మెయన్ ఫీచర్

పద్యం చెప్పిన పాఠం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అట జనికాంచె భూమి సురు
డంబర చుంబి శిరత్ సరిత్ ఝరీ
పటల ముహుర్ ముహుర్‌లుఠదభంగ
తరంగ మృదంగ నిస్స్వన
స్ఫుట నటనానుకూల పరిపుల్ల
కలాపకలాపిజాలమున్
కటక చరత్కరేణ కరకంపిత
సాలము శీతశైలమున్...’’
ప్రపంచ తెలుగు మహాసభల వేదికపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చదివిన మూడు పద్యాలలో ఇది మొదటిది. ఈ పద్యాలను మరో రెండు మూడు వేల పద్యాలను చంద్రశేఖర రావు చిన్నప్పుడు ప్రాథమిక ఉన్నత పాఠశాలల విద్యార్థిగా ఉండిన సమయంలో కంఠస్థం చేశాడు, బట్టీ పట్టాడు! ఆయన స్వయంగా వెల్లడించాడు.. పద్యాలు, శ్లోకాలు సంస్కార రస గుళికలు, శిశువులు ఎదగడానికి మానవీయ స్వభావులుగా వికసించడానికి బౌద్ధిక బలం చేకూర్చగల సుధాకలికలు... చంద్రశేఖర రావుకు చిన్నప్పుడు వారి తొలి గురువు మృత్యుంజయ శర్మ ఇలా తెలుగు పద్యాలను నేర్పించాడట! ఇంకా ఎందరో గురువులు నేర్పించి ఉండవచ్చు! రాజకీయాలలో మునిగి తేలుతున్న చంద్రశేఖర రావునకు ఈ చిన్నప్పటి పద్యాలు ఇప్పటికీ గుర్తుండడం భారత జాతీయ అధ్యయన సంప్రదాయానికి సజీవ సాక్ష్యం! విస్తృతమైన వేదాలను కృతయుగం నుండీ కలియుగం వరకూ విద్యార్థులు బట్టీపడుతూనే ఉన్నారు! విద్యలు పుస్తకాలలో ఉండిపోతే అవి పనికిరావు. ఇతరులవద్ద ఉన్న ధనం వలె పుస్తకాలలో ఉన్న విద్య మనకు సమయానికి పనికిరాదన్నది శాస్త్రం.. ‘‘పుస్తకేషు చయా విద్యా పరహస్తేషు యత్ ధనమ్, సమయేతు న పరిప్రాప్తః న సావిద్యా నతత్ ధనమ్...’’. అందువల్ల విద్యలను పుస్తకాల నుంచి మస్తకాలకు ఎక్కించుకోవాలి! ఇలాంటి ధారణాధురీణుడు చంద్రశేఖర రావు. పరిపాలకుడు సాహిత్యాన్ని సృష్టించడం సాహిత్యాన్ని అధ్యయనం చేయడం ఈ దేశంలో కొత్తకాదు! శూద్రకుడు హర్షవర్ధన శిలాదిత్యుడు వంటి వారు ఉదాహరణలు మాత్రమే! జాతీయ విప్లవ సాధనలో తలమునకలై ఉండిన చాణక్యుడు రాజనీతి కోవిదుడు మాత్రమే కాదు, ఆర్థిక సామాజిక ధార్మిక సాంస్కృతిక విజ్ఞానాల రచయిత కూడ! చాణక్యుడు కలియుగం పదహారవ శతాబ్దినాటివాడు, అంటే క్రీస్తునకు పూర్వం పదహైదవ శతాబ్దివాడు! కలియుగం ముప్పయి ఎనిమిదవ శతాబ్దినాటి, అంటే క్రీస్తుశకం ఆరవ శతాబ్ది చివరినాటి భోజ మహారాజు దాదాపు మొత్తం భారతదేశాన్ని పాలించాడు. ఆయన పద్యగద్యాలతో - చంపువుగా - రఘురాముని కథను వ్రాశాడు! ‘సమరాంగణ సూత్రధారము’ వంటి ఇతర గ్రంథాలను రచించాడు! ఆయన సంస్కృతభాషలో మహాకవి! భోజుని తరువాత దాదాపు తొమ్మిది వందల ఏళ్లకు దక్షిణ భారతాన్ని పాలించిన తెలుగు వల్లభుడు శ్రీకృష్ణదేవరాయలు అందువల్లనే ఆంధ్ర భోజుడుయ్యాడు! పరిపాలకుడైన కృష్ణదేవరాయలు ‘ఆముక్తమాల్యద’ వంటి గ్రంథాలను రచించాడు... పూర్వపు తెలుగు వల్లభుడైన శ్రీకాకుళ దేవుని నోట ‘‘దేశభాషలందు తెలుగు లెస్స,,’’ అని పలికించాడు! కృష్ణరాయలకంటె పూర్వుడైన క్రీ.శ. పదునాలుగవ శతాబ్దినాటి కాకతీయ సమ్రాట్టు ప్రతాపరుద్ర దేవుడు కూడా గొప్ప సాహిత్యవేత్త! సాహితీ శాస్తక్రర్త విద్యానాథుడు ఈ కాకతీయ సమ్రాట్టునకు చెలిమికాడు... తెలుగు సభావేదికపై పద్యాలను పఠించడం ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి ఈ ‘పరిపాలక సాహితీ పండిత పరంపర’కు మరింత సార్థకతను సంతరించి పెట్టగలిగాడు... పాములపర్తి వెంకటనరసింహారావు, దామోదరం సంజీవయ్య వంటి పూర్వపు తెలుగు పాలకులు నిలబెట్టిన సంప్రదాయం ఇది... అల్లసాని వారి ‘ప్రవరుడు’ చూసిన ‘హిమాలయం’ అది!
చంద్రశేఖర రావు ఉటంకించిన ‘అట జనికాంచె భూమిసురుడు..’ అన్న పద్యంలో ‘మనుచరిత్ర’కారుడు అల్లసాని పెద్దన హిమాలయ పర్వతప్రాంత ప్రకృతి సౌందర్యాన్ని వర్ణించి ఉన్నాడు. ఆకాశాన్ని ముద్దాడుతున్న హిమశిఖరం నుంచి దూకుతున్న నదులలో చెలరేగుతున్న ‘‘అభంగ తరంగ మృదంగ ధ్వనులు’’ ఇందులో ప్రధానం! హిమాలయ పర్వతం అత్యంత ఎత్తయినదన్న భౌగోళిక వాస్తవాన్ని తెలుగు పాఠకులు గ్రహించాలన్నది ఈ పద్యంలోని మరింత ప్రధాన అంశం! ‘‘హిమాలయ పర్వతం ఎత్తుగా ఉంది..’’ అని నేరుగా చెప్పడం మామూలు వ్యవహారం. ‘‘హిమాలయం ఆకాశాన్ని తాకుతున్నది’ అని చెప్పడం ద్వారా ఆ పర్వతానికి ఉన్న ఔన్నత్యాన్ని - ఎత్తును - ‘‘్ధ్వనిం’’ప చేయడం కవిత్వం! ‘్ధ్వని’ వల్లనే కవిత్వం ఉత్తమ, అత్యుత్తమ, అత్యంత ప్రభావవంతమైన బోధన మాధ్యమం కాగలిగింది! శిశువునకు హిమాలయం ఎత్తయినది అని చెపితే విని మరచిపోతున్నాడు! ‘ఎత్తును’ ధ్వనింపచేసే పద్యాన్ని కంఠస్థం చేయించినట్టయితే ఆ మహా విషయాన్ని ఆ శిశువు పెరిగి పెద్దయిన తరువాత కూడా మరచిపోడు, తెలంగాణ ముఖ్యమంత్రి వలె గుర్తుంచుకుంటాడు! అల్లసాని పెద్దన శ్రీకృష్ణ దేవరాయల సమకాలికుడు, క్రీ.శ. పదహైదవ పదహారవ శతాబ్దులనాటి వాడు! క్రీస్తునకు పూర్వం ఒకటవ శతాబ్దినాటి సంస్కృత మహాకవి కాళిదాసు కూడ హిమాలయ పర్వతం ఎత్తును గురించి ప్రత్యక్షంగా - వాచ్యంగా - చెప్పలేదు! పరోక్షంగా ధ్వనింప చేశాడు. ‘‘మేఘములు హిమాలయ పర్వతం నడుము వద్దకు మాత్రమే ఎక్కగలవు అంతకంటె పైకి పోలేవు...’’ ‘‘ఆమేఖలం సంచరితాం ఘనానాం..’’ అన్నది వాచ్యం! ‘‘నడుము మేఘాలలో ఉన్న హిమాలయ పర్వతం తల ఎంత ఎత్తున ఉంటుందో?’’! దాన్ని స్ఫురింప చేయడం ధ్వని! ‘్ధ్వని’ ఉత్తమ కవిత్వ లక్షణమట! మన దేశంలో ‘్ధ్వని’ శాస్త్రం అనాదిగా వికసించింది! ‘‘్ధ్వని ఆలోకము’’ ‘‘్ధ్వన్యాలోకము’’ అన్న శాస్త్రాన్ని ఆనందవర్థనుడనే అలంకార శాస్తవ్రేత్త వ్రాశాడట! పెద్దనకు పూర్వుడైన బమ్మెర పోతన కూడ ‘‘త్రివిక్రముని ఎత్తును’’ ఇలానే ధ్వనింప చేశాడు. ‘‘రవిబింబంబు ఉపమింపపాత్రమగు’’ అన్న పద్యంలో వామనుడైన ‘వటువు’ ఎత్తుగా మరింత ఎత్తుగా ఎదిగి త్రివిక్రముడుగా మారిన దృశ్యం కళ్లకు కడుతోంది! ‘‘వామనుడు త్రివిక్రమ రూపంతో పెరిగాడు, సూర్యుడు ఆయన తలమీద గొడుగువలె కనిపించాడు. ఆ తరువాత సూర్యుడు త్రివిక్రముని తలలోని ‘రత్నం’ వలె కనిపించాడు, మెడలోని హారం వలె కనిపించాడు, చేతి కడియంలా కనిపించాడు. నడుమున మొలతాడు అయ్యాడు. చివరికి సూర్యుడు ఆ విరాట్ పురుషుడు నిలుచున్న గుండ్రటి పీఠమయ్యాడు..’’
ఇదంతా ఎందుకు? ఇదే పద్యాన్ని, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు చెప్పిన అల్లసాని పెద్దన ‘‘అట జనికాంచి’’న పద్యాన్ని మూడు నాలుగు నెలలక్రితం ఒక ‘చలనచిత్ర’ మహా రచయిత ఉటంకించాడు... అందుకని! చంద్రశేఖర రావు ఈ పద్యాన్ని మెచ్చుకున్నాడు, కానీ, ఆ విచిత్ర రచయిత ఇదే పద్యాన్ని తిట్టిపోశాడు! అల్లసాని పెద్దన ఇలాంటి పద్యాల ద్వారా భాషను ‘జటిలం’ చేశాడన్నది అతగాడి ఆరోపణ! ‘శ్రీ వేంకటేశ్వర భక్తి స్రవంతి’ - ఎస్‌విబిసి - దృశ్యమాధ్యమ వేదికపై ‘‘అన్నమయ్య పాటకు పట్ట్భాషేకం’’ అన్న కార్యక్రమంలో అతగాడు అతిథిగా ఆశీనుడు కావడం ఆ సందర్భం! అన్నమాచార్యుని అతగాడు ప్రశంసించి ఉండాలి! కోట్లమంది తెలుగుల భారతీయుల గుండెల గుడి గంటనాదం అన్నమయ్య పదం! అన్నమయ్య సంస్కృత గీతాలు వ్రాశాడు. తెలుగు పాటలు పలికాడు! కానీ ఆ ‘చలనచిత్ర సంచార విచిత్ర జీవి’కి ఆ పదకవితా పితామహుడిని ఆవిష్కరించడం చేతకాలేదు. అందువల్ల అల్లసాని పెద్దనను తిట్టాడు! ‘‘నన్నయ భట్టారకుడు తెలుగు భాషను సంస్కృత భాషతో సంస్కృత అక్షరాలతో సంకరం చేశాడని’’ ఆ వంకర బుద్ధివాడు ‘‘కనిపెట్టాడు’’.
కానీ భాషను నేర్చుకొనడానికి ‘సారళ్యం’ కాని ‘జాటిల్యం’ కాని అడ్డు రావన్నది తెలుగు మహాసభల వేదికపై నిలబడి చంద్రశేఖర రావు నిరూపించిన సత్యం! నన్నయ, పోతన, పెద్దన, గోపన్న - ఇలాంటి సరస్వతీ స్వరూపాలు ఇప్పుడు లేరు కదా..! అందువల్ల వారిని యథేచ్ఛగా తిట్టవచ్చునని, వారు సమాధానం చెప్పలేరని భ్రమిస్తున్న ఆధునిక విబుధ దైత్యులకు తెలంగాణ ముఖ్యమంత్రి ఈ పద్యం ద్వారా సమాధానం చెప్పాడు! ‘పారిజాతాపహరణం’ కావ్యంలోని మరో పద్యం ద్వారా పాఠం నేర్పాడు! భాష ‘సరళం’గా ఉండడం ‘జటిలం’గా ఉండడం విద్యార్థుల విద్యావంతుల స్థాయినిబట్టి మారుతుంది! ఐదేళ్ల బాలునికి అత్యంత సరళమనిపించే భాష రెండేళ్ల పాపకు చాలా ‘జటిలం’గా ఉంటుంది. ‘మొగ్గ’ను ‘ముగ్గు’ అని, ‘గుండు’ను ‘గుడ్డు’ అని పలికే నాలుగేళ్ల పాపకు కష్టం అనిపించే భాష పదునాలుగేండ్ల బాలికకు కొట్టినపిండి... పరిశోధన పట్టాపుచ్చుకున్న పండితునికి సులభంగా అర్థమయ్యే ‘పద్యం’ పదవ తరగతి విద్యార్థికి బోధపడకపోవచ్చు! భాషకు జటిలత్వం లేదు, సరళత్వం లేదు! నేర్చుకునేవారి మాట్లాడేవారి స్థాయి ఎదుగుతున్న కొద్దీ జటిలత్వం సరళత్వం అయిపోతోంది! ‘‘అన్నప్రాశన నాడు ఆవకాయ తినడు’’ అన్న సామెత అందరికీ తెలుసు! తెలుసుకున్నవారు దీన్ని భాషకు అన్వయించుకోకపోవడం అమాయకత్వం, విద్రోహం... అతి తక్కువ మందిది విద్రోహం, ఈ భాషా విద్రోహులు మన దేశాన్ని శతాబ్దుల పాటు దోచిన విదేశీయ దురాక్రమణదారులు బౌద్ధిక వారసులు! మాతృభాషను మరుగుజ్జుగా మార్చి శతాబ్దులుగా ఈ భాష ద్వారా ప్రస్ఫుటించిన భారతీయ జీవన సంస్కారాలను హత్య చేయడం ఈ విదేశీయ బౌద్ధిక వారసుల లక్ష్యం! ఈ విద్రోహుల కుట్ర గురించి తెలియని అనభిజ్ఞులు ‘‘నిజమే భాష కఠినంగా ఉండరాదు, ఐదవ తరగతి స్థాయికి మించిన భాషా పరిజ్ఞానం ఉండరాదు, భాష ‘వామన’ స్థాయిలోనే ఉండాలి.. త్రివిక్రమ రూపం ధరించరాదు’’ అని వాదిస్తున్నారు! చంద్రశేఖర రావు ‘అట జనికాంచె’, ‘ననుభవదీయ దాసుని’ ‘నవ్వులు చిత్తవృత్తికిన్ దివ్వెలు’ అన్న పద్యాలు చదవడం భాషా స్థాయిని దిగజార్చివేయాలన్న ‘మరుగుజ్జు’ సిద్ధాంతవాదులకు సరైన సమాధానం! ఇంత కాలానికి ‘సందర్భం’ ఏర్పడింది! ‘సమయం’ లభించింది! సరళమైన భాష మొక్క, జటిలమైన భాష మాను, మొక్కమొక్కగానే వాడిపోవాలా? మహావృక్షంగా ఎదగాలా?? ఎదగాలన్నది చంద్రశేఖర రావు నోట వెలువడిన ‘పద్యం’ చెప్పిన సమాధానం..
అర్థమయ్యే వాక్యాలు అర్థంకాని వాక్యాలు ప్రతి రచనలోనూ ఉంటాయి. ఉంటున్నాయి! అర్థంకాని వాటిని అర్థం చేయించడం కోసమే అయ్యవారు ఉన్నాడు, ఆచార్యుడున్నాడు! ఆదిలోనే అందరికీ అర్థమయిపోయినట్టయితే ఉపాధ్యాయుడు ఎందుకు? అధ్యాపకుడు ఎందుకు, ఆచార్యుడు ఎందుకు?? బోధనా వ్యవస్థ ఎందుకు?? అర్థంకాని వయస్సులోనే చంద్రశేఖరరావునకు మృత్యుంజయ శర్మ వందల పద్యాలను మప్పి ఉంటాడు, ఆ తరువాత అర్థం చెప్పి ఉంచాడు! వీరిద్దరూ ‘అధ్యయనం అధ్యాపన’ ప్రక్రియకు ‘ప్రతీక’లు.. ఈ ‘ప్రతీక’లు లెక్కపెట్టలేనన్ని..!! ప్రతి బాలుడు, ప్రతి బాలిక లెక్కలేనన్ని పద్యాలు నేర్చుకోవాలన్నది ముఖ్యమంత్రి ఆచరణ ద్వారా చెప్పిన పాఠం.

-హెబ్బార్ నాగేశ్వరరావు 9951038352