మెయన్ ఫీచర్

ఆ మూడు రోజులూ వారికి సెలవే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చలికాలమైనా తుపాను వచ్చినా వేకువజామునే లేచి పిల్లలకు ఇష్టమైన అల్పాహారం, లంచ్ బాక్సులోకి ప్రేమగా వంట చేసి, పిల్లల్ని ముస్తాబు చేసి, నుదుట ముద్దుపెట్టి బడికి పంపిన అమ్మ పిల్లలు స్కూల్ నుంచి రాగానే చికాకుగా, మూడీగా అగుపిస్తుంది. అలా ఎందుకుందో ఆ పసిప్రాణానికి అంతుపట్టని విషయం. తండ్రో, నానమ్మో వచ్చి అమ్మకి జ్వరమొచ్చింది. దగ్గరకి వెళ్తే నీకూ వస్తుంది, అని బుజ్జగించి దగ్గరికి తీసుకునేవరకు బిక్కమొహం వేసుకొనుండేది ఆ పసి హృదయాలు. ఎప్పుడూ కిలకిలా నవ్వుతూ, అల్లరి చేస్తూ, చెట్లెక్కి గెంతే సోదరి ఒక్కసారిగా లోలోపే బాధపడుతూ, ఎదురుగా రావడానికి సిగ్గుపడుతూ ఎక్కడో కూర్చుంటుంది. తన పిగ్గి బాంక్ నుంచి చెప్పకుండా డబ్బులు కాజేసినప్పుడు కూడా ఏమీ అనని సోదరి ఇప్పుడు చీటికీ మాటికీ కయ్యానికి కాలు దువ్వుతోంది. ఆఫీసు నుంచి రాగానే చిరునవ్వుతో కాఫీ తెచ్చిచ్చి గలగలా కబుర్లు చెప్పే భార్యామణి విసుగు ప్రదర్శిస్తూ ముక్తసరిగా జవాబు చెబుతోంది. భూగోళంలో పుట్టిన ప్రతి మహిళకు ప్రకృతి ఇచ్చిన అగచాట్లు ఇవి.
యుక్త వయసు వచ్చినాక, లేదా పెళ్లయ్యాక కూడా భార్యాభర్తలు కూడా పారదర్శకంగా మాట్లాడుకోలేకపోతున్న విషయం ఇది. డాక్టర్లు అసలే కొరత ఉన్న మన దేశంలో మహిళా గైనకాలజిస్ట్ లభ్యమవని ప్రదేశాలలో తాము పడుతున్న వేదన, నొప్పి పురుష గైనకాలజిస్ట్‌తో బిడియం లేకుండా, దాచకుండా చెప్పుకోవాలన్నా నరకప్రాయమే. ఎంతో అపురూపమైన, పవిత్రమైన ఆడజన్మ అనాదిగా ఎదుర్కొంటున్న సమస్య ఇది. ఆ సమయంలో అసహనం, విసుగు, ఉడుకుమోతుతనం, ఎక్కడలేని కోపం, నిస్సహాయత ఆవరిస్తాయి. అప్పటి వరకు కుటుంబ సభ్యులను ప్రాణానికి ప్రాణంగా చూసుకునేవాళ్లు, ప్రేమను పంచేవాళ్లు మెన్స్ట్రువల్ సిండ్రోమ్ వల్ల దూరంగా జరగాల్సి వస్తోంది. దీనికి కారణం బహిష్టు సమయంలో ఈస్ట్రోజన్, టెస్టొస్టెరాన్, ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్లు అతి కనిష్ఠ స్థాయికి దిగిపోవడమో, గరిష్ఠ స్థాయి పెరగడమో జరగడం. అనేకమంది అమ్మాయిలు, మహిళలు నొప్పుల ధాటిని తట్టుకోలేక, అవగాహనారాహిత్యం వల్ల భయాందోళనలకు గురి అయి క్రమేపీ మానసిక రుగ్మతలకు గురవుతున్నారు.
భారతదేశంలో భౌగోళిక, ఆర్థిక, సామాజిక, సాంఘిక పరిస్థితుల వలన ఋతుచక్రం పరమైన పరిశుభ్రత, పారిశుద్ధ్యం, నాణ్యమైన శానిటరీ నేప్‌కిన్స్ ఉపయోగించకపోవడం వలన పునరుత్పాదక ఇనె్ఫక్షన్స్‌కు కూడా గురి అవుతున్నారు.
మనదేశంలోనే కాదు. ప్రపంచంలో చాలా దేశాల్లో ఋతుస్రావం విషయాన్ని బహిరంగంగా మాట్లాడటం తక్కువే. ఆత్మన్యూనతాభావం, బిడియం, అసాంఘికం అన్న భావనవల్ల ఇలా జరుగుతోంది. అదేదో తప్పు చేసినట్లు, అవమానకరమైనది అన్నట్లు ఈ విషయంమీద వౌనం వహిస్తారు. అవగాహన, భావోద్వేగ వ్యక్తీకరణ, సానుకూల వైఖరిని సంఘీభావం, దొరికినప్పుడు చాలామందికి మానసిక రుగ్మతలను తగ్గించవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
పూర్వపు రోజుల్లో చక్కటి సూర్యరశ్మి, గాలి, వెలుతురు, కల్తీలేని పౌష్ఠికాహారం లభ్యమవడం వలన స్ర్తిలకు మెన్స్ట్రువల్ సమయంలో అంత ఎక్కువ ఇబ్బందులు ఉండేవికావు. ఇప్పుడు ప్రపంచం మొత్తంలో 80 శాతం వరకు ఎన్నో రకాల మానసిక శారీరక ఇబ్బందులు కలుగుతున్నాయి. దీనితోపాటు సాంఘిక ఇబ్బందులు కూడా తోడవుతున్నాయి. ప్రపంచం అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది. కానీ ఈ విషయంలో ఇంకా పరిస్థితి అలాగే కొనసాగుతున్నది. ఒక సాధారణ గృహిణి నుంచి ఫార్చ్యూన్ 500 కంపెనీ సిఇఒ వరకు మనసు విప్పి బహిరంగంగా చెప్పుకోలేని సమస్య ఇది.
మిగతా ఆచారాలు, నమ్మకాలు పక్కన పెడితే, మనవాళ్ల ఇళ్లలో పూర్వం పెద్ద వసారాలు, చావిడి, కొట్టు, జాఫిరీ, అరుగులాంటివి ఉండడం వలన మహిళలు వేరుగా ఉండి తమకు నచ్చిన నవలలు చదువుకోడానికి, తీరిక లేదా ఎప్పటినుంచే కట్టుకుంటామనుకున్న చీర ఫాలు కుట్టుకోవడం, పెయింటింగో, అల్లికలో చేసుకోవడానికి సమయం దొరికేది. ఇంటి పనుల నుంచి విముక్తి. విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం లభించేది. మరోపక్క పెళ్లీడుకొచ్చిన కూతురుకి వంట నేర్చుకొనే అవకాశం, మగపిల్లలకు ఆ మాత్రం అత్తెసరు పెట్టుకోవడం నేర్చుకునేది కూడా ఆ సమయంలోనే.
మొన్నామధ్య, అరుణాచల్ ప్రదేశ్ నుంచి లోక్‌సభ సభ్యుడైన నినోంగ్ ఎరింగ్ అనే అతను ‘మెన్రే్స్టషన్ బెనిఫిట్ బిల్లు 2017’ అనే ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న మహిళలకు ఋతుస్రావం సమయంలో రెండు రోజులు సెలవు, కార్యాలయంలో విశ్రాంతి కోసం మంచి సౌకర్యాలను అందించడమే ఆ బిల్లుయొక్క ముఖ్య ఉద్దేశం. మహిళా ఉద్యోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి కార్మిక చట్టాలను మరింత సవరించడానికి భారతదేశం అంతటా తరచూ డిమాండ్లు వచ్చాయి. మెన్సస్ లీవ్ కోసం ఇప్పుడిప్పుడే దేశవ్యాప్తంగా ఉద్యమం వేగాన్ని పెంచుకుంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పాసయిన ప్రైవేటు బిల్లులు వేళ్లమీద లెక్కించొచ్చు. అయినా ఈసారి విషయం కొంచెం తీవ్రమైనది. పైగా మోదీ సర్కారులో అభ్యుదయ భావాలు కలిగిన ప్రముఖులైన మహిళలు ఉండడం వలన ఈ బిల్లును తేలికగా ఆమోదం పొందేలా చేస్తుందేమో ప్రభుత్వం.
1960 సంవత్సరానికి మునుపు మహిళలకు ప్రసూతి సెలవులు కూడా ఉండేవి కావు. మహానుభావుడు జె.ఆర్.జి.టాటా మొట్టమొదటిసారి టాటా స్టీల్ కంపెనీలో అనేక శ్రామిక సంక్షేమ ప్రయోజనాలను ప్రవేశపెట్టారు. టాటా, ప్రసూతి ప్రయోజనాలతోపాటు ఎనిమిది గంటల షిఫ్ట్, ఉచిత వైద్య చికిత్స, ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్, ప్రమాద నష్ట పరిహార పథకం, బోనస్, పదవీ విరమణ ప్రయోజనాలు భారతదేశంలో పరిచయం చేశారు. ఇవన్నీ కొనే్నళ్ల తరువాత భారత ప్రభుత్వం అనుకరించి కార్మిక సంక్షేమ చట్టాలు చేసింది. ప్రసూతి బెనిఫిట్ (సవరణ) చట్టం ఏప్రిల్ 2017 నుండి అమలులోకి వచ్చింది. గత ఏప్రిల్‌లో ప్రసూతి బెనిఫిట్ సవరణ చట్టం మహిళా ఉద్యోగులకు ఇస్తున్న 12 వారాల మెటర్నిటీ లీవును 26 వారాల వరకు పెంచింది. అయినా ఈనాటికీ, ఇళ్ల నిర్మాణం, పంటపొలాల్లో పనిచేసే మహిళలకు ఈ ప్రయోజనాలన్నీ అందుబాటులో లేవు. శరీరంలో ఇతర అవయవాలకి సుస్తీ చేసినపుడు, నొప్పి వచ్చినపుడు ఎలా వ్యవహరిస్తారో ఈ విషయం గురించి బహిరంగంగా, ఆత్మవిశ్వాసంతో బెరుకు లేకుండా మాట్లాడుకుని సమస్యలు తీర్చుకోవడం మహిళల ప్రాథమిక హక్కు. దీనిని ఒక సహజ శారీరక ప్రామాణిక జీవప్రక్రియగా పరిగణించాలి. కాకపోతే మూఢనమ్మకాలని పారదోలి ఆరోగ్యపరమైన, మానసికపరమైన విషయంగా స్వీకరించాలి. కాకపోతే మెన్స్ట్రువల్ లీవ్ కేవలం ఉద్యోగం, వ్యాపారం చేస్తున్న మహిళలకే కాకుండా ప్రతి మహిళలకు దొరకాలి. గృహిణికి ఆ రోజుల్లో ఇంటిపని, వంటపని నుంచి విశ్రాంతి కలిపిస్తే మానసిక ఆందోళన, శారీరక సమస్యల నుంచి కొంచెం ఊరట లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అధికశాతం మహిళలు, ఋతుస్రావమపుడు డిస్మెనోరియా అనే గర్భాశయపు కండరాల నొప్పితో బాధపడుతున్నారు. ఈ విషయంలో సూపర్‌పవర్ దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు సహా అన్నీ వెనకబడే ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో నాజీ, యూరోపియన్ దేశాలు మహిళా ఫైటర్ పైలట్లు బహిష్టు సమయంలో విమానం నడపడాన్ని నిషేధించాయి. కడుపునొప్పితో బాధపడుతూ టార్గెట్‌ను నాశనం చేయడంలో విఫలమవుతారేమోనన్న సందేహం వల్ల అలా చేశారు. కాకపోతే అభివృద్ధి చెందిన దేశాలలో మహిళలకు శానిటరీ నేప్‌కిన్స్, పరిశుభ్రమైన వాతావరణం లభ్యమవుతాయి.
మెన్స్ట్రువల్ లీవ్ విషయంలో ఆసియా ఖండం ముందంజలో ఉంది. జపాన్, రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, 1947లో ‘శారీరక సెలవు’ పేరుతో సెలవు చట్టం మంజూరు చేసింది. దక్షిణ కొరియా 2001లో ‘మహిళల ఉపశమన’ సెలవును మంజూరు చేసింది. 2013లో తైవాన్ మహిళా ఉద్యోగినులకు మూడు రోజుల సెలవు అనుమతించే చట్టాన్ని సవరించింది. ఇండోనేషియా, చైనాలోని కొన్ని రాష్ట్రాలు, ఆఫ్రికాలోని జాంబియా కూడా ఈ విధమైన సెలవును మంజూరు చేశాయి. ఇటలీలో ఈ బిల్లు ఆమోదానికి సిద్ధంగా ఉంది, అమలు అయితే యూరోపియన్ దేశాలలో ప్రప్రథమంగా ఇటలీనే చరిత్రకెక్కుతుంది. గమ్మత్తేమిటంటే రష్యా ప్రభుత్వం కూడా మెన్స్ట్రువల్ లీవుని ప్రతిపాదిస్తే అక్కడ మహిళా అభ్యుదయ సంఘాలు, స్ర్తివాదులు ఖండించారు. పురుషులతో సమానంగా అన్నిటా మహిళ ఉండాలని వారి ఆంతర్యం. అనాదిగా నేపాల్ దేశంలో బహిష్ఠు సమయంలో మహిళలను ఇంటి నుంచి బహిష్కరించి పశువుల కొట్టంలోనో, పాకల్లోనో ఉండనిచ్చేవారు. ఇటీవల నేపాల్ ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి, మహిళలను అలా బహిష్కరించే వారిపై క్రిమినల్ కేసులు పెట్టి కారాగారానికి పంపుతోంది.
ఈనాటి ప్రపంచ శ్రామిక శక్తి, ఉద్యోగులలో మహిళలు దాదాపు 40 శాతం మంది ఉన్నారు. వారిలో 20 శాతం మంది మహిళలు బహిష్ఠు సమయంలో తీవ్ర అసౌకర్యం, బాధని అనుభవిస్తున్నారు. వారి పరిస్థితి మెరుగుపడి తమ రోజువారీ జీవితాన్ని సాఫీగా గడపడంలో, ఉపశమనం, విశ్రాంతి పొందడానికి మెన్స్ట్రుల్ లీవ్ దోహదపడుతుంది.
ప్రతీ నాణానికీ రెండు పార్శ్వాలు ఉన్నట్లే ఈ బిల్లు ఆమోదిస్తే, వివిధ సంస్థలు మహిళలకు ఉద్యోగం ఇవ్వాలంటే ఆలోచిస్తాయేమో. వాళ్లకి ప్రాముఖ్యత ఇవ్వరేమో అన్న వాదన లేకపోలేదు. అలాగే మహిళలు కూడా తమ వృత్తిలో నైపుణ్యం ప్రదర్శించి పైకి ఎదగడంలో సెలవు అడ్డుగోడగా ఉంటుందేమో అనే అనుమానమూ లేకపోలేదు. మానసిక, శారీరక శ్రేయస్సుకంటే పోటీ ప్రపంచం ఆర్థిక ప్రయోజనాలు, కృత్రిమ తాత్కాలిక ఆనందమే చాలా ముఖ్యం అయిన రోజులివి.
మూఢ నమ్మకాలని పారదోలి, లింగవివక్ష లేకుండా, కులమతాచారాలను గౌరవిస్తూ ఈ విషయంలో ఆ అంశాన్ని ఇమడ్చకుండా, కేవలం మానవతా దృక్పథంతో, ప్రకృతి నిర్మాణపరమైన మహిళల శారీరక అవసరాలకు అనుగుణంగా మెన్స్ట్రువల్ లీవ్‌ని ప్రతీ మహిళకు అవశ్యమే మంజూరు చేయాలి. మహిళాభ్యుదయం, రిజర్వేషన్లు, మహిళా సాధికారతకన్నా ఇది ప్రాముఖ్యం అధికంగా సంతరించుకున్నది. ఋతుస్రావం ప్రకృతి సహజం. దీనిపై సమాజం చైతన్యం కావాలి. విద్యావంతులైతే అది సాధ్యమవుతుంది.

- సునీల్ ధవళ, 09741747700