మెయిన్ ఫీచర్

అంతరంగం పోతన.. బాహ్యం శ్రీనాథుడు(ప్రపంచ తెలుగు మహాసభలు )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆచార్య సి.నారాయణరెడ్డిగారు ఒక అధ్యాపకుడిగానే కాకుండా, ఆచార్యుడిగానే కాకుండా, కవిగా, సినీ కవిగానే కాకుండా, రాజకీయటంచులను కూడా అందుకున్న విరాట్‌మూర్తి. సాహితీలోకంలో ఒకపక్క సారస్వతం, మరోపక్క రాజకీయం రెండింటిని కూడా నిలిపినటువంటి సవ్యసాచిగా నారాయణరెడ్డి కారణజన్ముడు.
నారాయణరెడ్డి హనుమాజీపేటలో పుట్టినప్పటికీ, చిన్నప్పటినుండి బాగా చదువుకోవాలని ఆసక్తి కలిగిన వ్యక్తి. తల్లి, తండ్రి వ్యవసాయ కుటుంబానికి సంబంధించినవారు. సిరిసిల్లకు వెళ్లి చదువుకోవాలి అంటే ‘మనకు వందల ఎకరాల భూమి ఉంది. మనం ఆ భూమి సాగు చేసుకుందాం’ అని తల్లి అంటే ఊరవతల బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు బాల్యంలోనే సినారె. అప్పుడు తల్లిదండ్రులు తత్తరపడి దుఃఖపడి బాబును సిరిసిల్లలో చదివించడానికి సమాయత్తమయ్యారు. ఈ విషయాన్ని నేనెందుకు చెబుతున్నానంటే సినారెకు చిన్నతనంలో చదువుమీద వున్న ఆసక్తితో సిరిసిల్లలో వున్న ఉర్దూ మీడియం కాన్గీ పాఠశాలలో చదువుకోవడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఆ బడిలో వీరి పేరు అడ్మిషన్ చేసుకుంటున్నప్పుడు సింగిరెడ్డి నారాయణరెడ్డికి బదులు సి.నారాయణరెడ్డి అని పడింది. నిజానికి నారాయణరెడ్డి అసలు పేరు సత్యనారాయణరెడ్డి.
సింగిరెడ్డి నారాయణరెడ్డి అని రాయాల్సి వచ్చింది. ఆ ముస్లిం టీచర్ ఆయనకు తోచిన రీతిలో సి.నారాయణరెడ్డి అని రాశాడు. అలాగే అది స్కూల్ రిజిస్టర్‌లో ఉన్న పేరుతో సి.నారాయణరెడ్డిగానే పరిగణించబడ్డాడు. సింగిరెడ్డి సత్యనారాయణరెడ్డిలా ఉంటే ఎలా ఉండేదో కానీ సి.నారాయణరెడ్డిగా ఉన్నందుకు అంతరంగంలో పోతన లాగా, బాహ్యంగా మాత్రం శ్రీనాథుని తలపింపజేసిన మహాకవి.
చాలామందికి పేర్లు ఉంటాయి. కొద్దిమందికి మాత్రమే అబ్రివేషన్‌లో చాలా అందంగా ఉంటాయి. అవి జిహ్వాగ్ర నర్తితంగా ఉంటాయి. కరాగ్ర వర్తితంగా ఉంటాయి. తమిళనాట ఎంజిఆర్, తెలుగునాట ఎన్‌టిఆర్, ఏఎన్‌ఆర్, కెసిఆర్, శ్రీశ్రీ అలాగే సినారె కూడా ఎంతో ప్రసిద్ధులు. ప్రపంచంలో ఉన్న 18 కోట్ల తెలుగుమంది ఆయన్ని సినారెగానే అభిమానిస్తారు. సంభావిస్తారు. హృదయంలో చిరస్థాయిగా నిలుపుకుంటారు. సాహితీలోకంలో ఎవరికీ దక్కనటువంటి కీర్తి, భోగం నారాయణరెడ్డిగారికి దక్కింది. కవులు కష్టపడతారు అని అంటారు. కవులు పేదరికంలో ఉన్నారంటారు. కవులకు గుర్తింపు లేదంటారు. కవులను ఎవరూ పట్టించుకోవడం లేదంటారు. కానీ నాకు తెలిసి గత యాభై ఏండ్లకు పైగా సి.నా.రె కవి అనే విషయాన్ని పట్టించుకోని భారతీయుడు, తెలుగువాడు లేడు. ప్రతి తెలుగువాడికి సినారె అనేటటువంటిది జిహ్వాగ్ర నర్తితం. అది కేవలం కారణజన్ములకు మాత్రమే సాధ్యమయ్యే విషయం. ఆయన సిరిసిల్ల తాలూకా హనుమాజీపేటలో పుట్టారు. మాది సిరిసిల్ల తాలూకా నారాయణపురం. మా ఊరు హనుమాజీపేటకు దగ్గరే. మానేరు ఒడ్డున మానేటి నీటి మాధుర్యాన్ని గ్రోలినటువంటి సినారె తెలంగాణ బిడ్డగా సుప్రసిద్ధుడైనా ప్రాంతాలుగానీ, భాషలు గానీ భేదాలు లేకుండా ఆయన ప్రపంచమంతా పర్యటించారు. ప్రపంచమంతా ఆయనకు సాహితీమూర్తిగా నీరాజనమెత్తింది. అది మహానుభావులకే సాధ్యమయ్యే విషయం. అందుకే ఆయన నా దృష్టిలో కారణజన్ముడు.
సి.నారాయణరెడ్డిగారి పాండిత్యం ఎలావున్నా అధ్యాపకుడిగా ఉస్మానియాలో విద్యార్థులందరినీ ఎంతగా ఆకట్టుకునేవాడంటే ఇతర అధ్యాపకులంతా అసూయపడేటంతగా. చెప్పడం, మాట్లాడటం, ప్రసంగం అన్నీ అందంగా ఉండేవి. ఆయన మాటే ఒక పాటగా ఉండేది. శబ్దాన్ని అలవోకగా ప్రయోగించేవాడు. అందుకే నన్నయను వాగానుశాసనుడు అంటే నారాయణరెడ్డిని శబ్దశాసనుడు అనాల్సిన అవసరం ఉంది. శ్రబ్దబ్రహ్మ మాటలో లయ, పాటలో లయ, ఆలోచనలో లయ, ఊహలో లయ. జీవితమంతా లయాత్మకంగా గడపటం అనేది ఆయనకే సాధ్యమైంది. ఒక దశలో నేను విద్యార్థిగా ఉన్నప్పుడు వారు పింగళి ఉమెన్స్ కాలేజీకి చీఫ్ గెస్టుగా వచ్చినప్పుడు వారి ప్రసంగం వినడానికి, వారిని చూడడానికి నేను దాదాపు ఐదు కిలోమీటర్లు సైకిల్‌మీద వెళ్లాను దాదాపు అది 1970-72 సం. మధ్యకాలంలో. ఆనాటినుంచి నేను ప్రభావితుణ్ణి అయ్యాను. ప్రత్యక్షంగా నేను శిష్యుడిని కాకున్నా, ఏకలవ్య శిష్యుడిగా ప్రభావితుణ్ణి అయినవాణ్ణి. ఆయనను దగ్గరగా చూసినటువంటి వాడిని. ఆయన కంఠంలో గాంభీర్యం ఉంటుంది. మాధుర్యం ఉంటుంది. మార్దవం ఉంటుంది. అంత గంభీరంగా ఉపన్యసించే సినారెగారికి పాటపట్ల మక్కువ ఎక్కువ. ఎందుకంటే ఆయన సంగీతజ్ఞుడు కూడా. మిమిక్రీ ఆర్టిస్టు కూడా. ఆయనకి ఆర్టిస్టుగా తెరమీద నటించాలనే ఆసక్తి లేకున్నా, మనకు చాలాసార్లు వెండితెరమీద కనబడుతున్నారు ఒక కవిగా. వేల సభలలో సినారెగారితో పాటు పాల్గొన్నాను. పాల్గొనడానికి కారణం ఆయనతోపాటు సభలో పాల్గొన్నంత సేపు మనకు కూడా అక్కడ కొంతలో కొంత ఆ జ్ఞానంలో, ఆ దీపపు వెలుగులో కొద్దిసేపు ఉండడానికి అవకాశం ఉంటుంది కదా అనే భావంతోనే ఆయన కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలుపెట్టి సినారె గారితో ఎప్పటికప్పుడు ‘మా రమణ’ అని పిలిపించుకునేటంత స్థాయికి రావడం నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నా.
దైవమంటే ఎక్కువగా విశ్వసించేవారు కాదు సినారెగారు. కానీ దైవానికి ఎక్కువ దూరంగా ఉండేటటువంటి వారుకాదు. దైవమా? అమ్మనా? అని అంటే ‘దేవతలంతా ఒకవైపు, అమ్మ ఒకవైపు’ అని అద్భుతంగా గజల్ రాసి తన భావాన్ని చాటినటువంటివారు. దేవుడా? మనిషా? అంటే ఆయన మనిషివైపే ఎక్కువగా మొగ్గుచూపుతారు. అది ఆయనలో ఉన్న ప్రత్యేకత. నాకు నచ్చిన అంశం ఏమిటంటే మనిషి చాలా ముఖ్యంగా చేయాల్సిన ప్రయత్నం నిండుగా చేసినట్లయితే తప్పకుండా ఫలితాన్ని అనుభవిస్తాడు అనే ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న ఒక మహాకవి. ఆయనను నేను సాంస్కృతిక శాఖకు సలహాదారుగా చూశాను. ప్రభుత్వానికి సలహాదారుగా, రాజ్యసభ సభ్యుడిగా, సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా చూశాను. ఇవన్నీ ఒక ఎత్తయితే, ఆయనను ఒక మంచి మనిషిగా, ఒక మనీషిగా ప్రతివారు కూడా చూడాల్సిన అంశంగా నేను భావించి, ఆయన చేత ప్రభావితం అయిన వారందరిలో నేనొకడిని.
ఆయన రాసిన సినిమా పాటలన్నింటిలో కూడా ఏదో ఒక సూక్తి లేకుండా ఉండదు. ‘అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం. ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే ఒక వింత నాటకం’ అన్నారు. ఇవ్వాల్టి ప్రపంచంలో యాభై, అరవై ఏండ్లు దాటినవారు ఇందులో ఉన్న సత్యాన్ని అనుభవంలోకి తీసుకొచ్చుకుంటున్న రోజులు ఇవి.
నాకెక్కువగా ఆయన పాటల్లో నచ్చింది ‘లక్షాధికారి’ సినిమాలో ‘చేనులో ఏముంది? మేనులో ఏముంది? చేనులో బంగారం, మేనులో సింగారం’. ఇవి అందరికీ తెలిసిన పదాలే కాని అందరం అంత అందంగా వాడగలుగుతామా? అనేది తలచుకుంటే ఒళ్లు జలదరిస్తుంది. పదాలను అలవోకగా వాడుతూ, శబ్దాన్ని అంత గొప్పగా నియంత్రించుకుంటూ ఒక శబ్ద బ్రహ్మగా ఉన్నటువంటి సినారెగారు బ్రతికినంతకాలం ఎంతోమందికి గురువుగా భాసించాడు. జీవితం ఉన్నంతవరకు రాస్తూ రాస్తూ ఉన్నతంగా జీవించిన కవులలో ఆచార్యగారిని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. తానే అన్నాడు ఒకచోట ‘రాస్తూ రాస్తూ పోతాను సిరా ఇంకేవరకు, పోతూ పోతూ రాస్తాను వపువు వాడేంతవరకు...’. ఇలాంటి పదాలు వాడి సార్థకం చేసుకున్నాడు. తన ప్రతీ పుట్టినరోజును తన గ్రంథం పుట్టినరోజుగా భావించి తన జీవితంలో రాయడం అనేది ‘అలా నేను కవిత్వాన్ని శాసిస్తుంటాను’ అన్నట్లు జీవించాడు. ఉచ్ఛ్వాస నిశ్వాస నా కవిత్వం అనొచ్చు కానీ, దాన్ని అలాగే చేయడం అనేది తనకు మాత్రమే సాధ్యం అయింది. గత సంవత్సరం ‘నా రణం మరణంపైనే’ అనే గ్రంథాన్ని వెలువరించినపుడు నేను వారి పక్కనే ఉన్నాను. ‘ఇది అవసరమా సార్?’ అన్నాను. ఎప్పుడైనా మరణం మీద రణం చేసే వాడినే నేను అన్నాడు. ఆయనకు మహీ ప్రాణమయినటువంటి గోవిందరాజుల రామకృష్ణారావుగారు రణం మరణంతో అనేటటువంటి శీర్షిక పెడితే మీరు మహానుభావులు, మీరు మరణంపైనే ఉండాలి కానీ ‘తో’ అనే ప్రయోగం బాగుండదు. ‘మీ రణం మరణంపైనే’ అంటే బాగుంటుంది అని చెప్పినప్పుడు, అవతలివాడి యొక్క సూచనను ఔదలదాల్చి గుర్తించి, గౌరవించి, ఆ శీర్షికను అలాగే పెట్టిన మహానుభావుడు. ఆయన మహాకవి ‘నీకేం తెలుసులే’ అని అనకుండా ‘మా గోవిందరాజు గారు ఇలా చెప్పారు కాబట్టి నేను ఇలా పెట్టాను’ అని చెప్పడం కూడా ఆయన సహృదయతకు, హృదయ వైశాల్యానికి నిదర్శనంగా భావిస్తాను. ఆయనకు ఎంతోమంది పరిచయం, పి.వి.నరసింహారావుగారితో ఉన్న అనుబంధం ఒక ఎత్తు. ఆనాటి ముఖ్యమంత్రులతో ఉండే అనుబంధం ఒక ఎత్తు. ప్రస్తుత ముఖ్యమంత్రి కె.సి.ఆర్.గారు వారిని గురువుగా భావిస్తే, ఒక విద్యార్థిగా, ఒక శిష్యుడిగా కెసిఆర్ గారిని అక్కున చేర్చుకున్న విషయం నాకు బాగా గుర్తు. సినారె గారి పుట్టినరోజు 2014 జూలై ఇరవై తొమ్మిది నాడు ముఖ్యమంత్రి కేసిఆర్ సినారె గారిని సత్కరించుకున్న రీతి, ఆయన పట్ల ఒక ముఖ్యమంత్రిగా కాకుండా, కేసిఆర్‌గా ఆయన చూపించిన భావం నాకిప్పటికీ బాగా గుర్తుంది. ఎందుకంటున్నానంటే సినారెగారు పెద్దవాళ్లకు పెద్దవాడిగా, పిన్నవాళ్లలో పిన్నగా ఉంటూ ఎంతోమంది యువకులకు ఆయన ఆదర్శంగా నిలిచారు.
ఎవరైనా వచ్చి మా కావ్యానికి, గ్రంథానికి ముందుమాట రాయండి అంటే, అలవోకగా రాసేసి యువతను వెన్నుతట్టిన వెన్నలాంటి మనసున్న మనిషి. వేలకొద్ది గ్రంథాల్లో ఆయన ముందుమాటలు, పీఠికలుంటాయి.
నేను ‘పద్య కవిత్వంలో వస్తు వైవిధ్యం’ అనేటటువంటి శీర్షిక తీసుకుని పిహెచ్.డి చేస్తున్నప్పుడు, ఆచార్య ఎల్లూరి శివారెడ్డిగారు నాకు గైడుగా అంగీకరించినప్పుడు సినారె గారి దీవెనలు అందుకున్నాను. అప్పుడన్నారు ఎల్లూరి శివారెడ్డి నా శిష్యుడు. నీవు ఎల్లూరి శివారెడ్డ శిష్యుడివి కాబట్టి నీవు నాకు ప్రశిష్యుడివి. ఈ రకంగానే కాదు ఎప్పుడైనా మీకు నేను ప్రశిష్యుడినే సార్ అన్నాను. అలాంటివారు ఎంతోమంది ఆయనకు శిష్యులు, ప్రశిష్యులు ఉన్నారు.
జనరంజకంగా మాట్లాడటం ఒక ఎత్తయితే, హృదయరంజకంగా దీవించడం ఏ కొద్దిమంది మాత్రమే చేయగలిగేటటువంటి పని. ‘ప్రజల కోసం పాటుపడని బ్రతుకెందుకు...’ అనే గజల్‌లో ఎంత గొప్పగా సూక్తులను అందించాడో. పాటలో, గజల్‌లో, కవిత్వంలో ప్రతిచోట కూడా మానవత్వాన్ని మేల్కొల్పటానికి చేసిన ప్రయత్నం చాలా గొప్పది. ‘ఈ నల్లని రాళ్లలో...’ పాట ఆయన సంగీత నృత్యం కోసం అని రాసినా, ఆ తరువాత కాలంలో ఘంటసాల నోట ఆ పాట వినపడినప్పుడు నిజంగా రాళ్లకు గుండెలుంటాయా? అన్నంత గొప్పగా అది అజరామరంగా నిలుస్తుంది.
సినారె శకం అది. మహానుభావులైన విశ్వనాథ, దేవులపల్లి, శ్రీశ్రీ, సినారెగారు వీరంతా ధృవతారలు. అలాంటి మహాకవిని మనం కోల్పోయాము అనేటటువంటి బాధ కొన్నాళ్లవరకు తెలుగు వారందరికీ ఉంటుంది. ఆ బాధను మనం అనుభవించాల్సిందే. సినారె తర్వాత కొంత ఖాళీ కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే సినారె తర్వాత ఎవరు ఆ స్థానాన్ని భర్తీచేస్తారు అనే దానికంటే సినారె తర్వాత ఆ బాటలో ఎవరు?? అనడం మంచిదేమో అని నా అభిప్రాయం. అది భర్తీ చేయలేనటువంటి పరిస్థితి. సినారె స్వరూపంలో కాని, స్వభావంలోకాని, కవిత్వంలో కాని, మాటలో కాని, పాటలో కాని, హృదయతత్త్వంలో కాని ఎక్కడ కూడా భర్తీ చేసేటటువంటి పరిస్థితి కలగకపోవచ్చు. కానీ ఆ బాటలో నడవటానికి వందలాదిమంది, వేలాదిమంది ఉండాలని చెప్పి ఒక సాహిత్య అభిమానిగా, నిరంతర విద్యార్థిగా కోరుకుంటాను.
జ్ఞానపీఠి అయినా, పద్మభూషణ్ అయినా, ప్రపంచమంతా పర్యటించినా, ఎంతోమంది రాష్టప్రతులను, ప్రధానమంత్రులను, ప్రజా ప్రతినిధులను, ముఖ్యమంత్రులను ఎరిగినా ఎక్కడ డూ తన ఆత్మ అభిమానానికి మాత్రం లోటు తెచ్చుకోలేదు. తాను పార్లమెంటులో పనిచేసినప్పుడు ఎన్ని మంచి పనులు చేశారో నాకు తెలుసు. హనుమాజీపేట గ్రామం ఒక కవి పేరిట నారాయణరెడ్డి పేటగా మారింది అంటే అది అందరికీ సాధ్యం అయ్యే పనికాదు. అదీ బ్రతికి ఉన్నప్పుడే మారడం ఎంతో గొప్ప విషయం.
ఆయన ఎన్నో సంస్థలకు గుప్తదానాలు చేశారు. ఎంతోమందికి తనకున్న జ్ఞానదీపపు వెలుగులో ఆశ్రయమందించారు. సినారె తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా జూన్ నెల 7వ తేదీనాడు చివరగా సమావేశానికి హాజరయ్యారు. తర్వాత మళ్లీ సమావేశాలకు రాలేదు. ఏ ఒక్క చిన్న సంస్థ పిలిచినా ఆ సంస్థకి మేనమామగా, పెద్దన్నయ్యగా, తండ్రిగా దీవిస్తూ ఆ సంస్థ వృద్ధిలోకి రావాలని ఆశీర్వదించే వ్యక్తిగా గుర్తుండిపోతారు.
తాను కొంత అనారోగ్యంగా ఉన్నా వయసురీత్యా 85 ఏండ్ల ప్రాయంలోకి వచ్చినా ఎవరు ఆహ్వానించినా తప్పకుండా వచ్చి దీవించి, ఆ సమావేశానికి నిండుదనాన్ని కలిగించి, మనుషులకు సంతృప్తి, సంస్థలకు సంతృప్తిని సంతోషాన్ని కలిగించిన సారస్వత మూర్తి. సాధారణంగా ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత అనారోగ్యం కారణంగానో, వేరే కారణంగానో వీలుకాదని చెప్పేవాళ్లని చాలామందిని చూసాం. కానీ ఈయన రవీంద్ర భారతిలోనో, గానసభలోనో ఒక్కొక్క రోజు రెండేసి, మూడేసి సమావేశాలకు వెళ్లిన సినారెను చూస్తే అంత చలాకీగా జీవితాన్ని గడపడానికి కారణం ఏమిటి? అంటే తనకున్న సాహితీ తృష్ణ, సారస్వత తృష్ణ. యువకులని వర్ధిష్ణువులను విష్ణువులుగా ఆశీర్వదించాలనేటటువంటి తపన. ఏది ఏమైనా భౌతికంగా మన మధ్య లేకపోయినా మన హృదయాల్లో చిరంజీవిగా ఉంటారు సినారెగారు. ఇప్పుడు జరుగుతున్న సంతాప సభలను చూసినట్లయితే ఆయన కీర్తికాయుడయ్యారు. ఆయన ఏ లోకంలో ఉన్నా తెలుగు వారందరినీ దీవిస్తాడని కోరుకుంటూ సెలవు.

(‘మూసీ’ ఆగస్టు 2017 మాసపత్రిక సౌజన్యంతో) - డా॥ కె.వి.రమణాచారి