మెయన్ ఫీచర్

ఆర్‌ఎస్‌ఎస్ మదిలో ఏముంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుజరాత్ ఫలితాలను ఆర్‌ఎస్‌ఎస్ ముందే పసిగట్టిందా? మోదీ ఆకర్షణ శక్తి తగ్గుతోందని, మెరుగైన ఫలితాల సాధనకు ఏం చేయాలో ఎన్నికలకంటే ముందుగానే బిజెపి అధినాయకత్వాన్ని సంఘ్ హెచ్చరించిందా అంటే అవుననే చెప్పాలి. ఇప్పుడు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాల తరువాత జాతీయ స్థాయిలో ఎలాంటి మార్పులు ఉంటాయో, 2019 ఎన్నికల్లో బిజెపికి ఎదురయ్యే సవాళ్లు ఏమిటో సంఘ్ పరివారం విశే్లషిస్తోంది. ఆ రెండు రాష్ట్రాల ఎన్నికలలో గెలుపొందినవారు ఆందోళనతో, భవిష్యత్‌లో ఏమవుతుందో అని కగారు పడుతున్నారు. ఓటమి చెందినవారు నైతిక విజయం సాధించామని, మునుముందు విజయాలకు బలమైన పునాది వేసుకోగలిగామని సంబరపడుతున్నారు. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత నేడు దేశంలో నెలకొన్న పరిస్థితులు ఇవి. ఆ రెండు రాష్ట్రాలలో బిజెపి ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలగడం ఎవ్వరికీ ఆశ్చర్యం కలిగించడం లేదు. అయితే వచ్చిన సీట్ల సంఖ్య ఆ పార్టీ నాయకులకే మింగుడు పడటంలేదు.
ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ ఎదుగుదలకు బలమైన పునాదిగా భావించే గుజరాత్ నేడు బిజెపి మనుగడకు సహితం కీలకంగా మారింది. అందుకనే ఒక చిన్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రభావం జాతీయ రాజకీయాలపై ఉండే అవకాశం లేకపోయినా దేశ రాజకీయాలలో విస్తృతమైన చర్చలకు దారితీస్తున్నది. 100 లోపు సీట్లు వస్తాయని బిజెపి నాయకులే కాదు, అనేకమంది రాజకీయ పరిశీలకులు కూడా భావించ లేదు. దానితో 2019 ఎన్నికలలో గెలుపొందాలంటే జాగ్రత్తపడాలనే స్పష్టమైన సంకేతాన్ని ప్రధాని మోదీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఇచ్చారు.
ముఖ్యంగా మోదీ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఉపాధి అవకాశాలను పొందలేకపోవడం, ప్రజల జీవన ప్రమాణాలలో గణనీయ మార్పు తీసుకురాలేకపోవడంతో నైరాశ్యానికి గురయిన యువతను ఆకట్టుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గుజరాత్‌లో కొంతమేరకు విజయం సాధించారు. ఇదే బిజెపికి ఆందోళన కలిగిస్తున్నది. అందుకనే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందాలంటే బిజెపి పునాదులను బలపరచాలని, యువతను ప్రోత్సహించాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అధ్యక్షుడిగా యువనేత రాహుల్ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో బిజెపి కూడా లోపల, బయట యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని నొక్కి చెప్పారు. యువత అభిలాషలకు ప్రతీకగా రాహుల్ ఎదగగలిగితే రాజకీయంగా పెను సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుందని బిజెపి నాయకులకు తెలుసు. కాంగ్రెస్ నాయకత్వంలో పెను మార్పులకు రాహుల్ ప్రయత్నం చేస్తున్న సమయంలో ఈ అంశం కీలక ప్రాధాన్యత సంతరింపచేసుకొంటున్నది. ఈ విషయం ప్రధాని మాటలలో కూడా వ్యక్తమైనది.
ఎన్నికల ఫలితాలపై మీడియాలో వ్యక్తం అవుతున్న పలు వ్యాఖ్యానాల కన్నా ఆర్‌ఎస్‌ఎస్ అధినాయకత్వం ఏ విధంగా భావిస్తున్నదో అనే అంశమే మోదీకి, బిజెపి అధ్యక్షుడు అమిత్‌షాలకు కీలకం అని వేరే చెప్పనవసరంలేదు. ఇటువంటి ఫలితాలను ఆర్‌ఎస్‌ఎస్ చాలా ముందుగానే అంచనా వేసినట్లు తెలుస్తున్నది. రాజకీయ అంశాలపై ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు ఎవ్వరు తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చెయ్యరు. కానీ క్షేత్రస్థాయిలో తమకున్న కార్యకర్తల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా వాస్తవ పరిస్థితులను అంచనా వేస్తూ ఉంటారు.
ఏఏ అంశాలలో ప్రభుత్వంపై ప్రజలలో అసంతృప్తి నెలకొంటున్నదో కూడా బిజెపి నాయకత్వానికి తరచూ స్పష్టం చేస్తూనే ఉంటారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ముందే దేశంలో బిజెపి ప్రాబల్యం తగ్గుతున్నదనే నిర్ణయానికి ఆర్‌ఎస్‌స్‌ఎస్ నాయకత్వం వచ్చినట్లు తెలుస్తున్నది. అందుకు ప్రధానంగా రెండు కారణాలు చెబుతున్నారు. మొదటగా ప్రధాని మోదీ చరిష్మా తగ్గిపోతున్నది. మరోవంక 2014లో గెలిచిన లోక్‌సభ స్థానాలే గరిష్ఠం. అంతకన్నా ఎక్కువ స్థానాలు గెలుపొందే సామర్థ్యం ఆ పార్టీ నాయకత్వానికి లేదు. ప్రజల మద్దతును గణనీయంగా బిజెపి కోల్పోతున్నది. ఈ విషయం గుజరాత్‌లో స్పష్టంగా వెల్లడైంది. వివిధ కారణాలవల్ల బిజెపికి దూరం అవుతున్న వర్గాలను తిరిగి ఆకట్టుకోవడంలో అమిత్‌షా ఎన్నో విఫల ప్రయత్నాలు చేశారు. మరోవంక రాహుల్ గాంధీ పార్టీని గెలిపించలేకపోయినా వైరుధ్య ప్రయోజనాలుగల సామాజిక వర్గాలను కూడదీసుకోవడంలో విజయం సాధించారు. గతంలో ఎన్నడూ రాహుల్ గాంధీ ఇటువంటి పరిణతిని ప్రదర్శించలేకపోయారు. ఈ పరిణామం గుజరాత్‌లో పరిమితమైన నష్టానే్న కలిగించినా జాతీయ స్థాయిలో వచ్చే సంవత్సరం ఎటువంటి ప్రభావం చూపగలదో అన్న ఆందోళన కలిగిస్తున్నది.
గుజరాత్‌లో 2014 ఎన్నికలలో బిజెపికి 63 శాతం ఓట్లు రావడంతోపాటు 165 అసెంబ్లీ సీట్లలో ఆధిక్యత లభించింది. కానీ ఇప్పుడు కేవలం 49 శాతం ఓట్లతో, 99 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇదే పరిస్థితి కొనసాగితే 2019 నాటికి గుజరాత్‌లో లభించే లోక్‌సభ సీట్ల సంఖ్య ఇంతకుముందు గెలిచిన అన్ని (26) స్థానాలనుండి 15 నుండి 20 సీట్లకు పడిపోయే అవకాశం లేకపోలేదు. ఇది ఖచ్చితంగా ప్రమాదకర పరిస్థితిని వెల్లడి చేస్తున్నది.
పశ్చిమ, హిందీ రాష్ట్రాలలో పార్టీ సీట్లను పెంచుకొనే అవకాశాలు లేవు. ఉన్న సీట్లను కాపాడుకోవడమే కష్టం కాగలదు. అందుకనే మొదటినుండి అమిత్‌షా దక్షిణ, తూర్పు రాష్ట్రాలలో సీట్లపై కన్ను వేస్తున్నారు. ఇప్పటివరకు ఒక్కసారి కూడా బిజెపి గెలుపొందలేని 150 సీట్లపై దృష్టి సారిస్తున్నారు. అయినా మూడేళ్లలో చెప్పుకోదగినంత ప్రగతి సాధించలేకపోయారు. ఒక అంచనా ప్రకారం ప్రస్తుతం ఉన్న సీట్లలో 40 నుండి 50 సీట్లను బిజెపి కోల్పోయే అవకాశం వున్నది. ఈ సీట్లను ఎక్కడ పూరించుకోవాలో అన్నది బిజెపి నాయకత్వం ముందున్న పెను సవాల్.
హిమాచల్‌ప్రదేశ్‌లో సహితం కాంగ్రెస్ ఓట్ల శాతం పెద్దగా తగ్గకపోవడం, బిజెపి మూడింట రెండు వంతుల సీట్లు పొందినా ముఖ్యమంత్రి అభ్యర్థి ధుమాల్‌తోసహా కీలకమైన పలువురు పార్టీ నాయకులు ఓటమి చెందడం ఆందోళన కలిగించే అంశమే. ముఖ్యంగా యుపి, ఎంపి, రాజస్థాన్ వంటి రాష్ట్రాలలో పార్టీ పలు సమస్యలను ఎదుర్కొంటున్నది. గత నెల ఉత్తరప్రదేశ్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో 34 జిల్లాల్లో బిజెపి ఒక వార్డు సభ్యుడిని కూడా గెలిపించుకోలేకపోయింది. గుజరాత్‌లో ఏడు జిల్లాల్లో ఖాతా తెరవనే లేదు. అంటే గ్రామీణ వ్యవసాయ రంగాల్లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం ప్రభుత్వ వ్యతిరేకతగా మారుతున్నట్లు స్పష్టం అవుతున్నది.
రాహుల్ మార్గం... మృదువైన హిందుత్వ
గుజరాత్‌లో రాహుల్ గాంధీ అనుసరించిన ‘మృదువైన (సాఫ్ట్) హిందుత్వ’ రాబోయే రోజులలో బిజెపిని ఇబ్బందులకు గురిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోదీ 2014లో వివిధ వర్గాలలో నాటి యుపిఎ ప్రభుత్వంపట్ల నెలకొన్న అసంతృప్తిని ఏ విధంగా అవకాశంగా మార్చుకొని, ఉద్ధృతంగా ప్రచారం చేశారో, నేడు రాహుల్ సహితం దాదాపుగా అదే విధంగా చేస్తున్నారు. రాహుల్ దేవాలయాల సందర్శనకు వివాదాంశంగా మార్చే ప్రయత్నం చేశారు. అయితే రాజకీయంగా విశేషమైన ప్రయోజనం పొందారు. ఆయన 27 దేవాలయాలను సందర్శించారు. వాటి పరిధిలో గల 18 సీట్లలో కాంగ్రెస్ గెలుపొందింది. వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న 8 రాష్ట్రాలలో ఒక్క త్రిపురలో మినహా బిజెపికి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కావడం గమనార్హం. ముఖ్యంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక వంటి రాష్ట్రాలలో రాహుల్ ఇటువంటి వ్యూహాన్ని అమలుపరిస్తే బిజెపికి ఎంతో కొంత నష్టం కలిగించినట్లు కాగలదు.
బిజెపి నాయకుల వలే వ్యక్తిగత దాడులకు దిగకుండా, ఎంతో హుందాగా, ప్రజా సమస్యలపైననే దృష్టి కేంద్రీకరించడం ద్వారా మొదటిసారిగా విద్యావంతుల దృష్టిని రాహుల్ ఆకర్షిస్తున్నారు. బిజెపి బలమైన మద్దతుదారులుగా ఉంటూ వచ్చిన పలు వర్గాలలో ఇపుడు రాహుల్ పట్ల సానుభూతి ధోరణి ఏర్పడుతున్నది.
ప్రభుత్వంపై రాహుల్ సంధిస్తున్న ఆరోపణ అస్త్రాలు పలు సందర్భాలలో సాధారణ బిజెపి శ్రేణుల మనోభావాలను ప్రతిబింబిస్తూ ఉండటం గమనార్హం. గతంలో అయోధ్యలో రామాలయం ద్వారాలు తెరిచి, 1989 ఎన్నికల ప్రచారాన్ని అక్కడినుంచే ప్రారంభించడం ద్వారా రాజీవ్ గాంధీ ఇటువంటి ప్రయత్నం చేసినా తగు ఫలితం పొందలేకపోయారు. తండ్రి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని రాహుల్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది.
పలు రంగాలలో మోదీ ప్రభుత్వం పనితీరును ఆర్‌ఎస్‌ఎస్ వర్గాలు మెచ్చుకొంటున్నా ఆర్థిక రంగంలో పనితీరుపట్ల మాత్రం తమ అసంతృన్తిని దాచుకొనే ప్రయత్నం చేయడం లేదు. యుపిఏ ఆర్థిక విధానాలనే ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నదని అంటూ దేశంలో అతి పెద్ద కార్మిక సంస్థ అయిన బిఎంఎస్ జాతీయ అధ్యక్షురాలు జాజి నారాయణన్ ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికలో వ్రాసిన వ్యాసం మోదీ ప్రభుత్వానికి తీవ్ర కలవరం కలిగించింది. భారతీయ పరిస్థితులకు అనువు కానీ విధ్వంసక ఆర్థిక సంస్కరణలను గత 26 ఏళ్లుగా అనుసరిస్తూ ఉండడం వల్లనే దేశం జిడిపి వృద్ధి రేట్ సాధిస్తున్నా సామాజిక, ఆర్థిక ప్రగతిని సాధించలేకపోతున్నదని నిర్ధారించారు. ప్రధాని మోదీ సహితం ఆర్థిక రంగంలో తగు ఫలితాలు సాధించలేకపోతూ ఉండడంపట్ల ఆందోళన పలు సందర్భాలలో వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
2014లో అభివృద్ధి నినాదంతో మోదీ అధికారంలోకి వచ్చారు. అభివృద్ధి అంశాలను ప్రస్తావించడం ద్వారానే ఇపుడు బిజెపి పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను ఆత్మరక్షణలో పడవేసే ప్రయత్నం రాహుల్ చేస్తున్నారు. గుజరాత్‌లో ఇటువంటి ప్రయత్నం కొంతమేర ఫలించడంతో మరింత ఉధృతంగా ఇతర రాష్ట్రాలలో కూడా అనుసరించే అవకాశం ఉంది.
ఇక ఉద్యోగాల కల్పన విషయంలో సహితం మోదీ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడుతున్నది. ఉద్యోగాలకు బదులు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెబుతూ ఉండటం యువతను ఉపశమింపచేయలేకపోతున్నది. దేశ జనాభాలో 85 శాతం మంది 35 ఏళ్లకన్నా తక్కువవారే కావడంతో వారికి ఈ అంశమే కీలకం కానున్నది. మూడున్నరేళ్లుగా ప్రభుత్వంలో ఖాళీగా వున్న ఉద్యోగాలను నింపే ప్రయత్నం కేంద్రం చేయనే లేదు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో 4 లక్షలకుపైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని మంత్రి జితేంద్రసింగ్ లోక్‌సభకు ఈ వారంలోనే తెలిపారు. వార్షిక నివేదిక ప్రకారం 2016 మార్చి 1 వరకూ మొత్తం 36,33,935 పోస్టులు ఉండగా, ప్రస్తుతం వీటిల్లో 4,12,752 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.
ఏది ఏమైనప్పటికీ మోదీ నాయకత్వంలో 2014లో గెలుపొందిన సీట్లను బిజెపి తిరిగి గెలుచుకోలేదని ఆర్‌ఎస్‌ఎస్‌లో పలువురు నిర్థారణకు వచ్చారు. అందుకనే యోగి ఆదిత్యనాథ్‌ను బెజెపి ప్రచారంలో కీలకం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలను గుజరాత్‌లో మోదీ అడ్డుకున్నా ఇతర రాష్ట్రాలలో అడ్డుకోవడం సాధ్యంకాదు. ఎందుకంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలో బిజెపి ముఖ్యమంత్రులను నియంత్రించే స్థాయిలో మోదీ లేరు.

-చలసాని నరేంద్ర 9849569050