మెయన్ ఫీచర్

అధికారం అలంకారమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకుల కేంద్ర స్థానాలు అందులో భాగస్వాములుగా ఉన్న సచివులను నామమాత్రులను చేస్తున్నాయి. ఇప్పుడు మంత్రుల పరిస్థితి పేరుగొప్ప ఊరు దిబ్బ. ప్రధానమంత్రి కార్యాలయం, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కార్యాలయాల ముందు మంత్రుల అధికారాలు దిగదుడుపే. నోరూ, పేరూ ఉన్న వాళ్లే ఏదో బతికేస్తున్నారు. అందరి అధికారాలనూ పీఎంఓ, సీఎంఓలే తనవిగా చేసుకుని శ్వాసించి శాసిస్తున్న పరిస్థితి. ఉత్తరభారతాన ఇలాంటి దృశ్యాలు కనిపించవు. దక్షిణాదిలో కూడా కొన్ని రాష్ట్రాల్లోనే ఇలాంటి పరిస్థితి. అందుకే ముఖ్యమంత్రులు బలవంతులుగా, మంత్రులు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోతున్నారు.
ప్రభుత్వమంటే ముఖ్యమంత్రులే కాదు, మంత్రులు కూడా! కానీ అధికారులు సీఎంలకు ఇచ్చే విలువ, ఆయన తర్వాత వరసలో ఉండే మంత్రులకు ఇవ్వరు. సీఎంలు కూడా వారినీ గౌరవించాలని చెప్పడం లేదు. తమ ఒక్కరికి విలువ ఇచ్చి మిగిలిన వారిని పట్టించుకోకున్నా ఫర్వాలేదనే కాంగ్రెస్ మార్కు సంప్రదాయం కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్‌లో నేతలు ఢిల్లీలో లొంగిపోయి, సొంత రాష్ట్రాల్లో ఎవరితో గొడవ పెట్టుకున్నా అధిష్ఠానం పట్టించుకోదు. పైగా ప్రోత్సహిస్తూ వాటిని తమాషా చూస్తుంటుంది.
ఢిల్లీ, అక్కడున్న పీఎంఓనే తీసుకుందాం. ఢిల్లీలో కేంద్రమంత్రులు చలికంటే మోదీని చూసే ఎక్కువగా వణికిపోతుంటారన్నది నిర్వివాదం. సంఘ్‌తో సన్నిహిత సంబంధాలున్న గడ్కరీ వంటి సీనియర్ మంత్రులు తప్ప, మిగిలిన వారంతా ఉత్సవ విగ్రహాలే. అందరిపై అడుగడుగునా నిఘా. ఏ మంత్రి ఎక్కడికి వెళుతున్నారు? ఎవరిని కలుస్తున్నారు? ఎంతసేపు భేటీ అయ్యారు? ఏ స్థాయి వ్యక్తులు కలుస్తున్నారు? అన్న దానిపై కూపీలు లాగడమే పీఎంఓ పనయిపోయిందని చాలామంది మంత్రులు, ఇతర పార్టీల ఎంపీలు కలసినప్పుడు తమ గోడు వెళ్లబోసుకుంటున్న వైనం పత్రికల్లో చూసినవే. ఫోన్లలో కూడా స్వేచ్ఛగా మాట్లాడుకోలేని దుస్థితి వారి సొంతం.
సొంత శాఖల్లో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోలేని దయనీయం. ప్రతి మంత్రి వద్ద ఏబీవీపీ లేదా సంఘ్‌లో పనిచేసిన వారుంటారు. ఒకరిపై మరొకరి నిఘా. ఏ ఫైళ్లపై సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లేదు. అంతా ప్రధానమంత్రి కార్యాలయమే. రాజ్‌నాధ్‌సింగ్ వంటి నలుగైదుగురు సీనియర్లు నియమించుకున్న పీఏలనే తిరస్కరించి పంపిన బలమైన వ్యవస్థలో, నోరూ వారుూ లేని మిగిలిన మంత్రుల పరిస్థితేమిటని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. చాలామంది మంత్రుల పరిస్థితి పైకి నవ్వుతూ లోపల తలుపులు వేసుకుని రోదించడమే. అందుకే చాలామంది మంత్రులు కాంగ్రెస్‌లో మాదిరిగా, ఎక్కువ కాలం ఢిల్లీలో గడపకుండా పని ఉన్నప్పుడే ఢిల్లీకొస్తున్నారు. కాంగ్రెస్‌లో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. అత్యంత కీలకమైన నిర్ణయాలు, భారీ ప్రాజెక్టులయితే తప్ప మిగిలిన అన్ని అంశాల్లో మంత్రులకు స్వేచ్ఛ ఉండేది. పీఎంఓ బదులు అహ్మద్‌పటేల్ వంటి ఒకరిద్దరు అంతఃపుర గంధర్వులే కాగల కార్యాలను తీర్చేవారు కాబట్టి పీఎంఓకి అంత సీను ఉండేది కాదు. అప్పట్లో అసలు పీఎంకే అధికారాలు లేనందున, ఇక కొసరు కార్యాలయం సంగతి చెప్పేదేముంటుంది? ఇప్పుడు పీఎంఓ సహా కీలక శాఖలో అధికారులంతా గుజరాతీయులే. మోదీ ఎవరినీ ఒక పట్టాన నమ్మరని, అందుకే గుజరాతీయులనే కీలక శాఖల్లో ప్రతిష్ఠ చేస్తుంటారన్న మాటలు వినిపిస్తుంటాయి. అంత కఠినంగా ఉన్నందుకే కుంభకోణాలు లేవన్న వాదనలో నిజం లేకపోలేదు. కానీ, మంత్రులకు విలువ లేని మంత్రివర్గంపై ఏం గౌరవం ఉంటుంది? రెండు తెలుగు రాష్ట్రాల్లో కొందరు కీలకశాఖల్లో ఉన్నారు. కానీ వారికెలాంటి అధికారాలుండవన్నది సంగతి సామాన్యుడికీ అర్ధమవుతే నేతలుగా వారికేం విలువ ఉంటుంది?
పీఎం అయినా, సీఎంలయినా తమకు ఇష్టులైన వారినే తమ దగ్గర నియమించుకుంటారు. దీన్ని తప్పుపట్టలేం. కానీ వారిచ్చిన చనువు, స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తేనే సమస్యలు వస్తాయి. చాలామంది సీఎంఓ అధికారులు సీఎంల ఇష్టాలు, అలవాట్లు, కోరికలకు అనుగుణంగా పనిచేస్తుంటారు. అంతవరకూ ఫర్వాలేదు. కానీ సీఎం చనువిచ్చారు కదా అని మంత్రులు, సహచర అధికారులపై పెత్తనం చేస్తే అది వికటిస్తుంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మంత్రుల కంటే సీఎంఓనే సుప్రీం. మంత్రులు కూడా సీఎంఓ ముఖ్య కార్యదర్శుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్న దుస్థితి. కొంతమంది అధికారులైతే మంత్రులొస్తే లేచి కూడా నిలబడని వాతావరణం ఉంది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కూడా దీనిని బాగా వొంటపట్టించుకుంటున్నారు.
సీఎంలు మంత్రులను గౌరవిస్తున్నారన్న సంకేతాలు వెళితే, ఆయన కింద పనిచేసే అధికారులూ దానిని అనుసరిస్తారు. లేకపోతే సీఎంను అనుకరిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు జరుగుతున్నది ఇదే. కర్నూలులో ఒక ఐఏఎస్ అధికారిని అధికారపార్టీ ఎమ్మెల్యే ఒకరు కలిసినప్పుడు, మీరు సీఎంతో ఎంతసేపు మాట్లాడతారని ప్రశ్నించారట. అందుకా ఎమ్మెల్యే అపాయింట్‌మెంట్ ఇస్తే ఓ ఐదు నిమిషాలు మాట్లాడతాం. అయినా సార్ అపాయింట్‌మెంట్ దొరకడం కష్టం కదా అని బదులిచ్చారు. అందుకు సదరు ఐఏఎస్ ఇప్పుడు నేను మీ ముందే సీఎం గారితో ఫోన్‌లో మాట్లాడమంటారా? అని అనేసరికి సదరు ఎమ్మెల్యే తన దుస్థితికి తానే జాలిపడాల్సివచ్చిందట. నిజమే. రోజూ సీఎంలు నేరుగా కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడుతుంటే ఇక ఆ జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులకు ఏం గౌరవం ఉంటుంది? ఏ అధికారి మాత్రం వారిని లెక్కచేస్తారు? తెలంగాణలో కూడా మంత్రులది ఇదే పరిస్థితి. ఎమ్మెల్యేలు ఏ పనికోసం వచ్చినా సార్‌తో మాట్లాడుకోండి. మేమేం చేయలేమని చెబుతున్న పరిస్థితి.
ఓసారి వైఎస్ విశాఖకు వెళ్లినప్పుడు అక్కడి జిల్లా పర్యటన కోసం హెలికాప్టర్ తెప్పించారు. అందులో సీఎంతోపాటు వెళ్లేందుకు అప్పటి ఓ అధికారి ప్రయత్నించగా, వైఎస్ ఆయనను పట్టించుకోకుండా మంత్రులను ఎక్కించుకుని వెళ్లిపోతే, సదరు అధికారి రోడ్డుమార్గం పట్టాల్సి వచ్చింది. అదే బాబు, కేసీఆర్ అయితే మంత్రులను పక్కకుపెట్టి అధికారులను ఎక్కించుకువెళతారు. అక్కడి అధికారులతో భేటీ అయిన వైఎస్ తాను ఈ రాష్ట్రానికి సీఎం అయితే, ఈ మంత్రి గారు మీ జిల్లాకు సీఎం. ఈయన గారు చెప్పింది చేయండని ఆదేశించారు. అంత స్వేచ్ఛ, పెద్దమనసు ఇప్పుడేదీ? వైఎస్ ఉన్నప్పుడు కూడా పాలనను సీఎంఓనే నియంత్రించేది. కాకపోతే అది స్వేచ్ఛాయుతంగా, సామరస్యంగా ఉండేది. ఒక పని కోసం ఎమ్మెల్యే రెండోసారి తన వద్దకు వచ్చారంటే దానిని వైఎస్ అవమానంగా భావించేవారు.
అందుకే సీఎంఓ ఉన్నతాధికారులు అక్కడివరకూ వెళ్లకుండా తామే ఆ పనులు పూర్తి చేసేవారు. వైఎస్ కూడా ఆ మేరకు వారికి తగినంత స్వేచ్ఛ ఇచ్చేవారు. తన వద్దకు వచ్చే జర్నలిస్టులు పనిచేసే పత్రికల స్థాయి ఏమిటన్నది కాకుండా అందరితోనూ సుహృద్భావంతో వ్యవహరించేవారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి అలా లేదు. కేవలం పెద్ద పత్రికలు, అది కూడా తమ వారికే సీఎంఓలలో ప్రవేశించే పరిస్థితి ఉంది. తెలంగాణలో అయితే అసలు సీఎం సెక్రటేరియేట్‌కే రానందున ఆ సమస్యే లేదు.
తాజాగా ఏపి హోం మంత్రి చినరాజప్పకు సొంత శాఖలోనే జరిగిన అవమానం చర్చనీయాంశమయింది. సొంత శాఖలో జరిగిన కార్యక్రమానికి ఆహ్వానం అందని తీరు ఆయనను సహజంగా మనస్తాపానికి గురిచేసింది. ఆ తర్వాత ఓ అధికారి ఫోన్‌లో చెప్పారనుకోండి, అది వేరే విషయం. బాబు సీఎం అయిన కొత్తలో ఒక సీఎస్‌ఓ, తన కుర్చీలో కూర్చునే తనతో మాట్లాడినా రాజప్ప వౌనం వహించారంటే ఇక్కడ తప్పెవరిదన్నది ప్రశ్న. మరో డిప్యూటీ సీఎం కెఇ కృష్ణమూర్తికి తన శాఖలో ఏం జరుగుతుందో తెలియదు. ఆర్డీఓ బదిలీలు కూడా ఆయన చేతి నుంచి కత్తిరించేశారు. ఏ కార్యక్రమాల గురించీ ఏ మంత్రికీ సమాచారం ఉండదు. దేవాదాయ శాఖలో ప్రకంపనలు సృష్టించిన సదావర్తి భూముల వ్యవహారాన్ని కొద్దిరోజులు వాయిదా వేయమని సీఎంఓ ప్రముఖుడు తన శాఖ కమిషనర్‌కు చెప్పేవరకూ మంత్రికీ తెలియదు. ఇలాంటి తమాషాలు, అవమానాలు మంత్రులకు అలవాటయిపోయాయి.
కాకపోతే మోదీతో పోల్చితే బాబు చాలా బెటర్. మోదీ కార్యక్రమాలు పరిశీలిస్తే ఫొటోల్లో ఆయనొక్కరే కనిపిస్తుంటారు. ఒక సందర్భంలో కేంద్రమంత్రి ఆయన పక్కకు వెళితే, సెక్యూరిటీ ఆయనను పక్కకులాగేసింది. అక్కడే మోదీ ఉన్నా దాన్ని పట్టించుకోలేదన్న వార్త మనం చూసిందే. కానీ బాబు అలా కాదు. ఎవరైనా మంత్రులు దూరంగా ఉంటే పిలిచి పక్కన నిలబెట్టుకుంటారు. కార్యకర్తలొచ్చినా పిలిచి ఫొటోలు తీయిస్తారు. బాబు మండల పార్టీ అధ్యక్షుడితో కూడా కొద్దిసేపయినా మాట్లాడతారు. మిగిలిన వారితో తాను వచ్చి, వెళ్లే సమయంలోనయినా మాట్లాడతారు. కానీ అప్పటికీ నేతలు బాబు తమకు సమయం ఇవ్వడం లేదని అలుగుతుంటారు. యుపీఏ అధికారంలో ఉన్నప్పుడు సోనియాను సీఎంలు కూడా కలిసే అవకాశం లేక వెనక్కివచ్చిన సందర్భాలున్నాయి. కానీ మోదీతో ఒక కేంద్రమంత్రి ఏకాంతంగా మాట్లాడిన దాఖలాలు మనకు కనిపించవు.
తెలంగాణ సీఎం కేసీఆర్ తాను అనుకుంటే తప్ప మంత్రులు ఆయనను కలవడం దుర్లభం. టీడీపీలో సంపూర్ణ స్వేచ్ఛ అనుభవించిన తమ్ముళ్లు చాలామంది ఇప్పుడు క్యాబినెట్‌లో ఉన్నారు. వారికి మునుపటి స్వేచ్ఛ లేదు. బాబు సీఎంగా ఉన్నప్పుడు జిల్లా పార్టీ-ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎప్పుడంటే అప్పుడు సమీక్షలు, పర్యటనలూ చేసేవారు. ఇప్పుడు కేసీఆర్ హయాంలో ఎవరి నియోజకవర్గాలకు వారు పరిమితం.ఎంత పెద్దవాళ్లయినా కేసీఆర్ పిలిస్తే వెళ్లాలే తప్ప, బాబు మాదిరిగా అపాయింట్‌మెంట్ లేకపోయినా, గేటు వద్దకు వెళితే లోపలికి పంపించే పరిస్థితి లేదు. ఎవరి స్టైల్ వారిది. ఎవరికైనా నడిచినంతకాలమే!

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 97053 11144