ఎడిట్ పేజీ

కమిటీలకు కాలదోషం... నివేదికలు నిష్ఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోలు పోయి డోలు వస్తే సంబడమే! మరి డోలు పోయి తోలే మిగులుతే.. అటు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఇటు ఇరు తెలుగు రాష్ట్రాల్లో విద్యాపరంగా జరుగుతున్న పరిణామాలు ఇవే! జాతీయ విద్యావిధానం పేరున మోదీ ప్రభుత్వం ముందు సుబ్రహ్మణ్యం కమిటీని వేసింది. ఆ కమిటీ ఓ నివేదికను ఇచ్చింది. ఆ నివేదిక అటకెక్కింది. సంబంధిత మంత్రిణి శాఖ మారింది. తిరిగి కొత్త మంత్రి, కస్తూరి రంగరాజన్ నేతృత్వంలో మరో కమిటీ. ఈ కమిటీ మొన్నటి డిసెంబర్ చివరి నాటికి నివేదికను ఇవ్వాలి. కాని, సంబంధితులతో (Stake holders) ఇంకా చర్చలు జరగాలని, మరి కొంత సమయం కావాలని కోరితే వచ్చే మార్చి నాటికి కేంద్రం సమయాన్ని పొడిగించింది. రంగరాజన్ ప్రకారం ఆ నివేదిక వస్తే, గిస్తే ముందు ఏడుకొండలవాడికి చూపినంకనే మోదీజీకి సమర్పించడం జరగవచ్చు! దాని సాధ్యాసాధ్యాలపై వచ్చే ఎన్నికలే సమాధానం కావచ్చు!
ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వయం పోషక స్వతంత్ర పాఠశాలల చట్టం 2017 పేరున ఏకంగా ఓ చట్టానే్న తేవడం, కొన్ని జిల్లాల విద్యా రంగాన్ని బాబాలకు అంకితం చేయడం జరిగిపోయాయి. మున్సిపల్ విద్యారంగం ఓ మురికికూపంగా మారిపోయింది. ఇటు తెలంగాణ ప్రభుత్వం విద్యాపరంగా ఉద్యమ కాలంలో ఆశల బీజాల్ని చల్లింది. కాని, అవి మొలకెత్తి చిగురించి కలుపుమొక్కలుగా ఎదుగుతున్నాయి. విద్యారంగంలో వేళ్ళూనుకున్న విషపు మొక్కల ఏరివేతకు బదులుగా, మరిన్నికలుపు మొక్కలు తోడుకావడం విద్యార్థుల తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తున్నది. వీటి విషబీజాలు పిల్లల పాలిట శాపంగా, ప్రాణాల్ని హరించే వాయువుగా మారుతున్నాయి. దీన్ని నియంత్రించడానికి (నిర్మూలించడానికి కాదు) తిరుపతిరావు కమిటీని ఎనిమిది నెలల క్రితం ఏర్పాటుచేస్తే, ఆరుసార్లు వాయిదా తీసుకొని కొత్త సంవత్సర కానుకగా ఫీజుల్ని ప్రైవేట్ పాఠశాలలే పెంచుకునే హక్కును ధారాదత్తం చేశాడు. దీంతో సరళతరం కావాల్సిన సమస్య మరింత జఠిలంగా మారింది. పైగా తానే ఓ పాలకుడిగా, నివేదికలో ఎలాంటి మార్పులు జరపమని, జరగవని తెలిపితే, పరాన్నజీవిలా మంత్రి పదవిని నిర్వహిస్తున్న కడియం ఫీజుల విషయంగా నిర్ణయం తీసుకుంటాడని, కెటిఆర్ మాట్లాడడం పుండుపై కారం చల్లిన చందంగా వుంది.
పెన్నివైస్ - పౌండ్ ఫూలిష్ (penny wise pound foolish)

ఈ ఆంగ్ల సామెతలా హైదరాబాద్ పాఠశాలల తల్లిదండ్రుల (HSPA) సంఘం వ్యవహారం తయారైంది. పేరులో పేరుకు అన్ని పాఠశాలల అనే అర్థాన్నిస్తుంది. కాని, ఇది ప్రాతినిధ్యం చేసేది మాత్రం కేవలం కార్పొరేట్ శక్తుల్లో నడుస్తున్న పాఠశాలల్లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులకే పరిమితంగా పనిచేస్తున్నది. ఇందులో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల తల్లిదండ్రుల ఊసే లేదు. కాబట్టి, ముందు వీరు కార్పొరేట్ పాఠశాలల తల్లిదండ్రుల సంఘంగా మార్చుకోవాలి. దీనికి భిన్నంగా వీరు అన్ని పాఠశాలల స్థితిగతుల గూర్చి, వాటి బాగోగుల గూర్చి, నిర్వహణ గూర్చి మాట్లాడితే ఈ రోజు విద్యారంగ పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదు. పైగా ఈ తల్లిదండ్రుల సమూహంలో దాదాపు 50 శాతానికిపైగా కార్పొరేట్ రంగానికి కొమ్ముకాస్తున్న వారు కాగా, మరో 25 శాతం కార్పొరేట్ స్థాయి జీతాల్ని పొందుతున్న వర్గాలే! వీరికి పాఠశాల ఫీజుల సమస్యగాని, డొనేషన్ల బెడదగాని దరిరాదు. పైగా ప్రైవేట్‌లోనే, కార్పోరేట్ వెలుగులతోనే తమ బుడతలకు బంగారు, డైమండ్, ప్లాటినమ్ భవిష్యత్తు దాపురిస్తుందని భావించే బాపతు వీరు. ఇక మిగతావారు ఉట్టికి, స్వర్గానికి ఎదగలేక, ఎదగాలనే తపనతో జాతీయ స్థాయి కూడాకాదు, అంతర్జాతీయ స్థాయి కరికులం (పెడగాజీ నిబంధనలకు విరుద్ధంగా) భ్రమల్లో విహరిస్తూ తమ పిల్లల్ని కూడా బంగారు కడ్డిల్లా తీర్చిదిద్దాలని భావిస్తున్నవారిదే అసలు సిసలైన సమస్య. పై సంస్థలో వినిపిస్తున్న గొంతు కూడా ఈ బాపతువారిదే!
పై స్థాయికి ఎదగాలనడంలో తప్పులేదు. కాని, ఉన్న స్థాయిని పట్టించుకోక, అంటే ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసి, అదో అంటరానిదానిగా భావిస్తూ ఊహల పల్లకిలో ఊరేగాలనుకోవడం, దీనికై ప్రభుత్వం స్పందించి విధి విధానాల్ని రూపొందించాలనుకోవడమే అసమంజసం కాదా? ప్రభుత్వ విద్యా రంగాన్నుంచి మెల్లిమెల్లిగా తప్పుకుంటూ, మొత్తంగా ప్రైవేటీకరణకై మొగ్గుచూపుతూ ప్రైవేట్ రంగంలోనే విద్య బాగుందని ప్రచారం చేస్తూ, అక్కడ చదువుతేనే రేపటి తరం విదేశీ వలసలకు అవకాశం కల్గుతుందని బాహాటంగా తెలుపుతున్న ప్రభుత్వాన్నుంచి, ప్రైవేట్, అందునా కార్పొరేట్ పాఠశాలల నియంత్రణను ఆశించడమే ఓ తప్పుడు ఆలోచన! ఈ వర్గమంతా, ప్రభుత్వ విద్యను కాపాడుకోవాలనే కించిత్తు ఆలోచన చేస్తే ఈ ఫీజుల భారం వుండదుగా! వీరు చెల్లించే ఫీజుల్లో కనీసం పదిశాతాన్ని స్థానిక ప్రభుత్వ పాఠశాలలకు ఖర్చు చేసినా (నిజానికి ఇది ప్రభుత్వ బాధ్యత), కమిటీలుగా ఏర్పడి పర్యవేక్షణ చేసినా, గతంలో కన్నా మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలలు నడుస్తాయి. అప్పుడు విధిగా ప్రభుత్వం ఉపాధ్యాయుల నియామకం చేయాల్సి వస్తుంది. వౌలిక వసతుల్ని కల్పించాల్సి వస్తుంది. ఉభయ తారకంగా ప్రభుత్వ బాధ్యతల్ని గుర్తింపజేసినట్లుగా, తప్పించుకోకుండా జాగ్రత్తపడినట్లుగా వుండడమే కాక, తల్లిదండ్రులు కోరుకుంటున్న (నాణ్యత అనే పదానికి పెడగాజిలో అర్థమే లేదు) ఉల్లాసభరితమైన విద్య పిల్లలకు అందుతుంది. దీంతో శిక్షణ పొందిన ఉపాధ్యాయులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
ఇలా ప్రభుత్వ విద్యా విధానాన్ని ఎదిగిస్తే, కార్పోరేట్ రంగం ఏదో ఒక దశలో ఆగిపోతుంది. ఈ భ్రమల్లో వున్నవారు కూడా తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలవైపు తిప్పుతారు. ఓ పదిశాతం సమాజపు ఉచ్చునుంచి మిగతా సమాజం బయటపడుతుంది. ఓ వస్తువు ఉత్పత్తి అవుతే, అందరు వినియోగిస్తేనే దానికి లాభాలు వస్తాయన్నట్టు, కార్పోరేట్ పాఠశాలలకు అత్యధిక వర్గాల పిల్లలు వస్తేనే కోట్లకు పడగెత్తుతారు. దీన్ని నియంత్రణ చేయాల్సిన అవసరం వుంది. ఈ దిశగా తల్లిదండ్రుల సంఘం పనిచేయగలగాలి.
రేటింగ్ - అవార్డులు
కార్పోరేట్ పాఠశాల సంస్కృతి మనసును దోచడం కాదు, తల్లిదండ్రుల్ని పిచ్చివాళ్లను చేస్తున్నది. ముఖ్యంగా హైదరాబాద్‌లో, చుట్టుప్రక్కల శివారు ప్రాంతంలో వెలసిన ఈ విష వృక్ష పాఠశాలలకు ఈమధ్యన మరో కార్పోరేట్ ఆంగ్ల మాథ్యమ పత్రిక స్వయాన నడుము బిగించి రేటింగ్‌ను ఇవ్వడం ప్రారంభించింది. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ నడిబొడ్డు పాఠశాలలంటూ విభజించి, అంతర్జాతీయ, జాతీయ స్థాయి కరికులం పేరున లేబుళ్ళను తగిలించి గ్రేడింగుల్ని ఇవ్వడం జరుగుతున్నది. అలాగే ప్రీ ప్రైమరీ పాఠశాలలకు బ్యూరోక్రాట్లచే, రాజకీయ నాయకులచే అవార్డుల్ని ప్రదానం చేయిస్తున్నది. తమ పిల్లలు చదువు వెలగబెడుతున్న పాఠశాలు ఆ జాబితాలో, అవార్డుల పందేరంలో వున్నాయో లేదో చూసుకోవడం, వుంటే ఏ ప్రాధాన్యతాక్రమంలో వున్నాయో తెలుసుకొని సంబరపడడం జరుగుతున్నది. అనుకోకుండా సంబంధిత పాఠశాల ఆ జాబితాలో కనపడకుంటే, నిరుత్సాహపడి, వచ్చే విద్యా సంవత్సరంలో రేటింగ్ పాఠశాలలకే పంపాలనే నిర్ణయానికి వస్తున్నారు. తీరా లక్షలు కుమ్మరించి పాఠశాలను మార్పిస్తే, ఆ పాఠశాల రేటింగ్ వుంటుందా, వూడుతుందా, లేక దిగజారుతుందా తెలియదు. సదరు తల్లిదండ్రులకు, పాఠశాలలకు గ్రేడింగ్ ఏంటి అనే ఆలోచనే రాకపోవడం మరో విడ్డూరం!
పోనీ ఈ గ్రేడింగ్‌లు ఏ ప్రాతిపదికన ఇచ్చారు, అందులో పనిచేసే ఉపాధ్యాయుల జీతభత్యాలు, విద్యార్హతలు, బోధన విధానాలు, వారి మానసిక స్థితి, మానవీయ కోణం, అన్నింటికి మించి వారి వ్యక్తిగత సాధికారిత లాంటి అంశాలు ఏమైనా పరిగణనలోకి తీసుకున్నారా అంటే అది ఎక్కడా కనపడదు. పోనీ విద్యార్థుల్ని అడిగారా, అడిగితే ఓ పాఠశాల గూర్చి స్పందించే స్థాయి విద్యార్థులకు నిజంగా వుందా అనేది మరో ప్రశ్న! ఆ గ్రేడింగ్‌లలో కనపడింది మాత్రం, అవి అనుబంధంగా వున్న బోర్డులు, వారికి ఇష్టం వచ్చినట్లుగా నిర్ణయించుకున్న కరికులం, బిల్డింగు సోయగాలే! ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ నాలుగు గోడల మధ్యన ఏం జరుగుతున్నదో, పిల్లల మానసిక, శారీరక పరిస్థితి, అనుభూతి ఏంటో ఎక్కడా విశే్లషణ లేదు. అసలు ఇవి వుండాల్సిన అంశాలనే విషయం తల్లిదండ్రులకు తెలియదు. నిర్వాహకులకు పట్టింపు లేదు. రేటింగ్ ఇచ్చిన మధ్యవర్తికి లేదు. విద్యను ఓ వ్యాపార సరుకుగా, పిల్లల్ని మరబొమ్మల్లా చూసే ఆలోచనలే ఇలాంటి గ్రేడింగ్‌లకు అవార్డులకు ఆస్కారాన్ని కల్గించాయి.
పిల్లల దృష్టికోణం కావాలి!
తమదంతా దరిద్రపుగొట్టు చదవని, తమని తల్లిదండ్రులు వున్న ఊర్లో, ఉన్నదాంట్లో చదివించారని న్యూనతాభావనకు గురవుతూ, తమకన్నా పిల్లలకు ఇలాంటి దుర్గతి రావద్దనుకోవడంలోనే నేటి తల్లిదండ్రుల మూర్ఖత్వం దాగివుంది. నిజానికి నిన్నటి తరం తల్లిదండ్రుల పెంపకం, అందించిన విద్య సంస్కారవంతమేకాక, సామాజికపరమైంది. అందుకే ఈనాడు హాయిగానే బతకగలుగుతున్నారు. కాని, డాలర్ల వేట అనే ఓ చీకటి కోణం వెంటాడి, పిల్లల్ని పిల్లలుగా ఎదగనీయకుండా, ఓ అస్తవ్యస్త సమాజానికి నారు పోస్తూ నీరు పోస్తున్నామని గ్రహించడం లేదు. దీన్ని గుర్తిస్తే తప్ప, పిల్లలకు విద్య పేరున ఎంత అన్యాయం జరుగుతుందో అర్థం కాదు. ఇవి అర్థమైతే, ఫీజుల్ని నియంత్రించాలనే గొంతు మార్చి, ప్రభుత్వ విద్య బాగుపడాలని, అందులోనే తమ పిల్లలు వికసించాలని కోరుకుంటారు.. ఆరాటపడతారు. ఇది జరగాలని, ఆలోచించే ప్రతివారూ జరిగేలా చూడాలని ఇప్పుడన్నా కోరుదాం!

- డా. జి.లచ్చయ్య సెల్: 94401 16162