మెయిన్ ఫీచర్

ధారణలో మేటి.. జువ్వాడి(ప్రపంచ తెలుగు మహాసభలు )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి గొప్ప రచయితకూ ఒక గొప్ప అనుచరుడుంటాడు - నన్నయ్యకు నారాయణభట్టులా,
జాన్సన్‌కు బాస్వెల్‌లా, శ్రీశ్రీకి కె.వి.రమణారెడ్డిలా, కాళోజీకి రామశాస్ర్తీలా -
అలాగే విశ్వనాథకు జువ్వాడి గౌతమరావు.

గౌతమరావుగారు విశ్వనాథవారి ‘రామాయణ కల్పవృక్షం’లోని పద్యాలను గానం చేస్తోంటే నేను చాలాసార్లు విన్నాను. గొప్ప
పారవశ్యాన్ని పొందాను. విశ్వనాథవారి భావాలతో ఏకీభవించకపోయినా ఆయన కవిత్వం వింటూ, ముఖ్యంగా గౌతమరావుగారు గానం చేస్తోంటే వింటూ
అనేకసార్లు గొప్ప తన్మయత్వానికి లోనయ్యాను.

జు

వ్వాడి గౌతమరావుగార్ని నేను మొట్టమొదటిసారి కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ కళాశాలలో కలుసుకున్నాను. నేనా కాలేజీలో 1971 నుండి 1982 వరకు అర్ధశాస్త్రోపన్యాసకునిగా పనిచేశాను. 1973లోనో 74లోనో ఆ కళాశాలలో జరిగిన ఒక సమావేశానికి (కళాశాల వార్షికోత్సవమనుకుంటాను) గౌతమరావు గారొచ్చి నా పక్కనే కూర్చున్నారు. ఇదివరకే వారిని గురించి విని ఉండటం వల్ల గౌతమరావంతటి గొప్ప వ్యక్తి నా పక్కన కూర్చున్నాడంటే చాలా గర్వంగా ఫీలయ్యాను.
గౌతమరావుగారు విశ్వనాథ సత్యనారాయణగార్కి అత్యంత సన్నిహితుడనీ, ‘రామాయణ కల్పవృక్షం’లని పద్యాలన్నీ ఆయనకు కంఠతా వస్తాయనీ, ‘మ్రోయు తుమ్మెద’ నవలలో ఆయనొక ముఖ్యమైన పాత్ర అనీ - ఇలా గౌతమరావుగార్ని గురించి సాహిత్య లోకంలోని అనేకమంది చెప్పుకోగా విన్నాను.
గౌతమరావుగారొచ్చి నా పక్కన కూర్చున్నారే గానీ నేనో రచయితనని అప్పుడాయనకు తెలీదు. ఆ కళాశాలలో పనిచేస్తున్న ఒక అధ్యాపకుడని మాత్రమే తెలుసు - వేదికమీద కూర్చున్నవాళ్లను ‘వాళ్ళెవరు’ అని అడిగాడు. వాళ్ళు ‘్ఫలానా’ అని చెప్పాను - వాళ్లు ఉపన్యసిస్తున్నప్పుడు వాళ్ళు చెబుతున్న కొన్ని విషయాలు బావున్నాయనో, కొన్ని బాగాలేవనో - కొన్ని స్పష్టంగా లేవనో ఇలా చాలా విశే్లషణాత్మకంగా వక్తలు మాట్లాడుతున్న విషయాలను గూర్చి చెప్పడం మొదలెట్టాడు - అలా చెబుతూనే ‘అబ్బో! ఈయనింకా చాలాసేపు మాట్లాడటట్టున్నాడు. నేను వెళ్తాను’ అంటూనే ఆయన లేచి వెళ్ళిపోయాడు.
ఆ తర్వాత గౌతమరావుగార్ని కరీంనగర్‌లోని టౌన్‌హాల్లో జరుగుతున్న యేదో సమావేశంలో కలుసుకున్నాను. నన్ను చూడగానే - ‘మొన్ననే మీరు రాసిన నవల చదివాను. ఆ నవల పేరు మరచిపోయాను. నవల చాలా బావుంది’ అన్నాడు చాలా ఆశ్చర్యపడ్డాను. నేనో రచయితనని ఆయనకు తెలియనే తెలియదు. ఆయన నా నవల చదవడమేమిటి? అనుకున్నాను. నవల పేరు మరచిపోయానంటున్నాడు - ఇంకెవరిదైనా చదివి నేను రాసిందనుకుంటున్నాడేమో అని కూడా అనుకున్నాను. ‘మీరు యే నవల చదివారు?’ అన్నాను చాలా ఆశ్చర్యంగా... ‘పేరు మరచిపోయానని చెప్పానుగా - కానీ థీమ్ బాగా గుర్తుంది... ఓ పెళ్ళిలో నాల్గైదు యువతీ యువకుల జంటలు కలుసుకుంటారు. అందరూ సమవయస్కులే. ఆ మూడు రోజులు వాళ్ళు కలిసి ఉండటం, మనసులు పారేసుకోవడం... వాళ్ళ ఇష్టాయిష్టాలు... రాగద్వేషాలు, వాళ్ళ మధ్య జరిగే చర్చలు... చాలా బాగా చిత్రించారు. మూడు రోజుల తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవడం... బాగుంది... వాళ్ళ అంతరాంతరాల్లో మెదిలే సున్నితమైన ఫీలింగ్స్‌ని బాగా చూపించారు’ అన్నాడు.
నేను వెంటనే ఆ నవల పేరు ‘వౌనరాగాలు’ అని చెప్పాను. అంతటి మహా పండితుడు నా నవలను చదివి బావుందనీ, ఎందుకు బావుందో కూడా అంత చక్కగా జ్ఞాపకం ఉంచుకొని చెప్పినందుకు చాలా సంతోషించాను. ఆ తర్వాత నేను గౌతమరావుగార్ని చాలాసార్లు కలిశాను. కానీ ఆయన నా మరో నవలేదీ చదివినట్టు చెప్పలేదు. ‘వౌనరాగాలు’ తర్వాత నేను చాలా నవలలు రాశాను. కానీ అవి ఆయన దృష్టిలో పడినట్టులేదు.
ఆ రోజుల్లో కరీంనగర్లో గౌతమరావుగారి కూతురు రోహిణి, మా ఇద్దరు చెల్లెళ్ళు - యశోద, సులోచన - వుమెన్స్ కాలేజీలో ఒకే క్లాసులో చదువుకునేవాళ్ళు. వాళ్ళు క్లాస్‌మేట్స్ మాత్రమే కాకుండా చాలా సన్నిహితులైన స్నేహితురాళ్ళు కూడా. ఈ నవల, అంటే ‘వౌనరాగాలు’ బావుందని రోహిణి చెప్పడం వల్లనే గౌతమరావుగారు ఆ నవల చదివాడని నాకు తెలిసింది.
1978లో కరీంనగర్‌లో ఫిల్మ్ సొసైటీని స్థాపించి కొన్ని గొప్ప సినిమాలను సభ్యులకు చూపించాం. నేనూ, డి.నరసింహారావు గౌతమరావు గారింటికి వెళ్లి ఫిల్మ్ సొసైటీలో సభ్యత్వం తీసుకొండని అడగ్గానే ఆయన సభ్యత్వం తీసుకున్నాడు. సత్యజిత్‌రే సినిమాలను చూపించినప్పుడు గౌతమరావుగారితో ‘మీరు తప్పకుండా వచ్చి ఈ సినిమాలను చూడాల’ని ఫోన్ చేసి చెప్పాను. ఆయన డా. శేషగిరిరావుగారితో కలిసొచ్చి ‘పథేర్ పాంచాలి’, ‘అపరాజిత’, ‘అపూర్-సంసార్’, ‘షతరంజ్‌కే ఖిలాడి’ లాంటి సినిమాలను చూశారు. ‘కరీంనగర్‌లో ఇంత గొప్ప సినిమాలను చూసే అవకాశం కల్పించినందుకు చాలా థాంక్స్ నవీన్‌గారు’ అన్నాడాయన. ‘హంసగీతె’ అనే కన్నడ పూర్తి సంగీతాత్మక సినిమాను చూపించినప్పుడు ఆయన పరవశించి పోయాడు. అలా ఎన్నో గొప్ప సినిమాలను ఆయనకు మేం చూపించాం.
ఆయనను అనేకసార్లు కలుసుకున్నప్పుడు సాహిత్యానికి సంబంధించిన అనేక విషయాలు నాకు చెబుతుండేవాడు - ఒకసారి శ్రీశ్రీని గురించి చెబుతూ ‘ప్రతి పదిమంది తెలుగువాళ్ళలో ఒక కవి, ఒక రాజకీయ నాయకుడు, ఒక పిచ్చివాడుంటారని శ్రీశ్రీయే ఒకసారి చెప్పాడు. ఆశ్చర్యం యేమిటంటే ఈ ముగ్గురూ శ్రీశ్రీలో ఉన్నారు’ అన్నాడు. నాకు శ్రీశ్రీ అంటే చాలా గొప్ప అభిప్రాయం ఉందని ఆయనకు తెలుసు. ఆయన అన్న ఈ మాట విన్నప్పుడు నేను కొంచెం నొచ్చుకున్నప్పటికీ తర్వాత ఆలోచిస్తే శ్రీశ్రీ వ్యక్తిత్వంలో ఆ మూడు ప్రవృత్తులూ ఉన్నమాట నిజమేనేమో అనిపించింది. మరోసారి ‘శ్రీశ్రీని ఇప్పుడింతగా పొగుడుతున్నారు కదా... ఇంకో పదేళ్ళ తర్వాత ఆయననెవ్వరూ గుర్తుచేసుకోరు... ది బబుల్ విల్ బరస్ట్...’ అన్నాడు.
‘ఎందుకలా అంటున్నారని’ నేనంటే ‘కేవలం శబ్దాన్ని ఆశ్రయించిన కవిత్వం ఆయనది. శబ్దాలతో గారడీలు చేసే మీలాంటి వాళ్ళ కళ్ళను జిగేలు మనిపించాడు. ఇట్‌వోంట్ లాస్ట్ లాంగ్’ అన్నాడు. ‘శ్రీశ్రీ సాహిత్యంలో చాలాకాలం బతుకుతాడ’ని నేనాయనతో కాస్సేపు వాదించాను. ఆయనది విశ్వనాథ స్కూల్ ఆఫ్ థాట్ కదా. ఆయన అలా తప్ప మరెలా మాట్లాడ్తాడని అనుకున్నాను. కాబట్టి ఆయనలా మాట్లాడినందుకు నేను ఆశ్చర్యపడలేదు. అయితే ఆశ్చర్యమేమిటంటే ఆయన నాతో విశ్వనాథను గూర్చి ఒక్కసారి కూడా చెప్పకపోవడం - 1995లో విశ్వనాథగారి నూరో జన్మదినోత్సవం వరంగల్లులో జరిగినప్పుడు సంపత్కుమారగారు నన్ను విశ్వనాథవారి నవలల మీద మాట్లాడమన్నాడు. ‘నాకు విశ్వనాథ నవలల మీద గొప్ప అభిప్రాయం లేదు’ అని నేనంటే ‘్ఫరవాలేదు - మీకున్న అభిప్రాయమే చెప్పండి’ అన్నారు సంపత్కుమారగారు. ఆ సభలో నేను విశ్వనాథ నవలల్ని గూర్చి మాట్లాడినప్పుడు వేదికమీద గౌతమరావు గారున్నారు. ‘ఏకవీర’ తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారు నవలాకారుడుగా ఒక్కొక్క మెట్టు దిగుతూ వచ్చారని ఆర్.ఎస్.సుదర్శనం గారన్న మాటను కోట్ చేసి ‘ఏకవీర’ తప్ప విశ్వనాథగారు రాసిన మిగతా నవలల్లో ఉన్న లోపాలను గూర్చి చెప్పాను. అయితే ఆ ఉపన్యాసం చేస్తున్నంతసేపు నేను చాలా టెన్షన్ ఫీలయ్యాను. నా ఉపన్యాసం వింటున్న గౌతమరావు గారేమనుకుంటున్నారోనన్నదే ఆ టెన్షన్‌కి కారణం. కానీ ఆ తర్వాత తెలిసిందేమిటంటే గౌతమరావుగారు నా ఉపన్యాసం అసలు విననే లేదని. అందుకే సభ ముగిశాక గౌతమరావుగారు నా ఉపన్యాసం గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు.
గౌతమరావు విశ్వనాథను తప్ప వేరే యే తెలుగు కవిని కూడా క్షుణ్ణంగా చదవలేదని చెబుతారు. నిజమే అనుకుంటాను. నాతో చాలాసార్లు కృష్ణశాస్తిని గురించి, కరుణశ్రీని గురించి ఇంకెందరో కవులను గూర్చి చెబుతూ వాళ్ళ లోపాలను గూర్చే ఎక్కువగా చెప్పారు. ఒకసారి ఆయన రాజకీయ జీవితాన్ని గూర్చి చెప్పమని అడిగినప్పుడు ఓ మూడు నాల్గు గంటలు ఏకధాటిగా చెప్పాడు.
సంతోష్‌కుమార్ అనే నా స్టూడెంట్... కరీంనగర్‌లోని ఎస్.ఆర్.ఆర్ కాలేజీలో బి.ఏ పూర్తిచేసి తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ (అర్థశాస్త్రం) చదివాడు. సోషలిస్టు పార్టీ గురించి పరిశోధన చేస్తున్నాననీ, తననొకసారి గౌతమరావుగారి దగ్గరకు తీసుకెళ్లండని సంతోష్ నా దగ్గరకొచ్చాడు. ఇద్దరం కలిసి గౌతమరావు గారింటికెళ్లాం. ఆయన నాగపూర్‌లో చదువుకునే రోజుల్లో లోహియా స్థాపించిన సోషలిస్టు పార్టీలో చేరి పనిచెయ్యడం, ఆనాటి హైదరాబాద్ సంస్థానపు రాజకీయాలు, ఆయన్నొకసారి అరెస్ట్ చేసి ఔరంగాబాద్‌లో జైల్లో పెట్టడం, ఆ జైలునుండి ఆయన తప్పించుకోవడం, మనల్ని యేడో నైజాం రాజు పాలిస్తున్న కాలంలో విద్యార్థులు చదువుకోవాలంటే ఎదుర్కోవలసిన కష్టాలను, ఇంకా ఇలాంటి ఎన్నో విషయాల్ని చెబుతూ ఆనాటి హైదరాబాద్ సంస్థానపు రాజకీయ చిత్రపటాన్ని మా ముందుంచారు.
1977లో, అత్యవసర పరిస్థితిని తొలగించిన తర్వాత, ఆయన జనతాపార్టీ అభ్యర్థిగా పార్లమెంట్‌కు పోటీచేసినప్పుడు నేనూ, నా మిత్రుడు డి.నరసింహారావు ఆయన కోసం చాలా ప్రచారం చేశాం. ఆయన తప్పకుండా గెలుస్తాడనుకున్నాం. కానీ గెలువలేదు. నిజాయితీ పరులెవ్వరూ రాజకీయాల్లో రాణించలేరని గౌతమరావుగారి రాజకీయ జీవితం రుజువు చేస్తుంది.
సహృదయుడు, సంస్కారవంతుడు, విశ్వనాథ ఆత్మను తనలో నిక్షిప్తం చేసుకున్నవాడు, మహాపండితుడు, గొప్ప ధారణశక్తిని తన స్వంతం చేసుకున్న ప్రతిభావంతుడు, తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తం చెయ్యడానికి వెనకాడని వాడు, ఎదుటి వ్యక్తి అభిప్రాయాలను గౌరవించేవాడు, అలాంటి గొప్ప వ్యక్తితో కరీంనగర్‌లో గడిపిన క్షణాల్ని నేనెప్పుడూ మరచిపోలేను.

- డా॥ అంపశయ్య నవీన్ (జయంతి పత్రిక సౌజన్యంతో)