మెయన్ ఫీచర్

న్యాయస్థానాల్లో తెలుగు అమలు సాధ్యమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగుభాషకు పట్టం కడుతూ ఇటీవల జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు నేపథ్యంలో హైకోర్టులో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఎక్కువగా ఇంగ్లీషులోనే వాదనలు ఉండే కోర్టులో తెలుగులో వాదనలు వినిపించాయి. అందుకు న్యాయవాది సోమరాజు చేసిన విజ్ఞప్తిని గౌరవ న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర రెడ్డి అంగీకరించారు. భూ సేకరణ వివాదం కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహాయ న్యాయవాది సోమరాజు తెలుగులో తమ వాదనలు వినిపించి ఆకట్టుకున్నారు. వాదనలు పూర్తయ్యాక న్యాయమూర్తి తీర్పును వెలువరించి సమస్యను పరిష్కరించారు. తెలుగులో వాదనలు వినిపించిన న్యాయవాది సోమరాజును న్యాయవాదులు అభినందించారు. ఇలాంటి మెరుపులు తెలుగుభాష స్థితిగతులపై నిరంతరం యోచిస్తున్న వారికి సంతోషాన్ని కలిగించే విషయమే అయినా, విశిష్ట్భాష హోదా దక్కించుకుని దశాబ్దం పూర్తయినా ఆ దిశగా మనం సాధించింది ఏమీలేదనే బాధ మాత్రం తప్పడం లేదు. ‘నేషనల్ జాగ్రఫిక్ సొసైటీ లివింగ్‌టన్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఎన్‌డేంజర్డ్ లాంగ్వేజెస్’ ఇచ్చిన సంయుక్త సర్వేక్షణ నివేదికలో తెలుగు భాష గురించి కూడా ప్రస్తావన ఉంది. తెలుగుభాష వినియోగం తగ్గితే భవిష్యత్‌లో మృతభాషల్లో చేరే ప్రమాదం ఉందనేది ఈ నివేదిక సారాంశం. వాస్తవానికి ఇప్పటికపుడు తెలుగుభాషకు వచ్చిన ముప్పేమీ లేకున్నా గత కాలపు మధురస్మృతులతో గడిపేయడమేనా లేక నిరంతరం అన్ని భాషలూ అభివృద్ధి చెందుతున్నట్టు తెలుగుభాష విలసిల్లాలని కోరుకోవడమా?
భాషా వికాసాన్ని ఎవరు కాదంటారు? కాని అందుకు ప్రజలు, భాషాభిమానులు, వ్యవస్థలు, సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశ్నార్ధకంగా మారింది. మీరంటే మీరు అనుకుంటూ ఇంతకాలం గడిచిపోయింది. ఆనాటి ప్రధాని పివి నర్సింహరావు మొదలు ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు వరకూ రాజకీయ నాయకుల్లో సైతం తపన ఉన్నా అందుకు తగ్గ కార్యాచరణ కొరవడుతోంది.
రాష్ట్ర సచివాలయం మొదలు, గ్రామ సచివాలయంలో వరకూ తెలుగులోనే కార్యకలాపాలు జరగాలని, న్యాయస్థానాల్లో వాదోపవాదాలు, తీర్పులు కూడా తెలుగులోనే ఉండాలని, తెలుగు భాషలోనే విద్యాబోధన కొనసాగాలని, అది సాధ్యం కాకపొతే కనీసం తెలుగు పాఠ్యగ్రంథంగా, భాషగా తప్పనిసరి చేయాలని, తెలుగులో చదివిన వారికి ప్రత్యేక అదనపు అర్హతగా గుర్తించాలనేదే చిరకాల వాంఛ.
ఈ ఏడాది నుండి తెలుగును తప్పనిసరి భాషగా నేర్చుకోవాలనే నిబంధనను తెలంగాణ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది, ఆంధ్రప్రదేశ్ సైతం అదే దిశగా యోచిస్తోంది. ఇక న్యాయస్థానాల విషయానికి వస్తే అడపాదడపా తీర్పులు తెలుగులో వస్తున్నాయి.
ఒక హత్య కేసుకు సంబంధించి తెలుగులోనే తొలితీర్పును ప్రకటించి ఆనాటి గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదిత్య భాంజ్‌దేవ్ న్యాయచరిత్రలో తనకంటూ ఒక పుట రాసుకున్నారు. ఆ తర్వాత కూడా ఆయన కార్మికశాఖ తీర్పులను, నేర విభాగానికి సంబంధించి తీర్పులను, సివిల్ కేసుల్లోనూ తెలుగులోనే తీర్పులను ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత కూడా నిజామాబాద్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి మంగారి రాజేందర్ తెలుగుభాషలో తీర్పును వెలువరించి ప్రభుత్వ కార్యకలాపాలు తెలుగులో నడవడానికి మార్గదర్శనం చేశారు. 2002 ఫిబ్రవరి 19న ఆయన తెలుగులో తీర్పు వెలువరించారు. తిరిగి అదే ఏడాది ఫిబ్రవరి 23న మరో కేసులో తెలుగులోనే తీర్పు చెప్పారు. 2016 ఆగస్టు 29న చిత్తూరు జిల్లా పుంగనూరు న్యాయస్థానంలో తెలుగు భాషలోనే న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. 2017 డిసెంబర్ 18న హుజుర్‌నగర్ సీనియర్ సివిల్ జడ్జి జయంతి ప్రామిసరీ నోటు దావా కేసులో తీర్పును తెలుగులో స్వయంగా టైపుచేసి వెలువరించారు. గతంలో న్యాయమూర్తి జయంతి కోదాడ జూనియర్ సివిల్ జడ్జిగా ఉన్న రోజుల్లో కూడా ఓ క్రిమినల్ కేసులో తెలుగులోనే తీర్పును వెలువరించారు.
1979లో నంద్యాల మున్సిఫ్ మెజిస్ట్రేట్ ఖాదర్ మొహియుద్దీన్ తెలుగులోనే తీర్పు చెప్పారు. 1980లో కూడా పలు కోర్టుల్లో న్యాయవాదులు తెలుగులోనే తమ వాదనలు వినిపించారు.
1981లో తొలిసారి న్యాయస్థానాల్లో తెలుగు ఎందుకు అమలు కావడం లేదని ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. 1982లో మున్సిఫ్ కోర్టుల్లో తెలుగు వాడాల్సిందేనని ఆదేశించింది. 2008లో అందుకు సంబంధించి మరోమారు ఉత్తర్వులు ఇచ్చినా ఫలితం శూన్యం.
కృష్ణా జిల్లా వినియోగదారుల మండలి వివాదంలో న్యాయమూర్తి అనూరాధ తెలుగులోనే తీర్పు వెలువరించారు. శ్రీకాకుళం జిల్లా న్యాయమూర్తి పద్మ నాలుగు తీర్పులను తెలుగులోనే వెలువరించారు. ఖమ్మం జిల్లా సత్వర న్యాయస్థానం న్యాయమూర్తి కళ్యాణ్‌రావుకూడా హత్య కేసుకు సంబంధించి తీర్పును తెలుగులో చెప్పారు. నాంపల్లి న్యాయస్థానానికి చెందిన న్యాయమూర్తులు కోకా రాధాదేవి, శైలజలు తెలుగులోనే తీర్పులు చెప్పారు.
న్యాయపాలన తమ మాతృభాషలో ఉంటేనే ప్రజలకు నమ్మకం పెరుగుతుందని, న్యాయవ్యవస్థ స్థానిక భాషల్లోనే పనిచేయాలని ఐక్యరాజ్యసమితి 1956 నివేదికలో పేర్కొంది. విచిత్రం ఏమంటే ఆంగ్లేయుల పాలనలో న్యాయస్థానాల్లో వాదోపవాదాలు తెలుగులోనే జరిగేవి. 1874లో అప్పటి కోర్టులు తెలుగులోనే తీర్పులు ఇచ్చాయి. తెలుగు భాషాభిమాని అప్పటి కలెక్టర్ సిపి బ్రౌన్ స్వయంగా తెలుగులోనే తీర్పు ఇచ్చారు. అవిభక్త మద్రాసు రాష్ట్రంలో న్యాయస్థానాల్లో తెలుగు ఉపయోగించమని మద్రాస్ హైకోర్టు సూచించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తెలుగులో తీర్పులు ఆగిపోయాయని చెప్పాలి.
న్యాయస్థానాల్లో ఏ భాష వాడాలన్న అంశంపై స్పష్టమైన నియమావళి ఉంది. లా కమిషన్ ఆదేశాల ప్రకారం ఉన్నత న్యాయస్థానాలైన సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఇంగ్లీషులోనే న్యాయమూర్తులు తీర్పులు చెప్పాల్సి ఉంటుంది. వాదోపవాదాలు ఇంగ్లీషులోనే సాగించాలి. రాష్ట్ర న్యాయవ్యవస్థ ఆధీనంలోని జిల్లా కోర్టులు, అదనపు జిల్లా కోర్టులు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు, జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు, సబార్డినేట్ కోర్టులు, మున్సిఫ్ కోర్టుల్లో ఆయా రాష్ట్రాల మాతృభాషలను వినియోగించాలి. అంటే తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రాలో న్యాయమూర్తులు తెలుగులోనే వాదనలు, తీర్పులు కొనసాగించవచ్చు. ఇప్పటికే కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ఆయా మాతృభాషల్లోనే పరిపాలన నిరాటంకంగా సాగుతోంది.
వాస్తవానికి 1974లో ప్రభుత్వం జీవో 485ను విడుదల చేసింది. దీని ప్రకారం కింది కోర్టుల్లో వాద ప్రతివాదనలు, తీర్పులూ మాతృభాషలోనే ఉండాలనేది ప్రభుత్వ ఆదేశం. ఈ ఉత్తర్వులు వెలువడి 44 ఏళ్లు గడిచింది. ఇంతవరకూ దాని అతీగతీ లేకుండా పోయింది. అంతకుముందు కూడా 1962, 1965లో ఇదే తరహా ఉత్తర్వులను ప్రభుత్వం ఇచ్చింది. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని ఆ దిశగా ప్రయత్నిస్తాయనే ఆశలు రేకెత్తుతున్న సమయంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో అడియాశలయ్యాయి.
రాష్ట్రాల అధికార భాషల ప్రతిపత్తిపై 2014 సెప్టెంబర్ 7న సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక తీర్పు వెలువరించింది. దేశ ప్రజలకు భాషల ఎంపికలో సంపూర్ణ స్వేచ్ఛ ఉందనీ, ఆయా రాష్ట్రాల్లో ఉండే స్థానిక భాషలను ప్రజల సౌకర్యార్థం అధికార భాషలుగా ప్రకటించుకుని అమలు చేసే హక్కు ఉందని ఆ తీర్పులో ధర్మాసనం స్పష్టం చేసింది. అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు, ప్రకటనలకు ఆ భాషనే ఉపయోగించాలి. కానీ రాష్ట్రాల అధికార భాషలనూ ముఖ్యంగా రాజ్యాంగంలోని 8వ షెడ్యూలు గుర్తించిన భాషలనూ విద్య, పాలనా వ్యవహారాల్లో విరివిగా ప్రవేశపెట్టి ప్రజలకు ప్రయోజనం చేకూర్చాల్సిన దశలో హైకోర్టు, సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో ప్రతికూల వ్యాఖ్యల కారణంగా పరిస్థితి మరింత దిగజారిందని చెప్పవచ్చు.
రాష్ట్రాల విభజన సమయంలో రాష్టప్రతి ఒక భాషను అధికారిక భాషగా ప్రకటించాలన్న నిబంధన ఉన్నంతకాలం మాతృభాషలకు పూర్తి న్యాయం జరిగే పరిస్థితి కనిపించడం లేదు. రాష్ట్రాలు అమలు చేయాల్సిన భాషల గురించి రాష్టప్రతి ‘సంతృప్తికి లోబడే ’ అధికార భాషగా ప్రకటించాలన్న నిబంధన అది. 1951నాటి ఉత్తరప్రదేశ్ అధికార భాషా చట్టానికి 1989లో ఒక సవరణ తెచ్చింది. ఈ సవరణ చెల్లదని ఉత్తరప్రదేశ్ సాహిత్య సమ్మేళన్ వాజ్యం దాఖలు చేసింది. దానిని విచారించిన తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇది. తమ నిర్ణయం రాజ్యాంగంలోని 345 అధికరణకు లోబడి ఉన్నదేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అధికార కార్యకలాపాలకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ భాషలను వినియోగించుకునే అంశం మీద శాసనసభలు నిర్ణయం తీసుకోవచ్చనేది ఆ అధికరణం చెబుతోంది. 345 అధికరణంలో కనిపించే ‘హిందీ’ ప్రస్తావన రాష్ట్రాల మధ్య అనుసంధానంగా వినియోగించుకోవడానికి సంబంధించే తప్ప ఆయా రాష్ట్రాల్లో ఉన్న స్థానిక భాషలను శాసించేందుకు కాదని కూడా సుప్రీంకోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లోథా అధ్యక్షతన ఏర్పాటైన ధర్మాసనం వివరణ ఇచ్చింది. ఈ దృష్ట్యా యుపీ శాసనసభ అధికార భాష హిందీతో పాటు ఉర్దూను రెండో అధికార భాషగా ప్రవేశపెట్టింది. అదే విధంగా ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కూడా అమలులో ఉంది. రెండో అధికార భాషగా ఉర్దూ చెలామణిలో ఉంది. ఆ భాషకు దక్కిన ప్రాధాన్యత కూడా తెలుగుభాషకు దక్కడం లేదనేది అభిమానుల వేదన.
ప్రభుత్వ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించే పరీక్షల్లో తెలుగుమాధ్యమంలో రాసే అభ్యర్ధులకు ఐదు శాతం మార్కులను కేటాయించాలంటూ వచ్చిన పిటీషన్‌పై అప్పటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీనిని సవాలు చేస్తూ తెలుగేతర అభ్యర్ధులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఆ తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. స్థానిక భాషల వినియోగంలో తలెత్తిన గందరగోళానికి సంబంధించి లా కమిషన్ కూడా కొంత బాధ్యత వహించాలనే చెప్పాలి. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఇంగ్లీషుకు తప్ప ఇతర భాషలకు ప్రాధాన్యం ఇవ్వరాదని లా కమిషన్ భావన. నిజానికి రాజ్యాంగం చలామణిలోకి వచ్చిన 15 ఏళ్ల తర్వాత మాతృభాషల ప్రతిపత్తిని సమీక్షించేందుకు జాతీయ కమిషన్‌ను విధిగా నియమించాలనే ఆదేశం ఉన్నా 1955లో తొలి కేంద్రీయ అధికార భాషా సంఘం ఏర్పడిన తర్వాత 1960 ఏప్రిల్‌లో ఏర్పడాల్సిన రెండో కేంద్రీయ అధికార భాషా సంఘం అసలు వెలుగు చూడలేదు. ఉత్తరప్రదేశ్(1970), మధ్యప్రదేశ్, రాజస్థాన్(1983), బీహార్, అలహాబాద్, పాట్నా, జోద్‌పూర్ తదితర హైకోర్టుల్లో హిందీ భాషలో వాదనలను అనుమతిస్తున్నపుడు మన హైకోర్టుల్లో తెలుగులో వాదనలు అనుమతించడానికి ఇబ్బంది ఏమిటి?
న్యాయవ్యవస్థల్లో తెలుగు వాడకంపై 2013 ఫిబ్రవరి 10న హైదరాబాద్ జూబ్లీహాలులో సమీక్ష జరిగింది. 2015 ఫిబ్రవరిలో విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో కూడా పలువురు న్యాయమూర్తులు తెలుగు వాడకంపై ఖచ్చితమైన అభిప్రాయాలు చెప్పారు. తమిళనాడు హైకోర్టులో తమిళం అమలుకు ఆ ప్రభుత్వం కేంద్రానికి అనేకమార్లు విజ్ఞప్తి చేసింది. అయినా కేంద్రం నుండి సానుకూల స్పందన రాలేదు. దీనికి కారణం వివిధ శాస్త్ర సాంకేతిక పరిభాష, సామాజిక శాస్త్రాల్లో పదబందాలకు సరైన పదాలు ఆయా ప్రాంతీయ భాషల్లో రూపొందకపోవడమే. ఆంగ్లం ఎంత సంక్లిష్టమో, అర్ధంకాని కొన్ని తెలుగు పదాలు కూడా సామాన్యులకు అంతే సంక్లిష్టం అనేది వారి భావన. భాష ఎదిగి జనసామాన్య పదాలు వాడుకలోకి వచ్చినపుడు న్యాయస్థానాల్లోనే కాదు, ఎక్కడైనా తెలుగు వాడకాన్ని ఎవరూ అడ్డుకోలేరనేది నిస్సందేహం.

-బి.వి.ప్రసాద్