం, వాటి ఆధారంగా ఆ ప్రాంతంలో వున్న సమూహాల ఉనికిని, వలసల్ని, ప్రయాణాల్ని అర్థం చేసుకోవడం, అదే చివరికి లిపిగా మారడం జరిగింది. లిపులు కూడా ఆవిర్భవించిన కాలం నుంచి నేటికి అనేక మార్పులకు గురైన విషయం తెలిసిందే! అలాగే ఉచ్ఛారణలు కూడా! ఈ సంధి కాలాల్లో భాషల్లో పలికే శబ్దాల్లో పదేపదే ఉచ్చరించే వాటిని స్వరాలని, మిగతావి స్వరాల ఆధారంతో పలుకే శబ్దాలని (అచ్చులు/హల్లులు) భాషలకు వివరణల్ని ఇవ్వడం జరిగింది. తర్వాతనే ప్రజలు మాట్లాడుకునే సంపూర్ణ వాక్యాలలో వ్యాకరణ అంశాల్ని, మిగతా విశేషణాల్ని స్థితబద్ధం (Rules/Regulations) ఛేయడం జరిగింది. ఇలా తీరుమారుతూ, ఓ అధికార భాషను సంతరించుకున్న భాషల్లో కొందరు పద్య రచన చేయడం, దానిపై తర్వాతి కాలంలో చందస్సు సృష్టించడం, గణ విభజనతో కవితలు రాయడం, కుదరని పదాలకు కొత్త పదాల్ని సృష్టించి పాదాల్లో చేర్చడం, వాటికి తామే అర్థాల్ని సూచించడం మనం ప్రబంధ సాహిత్యంలో చూస్తాం. నిజానికి, ఈ పదాల్ని, పద్యాల్ని, ఇంకా చెప్పాలంటే శ్లోకాల్ని ఏ కాలంలో, ఏ స్థాయిలో ప్రజలు వినియోగించిన దాఖలాలు లేవు. ఇవి నాటకీకరణ చెందిన తర్వాత, నాటక రంగాల ద్వారా, తర్వాత పత్రికల ద్వారా (సాహితీ) సినిమాల ద్వారా, ఈ నాటకీకరణ భాషకే ప్రాధాన్యత పెరిగి, చివరికి పాఠ్యాంశాలుగా మారిపోయాయి. ఓ దశలో ఇదే నిజమైన భాష అనే పిడివాదం కూడా బలంగా ముందుకు వచ్చింది. సాధారణంగా ప్రజలు మాట్లాడుకునే నిత్య జీవిత భాష, జానపద కళల భాష పనికిమాలినదిగా, పామరులు మాట్లాడే భాషగా ముద్ర వేయబడింది. ఈ విధంగా అసలైన భాషా సృష్టికర్తలే భాషరానివారుగా కించపర్చడం జరుగుతున్నది.
ఈ వాదనను ఒప్పుకునేవారు, ఒప్పుకోనివారు వున్నట్లే, కవిత్వమే రచనా వ్యాసంగమే భాషకు గీటురాయి అనేవారు వుంటారు. ఇదే నిజమైతే, వీరు సంక్షిప్త పరిచిన అచ్చువేసిన పుస్తకాలు వెయ్యి కాపీలు కూడా ఎందుకు అమ్ముడుపోవడం లేదో ఆలోచించాలి. ఈ వర్గాలన్నీ వాస్తవ ప్రజల భాషకు దూరమైపోతున్నాయని ఏనాడూ గుర్తించరు. ఓ అయిదు దశాబ్దాల క్రితం వరకు ప్రజలు మాట్లాడుకునే వాడుక భాషలో సామెతలు, జానపద పాటలు, వీధి బాగోతాలపై పుస్తకాలు వస్తే జనాలు కొనుక్కుని చదివేవారు. అక్షరాస్యత గణనీయంగా పెరిగినా నేటి సంప్రదాయ సాహిత్య పుస్తకాన్ని కొనడానికి మాత్రం ముందుకు రావడంలేదు. ఈ లొసుగుల్ని గుర్తించే ఓపిక, స్థాయి లేని రచయిత, కవుల వర్గాలు ఈ సమాజంలో తమనో ప్రత్యేక వర్గంగా, భాషా కోవిదులుగా గుర్తించబడాలని, అందుకు పడరాని పాట్లు పడుతూ, పాలకులకు అనుగుణంగా మసలుకోవడం, అందిన కాడికి సన్మానాలు పొందడం జీవిత లక్ష్యంగా మారిపోయింది.
మూడు రోజులు పోతే, అంగరంగ వైభవంగా తెలంగాణ తెలుగు మహాసభలు జరగబోతున్నాయి. ఈ సభల నిర్వహణకై కమిటీలు వేయబడ్డాయి. అందులో చాలామంది రచయితలు, కవులు, స్వయంగా రాసుకుని పాడే గాయకులు వున్నారు. వీరిలో అత్యధికంగా ఉపాధ్యాయులుగా పనిచేసినవారు కావడం గమనార్హం! వీరి వృత్తి కాలంలో ప్రజల భాషకు ఎంతమేర పట్టం కట్టారో, ప్రజల భాషలో మనస్ఫూర్తిగా ప్రజలతో సంభాషించారో, అసలు వారిని తోటి మానవులుగా ఎంతమేరకు గౌరవించారో వారివారి వ్యక్తిత్వాలకే వదిలేద్దాం! కాని ప్రజలు సృష్టించుకున్న భాషను మాట్లాడితే ఈసడించుకున్న సందర్భాలు, ఆ ప్రజలు ఈ వర్గాలతో మాట్లాడటానికి జంకిన సందర్భాలు కోకొల్లలు!
ఇవి మన అంతరాత్మలకు బాగా తెలుసు. అందుకే ఈ కమిటీల్లో తెలుగు బాగా మాట్లాడే ఒక్క తెలుగేతరులు లేరు. అలాగే వౌఖిక సాహిత్యాన్ని ఆసుకవిత్వంగా వినిపించిన ఒక్క కళాకారుడు లేడు.
ఓ జాతిని చంపాలన్నా (Genocide) నిర్వీర్యం చేయాలన్నా ఆ జాతి సంస్కృతిలో అతి ముఖ్యమైన భాషను చంపాలన్న వలసవాదుల నీతిలా, కొంతమంది భాషావాదులు ప్రజల భాషను వారి నాలుకల నుంచి జాలువారకుండా చూస్తున్నారు. పాలకుల దుర్మార్గపు ఆలోచనలకు వీరే పందిళ్లు వేస్తున్నారు. పాదులు కడుతున్నారు. వీరెవ్వరికి, మాతృభాషలో బోధన వుండాలనే ధ్యాసలేదు. వుండాలనే కోరిక లేదు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే ఇలాంటివారే భాషా పరిరక్షకులని, పాలకులు పనిగట్టుకొని చేసే సంబరాలే ఈ తెలుగు మహాసభలు? వీరే నిజమైన భాషా రక్షకులమని భావిస్తే, ఫక్కున నవ్వేది (అదీ ఆంగ్లపు నవ్వులో) తెలుగే?

- డా. జి.లచ్చయ్య సెల్: 94401 16162