మెయన్ ఫీచర్

సత్కారాలతో తెలుగు బతుకుతుంధా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మినిష్టరచ్చే మురికిపాయే
మాలవాడలు మంచిగాయే!
వీధివీధిన వెలుతురాయే!!
బీదవారికి పట్టాలంట
బొజ్జ చూపుతు ఇచ్చిపాయే!
చల్లబడెను పల్లె అంతా
పాపమంతా పారిపోగా..!!
అయిదు దశాబ్దాల క్రితం ఓ స్థానిక పత్రికలో ఈ కవిత రాసిన విద్యార్థి పోలీసుల బెదిరింపులకు గురయ్యాడు. చేసుకునేవారికి చేసుకున్నంతగా ఈ కవిత వారివారి అవగాహననుబట్టి అర్ధమవుతుంది. ‘మూర్ఖరాజా’ కథను ఇలాంటి సందర్భాలలోనే ప్రస్తావిస్తూ వుంటాం! నిజానికి ఈ కథ జరిగినది కాదు. కాని, రాజును ప్రశ్నించే తత్వం ప్రజలకు లోపిస్తే.. అనే నేపథ్యంతో సమాజాన్ని జాగృతం చేయడానికై రాయబడిన కథ ఇది. ఇప్పుడైతే అంతా ప్రజాస్వామ్యమే! కన్నడ ప్రభువైనా, కృష్ణదేవరాయలు తెలుగుభాషకు పీఠం వేశాడని, ఆ కోవలోనే అష్టదిగ్గజాలను తన ఆస్థానంలో నియమించాడని ప్రతీతి. పైగా భాషలన్నింటిలో తెలుగు ‘లెస్స’ అని కీర్తించిన కాలం. అయినా, ఈ అష్టదిగ్గజాలు, స్వయంగా కవి అయిన రాయలు ప్రబంధ సాహిత్యానే్న సృజించారుగాని, ప్రజల, పామరుల భాష కాదు.
భాషకుండే అనేక రూపాలు, ప్రవాహిలో పరిమళాలను వెదజల్లే కుసుమాలేగాని, స్వయంగా పారే నది కాలేవు. నదికి గమనమే లేకపోతే, పైగా ఈ కుసుమాలే అడ్డుకట్టగా మారితే నదితోపాటు ఈ కుసుమాలు వికసించక మోడుబారుతాయి. భాషకు పట్టంకట్టే మహానుభావులెవరూ ఈ విషయాన్ని గుర్తించడం లేదు. పాలకులకు అంతకన్నా పట్టింపు లేదు. తలచింది జరిగితే ఆనందానికి అవధులుండవు. అంగరంగ వైభవంగా జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలతో నిజంగానే బంగరు తెలంగాణ సాకారమైందని ప్రభువులు భావిస్తే, చివరికి రాయలు కూడా తెలుగుకు ఇంతటి ఘనకీర్తిని సాధించి పెట్టలేదని ఆహూతులు భ్రమిస్తున్నారు. మహాసభలంటే కొన్ని నిర్దిష్ట ప్రమాణాలతో, విధివిధానాలతో, దశదిశను నిర్దేశించే తీర్మానాలతో ముగుస్తాయి. ఈ సభల స్ఫూర్తితో నిజానికి భాష పరిరక్షించబడాలంటే అత్యంత ప్రధానమైనది, పాఠశాల మాధ్యమం. ఈ విషయంగా మహాసభలు ప్రాంగణంలో కనీసం ఓ ఆటవెలది, తేటగీతి కానరాని వైనం. ఈ సమస్యనో వస్తువుగా చిత్రీకరించని సాహితీ ప్రక్రియలు. ఈ ఊసే లేకుండా, తెలుగు ఎలా బట్టకడుతుంది? పోనీ, ప్రభుత్వమే ఓ సాహసం చేసి (చేయదుకాక చేయదు), ఓ నిర్ణయం తీసుకొని, వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రాథమిక స్థాయి దాకా, అన్ని యాజమాన్యాలు, పదో తరగతి దాకా రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యం తెలుగు మాధ్యమంలోనే నడపాలని, నడుపుతుందని, దీనికై సభలకు వచ్చిన ఆహూతులు, ముఖ్యంగా భుజాలపై దుశ్శాలువల్ని ధరించినవాళ్లు విధిగా సహకరించాలని, తమ కుటుంబాల పిల్లల్ని ఈ మాధ్యమ పాఠశాలలకే పంపించాలని తీర్మానం చేస్తే, బహుశ ఎంతమంది ఆయా ప్రాంగణాల్లో (ఆరు) ఊపిరి పీల్చేవారో తెలియదు. బయటపడి, కుటుంబ సభ్యులతో కోర్టుల్లో కేసులు వేయించేవారెందరో తెలియదు. ఇక అతి ముఖ్యమైన విషయం - పాలన భాషగా, న్యాయపరమైన భాషగా ఆచరణలోకి తీసుకురావడానికి అడ్డంకులేమిటి? ముందు, రాష్ట్ర కార్యాలయాల్లో, అధికారులందరు ప్రజలతో తెలుగులోనే సంభాషించాలని, అర్జీలన్నీ విధిగా తెలుగులోనే స్వీకరించాలని, జవాబులు, పరిష్కార సమస్యలన్నీ తెలుగులోకే అనుసంధానం జరగాలని ఆదేశాలివ్వడానికి అభ్యంతరం ఎందుకు? అయినా, తెలంగాణ భాషను కూడా ఓ ఉద్యమ రూపంగా వాడుకున్న నేటి పాలక ప్రభుత్వానికి దీనిని ఆచరణలోకి తీసుకురావడానికి మహాసభలు కూడా పనిచేయకపోతే ఎలా? ఇది మొదట్లోనే అమల్లోకి వస్తే, న్యాయభాష కూడా న్యాయంగా తెలుగులో అమలయ్యేది! ఇవేమీ చేయకుండా, ఇటువైపుగా తీవ్రమైన ఆలోచనలు రాకుండా జాగ్రత్తపడి మహాసభల్ని ఘనంగా జరిపామని పాలకులు, బ్రహ్మాండంగా జరిగాయని భాషాకోవిదులు (భాషను రక్షించుకుంటున్న అసలుసిసలు జనం కాదు) భావిస్తే నిజంగా తెలుగు ఈ గడ్డపై వుంటుందా? పాఠశాలల్లో కరువైన తెలుగు, మెల్లిగా ఇంట్లో కనుమరుగై, చివరికి వీధుల్లో కూడా కనుమరుగైతే, తెలుగులో సాహిత్య బీజాలు వేస్తున్న తరం అంతరిస్తే మిగిలేది తెలుగు? పరభాష ఆంగ్లమా? దీనికి సమాధానం కావాలి. సమాధానం అడగాలి. సన్మానం పొందిన ఏ గొంతైనా ఈ ప్రశ్న వేసుకుందా? కార్యాచరణ(Road Map) ప్రణాళికలు రూపొందించి, నిర్ణీత కాలవ్యవధిలో వాటిని ఆచరణలోకి తీసుకువెళతారు. మధ్య, మధ్యన లోతుపాతుల్ని సమీక్షించుకుంటూ ముందుకువెళతారు.
కానీ, ఈ మహాసభల్లో అవధానాలు, కవిగానాలు, సమ్మేళనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు విరాజిల్లినంతగా, పై అంశాలేవీ చర్చకు వచ్చినట్లు కానరావడం లేదు. తెలిసో, తెలియకనో తెలుగును మృతభాష (Extinct) కావద్దని, ప్రారంభ ముగింపు సమావేశాల్లో ప్రస్తావించడం గమనార్హం! అయితే, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, కారకులెవరు, ప్రజలా, పాలకులా, పండితులా, కవివర్యులా ప్రస్తావనకు రాకపోవడం, చర్చించకపోవడం ఓ వైచిత్రి! ప్రారంభ, ముగింపు సమావేశాన్ని పక్కనపెడితే, మధ్యలోని మూడు రోజులు ఈ అంశాల చుట్టే చర్చాగోష్ఠులు జరగాల్సింది. వీటి సారాంశంతో కొన్ని కీలకమైన తీర్మానాలు రూపొందించి, ముగింపు సమావేశంలో ఆ తీర్మానాల్ని ఆమోదింపచేయడం మహాసభల ఆనవాయితీ. ఊహు! ఆ ఊసు ఎక్కడా లేదు.
సభలకు ముందు 1-12వ తరగతి దాకా ఓ విషయంగా తెలుగు భాషను బోధించేలా చర్యలు తీసుకుంటామని అన్నారేగాని, ఆచరించే తీర్మానం ఆమోదముద్ర పొందలేదు. పచ్చజెండా ఊపలేదు. ఓ కమిటీని వేశారు. ఓ రూలింగ్‌తో (తెలుగులో మొదటి ఉత్తర్వుగా పని జరిగే అంశానికి కమిటీ ఎందుకు? అంటే.. కాలయాపనకు.. చర్చలకు.. వీగి పోవడానికే! కుంటినడకన సాగుతూ అంపశయ్యపైనగల ప్రభుత్వ తెలుగు మాధ్యమ పాఠశాలలకు ఇది సమస్యే కాదు. ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తున్న ఆంగ్ల మాధ్యమ రెసిడెన్షియల్ పాఠశాలలకు కూడా ఇది సమస్య కాదు. ఇక తెలుగునకు తలదన్ని, సంస్కృతాన్ని (మార్కుల మాయాజాలంతో) ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా ఇది సమస్య కాబోదు. అదీ, సంస్కృత పండితులు కనె్నర్రజేయకపోతేనే! సమస్యంతా, సిబిఎస్‌ఇ (CBSE), ఐసిఎస్‌ఇ (ICSE)లాంటి అనుబంధ సంస్థలతో, బలంగా వేళ్లూనుకున్న కార్పొరేట్ వ్యవస్థలతోనే. వీటి కోరలు పీకి, సాధువుగా మార్చాలంటే, ఉమ్మడి జాబితాలో ఉన్న విద్య అడ్డువస్తుంది. దీనిని ప్రభుత్వం ఎలా చూస్తుందో, పరిష్కరిస్తుందో కమిటీయే కాదు, కాలం కూడా పరిష్కరించలేదు. మనసావాచా తెలుగును బతికించండంటూ గోడును వెళ్లబుచ్చింది రాష్ట్రేతర తెలుగువారు కావడం గమనార్హం! తెలుగు మాధ్యమ పాఠశాలల్లో పిల్లల సంఖ్య పడిపోవడంతో ఈ పాఠశాలల్ని మూసివేస్తూ, తమిళ మాధ్యమంలోకి మారండని తమిళ ప్రభుత్వం అంటుందని, అక్కడ తెలుగు మాధ్యమంలో తెలుగుపై నిజమైన అభిమానంతో చదివిస్తున్న తల్లిదండ్రులు ఈ సభల్లో ఆవేదన వెలిబుచ్చారు. ఆ విధంగా జరగకుండా తమిళ ప్రభుత్వాన్ని ఆదేశించి, ఆ రాష్ట్రంలోని తెలుగు మాధ్యమ పాఠశాలల్ని రక్షించే చర్యలు ఇరు తెలుగు రాష్ట్రాలు చేపట్టాలని వారు వివరించారు. ఇది బహుశ, పాలకుల చెవికెక్కిందో లేదో తెలియదు. ఇక మహారాష్టల్రో తెలుగును బోధించే ఉపాధ్యాయులు లేక, విధిగా తమ పిల్లలకు మరాఠీని నేర్పిస్తున్నామని, తెలుగు బోధకుల్ని మహారాష్టల్రోని కొన్ని పాఠశాలల్లో నియామకం చేసే చర్యలు చేపట్టాలని ఆ ప్రాంత వాసులు ఈ సభల సందర్భంగా కోరడం తెలిసిందే! ఉన్న డిఇడి కాలేజీల్లోనే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి, ఓరియంటల్ పాఠశాలల్ని, కళాశాలల్ని, పండిత శిక్షణ కాలేజీల్ని పట్టించుకోని ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తుందని అనుకోవడం.. అత్యాశ కాదు.. దురాశే అవుతుంది.
అసలు చర్చకేరాని అతి ముఖ్యమైన మరో అంశం పీఠాల ఏర్పాటు. స్వరాష్ట్రాల్లోనే తెలుగు పీఠం ఏర్పాటు గూర్చి ఆలోచించని ప్రభుత్వాలు (తెలుగు అకాడమీకి సంచాలకులు లేరు, తెలుగు విశ్వవిద్యాలయానికి ఆలనాపాలనా లేదు) పక్క రాష్ట్రాల్లో తెలుగు పీఠాల్ని ఏర్పాటు చేసి తెలుగు భాష వికాసానికి తోడ్పడుతాయని ఆశించగలమా! నిజానికి ఈ సందర్భంగానన్నా తెలుగు రాష్ట్రాల చుట్టూ వున్న తమిళ, కర్నాటక, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలతోపాటు, ఛత్తీస్‌గఢ్ (25 లక్షల మంది తెలుగువారున్నారు) రాష్ట్రాలలో మహాసభల స్ఫూర్తితో తెలుగుభాషా పీఠాన్ని ఏర్పాటు చేసి, నిధులను విడుదల చేసి, అక్కడ తెలుగు మాధ్యమం పాఠశాలల్ని ప్రోత్సహించి, తగినంతమంది ఉపాధ్యాయులకు (ఆయా ప్రాంతాల తెలుగువారికి) శిక్షణనిచ్చే బృహత్తర కార్యక్రమాల్ని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలి, ఈ దిశగా ఈ మహాసభల్లో వాతావరణం వుండాల్సింది. కానీ, భిన్నంగా భాషాశ్రేయస్సును మంటగలిపి, యువతను పెడదారి పట్టిస్తున్న సినీరంగాన్ని దగ్గరకు తీసి, సిసలైన పాలకుల్ని కలుపుకొని పోవాలల్సిన శిష్టవర్గాన్ని మహాసభల దరిదాపుల్లోకి రానీయకుండా జాగ్రత్తపడి తెలుగుతేజాన్ని ఇటు రాష్ట్రంలో, అటు ఢిల్లీలో గొంతెత్తి వినిపించి, తెలుగు మాధ్యమంలో చదువుకుంటే ఉద్యోగంలో ప్రాధాన్యత ఇవ్వాలని వక్కాణించిన ఎన్‌టిఆర్‌ను కనీసంగా ఊహల్లోకి కూడా రాకుండా నిర్వహించిన తెలుగు మహాసభలు తెలుగును ఏ విధంగా కాపాడుతాయో ఇంకా వేచి చూడాలా? తెలుగుభాషకు ప్రజల భాషలో పట్టంకట్టిన గిడుగు కనపడకపోయినా ఫర్వాలేదు కానీ తెలంగిని ‘తెలుగు’ అను నామకరణం చేసిన పాల్కురికి సోమన్న, రాజ్యధిక్కారం చేసి తన కవితాకృతిని తాను నమ్ముకున్న దైవానికే అంకితం చేసి, మడి దున్నుకు బతికిన పోతన, తన గొడవను ప్రజల గొడవగా గొంతెత్తి వినిపించిన కాళోజీ ఈ మహాసభల సందర్భంగా జీసస్‌లా పునరుత్థానం (Rebirth)చెంది వస్తే.. ఏం జరిగేదో ఊహించడం కష్టం కాకపోయనా, ఒళ్లు మాత్రం జలదరిస్తుంది. ఇలా ఆకుకు, పోకకు సంబంధం లేకున్నా, నోరు ఎర్రబడితే సూర్యుడే మన నోట్లో ఉదయించాడనుకుంటే.. మహాసభలు కూడా ఇలాంటివే అనుకుంటే.. చెప్పేది, చేసేది ఏం లేదు.. క్షణాల్ని కూడా ఘడియల్లా లెక్కించాల్సిందే!

- డా. జి.లచ్చయ్య సెల్: 94401 16162