మెయన్ ఫీచర్

రాజకీయాలతో ఆంధ్రకు అన్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి రాజకీయ వ్యవహారశైలి కారణంగా ఐదుకోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. నాడు ‘రెండు కళ్లు’, ‘సమన్యాయం’ అంటూ...23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ విభజనను కోరుకుంటూ లేఖల మీద లేఖలు పంపారే కానీ, విభజన ముసాయిదా రూపకల్పనకోసం నాటి యుపీఏ సర్కారు నిర్వహించిన ఏ సమావేశంలోను ఆయన పాల్గొనలేదు. ఐదులక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ కావాలని ఓ పేపర్ స్టేట్‌మెంట్‌తో సరిపుచ్చారు. ఇక భాజపా సంగతి సరేసరి. పరిశ్రమల స్థాపనకోసం నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు, పదేళ్లు కావాలని రాజ్యసభలో నాడు ప్రతిపక్ష స్థానంలో ఉన్న నేటి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను గట్టిగా డిమాండ్ చేశారు. ఇప్పుడేమో ప్రత్యేక హోదా విషయం కాంగ్రెస్ పార్టీ విభజన బిల్లులో పట్టలేదని డొంకతిరుగుడుగా మాట్లాడుతున్నారు.
దేశవ్యాప్తంగా యుపిఎ ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు వీస్తున్న తరుణంలో, భాజపాతో జట్టుకట్టిన చంద్రబాబు ఎన్నికల్లో నవ్యాంధ్ర ప్రదేశ్‌లో విజయం సాధించగలిగారు. అయితే పదవీ స్వీకార ప్రమాణం చేసిన దగ్గరినుంచి నేటి వరకు ‘అడ్డగోలుగా విభజించారు’, ‘ఇష్టానుసారం చేశారు’ అంటూ కాంగ్రెస్‌పై దుమ్మెత్తి పోస్తూనే ఉన్నారు. కాలచక్రంలో రెండేళ్లు గడిచిపోయాయి. మిగిలింది ఏమిటి? బాబు, రైతు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేగలిగారా? నిరుద్యోగభృతి ఇవ్వగలిగారా? రాష్ట్ర ప్రజలందరికీ శుద్ధి చేసిన తాగునీరు ఇవ్వగలుగుతున్నారా? ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశారా?ఎన్నికల్లో కులాలవారీగా ఇష్టారీతిగా ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ఆరోగ్యశ్రీ పథకం, 108, 104 వైద్యసేవలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి ప్రజారంజక పథకాలను నిర్వీర్యం చేస్తున్నారు. అక్రమాలు జరిగాయని ప్రచారం చేసి ఇందిరమ్మ ఇళ్ళ లబ్దిదారుల నోట్లో మట్టి కొట్టారు. ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్‌కు మొక్కుబడి నిధులు కేటాయించడమే కాకుండా అవికూడ సక్రమంగా అమలు చేయడంలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నింటా వైఫల్యాలే కనిపిస్తాయి.
విభజనచట్టం ద్వారా రాష్ట్రానికి ఒనగూడే ప్రయోజనాలు, నాడు కేంద్ర ప్రభు త్వం తరపున ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా కేటగిరి, ఆర్థికలోటు భర్తీ వీటినైనా సాధించగలిగారా? కృష్ణా, గోదావరి మిగులు జలాలు రాష్ట్రానికి దక్కనీయకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నా దీటుగా స్పందించారా? ఏమీ లేదు. రాజధాని పేరుతో గుంటూరు-కృష్ణా జిల్లాల మధ్య మూడు పంటలు పంటే వేలాది ఎకరాల భూములను నయానా, భయానా లాగేసుకొని రియల్ ఎస్టేటర్ అవతారం ఎత్తారు. పెట్టుబడుల పేరుతో విదేశీ పర్యటనలు చేస్తూ ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారు. పాలనాపరంగా మంత్రులపై, అధికార్లపై సీఎంకు పట్టు లేదు. ప్రభుత్వ యంత్రాం గం ఆసాంతం అవినీతిమయమైపోయింది. ప్రభుత్వ విధుల్లో అధికార పార్టీ పెద్దల జోక్యం మితిమీరిపోయింది. టీడీపీ కార్యకర్తలు దళారుల మాదిరిగా వ్యవహరిస్తున్నారు. మరోపక్క ప్రధాన ప్రతిపక్షాన్ని మానసికంగా దెబ్బతీసేందుకు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ప్యాకేజీలను ఇస్తూ మరీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు పచ్చ కండువాలు కప్పేస్తున్నారు.
ఇక ప్రత్యేకహోదాపై భాజపా తన అసలు రంగును బయటపెట్టింది. విభజన చట్టంలో లేదు కనుక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా పన్ను మినహాయింపులు కూడా ఇచ్చేది లేదంటూ పార్లమెంటులో కేంద్ర మంత్రులు స్పష్టం చేశారు. పైగా ఏపీకి ఇవ్వాల్సిన ప్రతి పైసా ఇస్తున్నామంటూ రూ.6వేల కోట్లకు లెక్క చెప్పారు. ఈ విషయంలో టీడీపీ ప్రభుత్వ అంచనాలు, నీతి ఆయోగ్ అంచనాలకు పొంతన లేదని స్వయానా ఆర్థికమంత్రి ఆరుణ్ జైట్లీ ప్రకటించారు.
కేంద్రం విభజన చట్టం హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్‌పై తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోంది. విభజన చట్టంలో పేర్కొన్నట్టు వెనుకబడిన ఏడు జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, పారిశ్రామిక వర్గాలకు పన్ను రాయితీలు కల్పించారా? ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేశారా? దుగరాజపట్నం పోర్టుకు, విశాఖ-చెన్నై పారిశ్రామికవాడకు నిధులు ఇవ్వనేలేదు. విశాఖకు రైల్వే జోన్ ఇచ్చేందుకు తాత్సారం చేస్తున్నారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వదలుచుకుంటే చట్టంలోని ఏ నిబంధన అడ్డుకాబోదు.
రాయలసీమ నాలుగు జిల్లాలతోపాటు, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అభివృద్ధికి రూ.30వేల కోట్లు ఇవ్వాల్సి ఉడగా, కేవలం జిల్లాకు రూ.50కోట్ల చొప్పున మాత్రమే విదిల్చారు. యుపిఎ ప్రభుత్వం ముందుచూపుతో పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపేలా చర్యలు తీసుకుంది. దాన్ని అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ అమలు చేసి తామేదో పొడిచేసినట్టు చెప్పుకుంటున్నారు. పోలవరం పూర్తి కావడానికి రూ.30వేల కోట్లు అవసరం కాగా, కేంద్రం ఇప్పటివరకు రూ.650 కోట్లు మాత్రమే ఇచ్చింది. తిరుపతిలో ఐఐటీ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. అందుకు రూ.700 కోట్లు అవసరమైతే ఇప్పటి వరకు కేవలం రూ.40 కోట్లు మాత్రమే విడుదల చేశారు. చిత్తూరులో ఏర్పాటు చేయబోతున్న ఐఐఎస్‌ఈఆర్‌కు రూ.1030 కోట్లు అవసరం కానీ, కేవలం రూ.40 కోట్లు మాత్రమే కేటాయించారు. వైజాగ్‌లో ఏర్పాటు చేయబోతున్న ఐఐఎంకు రూ.900 కోట్లు అవసరం కాగా, రూ. 30 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ నిధులతో అభివృద్ధి కనిపిస్తుందా? ఒకేసారి పూర్తి నిధులు ఇవ్వకపోయినా, రెండు మూడేళ్లలో పూర్తయ్యేలా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది.
తాడేపల్లిగూడెంలో ఏర్పాటుచేసే ఎన్‌ఐటీకి రూ.300 కోట్లు అవసరం. కానీ నిధులేమీ ఇవ్వలేదు. కర్నూలులో ఏర్పాటు చేయనున్న ఐఐటీకి రూ.400 కోట్లు అవసరమైతే రూ.20కోట్లు మాత్రం కేటాయించారు. అంతేకాదు రాష్ట్రంలో కేంద్ర విశ్వవిద్యాలయం, గిరిజన విశ్వవిద్యాలయాల ఏర్పాటుపై సంబంధిత శాఖలు నాలుగు నెలల క్రితం తమ ప్రతిపాదనలను కేంద్ర కేబినెట్ కార్యదర్శికి పంపినా, ఇంతవరకు కేబినెట్ ఆమోదానికి నోచుకోలేదు. మంత్రివర్గ సమావేశంలో ఆమోదిస్తే తప్ప ఇవి మంజూరు కావు. విజయవాడలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ పేరుతో ఉన్న సంస్థకు బోర్డు ఏర్పాటుకు సంబంధించిన ఫైలు పీఎంఓ ఆఫీసులో మగ్గుతోంది. చిన్న చిన్న విషయాలపైనా కేంద్రం నాన్చుడు ధోరణి అవలంబిస్తోంది. ఇవన్నీ ఎప్పటికి పూర్తి కావాలి? ఇంత జరుగుతున్నా ఐదుకోట్ల మందికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు దీటుగా స్పందించలేకపోతున్నారు. రాష్ట్ర హక్కుల సాధనకోసం రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలను కలుపుకొని ఐక్య కార్యాచరణకు సిద్ధం కాలేకపోతున్నారెందుకు? పైగా..30 సార్లు ఢిల్లీ వెళ్లొచ్చా..ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమీ చేయలేం. కేంద్ర మంత్రి వర్గం నుంచి వైదొలిగేది లేదు..పోరాడితే ఫలితాలు వేరుగా ఉంటాయి. కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడుతుంది. ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీ పోయి ఆందోళన చేయాలంటూ సలహాలిస్తున్నారు. ఉపాధి హమీ పథకానికి మంజూరైన నిధులతో ఇంకుడు గుంతలు తవ్విస్తూ...రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామంటూ ఉపన్యాసాలు దంచేస్తున్నారు. రాష్ట్ర హక్కుల సాధనకు దృఢవైఖరి తీసుకోరెందుకని? ఓటుకు నోటు కేసు సహా, ఇతరత్రా చెప్పుకోలేని బలహీనతల వల్ల కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేకపోతున్నారా?
ఇటీవలి కాలంలో టీడీపీ-బీజేపీల మధ్య మిత్రభేదం బయటపడుతోంది. బాబుపాలన పారదర్శకంకగా లేదని, కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పడంలేదని భాజపా నాయకులు బహిరంగాంగానే విమర్శిస్తున్నారు. కేంద్రం సహకరించడం లేదంటూ స్వయానా ముఖ్యమంత్రే మెల్లమెల్లగా స్వరం పెంచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు మేలు చేయడం వల్ల రాజకీయంగా తమకొరిగేదేమీ లేదని, ఫలాలన్నీ టీడీపీనే నొక్కేస్తున్నదని, భాజపా అగ్రనాయకత్వం భావిస్తోందా? తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీతో కలిసి 2019 ఎన్నికల్లో పోటీకి దిగలేమని భావిస్తున్నారా? అందుకే టీడీపీని పొమ్మనలేక పొగపెడుతున్నారా?
ఈ ప్రశ్నలను పక్కనబెడితే స్వార్థ రాజకీయాలకోసం బీజేపీ-టీడీపీలు తడిగుడ్డతో ఆంధ్రుల గొంతుకోస్తున్నారనేది సుస్పష్టమవుతోంది. నిజంగా చంద్రబాబునాయుడుకు రాష్ట్భ్రావృద్ధి, భావితరాలు మేలు చేయాలన్న చిత్తశుద్ధి లేదు. ఉంటే ఆయన వ్యవహారశైలి ఈవిధంగా ఉండదు. ఆంధ్రుల ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తూ కేంద్రం వేసే బిచ్చమెత్తుకోవడానికే ఆయన సిద్ధపడ్డారు. తెలుగుజాతి ఉన్నతికోసం పరితపించిన నందమూరి తారకరామారావు ఆత్మ ఘోషించే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇదే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటే అక్కడి ప్రజలు అధికారం కట్టబెట్టిన నాయకుడి ప్రతిస్పందన ఏవిధంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
అంధ్రప్రదేశ్ హక్కుల సాధనకు రాజకీయపార్టీలన్నీ కలసికట్టుగా పోరాడాలన్న ప్రజల అభీష్టానికి అనుగుణంగా చొరవ తీసుకోవాల్సిన బాధ్యత ఇతర పక్షాలకన్నా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబుపై మరింత ఉంది. ఇందుకోసం రాజకీయాలను పక్కనబెట్టి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్పీసీ సహా అన్ని రాజకీయ పక్షాలతో, మేధావులతో, ప్రజాసంఘాలు, ఉద్యోగసంఘాలు, రైతు సంఘాలతో తక్షణం సమావేశం నిర్వహించి రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై సుదీర్ఘంగా చర్చించాలి. ఐక్య కార్యాచరణ ఉద్యమం చేపట్టి విభజనతో చితికిపోయిన రాష్ట్రానికి దక్కాల్సిన వాటిని సాధించుకోవాలి. లేకుం టే నవ్యాంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా ఆంధ్రులకుద్రోహం చేసిన ఘనుడిగా చంద్రబాబు చరిత్రలో మిగిలిపోతారు.

-కొలనుకొండ శివాజీ (ఏపీసీసీ అధికార ప్రతినిధి) సెల్ 9866200463