ఎడిట్ పేజీ

ఆర్థికరంగంలో అనిశ్చితి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోదీ ప్రభుత్వం తొలినుండి నిర్దుష్టమైన ఆర్థిక విధానాలను రూపొందించుకోలేకపోతున్నది. విధానపరమైన స్పష్టతకన్నా సంచలనాలకు, ప్రచారాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నది. అందువల్ల ఒక విధంగా దిక్కుతోచని స్థితిలో చిక్కుకోవలసి వస్తున్నది. గతంలో ముఖ్యమంత్రిగా మోదీ, ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించిన విధానాలను నేడు గతంలోకన్నా దూకుడుగా అమలు చేసే ప్రయత్నం చేయవలసి వస్తున్నది. ఆర్థికరంగంలో తగు అవగాహన లేనివారు లేదా స్పష్టమైన విధానపరమైన కల్పన లేనివారు ఆర్థిక విధానాలు రూపొందించడంలో కీలకపాత్రవహిస్తూ ఉండడమే అందుకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. అది నోట్ల రద్దు కావచ్చు. జీఎస్టీ అమలు కావచ్చు. లేదా ఆధార్‌కార్డులు కావచ్చు. ముందువెనుక ఆలోచించకుండా అమలుచేసే ప్రయత్నం చేసి అపహాస్యం కావలసి వస్తున్నది. ఉదాహరణకు ఆధార్ కార్డులను సర్వత్రా తప్పనిసరి చేసే ప్రయత్నం చేస్తూ ఇప్పుడు ఆత్మరక్షణలో పడవలసి వచ్చింది. ఆధార్ కార్డులు జారీ చేయడానికి ప్రభుత్వం సేకరించిన పౌరుల సమాచారానికి ఏ మాత్రం భద్రత లేదని రుజువు చేసిన ట్రిబ్యూన్ పత్రిక విలేఖరిపై కేసు నమోదు చేసిన ప్రభుత్వం నలుమూలల నుండి వెల్లువెత్తుతున్న నిరసనలతో నష్ట నివారణ చర్యలకు దిగవలసి వస్తున్నది. వచ్చిన ఆరోపణలను నిజాయితీతో పరిశీలించి లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేయకుండా ఆధార్ సమాచారం భద్రతకు ఢోకా లేదని వాదిస్తూ వచ్చారు. అయినా ఆధార్ డేటా గోప్యతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆధార్ గుర్తింపు సంస్థ (యుఐడిఎఐ) ‘వర్చువల్ ఐడి’ పేరిట ఆధార్ కార్డ్ హోర్డర్లకు ప్రత్యేక సదుపాయాన్ని ప్రకటించవలసి వస్తున్నది.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను మరింత సడలించి రెండోదశ ఆర్థిక సంస్కరణలకు కేంద్రం తెరలేపింది. సింగిల్‌బ్రాండ్ రిటైల్, నిర్మాణ రంగాల్లో వందశాతం ఎఫ్‌డిఐలను అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను గట్టెక్కించే దిశగా విదేశీ విమానయాన సంస్థలు 49 శాతం వరకు పెట్టుబడులు పెట్టేందుకూ ద్వారాలను బార్లా తెరిచింది. ఇవన్నీ బీజేపీ గతంలో ప్రకటించిన ఆర్థిక విధానాలకు పూర్తి వ్యతిరేకం. ఆర్థికంగా తన ప్రభుత్వం చెప్పుకోదగిన పురోగతి సాధించలేకపోతున్నదని ప్రధానిలో పెరుగుతున్న అసహనమే ఇటువంటి తీవ్రమైన చర్యలకు కారణంగా కనిపిస్తున్నది. ప్రభుత్వం ఎంతగా ప్రయత్నం చేస్తున్నా కీలక రంగాలలో ప్రైవేట్ పెట్టుబడులను ఆకట్టుకోలేకపోతున్నది. చమురు ధరలు గత మూడున్నరేళ్లలో నాల్గవ వంతుకు పడిపోవడంతో ఇబ్బడిముబ్బడిగా అదనపు ఆర్థిక వనరులు సమకూరినా ప్రభుత్వం తీవ్రమైన నిధుల కొరతను ఎదుర్కొంటున్నది.
ప్రభుత్వ అంచనాల ప్రకారమే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక లోటు రూ.2.6 లక్షల కోట్లకు చేరుకొనే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితులలో ఎయిర్ ఇండియా విదేశీ పెట్టుబడులకు ద్వారాలను బార్లా తెరవక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. కీలకమైన రక్షణ రంగంలో కూడా ఆ విధంగా ద్వారాలు తెరిచిన ఘనత ఈ ప్రభుత్వానికే చెందుతుంది. ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతపరంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను వ్యతిరేకిస్తుంది. ఆర్థికవేత్తల అభిప్రాయం మేరకు కూడా అందుకు మనం ఎంతగా ప్రాధాన్యత ఇస్తున్నా, అందుకోసం విదేశీ పెట్టుబడిదారులకు అనూహ్యమైన రాయితీలు కల్పిస్తున్నా మనం ఆకర్షిస్తున్న పెట్టుబడులు చాలతక్కువ. స్వదేశంలో ఉన్న వనరులను సక్రమంగా ఉపయోగించుకోగలిగితే అంతకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ప్రయోజనం పొందగలం.
విదేశీ పెట్టుబడులతోపాటు సాంస్కృతికంగా మన సమాజంపై దాడికి అవకాశం కలుగుతుంది. ఆర్థిక పెట్టుబడుల రూపంలో ఇక్కడ మతమార్పిడులకు, మన సమాజంపై సాంస్కృతికపరంగా దాడులు జరపడానికి వీలు కల్పించే ఇతరత్రా కార్యకలాపాలకుసైతం పుష్కలంగా వనరులు సమకూర్చినట్లు కాగలదు. వాజపేయి ప్రభుత్వ హయాంలో అయితే స్వదేశీ జాగరణ్ మంచ్, భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్ వంటి సంస్థలు బహిరంగంగానే ప్రభుత్వ ఆర్థిక విధానాలను వ్యతిరేకించాయి. ఆర్‌ఎస్‌ఎస్‌లో గొప్ప సిద్ధాంతకర్తగా, ద్రష్టగా పేరొందిన దద్దోపంత్ ధేంగ్డి అయితే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన ప్రదర్శనలకు నాయకత్వం వహించారు. ఒక సందర్భంగా ‘దేశ ప్రయోజనాలకు ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పనిచేస్తున్నది’ అంటూ ఘాటుగా విమర్శించారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వ విధానాలపట్ల తమ వ్యతిరేకతను బహిరంగంగా వ్యక్తం చేయకుండా పరివార్ సంస్థలను ఆర్‌ఎస్‌ఎస్ కట్టడి చేస్తున్నది. అయినా అంతర్గత సమావేశాలలో ప్రభుత్వ ఆర్థిక విధానాలపట్ల తమ వ్యతిరేకతను స్పష్టం చేస్తూనే ఉన్నాయి.
కేవలం విదేశీ పెట్టుబడులకు ద్వారాలను బార్లా తెరవడమే కాకుండా ప్రభుత్వపరంగా ఎటువంటి పర్యవేక్షణ అవసరం లేకుండా విదేశీ కంపెనీలు మనదేశంలో నేరుగా వ్యాపారం చేసే అవకాశాన్ని ఇప్పుడు ప్రధాని కల్పిస్తున్నారు. విదేశీ పెట్టుబడుల ద్వారా మోదీ ప్రభుత్వం చెబుతున్నట్లు ఆర్థికవృద్ధి రేటుతోపాటు ఉద్యోగ కల్పనకు దారితీస్తుందని వాదనలతో స్వదేశీ జాగరణ్ మంచ్ తీవ్రంగా విభేదిస్తున్నది.
వాస్తవానికి భారీ పెట్టుబడులు ఉద్యోగ కల్పనకు ఉపయోగపడవని సామాన్య పరిజ్ఞానం ఉన్న వారెవరైనా చెబుతారు. ఒక అంచనా ప్రకారం ఒక లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే 3వేల మందికి మించి అదనంగా ఉద్యోగాలు కల్పించలేము. ఆ మేరకు పెట్టుబడులను మధ్యతరహా, చిన్నతరహా పరిశ్రమలలో ఆకర్షించగలిగినట్లయితే లక్షల సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తాయి. కానీ ప్రభుత్వ విధానాలు, ముఖ్యంగా జీఎస్టీ ఇటువంటి పరిశ్రమలు ఖాయిలా పడేందుకు దోహదపడుతున్నాయి. దానితో ఉన్న ఉద్యోగ అవకాశాలే తరిగిపోతున్నాయి. ప్రభుత్వ విధానాల రూపకల్పనలో నిమగ్నమైన వారికి క్షేత్రస్థాయి వాస్తవాలపట్ల తగు అవగాహన లేకపోవడం, కార్పొరేట్ వర్గపు ప్రభావాలకు లోనవుతూ ఉండడంతో ఇటువంటి లోపభూయిష్ట విధానాలు అనివార్యం అవుతున్నాయి.
విదేశీ పెట్టుబడులు మన జాతీయ సాంస్కృతిక విలువలను నిర్వీర్యపరిచే ప్రమాదం ఉంది. మనదేశంలో వినియోగ ప్రవృత్తిని పెంపొందించి మన సాంప్రదాయ ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం చేసే ప్రమాదం ఉంది. బహుళజాతి సంస్థల ప్రాబల్యం కారణంగా స్వదేశీ ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయి, మన ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మలైన లక్షలాది మంది చిన్న వ్యాపారాలు తీవ్రంగా బాగా ప్రమాదం ఉంది. ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ, సామాజిక జీవనం చిన్నాభిన్నం అవుతుంది.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహించడం మన ఆర్థిక స్వావలంబననే ప్రశ్నించే అవకాశం ఉంది. వాస్తవానికి భారతీయ జనసంఘ్ నేతలు సిద్ధాంతపరంగా ఉదారవాద ఆర్థిక విధానాలను ప్రతిపాదిస్తూ ఉండేవారు. లైసెన్స్, పర్మిట్ రాజ్యం పోవాలని గట్టిగా కోరారు. అంతమాత్రం చేత మన జాతీయ ప్రయోజనాలను తాకట్టుపెట్టాలని కోరలేదు.
అయితే, 1991లో పీవీ నరసింహారావు హయాంలో ప్రతిపాదించిన ఉదారవాద విధానాలు ఆర్థిక సంక్షోభం నుండి బయటపడటం కోసం గత్యంతరం లేక చేపట్టిన విధానాలేగానీ వాటిపట్ల నమ్మకం ఉండి మాత్రం కాదు. మన్మోహన్‌సింగ్ వంటి వారంతా నెహ్రూ ప్రతిపాదించిన, మనదేశంలో అవినీతి, దోపిడీ, పేదరికానికి కారణమైన సామ్యవాద తరహా ఆర్థిక విధానాలను సుదీర్ఘకాలం అనుసరించినవారే కావడం గమనార్హం.
అయితే బీజేపీ అవతరించిన తరువాత విలక్షణమైన ఆర్థిక విధానాలను రూపొందించుకొనే ప్రయత్నం చేయలేదు. ప్రజాకర్షక విధానాల వెంటపడే ప్రయత్నంలో ‘గాంధేయ సామ్యవాదం’ నినాదంతో వాజపేయి బీజేపీ ప్రయాణం ప్రారంభించారు. ఆ విధానాన్ని నాటి పార్టీ అగ్రనాయకురాలైన విజయరాజే సింధియా తీవ్రంగా వ్యతిరేకించారు.
వాజపేయి ప్రధాని పదవి చేపట్టిన తరువాత ఆర్థికమంత్రి పదవికి పార్టీలో సమర్థులు ఎవ్వరు కనబడనేలేదు. జస్వంత్‌సింగ్‌ను ఆర్థికమంత్రి చేద్దామంటే లోక్‌సభ ఎన్నికల్లో ఓడి ఉండడంతో అభ్యంతరాలు ఎదురయ్యాయి. అయితే అరుణ్‌జైట్లీని ఆర్థికమంత్రిగా చేయడానికి మోదీ అటువంటి నైతిక అంశాలను పరిగణనలోకి తీసుకోలేదనుకోండి. అద్వానీ ఆర్థికశాఖ చేపట్టడానికి భయపడ్డారు. అటువంటి పరిస్థితులలో అంతకుముందు చంద్రశేఖర్ ప్రభుత్వంలో ఆ శాఖ చేపట్టిన అనుభవంగల యశ్వంత్‌సింగ్‌ను ఆశ్రయించారు.
బహుళజాతి కంపెనీలకు తలుపు బార్లా తెరవడం ఈస్ట్ ఇండియా కంపెనీ రెండోసారి దేశంలో ప్రవేశించేటట్లు చేయడంగానే సంఘ్ పరివార్ భావిస్తూ వస్తున్నది. అందుకనే పరిమితంగా మాత్రమే విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇస్తూ ఈ విషయంలో వాజపేయి ప్రభుత్వం కొంత రాజీధోరణి అవలంబించింది. కానీ మోదీ ప్రభుత్వానికి అటువంటి సైద్ధాంతిక నిబద్ధత కూడా ఉన్నట్లు కనబడటం లేదు. పెట్టుబడుల సమీకరణ, ఉద్యోగ కల్పనలో విఫలమైనట్లు విమర్శలు రావడంతో అంతకన్నా మరోమార్గం లేదు.
వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభం, ఉపాధి అవకాశాలు తగ్గిపోతూ ఉండడంతో యువతలో అసహనం పెంచుతున్నట్లు గుజరాత్ ఎన్నికల్లో తేలింది. అందుకనే వచ్చే బడ్జెట్‌లో వ్యవసాయ ఆదాయం పెంచడం పట్ల దృష్టి సారించాలని నిర్ణయించుకున్నారు. ఉపాధి అవకాశం పెంపొందించడం కోసం భారీ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నారు. 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుంటే అంతకన్నా మరోమార్గం కనబడుతున్నట్లు లేదు.
మారుతున్న పరిస్థితులు, ప్రపంచీకరణ నేపథ్యంలో అంతర్జాతీయంగా లభించే అవకాశాలను అందిపుచ్చుకోవడం కోసం విదేశీ పెట్టుబడులకు అవకాశాలు కల్పించడం తప్పనిసరి అని సంఘ్ పరివార్‌లో సహితం ఇప్పుడు చాలామంది అంగీకరిస్తున్నారు. కానీ రిటైల్‌రంగంలో వందశాతం విదేశీ పెట్టుబడులు అనుమతించడాన్ని మాత్రం జీర్ణించుకునే అవకాశాలు కనిపించడం లేదు. ముఖ్యంగా బహుళ - బ్రాండ్ రంగంలో అది ప్రమాదకరమేనన్నది భావన. చిన్నచిన్న వ్యాపారుల ఆర్థిక మనుగడ ప్రశ్నార్థకంగా మారితే దేశం మరోరకమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం లేకపోలేదు. భారతీయ ఆర్థిక వ్యవస్థకు చిన్న వ్యాపారాలు మూలస్తంభం. ఎందుకంటే వారు తమ ఉద్యోగులను ‘బానిస’ భావనతో కాకుండా విస్తరించిన తమ కుటుంబం సభ్యులుగా గౌరవిస్తూ ఉంటారు. వారి సంక్షేమంపట్లకూడా శ్రద్ధ చూపుతూ చేయూత ఇస్తూ ఉంటారు. అదే విదేశీ కంపెనీలు ఎంతో నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తూ ఉంటాయి. రాత్రికి రాత్రి వేలాదిమంది ఉద్యోగులను ఇంటికి పంపడం, వారి జీతాలలో భారీ కోతలు విధిస్తూ ఉండటం చూస్తూనే ఉన్నాం. చిన్న వ్యాపారాలే అంతరిస్తే సామాజిక అశాంతికి దారితీసే ప్రమాదం కూడా ఉంటుంది.
ఎయిర్ ఇండియాలో 49 శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించడం ద్వారా మూడున్నరేళ్లుగా వాయిదా వేస్తూ వస్తున్న ఆ సంస్థ ప్రైవేటీకరణ మోదీ ప్రభుత్వానికి సులభం కాగలదు. అయితే ఈ ప్రతిపాదనను బిఎంఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఈ విషయంలో ప్రభుత్వం ముందుకువెడితే తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కోవలిసి వస్తుందని కూడా హెచ్చరించింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న రామ్‌నాయక్ వాజపేయి ప్రభుత్వంలో పెట్రోలియం మంత్రిగా ఉండేవారు. ప్రభుత్వరంగ చమురు కంపెనీలను ప్రైవేటీకరించే ప్రభుత్వ ప్రయత్నాలను ఆయన మంత్రిగా ప్రతిఘటించారని అంటూ ఉంటారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఏవిధంగా ఉపయోగపడగలవో అనేది ఒకపక్క చర్చనీయాంశం. మరోవంక సంఘ్ పరివార్‌లో సైద్ధాంతిక ఘర్షణ దారితీసే అంశంగా మారుతున్నది.

-చలసాని నరేంద్ర 9849569050