మెయన్ ఫీచర్

అవును.. అమరావతికి కులమే అడ్డు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయ విధానాలపై అపరిపక్వత, తన మార్గమేమిటో తనకే తెలియకపోయినా, తాను ఎవరి పక్షమన్న దానిపై తనకే స్పష్టత లేకపోయినా, తన వైఖరిపై తానే సంఘర్షించుకునేలా మాట్లాడే అలవాటు ఉన్నప్పటికీ జనసేనాధిపతి పవన్ కల్యాణ్ ఒక్కటి మాత్రం నిజం చెప్పారు. అమరావతి అభివృద్ధికి కులమే అడ్డని, విజయవాడలో కుల పరిస్థితులు మారకపోతే అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మించలేరన్న వ్యాఖ్యలు మనం మనుషులం అన్నంత నిజం.
కానీ, కల్యాణ్‌బాబు మిగిలిన జిల్లాలు, పరిపాలన వాసనలు, వారి చుట్టూ పరిభ్రమించేవారు, వారి వల్ల అన్ని రంగాల్లో ప్రయోజనం పొందే వర్గం దూకుడు, నియామకాలు, పదవులూ ఇవన్నీ పరిశీలిస్తే ‘అంతకుమించి’ ఆవేశంగా మాట్లాడేవారేమో?!
ఆయనకు తెలిసో, తెలియదో గానీ అసలు ఆంధ్రప్రదేశ్ అంటేనే కులం. కర్ణుడికి సహజ కవచ కుండలాల మాదిరిగా ఏపీలో కులానుబంధం అంతే సహజం. ఏపీలో పుట్టి పెరిగి, హైదరాబాద్‌లో పనిచేసే కొందరు సీనియర్ జర్నలిస్టులు కూడా నన్ను అనేక సందర్భాల్లో, తరచూ కులాల గురించి ఎందుకు ప్రస్తావిస్తారని అడగటం ఆశ్చర్యపరిచేది. మారుతున్న సామాజిక స్థితిగతులు తెలియని, ఆఫీసులకే పరిమితమయ్యే మరికొందరు జర్నలిస్టులు కూడా కులాలను ప్రస్తావించడాన్ని నేరంగా భావించేవారు. కానీ ఏపీలో పీల్చేగాలి తప్ప, మిగిలినవన్నీ కులంతో ముడిపడినవేనన్న విషయం బహిరంగం. పాలకుల నిర్ణయాలే కాదు, స్నేహాలు కూడా ఇప్పుడు కులప్రాతిపదికనే జరుగుతున్న వాస్తవ పరిస్థితి దాచినా దాగనిది.
కులాల ప్రాతిపదికన కార్పొరేషన్లు పెట్టి, తాయిలాలు ఇస్తున్నారంటే దాని అర్ధం అదే కదా? ఇది తెలంగాణకూ వర్తించేదే! ఒకప్పుడు పత్రికల్లో కులాల పేర్లు రాసేందుకు మొహమాటపడేవారు. కుల ఉద్యమాలకు తెరలేచిన తర్వాత ఒక సామాజికవర్గం అని రాసేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. కులాల గురించి చర్చిస్తూ పేర్లు రాయాల్సిన పరిస్థితి వచ్చేసింది.
పవన్ చెప్పినట్లు ఏపీలో మాదిరిగా తెలంగాణలో ప్రాంతీయతత్వం తప్ప, కులతత్వం లేదనుకున్నప్పటికీ.. ఇప్పుడు తెలంగాణలోనూ కులం వాసనలు, సమీకరణలు, ఏకీకరణలు దర్శనమిస్తున్నాయి. కాకపోతే అవి ఆంధ్రలో ఉన్నంత అరాచకంగా అయితే లేవన్నది నిష్ఠుర నిజం. లేకపోతే ఆంధ్రా మూలాలు ఉన్న వాళ్లు అన్ని దశాబ్దాలు తెలంగాణలో ఒక్క రాయి దెబ్బకూ గురికాకుండా, గుండెల మీద చేయి వేసుకుని నిర్భయంగా బతికేవారు కాదు.
అంతర్జాతీయ స్థాయి రాజధాని కట్టాలని తపిస్తోన్న సర్కారు సంకల్పం నెరవేరాలంటే, ముందు కులం కుళ్లును కడిగేయాలి. పైకి ఎవరెన్ని కబుర్లు చెప్పినా కులాభిమానం లేనివారు ఉండరు. అంతవరకూ ఫర్వాలేదు. కానీ అది ఉన్మాదమైతేనే సమస్య. ఇప్పుడు సమాజంలో కులాలు పోవాలని, సమసమాజం రావాలని న్యూస్‌చానెళ్ల డిబేట్లలో వాంతులు చేసుకుంటూ, వారాంతపు జాతిసందేశాల్లో టన్నుల కొద్దీ ఆవేదన వెలిబుచ్చే రాజగురువులు నిజజీవితంలో ‘తమవారికోసం’ చేసే తెరవెనుక చేసే అసలుపని అదేనన్నది బహిరంగ రహస్యం. అది ఎవరికీ తెలియదనుకుంటే అంతకుమించిన భ్రమ మరొకటుండదు.
ఈ విషయంలో పవన్ కనె్నర్రచేయాల్సిన అవసరమేమీ లేదు. ఎందుకంటే తెలుగునాట మీడియా రంగాన్ని శాసిస్తున్నది ఎవరో, అది ఎవరి చేతుల్లో ఉందో, అందులో ఏ వర్గం వారు ఎక్కువ పనిచేస్తున్నారన్న పాత నిజాలను పవన్ కొత్తగా కనిపెట్టాల్సిన పనిలేదు. ఇలాంటి పరిస్థితి తెలంగాణలో కనిపించదు. ఏపీ మీడియాలో ఓ కులం వారికే పెద్దపీట. పాలకుల ప్రత్యేక పిలుపులు, పేరంటాలు, మర్యాదలు, లాలనలు, లీకుల్లో కూడా వారికే ప్రత్యేకం. లావు, పొడుగుతో పనిలేదు. మనవాడైతే చాలు! ఇదంతా కళ్లెదుటే కనిపిస్తుంటుంది. ఇది ఒక్క మీడియాకే పరిమితమైన వ్యవహారం కాదు. సర్వ రంగాల్లోనూ సర్వత్రా కనిపించే దృశ్యాలే.
ప్రత్యేకించి ఏపీ రాజధాని విజయవాడలో కులజాడ్యం చాలాకాలం నుంచీ ఉన్నదే. ఈ నాలుగేళ్లలో మరీ తారాస్థాయికి చేరింది. టూవీలర్లు, కార్లపై తమ కులాన్ని ప్రకటించుకునే ఏకైక ధన్యనగరి బెజవాడ మాత్రమే. నాలుగేళ్ల నుంచి ఈ కులం జబ్బు చుట్టుపక్కల జిల్లాలకూ అంటుకుంది. ఒక కులాన్ని చూసి మరో కులం వాతలు పెట్టుకున్న దురదృష్టకర పరిస్థితి. సచివాలయంలో విశాఖ, తూర్పు గోదావరి, నెల్లూరు జిల్లాలకు చెందిన మంత్రుల చాంబర్లలో ప్రత్యేకించి కాపు-బలిజ అధికారులు, కుల సంఘాల నేతలే దర్శనమిస్తుంటారు. అధికారుల స్థాయిలో కూడా తమవారినే నియమించుకుంటూ పోతే ఇక అంతరాలులేని సమాజం, సామాజిక న్యాయం ఎలా సాధ్యమన్నదే ప్రశ్న. గతంలో వైఎస్ ఉన్నప్పుడు ఇలా జరగలేదా? అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకని నిలదీయవచ్చు. గతంలో బ్రాహ్మణుల పెత్తనంలో మిగిలిన వర్గాలు అణగారిపోలేదా అని ప్రశ్నించవచ్చు. నిజమే! అరాచకం, అప్రజాస్వామ్యపోకడ ఎప్పుడు, ఎక్కడ జరిగినా దాన్ని నిగ్గదీసి నిలేయాల్సిందే. వైఎస్ ఉన్నప్పుడు జరిగింది కాబట్టి, ఇప్పుడు తాము కూడా ఆయన చెప్పులోనే కాలుపెడతామంటే నష్టపోయేది ఎవరు?
సమాసమాజ స్థాపన, అంతరాలులేని పరిపాలన ఇవ్వాలంటే ముందు ఇలాంటి అరాచకాలకు తెరదించాలి. కులం పునాదులు పెకలించేందుకు అధికారంలో ఉన్న వారే ఒక అడుగు ముందుకేస్తే మంచిది. ఇవన్నీ తెలిసినందుకే కొత్త రాజధానికి కులం గాలి సోకకుండా, చంద్రబాబు బహుశా రాజధాని నగరాన్ని దూరదృష్టితో దూరంగా నిర్మిస్తున్నట్లుంది. ఆయన ఎంత దూరంగా నిర్మించినా అక్కడ చుట్టుపక్కల కూడా అదే గాలి ఉన్నందున, ముందు ఫలానా కులానికే అందలమన్న భావన మిగిలిన వర్గాల మదిలో తొలగించడంపైనే దృష్టి సారిస్తే విమర్శలకు తావుండదు. ఆంధ్రరాష్టమ్రే కాదు, అమరావతి కొందరిది కాదు, అందరిదీ అన్న భావన కల్పిస్తేనే దానికి అంతర్జాతీయ ఖ్యాతి!
* * *
మృతభాషగా మారుతున్న మాతృభాషను పల్లకీ ఎక్కించేందుకు ఎవరు ప్రయత్నించినా అభినందించాల్సిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలుగుభాషపై ఉన్న పట్టు ఒక్కటే కాదు, మమకారం కూడా తెలిసిందే. బయట బహిరంగసభలో కార్యకర్తల కోసం యాసలో, అంతర్గత సమావేశాలు, మీడియా సమావేశాల్లో ఆయన వాడే అచ్చమైన తెనుగు ముచ్చటగొలుపుతుంది. ఆ సందర్భంలో ఆయన వాడే పదాలు, సామెతలు, చేసే పదప్రయోగాలు వినసొంపుగా ఉంటాయి. సూటిగా చెప్పాలంటే ఇప్పుడున్న రాజకీయ నేతల్లో అసలు సిసలు తెలుగుతనం ఉట్టిపడే ప్రసంగాలు చేసే నలుగురైదుగురు నేతల్లో ఆయనొకరన్నది నిజం. తెలుగు-సంస్కృతంపై పట్టు ఉన్న కేసీఆర్, ఉమ్మడి రాజధానిలో ప్రపంచ తెలుగుమహాసభలు నిర్వహించాలని సంకల్పించడం ప్రతి తెలుగువాడికీ గర్వకారణం.
ప్రపంచంలోని తెలుగువారందరినీ పిలిచి, తెలుగుపేరంటం నిర్వహించి దానికో విశిష్ఠతను ఆపాదించేందుకు చేస్తున్న యత్నాల్లో సమిథులవుతున్న వారు ధన్యులు. అయితే, గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇలాగే తిరుపతిలో అట్టహాసంగా నిర్వహించిన సభలో చెప్పుకున్న ఆశలు, చేసుకున్న బాసలన్నీ జమ్మిచెట్టుపైకి ఎక్కించారే తప్ప వాటి అమలుకు ప్రయత్నించలేదు. హైదరాబాద్ సభలు అందుకు భిన్నంగా, కార్యాచరణకు నోచుకుంటాయని ఆశించడం అత్యాశ కాదు. స్కూలు స్థాయి నుంచి తెలుగుకు ప్రాధాన్యం ఇచ్చి, తెలుగు టీచర్ల నియామకం జరిగితేనే భాష బతుకుతుంది.
ఎందుకంటే కొడిగట్టుకుపోతున్న తెలుగుకు కొత్త వెలుగు ఇవ్వకపోయినా, ఉన్న భాషా సంపదను సమాధి చేయకపోతే అదే పదివేలన్నట్లున్న ప్రస్తుత పరిస్థితి చూస్తే, మాతృభాషపై మమకారం ఉన్న ఎవరికైనా కడుపు తరుక్కుపోక తప్పదు. అలాంటి దయనీయ స్థితిలో పాలకులే భాషను బతికించే ప్రయత్నాలు చేయడాన్ని ఎవరు మాత్రం ఎలుగెత్తి స్వాగతించరు? భాష అమలులో పక్కనే ఉన్న తమిళనాడును చూసి తెలుగుపాలకులు ఎందుకు నేర్చుకోరన్నది కొన్ని దశాబ్దాల నుంచి భాషాభిమానులను వేధిస్తున్న ప్రశ్న.
తమిళనాడులో పాలనాభాష తమిళమే. కేంద్రానికి పంపే లేఖలు తప్ప, మిగిలిన ఉత్తర్వులు, ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తమిళంలోనే కొనసాగుతున్నాయి. భాష బతికితే జాతి బతుకుతున్నందనడానికి తమిళనాడు నిలువెత్తు నిదర్శనం. తమిళ, హిందీ వారికి ఉన్న భాషాభిమానంలో మన తెలుగువారికి పదోవంతు కూడా ఉండదని చెప్పడానికి సిగ్గుపడనక్కర్లేదు. ఇక్కడి తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషపై ఏదైనా సదస్సు, లేదా సభలు జరిగే ముందు మాత్రమే అన్ని దుకాణాలపై ఉన్న బోర్డులపై తెలుగు కనిపించాలనే హడావిడి జరుగుతుంది. కానీ తమిళనాట ఇది మొదలయి ఎన్నో దశాబ్దాలయిపోయింది. అదీ భాషాభిమానమంటే!
తెలుగు నేర్పే సర్కారు స్కూళ్లకూ ఇప్పుడు ఇంగ్లీషు గబ్బు పట్టుకుంది. ఏపీలో మాననీయ మంత్రి నారాయణ గారు, గత కొన్ని దశాబ్దాలుగా తెలుగునేర్పుతున్న మునిసిపల్ పాఠశాలల్లో తెలుగుకు మంగళం పలికి, ఆంగ్రేజీ మీడియాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నం చేశారు. దానిపై వ్యతిరేకత వస్తే పదవ తరగతిపై దయచూపి, తొమ్మిదో తరగతి వరకూ ఆంగ్రేజీ మీడియాన్ని కొనసాగించారు. మళ్లీ దానిపై గొడవ జరిగితే ఇంగ్లీషుతోపాటు సమాంతరంగా తెలుగునూ బోధిస్తామని కరుణచూపిన సచివుల ముందు భాష బతుకు గురించి మాట్లాడితే చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే.
ఇక తెలుగువారికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన ఎన్టీఆర్ స్మరణ లేకపోవడం అసమంజసం. ఎన్టీఆర్ సీఎం కాక మునుపు తెలుగువారంటే మదరాసీల కిందే లెక్క. ఆయన సీఎం అయిన తర్వాతే జాతీయ స్థాయిలో తెలుగువారికి గుర్తింపు లభిస్తే, ఆ తర్వాత వచ్చిన చంద్రబాబునాయుడు ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్‌ను పరిచయం చేశారు. ప్రస్తుత సభల్లో ఎన్టీఆర్ ఊసు వినిపించి, కనిపించకపోవడం తప్పు. పక్కరాష్ట్ర గవర్నరును పిలిచి, ఉమ్మడి రాజధానిగా ఉన్న మరో తెలుగు రాష్ట్ర సీఎం చంద్రబాబును తొలిరోజు పండుగలో భాగస్వామిని చేయకపోవడం హుందాతనం అనిపించుకోదు.

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 97053 11144