మెయన్ ఫీచర్

నేరచరితులకు ముకుతాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అయితే ఏం చేస్తావ్...కోర్టుకు వెళ్తావా? నువ్వు కోర్టుకు వెళ్లి నా మీద కేసు వేసి నేను తప్పు చేశానని నిరూపించేలోగా నా పదవీ కాలం ముగిసిపోతుంది. ఇంకేం చేస్తావ్...
ఇది ఒక సినిమాలో విలన్ పాత్ర హీరోకు చేసే సవాల్... సినిమా దృశ్యమే అయినా వాస్తవంగా జరుగుతున్నది కూడా అదే, దశాబ్దాలుగా తీవ్రమైన నేరారోపణతో కేసులు ఎదుర్కొంటున్న నేతలు ఎన్నికల్లో పోటీ చేయడం, పదవీకాలం ముగియడం, మరికొంత మంది మరణించడం కూడా జరిగిపోతోంది. అయితే ఇక ననే్నం చేస్తారులే అనే నాటకీయ డైలాగ్‌లకు కాలం చెల్లినట్టే.
రాజకీయ నాయకులపై వచ్చే కేసుల విచారణలో జరుగుతున్న తీవ్రజాప్యాన్ని ఎండగట్టిన సుప్రీంకోర్టు ఎలాంటి తాత్సారం లేకుండా కేసులను పరిష్కరించాలని, ప్రతి రోజు విచారణ నిర్వహించి తొందరగా వాటిని ముగించాలని, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులను వచ్చే ఏడాదిలోగా పరిష్కరించాలని ఆదేశించింది. అంతే కాదు, వివిధ హైకోర్టుల్లో తక్షణమే ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలని, జిల్లా కోర్టుల్లో సైతం ప్రత్యేక సెల్స్ ఏర్పాటు చేసి ఆ కోర్టు పరిధిలో నాయకులపై ఉన్న కేసులను ఎప్పటికపుడు సమీక్షిస్తూ త్రైమాసిక నివేదికలు ఇవ్వాలని ఆదేశించింది. ఇంతవరకూ ఏం చేశారో, ఏం చేయబోతున్నారో చెప్పాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. ఫిర్యాదులు పెరుగుతుండటం, కేసులు తేలకపోవడంతో వారు హాయిగా పదవులు అనుభవిస్తుండటాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. వీరి విచారణకు ప్రత్యేక కోర్టులు ఉంటే తప్ప అన్ని కేసులను ఏడాదిలోగా తేల్చలేమని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అదే సమయంలో ఈ ప్రత్యేక కోర్టులను సిబిఐ వంటి ఇతర ప్రత్యేక కోర్టులతో కలపకుండా స్వతంత్రంగా పని సాగించాలని కూడా సుప్రీంకోర్టు సూచించింది.
ప్రస్తుత విశే్లషణల ప్రకారం చట్టసభల్లో మూడోవంతు సభ్యులు నేరగాళ్లే (ఎడిఆర్ రిపోర్టు-2017). ఇలాంటి వారి వ్యవహారాలను తేల్చడానికి కోర్టులు పూనిక వహించడం విశేషం. నేరాభియోగాలు రుజువైతే ప్రస్తుతం ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించే పద్ధతి అమలులో ఉంది. ఇలాంటి నిషేధాన్ని జీవితకాలం ఉండేలా అమలు చేయాలని ఎన్నికల సంఘం సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరుతోంది. ఈ ప్రతిపాదనకు కేంద్రం అడ్డుపడుతోంది. గతంలో ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 8(4) నిబంధనను కోర్టు కొట్టి వేసింది. దాంతో శిక్ష పడిన వెంటనే ప్రజాప్రతినిధులు తమ పదవులను కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఆ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపి రషీద్ మసూద్ తన పదవిని కోల్పోయారు. దానిని అడ్డుకునేందుకు న్యాయశాఖామంత్రి హోదాలో కపిల్ సిబాల్ రెండో సవరణ చట్టం-2013ను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. మరో పక్క సుప్రీంకోర్టులో కేంద్రప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ను కూడా దాఖలు చేసింది. 2013 సెప్టెంబర్ 24న ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకువద్దామని కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్న సమయంలో అప్పటి పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ ముసాయిదా పత్రాన్ని పత్రికావిలేకరుల సమావేశంలో చించివేశారు. దాంతో 2013 అక్టోబర్ 2న బిల్లును, ఆర్డినెన్స్‌ను కూడా కాంగ్రెస్ పార్టీ విరమించుకుంది.
తీవ్ర నేరాలు, శిక్షపడిన ప్రజాప్రతినిధులు జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని కోరుతూ బిజెపి నేత, న్యాయవాది అశ్వనీ ఉపాధ్యాయ దాఖలు చేసిన ‘పిల్’ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసులకు సంబంధించి కేంద్రప్రభుత్వం చేపట్టిన చర్యలు ఏమిటని ప్రశ్నించడంతో ఈ వ్యవహారం మళ్లీ చర్చనీయాంశం అయింది. చట్టసభల్లోకి నేరచరితులు ప్రవేశించకుండా ఉండాలంటే మార్గం ఏమిటని ఎపుడు సూచిస్తారని కూడా కేంద్రాన్ని సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది.
హత్యలు, మానభంగాలు, దోపిడీలు, హింస, వేధింపులు, ఫోర్జరీ, కిడ్నాప్‌లు, ఆర్థిక నేరాలు, ప్రమాదకర ఆయుధాలతో గాయపర్చడం, అక్రమనిర్బంధం, బలవంతపు వసూళ్లు వంటి నేరాలను చాలామంది ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు ఎదుర్కొంటున్నారు. తాజా లెక్కల ప్రకారం 2014 వరకూ అధికారంలో ఉన్న, ప్రస్తుతం కొనసాగుతున్న ఎంపిలు, ఎంఎల్‌సిలు, ఎంఎల్‌ఎలపై 13500 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. ఇలా నేరచరిత్ర ఉన్న వారే మళ్లీ మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, వీరి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోందే తప్ప తగ్గడం లేదని కూడా వ్యాఖ్యానించింది. మొత్తం కేసుల్లో తీవ్ర నేరాలు ఎదుర్కొంటున్న 1591 (అందులో 10 కేసుల్లో ప్రజాప్రతినిధులు మరణించారు) కేసులకు సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేకాదు 2018 మార్చి 1 నాటికి ప్రత్యేక కోర్టుల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని కూడా కేంద్రాన్ని ఆదేశించింది. ఈ అంశంపై తదుపరి విచారణ మార్చి 7న సుప్రీంకోర్టులో జరగనుంది. దీనికి ప్రతిగా దేశవ్యాప్తంగా కేసుల విచారణకు 12 ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు రూ. 7.80 కోట్లు వెంటనే మంజూరు చేస్తామని కూడా చెప్పింది. కొంత గడువు ఇస్తే వారిపై ఉన్నకేసుల సమాచారాన్ని సేకరించి విచారణ వేగవంతం చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది.
ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేతల అఫిడవిట్లను పరిశీలించిన అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్సు (ఎడిఆర్) సంస్థ మరిన్ని దిగ్భ్రాంతికర అంశాలను వెల్లడించింది. మహిళలపై దాడుల కేసులను 51 మంది నేతలు ఎదుర్కొంటున్నారు. 1581 మంది ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులున్నాయని తేల్చింది. 543 మంది లోక్‌సభ సభ్యుల్లో 162మందిపై మహిళలపై దాడులకు సంబంధించి క్రిమినల్ కేసులున్నాయి. మొత్తం 30 శాతం కేసుల్లో ఐదేళ్లకన్నా ఎక్కువ శిక్ష పడేవే ఉన్నాయని కూడా ఈ సంస్థ పేర్కొంది. నేర చరిత్ర ఉన్నట్టు తెలిసినా పలు పార్టీలు అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చాయని ఎడిఆర్ పేర్కొంది. కేసులు ఎక్కువగా ఉన్న నాయకులు టాప్ లీడర్లుగా చెలామణి అవుతున్నారని కూడా ఈ నివేదికలో పేర్కొంది.
తెలంగాణలో ప్రజాప్రతినిధుల అఫిడవిట్లు పరిశీలించిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ టిఆర్‌ఎస్ నేతలు 22 మంది, కాంగ్రెస్‌లో ఐదుగురు, టిడిపిలో నలుగురు, బిజెపిలో ముగ్గురు ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులున్నట్టు తేల్చింది. ఆ సంస్థ చైర్మన్ జస్టిస్ రెడ్డప్పరెడ్డి ఈమేరకు ఒక నివేదిక విడుదల చేశారు. అలాగే ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ, వైకాపా నేత వై ఎస్ జగన్మోహన్‌రెడ్డితో పాటు పలువురు ఎంపిలు, ఎంఎల్‌ఎలపై ఉభయ రాష్ట్రాల్లో కేసులు నమోదై ఉన్నాయి. ఇటీవల జరిగిన గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ 38 మంది, బిజెపి 23 మంది నేరచరితులకే టిక్కెట్లు ఇచ్చాయి. గెలిచిన వారిలో 36 శాతం మందిపై క్రిమినల్ రికార్డులు ఉండగా, 50 శాతం మందికి పైగా విజేతలు కోటీశ్వరులే.
ఒక్క చిన్న కేసు నమోదైతే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హుడు, ఎఫ్‌ఐఆర్ నమోదైతే న్యాయమూర్తిగా పనికి రారు. కానీ శిక్షపడినా ప్రజాప్రతినిధులు చట్ట సభలకు ఎన్నికవుతారు, చట్టాలు చేస్తూనే ఉంటారు, చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతునే ఉంటారు...ఇది ఎంత కాలం? వీరికి నిబంధనలు వర్తించవా? ఈ ప్రశ్న స్వయంగా సుప్రీంకోర్టు వేసింది. అవును నేరచరితులను ఎంతకాలం ఈ దేశం తమ భుజాలపై మోస్తుంది. ఒక పూలన్‌దేవీ, సీమా పరిహార్, మల్కన్‌సింగ్, దాదువా, వీర్‌సింగ్ , రాం సేవక్ పటేల్ వంటి బందిపోట్లను, ఖూనీకోర్లను కూడా మన నేతలుగా ఎన్నుకున్నాం. క్షమాగుణానికి కూడా హద్దు ఉండాలని సుప్రీంకోర్టు మరోమారు గుర్తుచేసింది. అక్కడితో ఊరుకోలేదు, ఎన్నికల్లో పోటీకి కనీస విద్యార్హత, గరిష్ఠ వయోపరిమితి కూడా ఉంటే బావుంటుందేమో ఆలోచించుకోమని చెప్పింది.
సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
అవినీతి అక్రమాలకు, తీవ్ర నేరాలకు పాల్పడే నేతలను ఎన్నికలకు దూరంగా ఉంచే ప్రక్రియకు 2002లోనే బీజం పడింది. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి తమపై ఉన్న అభియోగాలకు సంబంధించి అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఓటర్లకు తమ నేతకు సంబంధించిన విషయాలు తెలుసుకునే హక్కును గుర్తు చేసింది.
(అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్సు వెర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా)
2013 జూలై:
రెండేళ్లకు మించి శిక్ష పడిన ప్రజాప్రతినిధులు హైకోర్టుల్లో అప్పీలు చేసుకునేందుకు వీలుకల్పించే ప్రజా ప్రాతినిధ్య చట్టం క్లాజు 8(4)ను కొట్టివేసింది. రెండేళ్లకు మించి శిక్ష పడిన ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించే నిబంధనను వారు తప్పించుకునేందుకు చేసే ప్రయత్నాలకు సుప్రీంకోర్టు జూలై 10న అడ్డుకట్ట వేసింది.
(లిల్లి థామస్, లోక్‌ప్రహారి వెర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు)
2013 సెప్టెంబర్:
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులతోపాటు వీరెవరూ కాదు అనే అవకాశం పోలింగ్ సమయంలో ఓటర్లకు కల్పించాలని సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది.
(పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వెర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా)
2004 మార్చి:
ప్రజాప్రతినిధులపై ఉన్న క్రిమినల్ కేసులను ఎప్పటికపుడు విచారణ జరిపి తుది తీర్పులను వెలువరించాలని సుప్రీంకోర్టు దిగువ స్థాయి న్యాయస్థానాలను ఆదేశించింది.
2014 ఆగస్టు:
నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిని మంత్రులుగా చేర్చుకోరాదని ప్రధానిని, ముఖ్యమంత్రులను సుప్రీంకోర్టు సూచించింది
(మనోజ్ నరూలా కేసు)
2016 మార్చి:
ఐదేళ్లకు మించి జైలు శిక్ష పడేంత అత్యంత తీవ్రమైన కేసులు ఎదుర్కొంటున్న వారు అనర్హులుగా ప్రకటించడం, జీవితకాలం ఎన్నికల్లో పోటీచేయకుండా నిరోధించడంపై విచారణాధికారాన్ని ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్‌కు సుప్రీంకోర్టు అప్పగించింది.

-బి.వి.ప్రసాద్