ఎడిట్ పేజీ

యూదుల స్వభావం.. హైందవ ప్రభావం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ప్రపంచంలో దమనకాండకు బలి అయిన అన్ని మతాలవారికి అన్ని జాతులవారికి ఆశ్రయం కల్పించిన హిందూ జాతికి చెందినవాడిని కావడం నాకు గర్వకారణం.. రోము నియంతలు తమ పవిత్ర దేవాలయాన్ని పగులకొట్టి పారేసిన సమయంలో శరణార్థులై దక్షిణ భారతదేశానికి వచ్చిన శ్రేష్ఠతమ అవశేష ఇజ్రాయిలీ జాతీయులను మేము అక్కున చేర్చుకుని ఆదరించామని మీకు చెప్పడానికి నేను గర్విస్తున్నాను.. ప్రపంచానికి సహిష్ఠుతను సృష్టిగత సమన్వయాన్ని నేర్పించిన ధర్మానికి చెందినవాడను కావడం నాకు గర్వకారణం.. సహజ సహిష్ణు ప్రవృత్తి మా స్వభావం, అన్నిమతాలను సత్యానికి రూపాలని మేము సంభావిస్తున్నాము’- అని నూట ఇరవై నాలుగేళ్ల క్రితం అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన ‘ప్రపంచ సర్వమత మహాసభ’లో వివేకానంద స్వామి గుర్తుచేయడం చరిత్ర. వివేకానందుడు తన మొదటి ప్రసంగంలోనే ‘ఇజ్రాయిల్’ను ప్రస్తావించాడు.. పారశీక జాతికి హైందవ జాతీయులు శతాబ్దుల తరబడి ఆశ్రయం కల్పించిన సంగతి కూడా వివేకానందస్వామి చికాగో సభలో చేసిన ప్రథమ ప్రసంగంలో ప్రస్తావించాడు! కలియుగం 4995వ సంవత్సరంలో ఈ చికాగో సభ జరిగింది. క్రీస్తుశకం ప్రకారం అది 1893వ సంవత్సరం! అప్పటికి భారతదేశంలో విదేశీయుల దురాక్రమణ పరాకాష్ఠకు చేరుకొని ఉంది. అంధకారం అలముకొని ఉంది.. కానీ మన దేశంలో శరణార్థులుగా ఉండిన ‘యూదుల’కు దేశమే లేదు. అలాంటి దాస్యాంధకారంలో సైతం ‘వివేకానంద చంద్రుడు’ హైందవ జాతీయ స్వభావ ప్రభా కిరణాలను ప్రపంచమంతటా ప్రసరింపజేయగలిగాడు, ఈ హైందవ జాతీయ స్వభావం సార్వజనిక సహిష్ణుత, సృష్టినిహిత సమన్వయం, వైవిధ్య పరిరక్షణ, ‘నితాంత అపార భూతదయ..’! ఈ స్వభావం ఉన్నందువల్లనే భారతీయులు రెండువేల ఏళ్లపాటు ‘ఇజ్రాయిలీ’- యూదు- హిబ్రూ జాతీయులను ఆదరించారు, జిహాదీల హత్యాకాండకు గురికాకుండా పారిపోయి మన దేశానికి చేరిన అవశేష పారశీకులకు పదమూడు వందల ఏళ్లుగా భారతదేశం స్వదేశమైంది! ఈ హైందవ జాతీయ స్వభావం యూదులను ప్రభావితం చేయడం చారిత్రక పరిణామక్రమక్రమం.. వర్తమాన వాస్తవం.. పశ్చిమ ఆసియా చివర, మధ్యధరా సముద్ర తీరంలోని ప్రాచీన యూదు సీమలో 1948లో మళ్లీ స్వతంత్ర యూదు దేశం ఏర్పడిననాటి నుంచి ఈ వాస్తవం ప్రస్ఫుటిస్తోంది, ఇజ్రాయిల్‌లో ‘సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థ’ ఏర్పడి ఉండడం ఈ వాస్తవం! సర్వమత సమభావం అనాదిగా భారత జాతీయ స్వభావం, 1948 నుంచి ‘ఇజ్రాయిల్ స్వభావం’! ఈ స్వభావ సమానత్వం ప్రస్తుతం మన దేశంలో పర్యటిస్తున్న ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రసంగాలలో ధ్వనించింది! అంతర్జాతీయ బీభత్సకాండకు వ్యతిరేకంగా మన దేశంతో కలిసి పోరాడడానికి ఇజ్రాయిల్ తన సంకల్పాన్ని పునరుద్ఘాటించడం ఈ ధ్వని.. సహిష్ణుత సర్వమత సమభావానికి ప్రాతిపదిక, అసహిష్ణుత ఏకమతోన్మాదానికి అన్యమత విధ్వంసానికి మూలం! భారతీయ సహిష్ణుత, ఇజ్రాయిల్ సహిష్ణుత ఏళ్ల తరబడి జిహాదీల అసహిష్ణుతతో సమరం సాగిస్తుండడం ఈ పునరుద్ఘాటనకు నేపథ్యం.. మధ్యధరా సముద్రపు తూర్పు తీరంలోని ప్రాచీన పాలస్తీనా ప్రాంతాన్ని 1947లో ఐక్యరాజ్యసమితి రెండుగా విభజించడానికి దారితీసిన పరిణామక్రమం బీభత్సకాండలో ముడివడి ఉంది.. 1947లో ‘అఖండ భారత్’ మరోసారి ముక్కలు కావడం కూడా బీభత్సకాండ శతాబ్దులపాటు కొనసాగిన ఫలితం! ఉభయ దేశాలను ఐరోపావారు, ఉత్తర ఆఫ్రికా, పశ్చిమ ఆసియాలోని ‘జిహాదీ’లు, మతం మార్పిడి మూకలు భయంకర బీభత్సకాండకు బలి చేయగలిగారు. జిహాదీలతో సంఘర్షణ ఫలితంగా మన దేశం భూభాగాలను కోల్పోయింది, ఐరోపావారి బౌద్ధిక బీభత్సకాండ ఫలితంగా మన దేశం మరిన్ని భూభాగాలను కోల్పోయింది! కాని సనాతన హైందవ జాతి ఓడిపోలేదు, శతాబ్దులపాటు సంఘర్షణ సాగించింది. అసహిష్ణుతకు ప్రతిరూపాలైన రోము బీభత్సకారులు పాలస్తీనాలోకి చొరబడి యూదుల ప్రధాన దేవాలయాన్ని ధ్వంసం చేశారు. ‘జెరూసలెం’ నుంచి పాలస్తీనా- ఇజ్రాయిల్ నుంచి యూదు జాతిని నిర్మూలించారు. క్రీస్తునకు పూర్వం ఒకటవ శతాబ్దిలో ‘గ్రీసు’ నాగరికతను క్రీస్తుశకం ఒకటవ శతాబ్దిలో ‘హీబ్రూ’ - యూదు - ఇజ్రాయిల్- జాతిని ‘రోము’ బీభత్సకారులు ధ్వంసం చేశారు. ఓడిన ‘ఇజ్రాయిల్’ ప్రజలు ఇతర దేశాలకు పారిపోయారు. భారత్‌లో తప్ప మిగిలిన అన్ని దేశాలలో ‘హీబ్రూలు’ వివక్షకు వేధింపులకు చిత్రహింసలకు - బీభత్సకాండకు గురికావడానికి కారణం ఆయా విదేశాల ప్రజల సమష్టి మనఃప్రవృత్తి నిహితమైన ‘అసహిష్ణుత’.. తమవి కాని మతాలను భాషలను జాతులను సంస్కృతులను నామరూపాలు లేకుండా నశింపజేయడం అరబ్బుల సమష్టి ప్రవృత్తి, ఐరోపావారి చిత్తవృత్తి, తురుష్కుల వికృతి! కానీ భారతదేశపు స్వజాతీయులైన హిందువుల సమష్టి ప్రవృత్తి సర్వమత సమభావం, సర్వవైవిధ్య సమభావం! అందువల్లనే యూదులను, పారశీకులను భారతీయులు రక్షించగలిగారు. 1948లో స్వతంత్ర దేశంగా ఏర్పడిన యూదులు తమ కొత్త ఇజ్రాయిల్‌లో సర్వమత సమభావ ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు! ఇదే భారతదేశంలో యూదులు ఆశ్రయం పొందిన ఫలితం..
ప్రాచీన పాలస్తీనా, విభజన ఫలితంగా ‘యూదుల’ ఇజ్రాయిల్, ‘అరబ్బు’ పాలస్తీనా పక్క పక్కనే రెండు స్వతంత్ర దేశాలుగా ఏర్పడినాయి. ఇజ్రాయిల్ సర్వమత సమభావ- సెక్యులర్- రాజ్యాంగంగా ఏర్పడగా, ‘అరబ్ పాలస్తీనా’ జిహాదీ స్వభావంకల ఇస్లాం మత రాజ్యంగా ఏర్పడడం ‘సంఘర్షణ’ కొనసాగడానికి దోహదం చేసింది! పాలస్తీనాకు తూర్పుగా విస్తరించి ఉండిన ‘బాబిలోనియా’ సామ్రాజ్య నియంతలు క్రీస్తునకు పూర్వం ఆరవ శతాబ్దిలో యూదులకు చెందిన ‘జెరూసలెం’ ఆలయాన్ని ధ్వంసం చేశారు. కానీ యూదులు ఆలయాన్ని పునర్ నిర్మించుకున్నారు! క్రీస్తునకు పూర్వం నాలుగవ శతాబ్దిలో ‘ఇజ్రాయిల్’- ప్రాచీన పాలస్తీనా- గ్రీసువారికి, బాబిలోనియా నాగరికులకు మధ్య ఆధిపత్య యుద్ధక్షేత్రంగా మారింది! క్రీస్తునకు పూర్వం మూడవ శతాబ్దిలో ‘బాబిలోనియా’ నాగరికతను గ్రీసువారు ధ్వంసం చేశారు! ‘యూదులను’ బాబిలోనీయులను నిర్మూలించ యత్నించారు! బాబిలోనియులను గ్రీసు బీభత్సకారుడు అలెగ్జాండర్ తదితరులు మట్టుపెట్టారు! గ్రీసు వారిని ‘రోము’వారు, రోము ‘నాగరికము’ను క్రైస్తవులు ధ్వంసం చేశారు! ‘రోము’ మూకలు నశించిన తరువాత పాలస్తీనా - ఇజ్రాయిల్- ఐరోపా వారికి, అరబ్ జాతులకు మధ్య మత యుద్ధాలకు రంగభూమిగా మారింది! క్రీస్తుశకం నాలుగవ శతాబ్దినుంచి విస్తరించిన బైఝాంటైన్ సామ్రాజ్యం రోము నాగరిక అవశేషాలను సైతం తుడిపివేసింది, క్రైస్తవం వర్థిల్లింది! ఎనిమిదవ శతాబ్ది నుంచి క్రైస్తవం, ఇస్లాం పాలస్తీనాలో పరస్పరం ఢీకొన్నాయి. పదిహేనవ శతాబ్దిలో ఈ ‘బైఝాంటైన్’ సామ్రాజ్యాన్ని తరుష్క ‘ఒట్టమన్’ సామ్రాజ్యం వారు ధ్వంసం చేశారు. రాజధాని ‘కానిస్టాంట్‌నోపెల్’ పేరును ‘ఇస్తాన్‌బుల్’గా మార్చారు. పాలస్తీనాలోకి అరబ్బీ ఇస్లాం మతస్థులు వ్యాపించడానికి ఒట్టమన్ సామ్రాజ్యం దోహదం చేసింది! 1918 నాటి మొదటి ప్రపంచ యుద్ధం వరకు పాలస్తీనాలోకి అరబ్ ఇస్లాం మతస్థులు వెల్లువెత్తుతూనే ఉన్నారు. 1947లో విభజనకు ఇదీ నేపథ్యం. ఇలా పంతొమ్మిది వందల ఏళ్లు ప్రాచీన యూదుల సీమ విజాతీయ దురాక్రమణకు గురి అయ్యింది!
‘ఒట్టమన్’ సామ్రాజ్యం 1918లో పతనం కావడంతో వివిధ దేశాలలో వివక్షకు గురి అవుతూండిన యూదులు తమ ప్రాచీన ఇజ్రాయిల్‌కు తిరిగి రావడం ఆరంభమైంది. మధ్యధరా సముద్ర తీరంలోని హయిఫా నగరాన్ని తురుష్కులనుంచి బ్రిటన్ మిత్ర దేశాల కూటమి స్వాధీనం చేసుకొనడంతో ఒట్టమన్ సామ్రాజ్యం పతనం పూర్తయింది, ఒట్టమన్‌లకు బాసటగా నిలిచిన జర్మనీ పరాజయం పాలయింది! ఈ మొదటి ప్రపంచయుద్ధ సమయంలో బ్రిటన్ మన దేశాన్ని దురాక్రమించి ఉంది. యాభయి ఐదు శాతం దేశాన్ని బ్రిటన్ ప్రత్యక్షంగా పాలించింది, నలభై ఐదు శాతం దేశాన్ని బ్రిటన్ దురాక్రమణదారుల ‘పరమోన్నత అధికార’- పారవౌంటసీ- పరిధికి లోబడిన సంస్థానాధీశులు పాలించారు! మొదటి ప్రపంచ యుద్ధ సమయం నాటికి మన దేశంలో బ్రిటన్ దురాక్రమణకు వ్యతిరేకంగా ఉద్యమాలు, సాయుధ ఘర్షణలు మొదలయ్యాయి. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ వంటివారు జైళ్లకు వెళ్లివచ్చారు, స్వతంత్ర వీర వినాయక దామోదర్ సావర్కార్ వంటివారు జైళ్లలో మగ్గుతున్నారు. కానీ సైన్యంలో చేరి ఉండిన భారతీయులు వివిధ దేశాలలో బ్రిటన్ తరఫున రెండు ప్రపంచ యుద్ధాలలోను పోరాడారు! ఇలా హయిఫా విముక్తికోసం పోరాడినవారు భారతీయ సైనికులు! మైసూరు, హైదరాబాద్, జోధ్‌పూర్ సంస్థానాలకు చెందిన వీరులు, భారతీయ సంప్రదాయ బద్ధులు కాబట్టి హయిఫాకు తరుష్కులనుంచి విముక్తి లభించింది! సమరంలో వెన్నుచూపకపోవడం ఈ సంప్రదాయం! ‘విజయమా? వీర స్వర్గమా?’ అన్నవి మాత్రమే ప్రత్యామ్నాయాలు! ‘యోగయుక్తుడైన పరివ్రాజకుడు, యుద్ధంలో వెన్ను చూపని, అభిముఖహతుడైన వీరుడు- వీరిద్దరూ సూర్యమండలాన్ని ఛేదిస్తారు!’ అన్న భారతీయ సంప్రదాయం.. పరివ్రాజకుడు సన్యాసి. రణాభిముఖహతుడు అమరవీరుడు. సూర్యమండలాన్ని ఛేదించుకొని వీరిద్దరూ మోక్షం వైపు సాగిపోతారు!
‘‘ద్వావివౌ పురుషోరాజన్
సూర్యమండల భేదినౌ
పరివ్రాట్ యోగయుక్తశ్చ
రణే చాభి ముఖో హతః’’
అలా నలబయి నలుగురు భారతీయ సైనికులు ‘హయిఫా’ను విముక్తి చేయించడం కోసం అమరులయ్యారు! ‘హయిఫా’ విముక్తి బ్రిటన్ వారి యుద్ధ విజయం కాదు, భారతీయుల నైతిక విజయం. ఈ నైతిక విజయం ‘ఇజ్రాయిల్’ అవతరణకు దారితీసింది. బెంజమిన్ నెతన్యాహు ఆదివారం ఢిల్లీలో తీన్‌మూర్తి స్మారకం వద్ద అంజలి ఘటించడానికి ఇదంతా నేపథ్యం! తీన్‌మూర్తి-హయిఫా స్మృతి కేంద్రం ఇజ్రాయిలీ ప్రజలకు ఇలా చారిత్రక స్ఫూర్తికేంద్రమైంది! ‘హయిఫా’ విముక్తికి వందేళ్లు, ఇజ్రాయిల్ పునరవతరణకు డెబ్బయి ఏళ్ళు.
ఇజ్రాయిల్ విస్తీర్ణం దాదాపు ఎనిమిది వేల చదరపు మైళ్లు- ఇరవై వేల చదరపు కిలోమీటర్లు! మన దేశం వైశాల్యం పనె్నండున్నర లక్షల చదరపు మైళ్లు- ముప్ఫయి రెండు లక్షల చదరపు కిలోమీటర్లు! ఇలా మన దేశం ఇజ్రాయిల్‌కంటే నూట యాభై రెట్లు పెద్దది. కానీ స్వభావ సామ్యం ఉభయ దేశాల స్నేహానికి సమాన ప్రాతిపదిక! నూట ముప్ఫయి కోట్ల భారతీయులు ఎనభయి మూడు లక్షల ఇజ్రాయిలీల ‘స్వభావ సామ్యం’ ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థ- వరల్డ్ డెమోక్రాటిక్ ఆర్డన్‌ను 1948 నుంచి పెంపొందిస్తోంది! ఇజ్రాయిల్ జనాభాలో ఐదవ వంతు అరబ్ ముస్లింలు! హీబ్రూ భాష అధికార భాష, అరబ్బీ భాష రెండో అధికార భాష! ఈ సర్వమత సమభావ వ్యవస్థను ధ్వంసం చేసి ఇస్లాం మత రాజ్యాన్ని స్థాపించడానికై ఇజ్రాయిల్‌తో అరబ్ దేశాలవారు నాలుగు సార్లు యుద్ధం చేశారు! తొలి దురాక్రమణ ఇజ్రాయిల్ ఏర్పడిన రోజే జరిగింది! కానీ ‘సర్వమత సమభావం’ గెలిచింది! ఇజ్రాయిల్ గెలిచింది! భారతీయ సంస్కృతి స్వభావం గెలిచింది...

-హెబ్బార్ నాగేశ్వరరావు 9951038352