మెయన్ ఫీచర్

న్యాయపరిధిలోకి ఎవరిది చొరబాటు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏది మితిమీరిన న్యాయ ప్రమే యం-జ్యూడిషియల్ ఓవర్ రీచ్-? ఏది న్యాయ క్రియాశీలత-జ్యుడిషియల్ యాక్టివిజమ్-? అన్న విషయంలో ఏకాభిప్రాయం లేదు. ప్రభుత్వాల విధాన నిర్ణయాలలో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోరాదని, అలా చేసుకొనడం మితిమీరిన న్యాయప్రమేయం అని ప్రధాన మంత్రులు వ్యాఖ్యానించడం చరిత్ర. కానీ ఈ విషయంలో కూడ రాజకీయవేత్తల మధ్య, రాజకీయ పేషీల మధ్య ఏకాభిప్రాయం లేదు. నల్లధనం వెలికి తీయడానికై తమ పర్యవేక్షణలో ప్రత్యేక పరిశోధన బృందం- స్పెషల్ ఇనె్వస్టిగేటింగ్ టీమ్-సిట్- ఏర్పడాలని సర్వోన్నత న్యాయస్థానం క్రీస్తుశకం 2011 జూలైలో నిర్ధారించింది... ఆదేశం మితిమీరిన న్యాయ ప్రమేయమని అప్పటి ప్రధాని మన్‌మోహన్ సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యాఖ్యానించింది. కానీ 2014, మే 26న ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఏర్పడిన భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం అధికార బాధ్యతలను స్వీకరించిన వెంటనే సిట్‌ను ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తమ విధాన రూపకల్పన పరిధిలోనికి సర్వోన్నత న్యాయస్థానం చొరబడిందని భావించింది. కానీ భాజపా ప్రభుత్వం అలా భావించలేదు. రాజ్యాంగ స్ఫూర్తి ప్రాతిపదికగా రాజకీయ లక్ష్యాలు ప్రాతిపదికగా మాత్రమే మితిమీరిన న్యాయ ప్రమేయం గురించి ప్రచారం జరుగుతోందన్న దానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే... భిన్న రాజకీయ పార్టీలు, విభిన్న అభిప్రాయాలు!
ఒకే రాజకీయ పక్షం అభిప్రాయాలను మార్చుకొనడం కూడ చరిత్ర. ఆహార ధాన్యాలను నిరుపేదలకు ఉచితంగా పంచిపెట్టాలని లేదా అతి తక్కువ ధరలకు విక్రయించాలని 2010 జూలైలో సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించినప్పుడు మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వం ఈ ఆదేశాన్ని మితిమీరిన న్యాయ ప్రమేయమని అభివర్ణించింది. తమ ప్రభుత్వ విధానాన్ని సుప్రీంకోర్టు నిర్దేశించజాలదని, ఆక్షేపించింది. సర్వోన్నత న్యాయ నిర్ణయాన్ని అమలు జరుపలేమని ఒక సారి, అమలు జరుపగలమని మరోసారి మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వం పదేపదే మాట మార్చడం చరిత్ర...దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్నవారెవరు? దిగువన ఉన్నవారెవరు? అన్న విషయమై 2011లో ప్రణాళికా సంఘం వారు చేసిన దోష భూయిష్టమైన నిర్ధారణలు వ్యవస్థీకృతం కాకుండా సుప్రీంకోర్టు నిరోధించింది. ఈ ప్రమేయం లేకపోయి ఉండినట్లయితే కోట్లాది నిరుపేదలకు ఆహార భద్రత లభించి ఉండేది కాదు. గ్రామీణ ప్రాంతాలలో నెలకు దాదాపు ఎనిమిది వందల రూపాయలు, ఇంకా ఎక్కువ సంపాదించే వ్యక్తి దారిద్య్ర రేఖ కంటె ఎగువన ఉన్నట్టు ప్రణాళికా సంఘం 2011లో నిర్ధారించింది. అలాగే పట్టణ ప్రాంతంలో నెలకు వెయ్యిరూపాయల కంటె ఎక్కువగా ఆదాయం ఉన్నవారిని కూడ దారిద్య్ర రేఖ కంటె ఎగువన ఉన్నట్టు విచిత్రమైన నిర్ధారణ జరిగింది. గ్రామాలలో రోజునకు ఇరవైఏడు రూపాయల కంటె తక్కువ ఆదాయం పొందేవారు పట్టణాలలో దినసరి ముప్ప యి నాలుగు రూపాయలకంటె తక్కువ ఆదాయం ఉన్నవారు మాత్రమే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్టు నిర్ధారణ జరిగింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారిని మాత్రమే ఆహార భద్రత అర్హత ఉంది. అందువల్ల దాదాపు వందశాతం ప్రజలకు ఆహార భద్రత చట్టం కింద ఆహార ధాన్యాలను చౌక ధరలకు పొందే అర్హత ఉండదు. క్రీస్తుశకం 2001నాటి ధరలు, ఆదాయం ప్రాతిపదికగా 2011లో ఇలాంటి నిర్ధారణ జరగడం ప్రణాళికా సంఘం వారి మతిమాలినతనం...పదేళ్లలో పెరిగిన ద్రవ్యోల్బణాన్ని వారు పరిగణించలేదు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఆదేశించడం వల్లనే కేంద్ర ప్రభుత్వం దారిద్య్రరేఖ ప్రాతిపదికను మార్చింది. ప్రభుత్వం వారి మతిమాలిన చర్య కారణంగానే న్యాయ క్రియాశీలత అనివార్యం అయిందనడానికి ఇది ఉదాహరణ.
ప్రభుత్వం వారి నిర్లక్ష్యం కారణంగా గిడ్డంగులలోను, ఆరుబయట ప్రదేశాలలోను నిలువ చేసిన లక్షల టన్నుల ఆహారధాన్యాలు పాడయిపోతున్న వాస్తవం 2010లో బయటకు పొక్కింది. ఇలా పాడైపోయిన ధాన్యాన్ని పాడవడానికి ముందే నిరుపేదలకు ఉచితంగా కాని, తక్కువ ధరకు కాని పంచిపెట్టాలని 2010లో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆహార భద్రత చట్టం రూపొందించాలన్న జ్ఞానోదయం ప్రభుత్వానికి కలగడానికి ఈ న్యాయ క్రియాశీలత కారణం. 2013లో కానీ ఆహార భద్రత చట్టం రూపుదిద్దుకోలేదు. కానీ 2010 ఆగస్టులో ‘‘ఆహారధాన్యాలను ఉచితంగా పంచండి. లేదా అతితక్కువ ధరలకు విక్రయించండి.’’ అని సుప్రీంకోర్టు చెప్పగానే అప్పటి ప్రధాని మన్‌మోహన్ సింగ్ ‘‘ఇది మితిమీరిన న్యాయ ప్రమేయం. ప్రభుత్వ విధాన రూపకల్పన పరిధిలోకి సర్వోన్నత న్యాయస్థానం చొరబడరాదు..’’ అని వ్యాఖ్యానించారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉండిన భాజపాకు ఇది ‘‘చొరబాటు కాలేదు!! కానీ ‘‘ఐదు నక్షత్రాల-ఫైవ్ స్టార్-ఉద్యమకారులకు న్యాయమూర్తులు భయపడుతున్నారు..’’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2015 ఐదవ తేదీన వ్యాఖ్యానించారు. పదేళ్ల క్రితం నిర్భయంగా తీర్పులు చెప్పగలిగిన న్యాయమూర్తులు ప్రస్తు తం ఈ ‘ఐదు నక్షత్రాల’ ఉద్యమ నాయకులు ఏమనుకుంటారోనన్న భయానికి గురి అయి ఉన్నారని కూడ మోదీ అన్నారు. సర్వోన్నత న్యాయమూర్తుల ముఖ్యమంత్రుల ఉమ్మడి సమావేశంలో ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలను అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి హెచ్‌ఎల్ దత్తు నిరసించినట్టు ప్రచారమైంది. న్యాయవ్యవస్థ అధికార పరిధిలోకి బయటివారు చొరబడుతున్నారన్నది మోదీ వ్యాఖ్యానంలోని ధ్వని...
పాడయిపోనున్న ఆహార ధాన్యాలను పాడుకాకుండా కేంద్ర ప్రభుత్వం తనంత తానుగా ఎందుకని నిరోధించలేదు? నిరోధించి ఉన్నట్లయితే సుప్రీంకోర్టు ప్రమేయం లేదు. పప్పులను, గోధుమలను, బియ్యా న్ని నూనెలను పాడుకాకుండా నిరోధించే వ్యవస్థ దశాబ్దుల తరబడి ఏర్పడకపోవడం ప్రభుత్వాల క్రియాశూన్యత కాదా? సుప్రీంకోర్టు ఆదేశించిన తరువాత అప్పటి వ్యవసాయమంత్రి శరద్ పవార్ న్యాయ నిర్ణయాన్ని గౌరవిస్తామని 2010 ఆగస్టు 31న ప్రకటించారు. తాము సలహానివ్వలేదని, ఆదేశించామని కూడా సర్వోన్నత న్యాయమూర్తులు దల్వీర్ భండారి, దీపక్ వర్మ ఆదే రోజు స్పష్టం చేశారు. చొరబాటు అయినట్టయితే అది రాజ్యాంగ విరుద్ధం. కానీ సర్వోన్నత న్యాయస్థానం ఇస్తున్న తీర్పులు, తమకు నచ్చనప్పుడు ‘‘చొరబాటు’’గా ప్రకటిస్తున్న ప్రభుత్వాలు రాజకీయ నిర్వాహకులు ఏ రాజ్యాంగ అధికరణం ప్రకారం అది చొరబాటు? అని ఎందుకని చెప్పడం లేదు? రాజ్యాంగంలోని 32వ, 131వ అధికరణాల ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించే అధికారం సర్వోన్నత న్యాయస్థానానికి ఉంది. ఇతర అధికరణాలలో సైతం ఈ అధికారం విహితమై ఉంది. ఇదంతా అతి ప్రమేయం కాజాలదు. న్యాయస్థానాలను ఆదేశించే అధికారం రాజ్యాంగం ప్రభుత్వాలకు కల్పించలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థ వౌలిక స్వభావంలోనే మిగిలిన రెండు రాజ్యాంగ విభాగాలకంటె న్యాయ విభాగం ఉన్నతమైనదన్న సహజ సూత్రం నిహితమై ఉంది. ప్రభుత్వాల వైఫల్యాల-ఎర్రర్స్ ఆప్ ఒమిషన్-ను ప్రభుత్వాలు అత్యాచారాల-ఎర్రర్ ఆఫ్ మిషన్-ను నిరోధించే అధికారం అనాదిగా న్యాయవ్యవస్థకు ఉంది. మనదేశంలో అనాదిగా శ్రుతి, స్మృతి న్యాయవ్యవస్థకు రూపాలు. ఈ వ్యవస్థ ప్రాతిపదికగా సామాజిక న్యాయం వికసించింది. పాలకులు శాస్త్ర నియమాలను పాటించారు. పాలకులు శాస్తన్రియమాలను నిర్దేశించలేదు. పాలనలో శాస్త్ర ప్రమేయం ఉంది, పాలకులకు శాస్త్రంలో ప్రమేయం లేదు. శాస్త్రం సమష్టి జనాదేశం. ఆధునికులు దీనే్న డాక్టరిన్ ఆఫ్ మాండేట్-జనాదేశ సిద్ధాంతమని వ్యవహరిస్తున్నారు.‘డాక్టరిన్ ఆఫ్ మాండేట్’ ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థలకు పునాది! అందువల్ల ఎగ్జిక్యూటివ్-మంత్రివర్గ, లెజిస్లేచర్-శాసన నిర్మాణ విభాగాల పరుధులలోకి న్యాయవిభాగం ప్రవేశించడం సహజ ప్రజాస్వామ్య ప్రక్రియ. ఈ న్యాయప్రమేయానికి ఆవకాశం లేనట్టయితే ప్రజాస్వామ్యం పేరుతో ప్రచ్ఛన్న నియంతృత్వం వ్యవస్థీకృతమవుతుంది. అలాంటి ప్రచ్ఛన్న నియంతృత్వం క్రీస్తుశకం 1975వ 1977వ సంవత్సరాల నాటి’’ అత్యవసర పరిస్థితి-ఎమర్జెన్సీ- రోజులలో మనదేశంలో నెలకొన్నట్టు చరిత్ర సాక్ష్యం చెబుతోంది. ఇలా నెలకొనడానికి కేంద్ర మంత్రివర్గం-ఎగ్జిక్యూటివ్- న్యాయవ్యవస్థ పరిధిలోకి చొరబడిపోవడం కారణం!
అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రభు త్వం న్యాయవ్యవస్థ పరిధిలోకి అక్రమంగా చొరబడింది. నలుగురు న్యాయమూర్తుల వరిష్ఠత-సీనియారిటీ-ను నిరాకరించింది. ఐదవ స్థానంలోని న్యాయమూర్తిని సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తిగా నియమింపచేసింది. ఈ రాజకీయ ప్రమేయానికి కార ణం 1975 జూన్‌లో అలహాబాద్ ఉన్నత న్యాయస్థానం వారు ఇందిరాగాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం. ఈ న్యా య నిర్ణయాన్ని వమ్ము చేయడానికి వీలుగానే నలుగురు సర్వోన్నత న్యాయమూర్తుల సీనియారిటీకి విఘాతం కలిగించినట్టు చరిత్ర చెబుతోంది. అలహాబాద్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు ఆ తరువాత రద్దు చేసిందట! ‘‘నిప్పునకు చెదలంటదు..’’ అన్న న్యాయ సూత్రం నీరు కారిపోవడానికి బహుశా అదే మొదలు. ‘‘్ఫలానా రాజకీయ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఫలానా వారికి ఉన్నత న్యాయమూర్తి పదవి వస్తుంది, ఫలానా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టయితే ఫలానా వారికి న్యాయపదవి రాదు..’’ అన్న చర్చలు బహిరంగాంగానే జరిగాయి. అన్ని రంగాల్లో వలెనే ఉన్నత సర్వోన్నత న్యాయవ్యవస్థలోని అవినీతి పరులు న్యాయమూర్తుల రూపంలో చొరబడడం తరువాతి చరిత్ర! ఇలాంటి ముగ్గురు అవినీతి పరులను పార్లమెంట్ అభిశంసించడానికి యత్నించింది కూడ. న్యాయవ్యవస్థలోనికి రాజకీయ వాదుల చొరబాటు వల్లనే అవినీతి గ్రస్తులైన న్యామూర్తులు దాపురించడం నిజం కాదా? ప్రస్తుతం న్యాయమూర్తుల నియామకం కోసం ఎర్పడి ఉన్న ‘వరణ మండలి’-కొలేజియం-అవినీతి పరులను న్యాయమూర్తులు కాకుండా నిరోధించగలదా?

-హెబ్బార్ నాగేశ్వరరావు సెల్: 9951038352