మెయన్ ఫీచర్

గాయపరుస్తున్న చైనా గాలిపటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశాన్ని ముంచెత్తుతున్న చైనా వారి ‘ప్లాస్టిక్ పతంగ్’లు ‘వాణిజ్య ప్రపంచీకరణ’ - గ్లోబలైజేషన్ - దురాక్రమణకు సరికొత్త ప్రతీకలు. ‘పతంగ్’- గాలిపటం - ఎగరవేయడం అనాది సంప్రదాయం, ప్రకృతిని పూజించే మాధ్యమం! ప్రకృతి ఆరాధన వేద సంస్కృతి, ప్రకృతిని పరిరక్షించడం సనాతన హైందవ జాతీయ సంస్కారం.. పుట్టను, చెట్టును, చెఱువు గట్టును, కొండ గుట్టను, అడవి మిట్టను పూజించడం ప్రకృతి కంటే మానవుడు సృష్టి కంటె సమాజం భిన్నం కాదన్న సహజ వాస్తవానికి యుగయుగాల ధ్రువీకరణ! మకర సంక్రాంతి పండుగ ఈ ప్రకృతి సమారాధనతో ముడివడిన స్వజాతీయుల సమష్టి అంతరంగం.. విశ్వప్రస్థాన పథంలో పునరావృత్తం అవుతున్న సమోజ్వల ఘట్టం, పగటి నిడివిని పెంచి ఉత్తరార్థ గోళాన్ని వెలుగులతో ముంచెత్తగల ఖగోళ విప్లవం.. సృష్టిగత వాస్తవాలను జీవన సంప్రదాయాలుగా మలచుకున్న భారతీయులు అందువల్లనే ప్రకృతిని ఆరాధిస్తున్నారు. మకర సంక్రాంతికి మొక్కులిడుతున్నారు. గాలిపటం ఈ భక్త్భివ రూపం, అనురక్త్భివ కేతనం! కానీ చైనా నుంచి కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్న ప్లాస్టిక్ గాలిపటాలు ఈ సహజత్వానికి ఛిద్రాలను పెడుతున్నాయి! ఆకాశానికి కన్నాలను పొడుస్తున్నాయి, గగనచరాలైన జీవులను గాయపరుస్తున్నాయి.. ప్రకృతిని పరిమార్చుతున్నాయి! మన దేశంలో విజ్ఞానం వినోదం ప్రాకృతిక సమతుల్య స్థితిని సంరక్షించడానికి దోహదం చేయడం చరిత్ర.. కానీ పాశ్చాత్య దేశాల నుంచి వెల్లువెత్తిన ‘ప్లాస్టిక్’ పంచభూతాలను ‘పంచభూత భాసితమైన ప్రకృతి కళ’ను పాడుచేస్తోంది! ‘ప్రపంచీకరణ’ బలపడుతున్నకొద్దీ ‘ప్లాస్టిక్’ మరింతగా విస్తరిస్తోంది. నూలుతో తయారైన ‘పటం’తోను, వృక్ష నిర్వాసములతోను, కలపతోను తయారైన ‘కాగితం’తోను మన దేశంలో గాలిపటాలు తయారయ్యాయి, తయారవుతున్నాయి! కానీ రెండు మూడేళ్లుగా చైనా నుంచి ‘ప్లాస్టిక్’ గాలిపటాలు - పతంగ్‌లు - దిగుమతి అయిపోతున్నాయి! ఈ ప్లాస్టిక్ పతంగ్‌లు చౌకగా దొరుకుతున్నాయన్న భ్రాంతికి గురి అయిన పిల్లలు వారి తల్లిదండ్రులు ఈ ‘పతంగ్’లను విరివిగా కొనేస్తున్నారట! అందువల్ల మన దేశంలోని కుటీర పరిశ్రమలలో తయారవుతున్న గాలిపటాలకు గిరాకీ తగ్గిపోతోంది. ఫలితంగా ఈ ‘కుటీర’ ఉత్పత్తిదారులు తమ వృత్తిని మానుకోవలసిన వైపరీత్యం ఏర్పడింది. ‘‘్భరత్‌లో నిర్మించండి’’ అని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి విచిత్ర వికృత వ్యతిరేక నేపథ్యం చైనా వారి ‘ప్లాస్టిక్’ గాలిపటం.. భాగ్యనగరంలోని ధూల్‌పేట ప్రాంతంలో తరతరాలుగా గాలిపటాలను తయారుచేస్తున్న ‘కుటీర’ యజమానులు కార్మికులు రెండేళ్లుగా తమ ఉత్పత్తులను యాబయి శాతానికి పైగా తగ్గించేశారట! యాబయి కుటుంబాల నిర్వాహకులు, వందలాది శ్రామికులు తమ వృత్తిని మానుకోవలసిన పరిస్థితి దాపురించి ఉంది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే! గాలిపటాల ఉత్పత్తిలో అగ్రగామి అయిన గుజరాత్‌లో కూడా ఈ కుటీర పరిశ్రమలను చైనా గాలిపటం కూల్చివేస్తోంది..
గాలిపటాలను ఎగురవేయడానికి అవసరమైన ‘సూత్రం’ - దారం - మాంజా - కూడా ‘నూలు’తో తయారుకావడం మన దేశపు సంప్రదాయం. ప్రాకృతికమైన ‘పత్తి’దారం ప్రకృతికి సుఖకరమైన స్పర్శను కలిగిస్తోంది. కానీ పదేళ్లకుపైగా చైనా నుంచి దిగబడుతున్న ‘ప్లాస్టిక్ మాంజా’తో గాలిపటాలను ఎగురవేస్తున్నారు. ఈ దారం ‘స్పర్శ’తో చిన్నారుల చేతులకు వేళ్లకు గాయాలవుతున్నాయి. విష రసాయన పూరితమైన ఈ ‘ప్లాస్టిక్’ దారం పక్షులను తాకిన వెంటనే అవి ప్రాణాలను కోల్పోతున్నాయి. చిన్న పిల్లల గొంతులకు ఈ దారం స్పర్శతో పెద్ద పుండ్లు అవుతున్నట్టు కూడా ప్రచారమైంది! ఈ చైనా ‘దారం’ ఉపయోగించరాదని తెలంగాణ ప్రభుత్వం రెండేళ్ల క్రితం నిర్థారించింది, చైనా దారాన్ని నిషేధించింది.. గత జూలైలో జాతీయ హరిత న్యాయమండలి - నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ - ఎన్‌జిటి - దేశ వ్యాప్తంగా నిషేధం విధించింది! ఈ దారాన్ని ‘గాజుపొడి’తో పదును పెడుతుండడంవల్ల పక్షుల గొంతులను మానవ దేహాలను గాయపరుస్తోంది. కానీ ఈ ‘నిషేధం’ తరువాత కూడా ఈ చైనా దారం దేశమంతటా తెగ అమ్ముడు పోతోందట. అందువల్ల సంప్రదాయ పద్ధతిలో దారం తయారుచేస్తున్న చిట్టి పొట్టి ఉత్పత్తిదారులు తమ వృత్తిని మానేశారు, మానేస్తున్నారు! ‘నిషేధం’ తరువాత కూడా చైనా దారాన్ని విరివిగా మన జనాలు కొంటుండడానికి కారణం చైనా దారం ‘కారుచౌక’గా లభిస్తుండడం! కేంద్ర ప్రభుత్వం ఈ దారం దిగుమతిని నిషేధించినపుడు మాత్రమే ‘జాతీయ హరిత న్యాయ మండలి’ ఆదేశం అమలు జరుగగలదు! ఏది చైనా దారం? ఏది స్వదేశీయ సూత్రం? అన్న విజ్ఞాన వివక్ష చిన్నపిల్లలకు వారి తల్లిదండ్రులకు లేదు. అందువల్ల ఏది తక్కువ ధరలకు లభిస్తే దాన్ని కొంటారు! అందువల్ల చైనా గాలిపటాల, చైనా దారాల దిగుమతిని ప్రభుత్వం నిషేధించాలి! ‘నిషేధం’ తరువాత కూడా ‘దొంగ రవాణా’ మాధ్యమంగా చైనా దారాలు, గాలిపటాలు చొరబడకుండా నిఘా పెరగాలి నిరోధించాలి!
వాణిజ్య ప్రపంచీకరణ ద్వారా వివిధ దేశాల ‘స్వతంత్ర సార్వభౌమ రాజ్యాంగ వ్యవస్థలు’ చెరిగిపోవాలని, సరిహద్దు సమసిపోయి ప్రపంచమంతా ‘పుడమి పల్లె’ - గ్లోబల్ విలేజ్ - గా ఏర్పడాలని పాశ్చాత్య సంపన్న దేశాలు 1990వ దశాబ్దిలో ప్రచారం చేశాయి! ‘‘ప్రవర్థమాన దేశాలలో మాత్రం ప్రభుత్వాలు ప్రజలకు ఉత్పత్తిదారులకు ఎలాంటి ‘రాయితీ’లు - సబ్సిడీలు - కల్పించరాదు’’- ఇదీ వాణిజ్య ప్రపంచీకరణ మాయాజాలంలోని ప్రధాన ‘సూత్రం’! ఈ ‘సూత్రం’ సంపన్న దేశాలకు సమానంగా వర్తించాలి, ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’ - వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ - డబ్ల్యుటిఓ - నియమావళి అలా వర్తించాలని నిర్దేశిస్తోంది. కానీ మన దేశం వంటి ప్రవర్థమాన దేశాలు, పేద దేశాలు మాత్రమే ఈ నిబంధనను ‘బుద్ధి’గా అమలు జరుపుతున్నాయి, ఉన్న రాయితీ - సబ్సిడీలను క్రమంగా తగ్గించి తుదకు రద్దుచేయడానికి యత్నిస్తున్నాయి! కాని సంపన్న దేశాల ప్రభుత్వాల వారు మాత్రం ‘సబ్సిడీ’లను రకరకాల ‘దొడ్డిదారులు’ మాధ్యమంగా కొనసాగిస్తున్నారు! ఫలితంగా ప్రవర్థమాన దేశాలలో ఉత్పాదక వ్యయం పెరిగింది, సంపన్న దేశాలలో ఉత్పాదక వ్యయం తగ్గింది! అందువల్ల మన దేశంలో కుటీర పరిశ్రమల ద్వారా తయారవుతున్న ఉత్పత్తుల ధరలకంటే, సమాన సంపన్న విదేశీయ ఉత్పత్తుల ధరలు తక్కువగా ఉన్నాయి. ఫలితంగా మన దేశపు వినియోగదారులు వేలంవెఱ్ఱిగా విదేశీయ వస్తువులను కొనేస్తున్నారు. చైనా ‘ప్రపంచీకరణ’ ద్వారా అత్యధిక స్థాయిలో అక్రమ ప్రయోజనాలను పొందుతోంది. ప్రజాస్వామ్య పారదర్శక వ్యవస్థ లేని చైనాలో ఎగుమతులపై ఉత్పత్తులపై ‘నియమావళి’కి వ్యతిరేకంగా లభిస్తున్న రాయితీలు బయటికి పొక్కడంలేదు! ఇది మొదటి వాణిజ్య వైపరీత్యం! పర్యావరణ పరిరక్షణకు, ప్రకృతి సంతులన సమన్వయ వ్యవస్థకు దోహదపడే రీతిలో వస్తువులను ఉత్పత్తి చేయడం అనాదిగా భారతీయ వికేంద్రీకృత వ్యవస్థ.. ‘ప్రపంచీకరణ’ ఈ వికేంద్రీకృత వ్యవస్థను భగ్నం చేసి, కాలుష్యం పెంచుతున్న ‘కేంద్రీకరణ’ను వ్యవస్థీకరిస్తోంది. కాలుష్యం పెంచగల రీతిలో కంటె, స్వచ్ఛతను పంచే రీతిలో ఉత్పత్తులను చేయడం ఎక్కువ ఖర్చుతో కూడిన వ్యవహారం.. ఇది రెండవ వైపరీత్యం! ఈ రెండు కారణాలవల్ల దేశంలో తయారవుతున్న ‘గాలిపటం’ కంటే, ఎగురవేసే ‘సూత్రం’కంటే చైనా పటం, చైనా దారం తక్కువ ధరలకు లభిస్తున్నాయి! ‘స్వచ్ఛ్భారత్’ను ప్రచారం చేస్తున్న ప్రభుత్వం చైనావారి ప్లాస్టిక్ గాలిపటాలవల్ల, గాజు విషాల దారంవల్ల జీవజాలం ఆరోగ్య ‘స్వచ్ఛత’కు జరుగుతున్న భయంకరమైన హానిని గురించి ఎందుకని ప్రచారం చేయరాదు?! స్వదేశంలో ఉత్పత్తి అవుతున్న ‘గాలిపటాలు’, దారం చైనా వాటికంటే తక్కువ ధరలకు లభించే విధంగా కుటీర ఉత్పత్తికారులకు ఎందుకని భారీగా ప్రోత్సాహకాలు - ఇన్‌సెంటివ్స్ - రాయితీలు కల్పించరాదు?
‘గాలిపటం’ ప్రతీక మాత్రమే! శత్రుదేశమైన చైనా మన భూభాగాలను ఆక్రమించి, మనకు అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించడమే ప్రపంచీకరణ మన నెత్తికెత్తిన వైపరీత్యం! ‘‘అతి పెద్ద భాగస్వామి’’ అని అంటే మన దేశానికి ఇతర దేశాల కంటే ఎక్కువగా చైనా ‘ఎగుమతుల’ను అంటగడుతోంది! కానీ మన దేశం నుండి చైనాకు జరుగుతున్న ఎగుమతులు అంతంతమాత్రం.. గత ఏడాది మనం చైనా వద్ద దాదాపు రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయల విలువైన వస్తువులను కొన్నాము. చైనా మన దేశం నుండి ముప్ఫయి ఐదు వేల కోట్ల రూపాయల విలువైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేసింది. అంటే మనకు దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయల వాణిజ్యపు లోటు ఏర్పడిందన్నమాట. దాదాపు పదిహేనేళ్లుగా ఇదే దుస్థితి నెలకొని వుంది! ఈ రెండున్నర లక్షల కోట్ల రూపాయలను మనం వస్తువుల రూపంలో కాక ‘విదేశీయ వినిమయ ద్రవ్యం’ - ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ కరెన్సీ రూపంలో - చెల్లిస్తున్నాము! ఫలితంగా ప్రతి ఏటా మనం ‘విదేశీయ వినిమయ ద్రవ్యం’ నిల్వలు ఈ మేరకు తగ్గుతున్నాయి, చైనా నిల్వలు ఈ మేరకు పెరుగుతున్నాయి! ప్రపంచంలోని మరే దేశం కూడా శత్రు దేశానికి ఇలా ప్రత్యక్ష ‘వాణిజ్య ఆయుధాన్ని’ అందించడంలేదు! 1988లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ మొదలుపెట్టిన ‘పథభగ్న’ - పాత్ బ్రేకింగ్- విధాన వైఫల్యానికి పరాకాష్ఠ ఇది. సరిహద్దు సమస్య మూలపడింది, అనవసరమైన హానికరమైన చైనీయ సామగ్రితో దేశం నిండిపోతోంది! ఏటా మన రక్షణ వ్యయంతో సమానమైన, జనశ్రమార్జిత ధనం ‘వాణిజ్యం’ వల్ల చైనాకు తరలిపోతోంది! చైనా ప్రభుత్వం దొంగ రవాణాను నిర్లజ్జగా ప్రోత్సహిస్తోంది. మన దేశం మాత్రమే కాదు అనేక దేశాలవారు చైనావారి ఈ వాణిజ్య బీభత్సానికి బలైపోతున్నారు. రక్తక్షీణతను అరికట్టడానికి చైనాలో ‘ఎజియావో’ అన్న సంప్రదా ఔషధం తయారవుతోంది. ఈ ఔషధంలో ఉపయోగించే ప్రధాన పదార్థం గాడిద చర్మం. గాడిద చర్మాన్ని ఉడికించడం ద్వారా ఈ మందును తయారుచేస్తున్నారట! మరణించిన గాడిదల చర్మాన్ని గ్రహించవచ్చు. కానీ ఆ చర్మం చాలదు. అందువల్ల చైనా ముఠాలు విదేశాలలో చొరబడి గాడిదలను చంపి చర్మాలను ఒలుచుకొని వెడుతున్నారు. ఆఫ్రికాలోని కెన్యాలో ఈ హత్యాకాండ తారాస్థాయికి చేరుకొనడంతో గార్ధ్భ పాలకులు బెంబేలెత్తిపోతున్నారు! గాడిదలపై వస్తువులను తరలించి ‘అద్దె’ల ద్వారా పొట్టపోసుకునే ఒక పథ సంచారికి చెందిన ఐదు గాడిదలు ఒకే వారంలో హత్యకు గురికావడంతో ఈ చైనా దుశ్చర్య గురించి ఆఫ్రికా అంతటా చర్చ జరుగుతోందట! సంప్రదాయ ఔషధాల తయారీకోసం చైనా ముఠాలు ఏళ్ల తరబడి మన దేశంలోని పెద్ద పులులను హత్య చేస్తున్నారు. పులిగోళ్లు పులి చర్మాలు కావాలట! 2014లో చైనా అధ్యక్షుడు ఝీజింగ్ పింగ్ టాంజానియా నుంచి స్వదేశానికి వెళ్లిన విమానంలోనే ఏనుగు దంతాలను దొంగ రవాణా చేయడం ప్రపంచాన్ని విస్మయపరచిన ఘటన.. భారతీయ ఔషధాల తయారీకి మూలికలు, ఓషధులు అవసరం.. చైనా మందుల కోసం జంతు హననం అనివార్యం.. ఇదీ అంతరం!

-హెబ్బార్ నాగేశ్వరరావు 9951038352