మెయిన్ ఫీచర్

మోక్షమిచ్చే మరకతశివలింగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మరకత మహాదేవ రక్ష రక్ష - మరకత శివలింగ రక్ష రక్ష’’ అంటూ ఒక్కసారి పఠించినంత మాత్రాన భోళాశంకరుడు అపార కృపాకటాక్షాన్ని భక్తులపై గుమ్మరిస్తాడు. ఈ స్వామి మరకత మహాదేవ సోమేశ్వరస్వామి! ప్రాతఃకాలంలో సూర్యుని కిరణాలు ఇక్కడి శివలింగంపై పడి అత్యద్భుతంగా మరకత మణులతో ఆవిర్భవించిన లింగంగా మహా శివుడు దర్శన మిస్తాడు.
రంగారెడ్డి జిల్లా, శంకర్‌పల్లి మండలం, చందిప్ప గ్రామంలో మూసీనది సమీపంలో కొలువై వుంది ఈ మరకత మహాదేవుని ఆలయం. ఆకుపచ్చని రంగులీనే ఈ శివలింగాన్ని మరకత శివలింగంగా భక్తులు కొనియాడుతారు. నవరత్నాలల్లోని బుధుని రూపం, చంద్రుని నక్షత్రం కూడా కలగలసి ఉందని భక్తులు విశ్వసిస్తారు.
స్థల పురాణం
ఈ ఆలయాన్ని క్రీస్తుశకం 1076-1126 పశ్చిమ చాళుక్య వంశంలోని రాజుల్లో 6వ చక్రవర్తి విక్రమాధిత్యుడు పవిత్రమైన ముచుకుందానది ఒడ్డున అంటే ఇప్పటి మూసీనది ఒడ్డున శంకర్‌పల్లి పట్టణానికి సమీపంలో ఉన్న చందిప్ప గ్రామంలో ఈ మరకత శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లుచెప్తారు.
శాసనాధారాలు
పశ్చిమ చాళుక్య వంశ రాజులలో సుప్రసిద్ధ చక్రవర్తి శ్రీత్రిభువన మల్లబిరుదాంకింతుడైన ఆరవ విక్రమాధిత్యుడు క్రీ.శ.1076 నుండి 1126 వరకు పరిపాలించాడు. అప్పుడు ఈ సోమేశ్వర మరకత శివలింగం ఆలయ స్థాపనకు, ఆ దేవుని అంగరంగ భోగములకు, విశేష పూజలకు, శివరాత్రి కార్యక్రమాలకు 254 ఎకరాల గుడిమాన్యాన్ని ప్రకటించారు. పశ్చిమ దిశలో హెబ్బిహోలు పేరుగల పొలంలో 153 ఎకరాలు నల్లరేగడి భూమిని, నైవేద్యమునకు తూర్పు దిశగ 2-20 ఎకరాలు, వరికి, పూల తోటకు 54 ఎకరాలు, తాటివనం, ఇలా రాజులు అగ్రహారం కింద దైవ పూజలకోసం, అన్నదానం కోసం కేటాయించినట్లు ఇక్కడున్న శాసనం వెల్లడిస్తోంది.
క్షేత్రపాలకుడు
కాలభైరవుడు! ఆలయ ప్రాంగణంలో గల ‘కాలభైరవుడు’ ఈ లింగాన్ని వెయ్యి సంవత్సరాలు భద్రంగా కాపాడుతున్నట్లు చెబుతారు. ‘కాలభైరవ నమస్తుతే’, ‘కపిలేశ్వరా నమస్తుతే’, ‘కాశీవిశే్వశ్వరా నమస్తుతే’ అనే పలుకులతో ఆదివారం పూజలుచేస్తే దోషాలు పోయి శుభం కలుగుతుందని ఇక్కడి నివాసితులు పూజలు చేస్తారు.
కొంతకాలం క్రితం ఈ మరకత శివుడు పూజాదికాలు లేక జీర్ణావస్థలో ఉన్నట్టు చెప్తారు. అపుడు సాయులు అనే భక్తుడి చిన్న కుమారుడు సతీష్‌కుమార్ (నరేష్) లింగాన్ని చూడాలన్న ఆశతో వెతుక్కుంటూ చందిప్పకు వెళ్ళి లింగాన్ని చూశాడట. ఆ శివునికి రోజు అభిషేకం చేస్తూ శివునే్న పూజిస్తుండేవారట. ఆ తర్వాత కొంత కాలానికి శంకర్‌పల్లికి చెందిన కాంట్రాక్టర్ వెంకటేశ్వరరావు-ఉమారాణి దంపతులు పునర్నిర్మాణానికి ముందుకు వచ్చారు. వీరికితోడు గ్రామపెద్దలైన శేఖర్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి లాంటి మోతుబరు లు, ఇతర గ్రామస్థులు ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2 అక్టోబర్ 2012న నూతనంగా గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, రాజరాజేశ్వరిదేవి, నందీశ్వరుల విగ్రహాలను ప్రతిష్ఠించారని ఇక్కడి నివాసితులు చెప్తారు. ఈ మరకత శివలింగానికి రుద్రాభిషేకం ప్రతిరోజు జరిపిన వారికి మోక్షం లభిస్తుందని పెద్దలు చెబుతారు.
శివుని అభిషేకాలు - ఫలాలు
ఈ మరకత శివలింగానికి నీటితో అభిషేకం చేయడమే కాక, ఆవు నెయ్యితో ఐశ్వర్యం, కుంకుమతో అర్చిస్తే ధనం, రుద్రాక్షలతో కనకం, చెరుకు రసంతో సుఖాలు, మామిడి పండ్ల రసంతో దీర్ఘవ్యాధులు, నల్లద్రాక్షతో కార్యసిద్ధి, కస్తూరితో అధికారం, కలుగుతాయని అంటారు. విద్యార్థులు ఎవరైనా ఈ శివుణ్ణి బుధవారం నాడు అభిషేకిస్తే వారికి సర్వవిద్యలూ కరతలామలకం అవుతాయని అంటారు.
ఈ మరకత శివలింగానికి బ్రహ్మీ ముహూర్తం 3 గంటల నుండి 5 గంటల లోపు అభిషేకం చేస్తే కార్యసిద్ధి జరుగుతుందని భక్తులు చెబుతారు. పౌర్ణమినాడు మరకత శివునకు అభిషేకం చేస్తే మోక్షమిస్తాడని అంటారు. ఈ ఆలయంలో శివునికి ప్రీతికరమైన నాగలింగ వృక్షం, ఉసరిచెట్టు, మారేడు వృక్షం లాంటివి ఉన్నాయ. శివలింగం ఆకారంలో ఉంటే ఈ నాగపుష్పాలతో 41వ రోజులు శివుడ్ని అర్చిస్తే వారి కోరుకున్న కోరిక ఇట్టే తీరుతుంది! ఇహ లోక సుఖాలేకాక శివ సాయు జ్యాన్ని పొందుతారని స్థల పురాణం చెబుతుంది. సుబ్రహ్మణ్యస్వామి నాగుపాము రూపంలో ఇక్కడే ఎన్నో ఏళ్లుగా నివాస ముంటూ అప్పుడప్పుడూ భక్తులకు దర్శనమిస్తుంటాడు.
ఇంకా నేటికీ కూడా ఈ శివాలయాన్ని అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉందని ఇక్కడికి వచ్చే భక్తులు అంటారు. ఎక్కడెక్కడినుంచో వచ్చే మరకతశివుణ్ణి దర్శించుకోవాలనుకొనే భక్తులకు నయనానందకరమైన ప్రకృతి ఆనందాన్నిస్తుంది.

- ఎస్. నాగలక్ష్మి