మెయిన్ ఫీచర్

తెలంగాణలో తెలుగు వెలుగు(ప్రపంచ తెలుగు మహాసభలు )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు తెలంగాణ అని పిలవబడే ప్రాంతాన్ని 1947కు ముందు నిజాం దేశం అనేవారు. అప్పుడు అసఫ్‌జాహీ వంశస్థులు ఈ ప్రాంతాన్ని పాలించేవారు. వారు ఉర్దూను అధికార భాషగానూ, బోధనా భాషగానూ (తాలీమ్) నిర్ణయించారు. ఇక్కడ పర్షియన్ భాష కూడా వ్యాప్తిలో ఉండేది. పూర్తిగా నిరాదరణకు గురి అయినది తెలుగు భాష మాత్రమే.
1920 ప్రాంతములో హైదరాబాద్‌లో జరిగిన ఒక సభలో మరాఠీ హిందీ ఉర్దూ ఇంగ్లీషు భాషలల్లో వక్తలు ప్రసంగించారు. ఒకరు తెలుగులో మాట్లాడడానికి లేవగానే అంతా గేలి చేశారు. ఈ అవమానం భరించలేక కొందరు ప్రముఖులు తెలుగు భాషారక్షణ కోసం పూనుకున్నారు. ఆ విధంగా బొగ్గులకుంట (హైదరాబాద్)లో ఆంధ్ర సారస్వత పరిషత్తు, వరంగ్‌ల్‌లో రాజరాజ భాషా గ్రంథాలయం వంటివి ఏర్పడ్డాయి. సుల్తానుబజారులోని శ్రీ కృష్ణ దేవరాయ ఆంధ్ర భాషానిలయం కూడా తెలుగుభాషా రక్షణకోసం ఏర్పడిన సంస్థయే. గోల్కొండ పత్రిక, గోల్కొండ కవుల చరిత్ర వంటివి సురవరం వారి సుకృతులు.
1948 సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణపై సర్దారు వల్లభ్‌భాయి పటేల్ పోలీసు చర్య జరిపిన తర్వాత హైదరాబాదు రాజ్యం ఇండియన్ యూనియన్‌లో విలీనం అయింది. 1948 తర్వాత ఉస్మానియా యూనివర్శిటీలో తెలుగు భాషా బోధన ఎం.ఏ. ప్రారంభించారు. బి.రామరాజు, సి.నారాయణరెడ్డి, కె.గోపాలకృష్ణమూర్తి, దుర్గయ్య ఇరివెంటి కృష్ణమూర్తి వంటి వారు తొలితరం విద్యార్థులు. తరువాతి కాలంలో వీరంతా ఇక్కడే అధ్యాపకులైనారు.
మొదట రాయప్రోలు సుబ్బారావు శాఖాధ్యక్షులుగా ఉండేవారు. తర్వాత ఖండవల్లి లక్ష్మీరంజనం, దివాకర్ల వేంకటావధాని, బి.రామరాజు, అమరేశం, కె.గోపాలకృష్ణారావు, నాయిని కృష్ణకుమారి, రాజేశ్వర శర్మ, వేటూరి ఆనందమూర్తి, ఎల్లూరి శివారెడ్డి, కసిరెడ్డి వెంకటరెడ్డి, రఘుమన్న, సీతాకల్యాణ, చెన్నప్ప, గోనా నాయక్, నిత్యానందరావు, సూర్యా ధనుంజయ్ సుమతీ నరేంద్ర వంటివారు శాఖాధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. వీరంతా తెలంగాణలోని అన్ని (తొమ్మిది) జిల్లాలు పర్యటించి గ్రామగ్రామాన తెలుగు భాషా ప్రచారం చేశారు. నీలగిరి పత్రిక, విభూతి, దివ్యవాణి, సాధన, సుజాత, శోభ, విరాట్, మూసి, జనధర్మ, వంటి పత్రికలు తెలుగు భాషా రక్షణకోసం ఇక్కడ నడిచాయి. యువభారతి వంటి ప్రైవేటు సంస్థలు తెలుగు భాషా రక్షణ కోసం విశేష కృషిని చేశాయి. తొలుత ఆంధ్ర సారస్వత పరిషత్‌లో వీరి కార్యక్రమాలు జరిగేవి. ఆచార్య దివాకర్ల వేంకటావధాని గారు ప్రాచీన ప్రబంధములపై చేసిన ప్రసంగములకు శ్రోతలు వేల సంఖ్యలో వచ్చారు. ‘‘ఇక ఈ కాంపౌండ్ సరిపోదు. సభలను లాల్‌బహదూర్ స్టేడియంకు మార్చవలసి ఉంది’’ అని అన్నారు ఆనాటి విద్యాశాఖామాత్యులు పి.వి. నర్సింహారావుగారు. జి.వి.సుబ్రహ్మణ్యం, సుధామ, వంగపల్లి విశ్వనాథుడు, తిరుమల శ్రీనివాసాచార్య వంటి ఎందరో ఈ సంస్థలో కార్యకర్తలుగా పనిచేశారు.
జాతీయ సాహిత్య పరిషత్: భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం తెలంగాణలో గణనీయమైన కృషి చేసింది. భండారు సదాశివరావు(వరంగల్), బి.రామరాజు (హైదరాబాద్) గార్ల సారథ్యంలో ఈ సంస్థ రాష్టమ్రంతా శాఖోపశాఖలుగా విస్తరించింది. ఒక్క సిద్దిపేట శాఖ కేంద్రం దాదాపు రెండు వందల పుస్తకాలు అచ్చువేసి వేలాది సాహిత్య సభలను జరిపిందంటే ఈ సంస్థ బలం, బలగం ఎంతో ఊహించుకోవచ్చు.
విశ్వసాహితి : ఇది పోతుకూచి సాంబశివరావుగారి నేతృత్వంలో నడిచిన సంస్థ. వేలాది రచయితలను ఈయన సృష్టించాడు. ప్రపంచ తెలుగు మహాసభలకు దీటుగా అఖిల భారతీయ తెలుగు మహాసభలు నిర్వహించారు. విశ్వసాహితి అనే పత్రికను నడిపారు.
కృష్ణా పత్రిక : 1960 నుండి హైదరాబాద్ నుండి కృష్ణా పత్రిక వార పత్రికగా నడిచింది. దీని సంపాదకులు సుబ్రహ్మణ్య శర్మగారు. 1975 తర్వాత ఈ పత్రికను పిరాట్ల వెంకట్వేర్లు దినపత్రికగా మార్చారు. చిక్కడపల్లి హైదరాబాద్‌లో దర్బారు పేరుతో సాహిత్య సాంస్కృతిక సదస్సులు నిర్వహిస్తూ ఉండేవారు.
సాహిత్య అకాడమీ : ఇది హైదరాబాద్ నుండి నడిచిన సంస్థ. తర్వాతి కాలంలో దీనికి శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో విలీనం చేశారు. డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి, దేవులపల్లి రామానుజ రావు, ఇరివెంటి కృష్ణమూర్తి వంటి వారు సారథ్యం వహించారు. ప్రాచీన తెలుగు కావ్యాలను చౌక ధరలో ముద్రించి అందుబాటులోకి తెచ్చారు.
మహాభారత సంశోధిత ప్రాజెక్టు : దీనిని 1960 ప్రాంతాల్లో ఉస్మానియా యూనివర్శిటీ తెలుగు శాఖ నిర్వహించింది. ఇందులో ఎందరో విద్వాంసులు పనిచేశారు. భూపతి లక్ష్మీనారాయణ డైరక్టరు. ప్రామాణిక కవిత్రయ మహాభారత ప్రతిని వివిధ తాళపత్ర గ్రంథాలను ఒకచోటికి తెచ్చి ఈ మహాయజ్ఞం నిర్వహించారు.
చేతనావర్తం: ఇది వరంగల్‌లోనుండి వచ్చిన సాహిత్య ఉద్యమం. ఇందులో వే.నరసింహారెడ్డి, ఎం.వీరభద్రయ్య, సుప్రసన్న, పేర్వారం జగన్నాథం వంటి వారు పాల్గొన్నారు. దిగంబర కవుల ఉద్యమానికి పోటీగా చేతనావర్త ఉద్యమం సాగింది.
తెలంగాణ రచయితల సంఘం : ఇది 1950వ దశకంలోనే ప్రభవించింది. సి.నారాయణరెడ్డి, దాశరథి కృష్ణమాచార్య వంటివారు ఎందరో ఈ సంస్థకు సారథ్యం వహించారు.
విప్లవ రచయితల సంఘం : వరంగల్ కేంద్రంగా ఈ సంస్థ ఏర్పడింది. వరవరరావు, రాజలోచన్, కాళోజీ నారాయణరావు వంటి ఎందరో ప్రముఖ రచయితలు ఈ సంస్థ దావరా గ్రంథాలు వెలువరించారు. గ్రామగ్రామాన తిరిగి ఉపన్యాసాలు చెప్పారు. మార్క్సిస్టు భావజాలాన్ని ప్రచారం చేశారు.
అభ్యుదయ రచయితల సంఘం: దీనికే అరసం అని సంగ్రహ నామం. వీరి కవితా సంకలనాలు, రచనలు చాలా వచ్చాయి. ప్రస్తుతం తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడిగా ఉన్న ఎస్.వి. సత్యనారాయణ వంటి ఎందరో రచయితలు ఇందులో కీలకపాత్ర పోషించారు. వట్టికోట ఆళ్వారుస్వామి దాశరతి రంగాచార్య వంటి వారు తొలితరం రచయితలు.
ఫ్రీవర్స్ ఫ్రంట్ : కుందుర్తి ఆంజనేయులు శీలా వీర్రాజు వంటి వారు ‘వచన కవితా రచన’ను ఒక ఉద్యమంగా నడిపారు. మాదిరాజు రంగారావు వచన కవిత్వంలో పుంఖానుపుంఖంగా సామాజిక స్పృహతో గ్రంథాలు ప్రచురించి వన్‌మాన్ ఆర్మీగా నిలిచాడు. గుంటూరు శేషేంద్ర శర్మ ‘‘కవిసేన’’ను నిర్మించి ఒక మానిఫెస్టో కూడా విడుదల చేశాడు. కవి కవిత్వం వ్రాయాలే కాని రాజకీయ నినాదాలు కవిత్వం కాదు - అని ఈయన వాదం. ఇక ఆంధ్రభూమి దిన, వార, మాస పత్రికలు తెలుగు భాషా సాహిత్యాలకు ఎంతో సేవ చేశాయి. ‘సాహితి’ వంటి ‘అక్షర’ వంటి పేజీలు పేజీలు సాహిత్యంకోసమే కేటాయిస్తున్నాయ. కథల పోటీలు నవలల పోటీలు పెట్టి వందలాది మంది రచయితలను ప్రోత్సహించాయి, ప్రోత్సహిస్తున్నాయ
తెలుగు అకాడమీ : ఇది ప్రభుత్వ సారధ్యంలో నడిచిన సంస్థ. విద్యార్థులకు కావలసిన పాఠ్య గ్రంథాలను రూపొందించడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించింది. పోణంగి శ్రీరామ అప్పారావు, బూదరాజు రాధాకృష్ణ, మంజుశ్రీ, శ్రీహరి, ఆవుల మంజులత వంటి దిగ్దంతులెందరో ఈ సంస్థకు ప్రాణం పోశారు.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం : ఇది తారక రాముని మానసపుత్రిక. తెలుగు సాహితీ గీతిక. మాములుగా నడిచే విశ్వవిద్యాలయాలకన్నా భిన్నంగా ఇందులో కోర్సులు నడిచాయి. ఇందలి జ్యోతిష విద్య నేర్చుకునేందుకు ఐఎఎస్ అధికారులే విద్యార్థులుగా చేరి సాయంకాలం పాఠాలు నేర్చుకునేవారు. తూమాటి దోణప్ప అనుమాండ్ల భూమయ్య, నాయిని కృష్ణకుమారి, జివిఎస్ సుబ్రహ్మణ్యం, ఎన్.గోపి, ఎల్లూరి శివారెడ్డి, ఆవుల మంజులత, పేర్వారం జగన్నాథం, ఎస్.వి.సత్యనారాయణవంటి మరెందరో శ్రమించి ఈ సంస్థ అభివృద్ధికి దోహదం చేశారు. ఇందలి నాట్యవిభాగంలో అలేఖ్య, భాగవతుల సీతారాం వంటి నిష్ణాతులు, సి.వి.వి.సుబ్రహ్మణ్యం వంటి జ్యోతిష వాస్తు పండితులు ఇందులో అధ్యాపకులుగా గణనీయమైన సేవలు అందించారు. హైదరాబాదులో దాదాపు 200కు పైగా సాహితీ సాంస్కృతిక సంస్థలు ఉన్నాయి. గ్రంథ ప్రచురణలు, ఆవిష్కరణలు, సదస్సుల నిర్వహణ వంటివి ఈ సంస్థలు నిర్విరామంగా చేస్తూనే ఉన్నాయి. ఇవి కొందరు వదాన్యుల విరాళాల మీద నడుస్తున్నాయి.
ఆర్యసమాజం : రఘుమన్న, మర్రి కృష్ణారెడ్డి వంటివారు వైదిక సాహిత్యాన్ని ప్రచురించి ప్రచారం చేస్తున్నారు. జానపద సాహిత్య పరిషత్ తెలంగాణ జానపద గీతాలను వీరగాధలను సేకరించి సదస్సులు నిర్వహిస్తున్నది. కేవలం మహిళల కోసం లేఖిని వంటి సంస్థలు పనిచేస్తున్నాయి. యద్దనపూడి సులోచనారాణి వాసా ప్రభావతి వంటి ఎందరో ప్రముఖ రచయిత్రులు ఈ సంస్థను నిర్వహిస్తున్నారు.
సురభారతి : వీటి కార్యాలయాలు ఉస్మానియా విశ్వవిద్యాలయం గేటుకు సమీపంలో ఉంది. ప్రాచీన సంస్కృత గ్రంథాల ప్రచురణ, ఉచిత సంస్కృత బోధన తరగతుల నిర్వహణ ఈ సంస్థ లక్ష్యం. లాలే, పుల్లెల శ్రీరామచంద్రుడు, కప్పగంతుల కమలమ్మ, నరసింహాచార్య వంటి వారు ఈ సంస్థకు ఊపిరి పోశారు.
సర్వార్థ సంక్షేమ సమితి : పి.వి. మనోహర రావు ప్రధాని పి.వి. సోదరుని నేతృత్వంలో నడుస్తున్న తెలంగాణ చైతన్య ధార్మిక సంస్థ.
భువనవిజయ ఉద్యమం: ఆచార్య దివాకర్ల వేంకటావధాని గారు తెలుగు పద్యాన్ని బ్రతికించాలనే తపనతో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. వారు జీవించి ఉన్న కాలంలోనే దాదాపు 800 ప్రదర్శనలు ఇవ్వబడ్డాయి. ఆ తర్వాత మేము అమెరికా, సింగపూర్ వంటి దేశాలల్లోనూ ప్రదర్శనలు ఇచ్చాము. ఇందులో శ్రీ కృష్ణదేవరాయులుగా గుంటూరు శేషేంద్రశర్మ, అయ్యదేవర పురుషోత్తమరావు, కోకా రాఘవరావు, పుల్లెల శ్రీరామచంద్రుడు కప్పగంతుల లక్ష్మణశాస్ర్తీ వంటి అగ్రశ్రేణి పండితులు పాల్గొన్నారు. పద్మభూషణ్ నూకల చినసత్యనారాయణ, సింగనభట్ల నరసయ్య, అక్కిరాజు సందరరామకృష్ణ, కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతి వంటి వారు కూడా రాయల పాత్రను పోషించారు. అవధాని మాష్టారు పోయిన తరువాత కూడా ఈ ఉద్యమం ఆగలేదు. ఇప్పటికి మా దివాకర్ల వేదిక ఆధ్వర్యంలో 1100 ప్రదర్శనలు ఇచ్చాము అంటే ఏ స్థాయిలో పద్య ప్రచారం జరిగినదో ఊహించుకోవచ్చు. నేను సందర్భోచితంగా మహామంత్రి తిమ్మరుసు, అల్లసాని పెద్దన ధూర్జటి వంటి పాత్రలు పోషించాను. ఒకప్పుడు పి.వి.నరసింహారావుగారు, విశ్వనాథ పాత్రను వేయగా దాశరథి కృష్ణమాచార్యులు వంటి వారు కూడా భువనవిజయ ప్రదర్శనలు ఇచ్చినట్లు విన్నాను. అది 1955 ప్రాంతం కావచ్చు. తెలంగాణలో సాహిత్య పునరుజ్జీవనంలో ఆచార్య దివాకర్లవారి పాత్ర స్వర్ణాక్షరములతో లిఖింపదగినది. ఆచార్య బి.రామరాజు, మహబూబ్‌నగర్‌లోని నాగలింగ శివయోగి తెలంగాణలోని తాళపత్ర గ్రంథ సేకరణ, పరిష్కరణలలో ప్రముఖ పాత్ర పోషించారు. 1947కు ముందు గద్వాల, వనపర్తి దోమకొండ వంటి సంస్థానాధీశులు తెలుగు భాషా సాహిత్య పరిరక్షణకు చేసిన సేవ చిరస్మరణీయము. పాగ పుల్లారెడ్డి, ఎం.ఎస్.రాజలింగం వంటి వారు 1948 ప్రాంతంలో ఆంధ్ర మహాసభ ద్వారా తెలంగాణ విమోచనోద్యమం నడిపారు. అవన్నీ ఈ తరం వారికి తెలియవు. గీతం కాదు నాస్తి - అది అనుభవాల ఆస్తి అని గుర్తుంచుకొని వారందరికీ మనసావాచాకర్మణా అంజలి ఘటిద్దాం!
తెలంగాణలో కాకతీయుల కాలం నాటి వీరభద్రపళ్లెం, మైలారభటుల తాండవం వంటి నృత్యప్రక్రియలు పునరుద్ధరింపబడ్డాయి. నటరాజ రామకృష్ణ ప్రేరణ శివతాండవం, ప్రేరణ లాస్యం పునరుద్ధరించారు. ఇంకా ఒగ్గుకథ బుర్రకథ హరికథ పటం కథల వంటి జానపద కళారూపాలు ఇటీవలి కాలంలో పునరుజ్జీవింపబడ్డాయి. శ్రీమతి శోభారాజు, (సంగీతం), శోభానాయుడు, ఉమారామారావు, శివచంద్ర, ఆలేఖ్య, స్వర్ణమాల వంటి వారు నృత్యరంగంలో విశేష కృషి కనబరిచారు. పి.వి.రెడ్డిగారి శిల్పాలు రాజయ్య, కొండపల్లి శేషగిరిరావు వంటివారి చిత్రలేఖనాలు దేశవ్యాప్తంగా ప్రచారం పొందాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రామప్ప, వేయిస్తంభాల గుడి, పానగల్లు, కొలనుపాక వంటి దేవాలయాల పునరుద్ధరణకై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నది. కె.వి.రమణాచారి తన 60వ జన్మదినోత్సవాన్ని 60 మంది హరిదాసుల కథాగానంలో జరుపుకొని జన్మదినోత్సవం అంటే ఇలా ఉండాలని కొత్త సంప్రదాయాన్ని రూపొందించారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అప్పుడు మద్రాసు నుండి చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కు తరలివచ్చింది. ఈ కృషిలో ఎఎన్‌ఆర్, ఎన్‌టిఆర్, జమున, రామానాయుడు వంటి వారు ప్రధాన భూమిక నిర్వహించారు. విజయవాడ నుండి పత్రికా రంగం హైదరాబాదుకు తరలివచ్చింది.

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్