మెయన్ ఫీచర్

ఇది లాభదాయక రాజకీయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికలలో అపూర్వ విజయాలు సాధించి, ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వారికి గెలిచిన ప్రజాప్రతినిధులను సంతృప్తిపరచి, వారు తమతోనే ఉండేటట్లుచేసుకోవడం నేడు క్లిష్టతరం అవుతున్నది. పార్టీ ఫిరాయింపు చట్టం ఉన్నప్పటికీ అమలులో అది నిర్వీర్యమైపోతున్నది. ఢిల్లీలో కూడా అదే జరిగింది. ఊహించని రీతిలో 70 అసెంబ్లీ స్థానాలలో 67 స్థానాలు గెల్చుకోవడంతో వారందరిని సంతృప్తిపరచడం, మంత్రి పదవులు ఇవ్వడం ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు అసాధ్యంగా మారింది. దానితో కొందరినైనా సంతృప్తిపరచడం కోసం కొందరిని పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించి, మంత్రి హోదా కల్పించే ప్రయత్నం చేశారు.
దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఇటువంటి సంప్రదాయాన్ని రాజకీయ అవసరాల కోసం అనుసరిస్తూనే వున్నాయి. కోర్టులకు వెళ్లడమో, ఇతరత్రా అభ్యంతరాలు వ్యక్తం అవుతూ ఉండడంతో వారిని ఆ పదవులనుండి తొలగిస్తూ వస్తున్నారు. అయితే కేజ్రీవాల్ నియమించినవారు కోర్టు జోక్యంతో పదవులను చేపట్టక ముందే వాటిని కోల్పోయినా 20 మందిని లాభదాయక పదవులు ఉన్నందున శాసనసభ్యత్వానికి అనర్హులంటూ ఎన్నికల కమిషన్ నిర్ణయించడం దేశంలో పెద్ద సంచలనమే కలిగించింది. సాధారణ విచారణ ప్రక్రియను పూర్తిచేసి అటువంటి నిర్ణయం తీసుకొంటే పెద్దగా విమర్శలు చెలరేగి ఉండేవి కాకపోవచ్చు.
అయితే ప్రధాని మోడీ గుజరాత్‌లో తనవద్ద పనిచేసిన అధికారిని కావాలని ఎంపిక చేసి నియమించుకున్న ఎన్నికల ప్రధాన కమిషనర్ అచల్‌కుమార్ జ్యోతి పదవీ విరమణకు రెండు రోజుల ముందు హడావుడిగా ఈ నిర్ణయం తీసుకోవడంతో విమర్శలకు ఆస్కారం కలిగింది. ఆయా ఎమ్మెల్యేల వాదనలు వినకుండానే ఇటువంటి నిర్ణయాన్ని రాజకీయ కారణాలతో తీసుకున్నారంటూ అభ్యంతరాలు వ్యక్తం అయిన తర్వాత కూడా రాష్టప్రతి రామనాధ్ కోవింద్ లోతుగా పరిశీలించకుండానే రెండు రోజులలో అనుమతి ఇవ్వడం కూడా విస్మయం కలిగించింది. ఈ విధంగా పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం హర్యానా, చత్తీస్‌గఢ్, తెలంగాణ వంటి పలు రాష్ట్రాలలో జరిగినా స్పందించని ఎన్నికల కమిషన్ ఢిల్లీ విషయంలో ఆసక్తి చూపడం పట్ల కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిననాడే గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకపోవడంపట్ల పలు విమర్శలు ఎదుర్కొంటున్న జ్యోతి తీసుకున్న ఈ నిర్ణయం సహితం రాజకీయ ప్రేరేపితంగానే భావించవలసి వస్తున్నది. పలు అంశాలలో ఎన్నికల కమిషన్ నిర్ణయాలలో సహజంగా రాజకీయంగా నష్టపోయిన వ్యక్తులు ఆరోపణలు చేస్తుంటారు. కానీ, జ్యోతి వలే ‘రాజకీయ పక్షపాతం’తో వ్యవహరిస్తున్నట్లు ఈ మధ్య మరెవ్వరూ విమర్శలు ఎదుర్కొన్న దాఖలాలు లేవు.
వారికి ఎలాంటి ఆర్థికపరమైన ప్రయోజనాలను కల్పించలేనందున ఆ పదవులు ‘జోడు పదవుల’ పరిధిలోకి రావని కేజ్రీవాల్ అప్పటినుంచి ఇప్పటివరకు వాదిస్తూనే వస్తున్నా ఆయన వాదనలు అరణ్య రోదనలయ్యాయి. కనీసం రాష్టప్రతి కూడా ఈ వాదనలను పరిగణనలోకి తీసుకొని ఉంటే ఆయన ఆ పదవికి ప్రతిష్ఠ ఇనుమడింపజేసినవారు అయి ఉండేవారు. ఇటువంటి సమస్య రాగలదని కేజ్రీవాల్ ముందుగానే ఊహించినట్లున్నారు.
అందుకే ఎందుకైనా మంచిదని పార్లమెంటరీ కార్యదర్శుల పదవులను అనర్హత చట్టంనుంచి మినహాయిస్తూ బిల్లును తీసుకొచ్చారు. అయితే మోదీ ప్రభుత్వం ప్రోద్బలంతో ఆ బిల్లును ఆమోదించకుండా రాష్టప్రతి కొట్టివేశారు. ఇలాంటి బిల్లులను తీసుకొచ్చే అవకాశం రాష్ట్రాలకు ఉంది. అలా కొట్టివేసే అధికారం రాష్టప్రతికి ఉంది. ఈ నేపథ్యంలో 20 మంది ‘ఆప్’ శాసనసభ్యులు తమ కొత్త బాధ్యతలు, అంటే పార్లమెంట్ కార్యదర్శులుగా బాధ్యతలు నిర్వహించనేలేదు. ఈ సందర్భంగా, ఇదే కేసులో ‘బాధ్యతలు తీసుకోకముందే వారి పదవులు పోయాయి’ అని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించడం ఇక్కడ గమనార్హం. అంటే వారెవ్వరూ లాభదాయక పదవుల బాధ్యతలు చేపట్టలేదని హైకోర్టు స్పష్టం చేసినట్లయింది. వారికి పదవులే లేనప్పుడు జోడు పదవుల్లో వున్నారన్న ఆరోపణ ఎలా వర్తిస్తుందో అర్థం కావడంలేదు. ఒకనాడు ప్రభుత్వానే్న ధిక్కరించి స్వయం ప్రతిపత్తిని నిలబెట్టుకున్న రాజ్యాంగ సంస్థ ఇప్పుడు ప్రభుత్వంవైపు చూస్తూ నిర్ణయాలు తీసుకొంటున్నట్లు ఆరోపణలు రావడం దురదృష్టకరం.
ఈ విషయమై ఒక నిర్ణయం తీసుకొనే ముందు తమ వాదన కూడా వినాలని బాధిత శాసనసభ్యులు ఎన్నోసార్లు పిటిషన్లు పెట్టుకున్నా ఎన్నికల కమిషన్ ఖాతరు చేయకపోవడం గమనిస్తే రాజకీయ దురుద్దేశ్యంతో వ్యవహరించినట్లు భావించవలసి వస్తుంది. ఈ విషయంలో జ్యోతి తర్వాత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఓం ప్రకాశ్ రావత్ మొదటి రోజునే చేసిన వ్యాఖ్యలు సహితం వివాదాస్పదంగా మారడం దురదృష్టకరం.
ఏ అంశంలోనైనా సరే న్యాయం జరగడమే కాదు, న్యాయం జరిగినట్టు కన్పించాలన్న సుప్రీంకోర్టు వౌలిక సూత్రాన్ని ఇక్కడ పట్టించుకోలేదనే ఆరోపణలు వస్తున్నాయి. కనీసం మేం చెప్పింది ఆలకించకుండా వేటు వేశారన్న ఆప్ వాదనను రావత్ తోసిపుచ్చారు. ‘వివరణ ఇవ్వాల్సిందిగా ఈసి ఇచ్చిన రెండు అవకాశాలను వారు (ఆప్) వినియోగించుకోలేదు’ అని కమిషన్ నిర్ణయాన్ని సమర్థించుకొనే ప్రయత్నం చేశారు. రావత్ మాటల ప్రకారం అనర్హత అంశంపై వివరణ కోరుతూ ఈసీ 20 మంది ఎమ్మెల్యేలకు 2017 సెప్టెంబర్ 28న మొదటిసారి, నవంబర్ 2న రెండోసారి నోటీసులు జారీ అయ్యాయి. అయితే ఆప్ ఈసీ నోటీసులకు బదులివ్వకుండా ఏకంగా కేసు విచారణనే నిలిపేయాలని కోరింది. సరిగ్గా ఈ సాంకేతిక అంశమై ఈసి కఠిన నిర్ణయానికి దోహదపడినట్లు చెబుతున్నారు.
అసలు తాము జోడు పదవులు చేపట్టనే లేదని అంటున్న వారి వాదనలు వినకుండా ‘మీరు జోడు పదవులు నిర్వహించారు, ఎందుకు అనర్హతకు గురిచేయకూడదు’ అంటూ వారి నెత్తిమీద కత్తిపెట్టినట్లు ఎన్నికల కమిషన్ వ్యవహరించడం సహజ న్యాయసూత్రాలకు వ్యతిరేకం కాగలదు. దానితో రావత్ తొలిరోజు చేసిన వ్యాఖ్యలను ఆప్ తప్పుపట్టింది. రెండుసార్లు కమిషన్ నుండి వచ్చిన నోటీసులు ఇచ్చినపుడు ఎమ్మెల్యేలపై విచారణ జరపాలని లిఖితపూర్వకంగా, వౌఖికంగా విజ్ఞప్తి చేసినప్పటికీ ఎన్నికల కమిషన్ స్పందించలేదని ఆప్ ఆరోపిస్తున్నది.
ఎన్నికల కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయంపై స్టే ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించినా, వచ్చే సోమవారంనాటి వాయిదా వరకు ఈ స్థానాలలో ఉప ఎన్నికలు జరపడానికి ప్రకటన విడుదల చేయవద్దని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించడం ఒక విధంగా కమిషన్‌కు షాక్ కలిగించడమే కాగలదు. ఈ విషయమై రోజువారీ విచారణకు హైకోర్టు సిద్ధపడింది కూడా. ఇప్పుడు కమిషన్ నిర్ణయంపై కోర్టు విచారణకు పూనుకొన్నట్లయింది.
ఇలా ఉండగా ఆప్ ఎమ్మెల్యేల అనర్హత పట్ల రాజకీయ ప్రత్యర్థులైన బిజెపి, కాంగ్రెస్ కూడా హర్షం ప్రకటించడం గమనార్హం. ఈ రెండు పార్టీలు ఆప్ ఉనికిపట్ల ఉలిక్కిపడుతూ ఉండడమే అందుకు కారణమని భావించవలసి వస్తుంది. ఆ విధంగా శాసనసభ్యులకు పార్లమెంటరీ కార్యదర్శి పదవులు కట్టబెట్టడం పట్ల ఈ పార్టీలు విధానపరంగా వ్యతిరేకంగా ఉన్నాయా? ఉంటే హర్యానాలో ఇంకా అటువంటి పదవులలో కొనసాగుతున్న తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల పట్ల ఎందుకు బిజెపి స్పందించడంలేదు?
ఢిల్లీ ఫార్ములా వర్తింపచేస్తే ఛత్తీస్‌గఢ్‌లోని 11మంది బిజెపి ఎమ్మెల్యేలు సహితం అనర్హతకు గురికావలసి వస్తుంది. వారు అనర్హులైతే అక్కడ బిజెపి ప్రభుత్వం కూలిపోతుంది. ఢిల్లీలో 20 మంది ఎమ్మెల్యేలు అనర్హులైనా ఆప్ ప్రభుత్వం మనుగడకు ఢోకాలేదు. చత్తీస్‌గఢ్ అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలు ఉన్నాయి. ఇందులో బిజెపికి 49 మంది, కాంగ్రెస్ పార్టీకి 39మంది, బిఎస్‌పి ఒకరు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు ఉన్నారు. ఒకవేళ ఆ 11మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. ఆ భయంతోనే బిజెపి గవర్నర్‌తో కలిసి రాజకీయాలు నడుపుతోందని, వారిని కాపాడుతోందని విమర్శలు చెలరేగుతున్నాయి.
ఢిల్లీలో ఆప్ ఎమ్మెల్యేలపై తీసుకున్న చర్యలు సబబు అయినపుడు ఇక్కడ (చత్తీస్‌గఢ్) బిజెపి ఎమ్మెల్యేలపై కూడా వేటుపడాల్సిందే. కానీ రెండేళ్లుగా ఈ వ్యవహారంపై ఎటూ తేల్చకుండా నాన్చుతున్నారు. ఈ వ్యవహారంలో గవర్నర్ కూడా భాగస్వామి కావటం దారుణం అని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మహమ్మద్ అక్బర్ ఆరోపించారు. ఢిల్లీ ఆప్ ఎమ్మెల్లే విషయంలో తొందరపాటు ప్రదర్శించిన ఎన్నికల కమిషన్ ఛత్తీస్‌గఢ్ విషయంలో మాత్రం పూర్తి భిన్నంగా వ్యవహరించింది.
గతంలో రమణ్‌సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం 11మంది బిజెపి ఎమ్మెల్యేలను పార్లమెంటరీ కార్యదర్శలుగా నియమించింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వారిపై వేటు వేయాలని కాంగ్రెస్ నేత అక్బర్ 2016లో ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఒకవేళ గవర్నర్ సిఫార్సు చేస్తే ఈ అంశాన్ని పరిశీలిస్తామని తెలుపుతూ తనకు సంబంధం లేనట్లు ఎన్నికల కమిషన్ వ్యవహరించింది. దీంతో ఆయన గవర్నర్ బలరామ్‌జీ దాస్ టండన్‌కు కూడా ఓ లేఖ వ్రాసినా ఎటువంటి స్పందన లేకపోయింది.
దాంతో గతేడాది ఛత్తీస్‌గఢ్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టి ఉన్నత న్యాయస్థానం తక్షణమే పార్లమెంటరీ కార్యదర్శుల అధికారాలను ఉపసంహరించుకోవాలని రమణ్ సింగ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ప్రభుత్వం మొక్కుబడిగానే ఆ ఆదేశాలను అమలు చేసింది. పేరుకు వారిని ఆ బాధ్యతలనుండి తొలగించినా ఆచరణలో ప్రస్తుతం వారంతా మంత్రుల మాదిరిగానే కారు, బంగ్లా, తదితర సదుపాయాలను అనుభవిస్తున్నారు.
ఇక తెలంగాణలో సహితం పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం హైకోర్టు ఉత్తర్వులతో ఎదురుతిరిగింది. మొత్తం తొమ్మిది మంటి టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అనర్హతకు గురికావలసి వస్తుందని అంటూ ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక పార్టీ ఫిరాయించిన ప్రజాప్రతినిధులపై తగు చర్యలు తీసుకోవడంలో సహితం ఎన్నికల కమిషన్ పెద్దగా ఆసక్తి చూపడంలేదు.
భారతదేశంలో రాజ్యాంగబద్ధంగా లేని అధికారాలను యధేచ్చగా సొంతం చేసుకుంటున్న సంస్థ ఎన్నికల కమిషన్ మాత్రమే అని చెప్పవచ్చు. దాని పేరు చెప్పగానే చాలా సందర్భాలలో కోర్టులు సహితం జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తున్నాయి. కమిషన్ తరచూ ప్రకటిస్తున్న నియమావళికి ఏ మాత్రం రాజ్యాంగబద్ధత ఉన్నదని అంటే అనుమానమే కలుగుతుంది.
ఉదాహరణకు నామినేషన్ పత్రాలతోపాటు ఆస్తులు, క్రిమినల్ కేసులకు సంబంధించి అఫిడవిట్‌లను జతచేయమని నిర్బంధం చేస్తున్నారు. చివరి క్షణాలలో అభ్యర్థిగా పోటీ చేస్తున్న వారికి పూర్తి వివరాలతో అటువంటి అఫిడవిట్‌లను దాఖలు చేయడం కష్టం అవుతుంది.
కానీ ఆ విధంగా సమర్పించిన అఫిడవిట్ ఓటర్లపై అసలు ప్రభావం చూపుతుందా? 1999 ఎన్నికలకు ముందు పోటీ చేస్తున్న అభ్యర్థులలో క్రిమినల్ కేసులు గల వారి పేర్లను ఎంతో ఆర్భాటంగా లోక్‌సత్తా నేత డా. జయప్రకాష్ నారాయణ్ మొదటిసారిగా ప్రకటించారు. మీడియా ఎంతో ప్రచారం కల్పించింది. అయితే ఆ జాబితాలో పేర్లు ఉన్న కారణంగా ఎవ్వరికైనా ఓట్లు తగ్గయా?
అసలు ఆ విధంగా సమర్పించే అఫిడవిట్‌లు ఏ మేరకు యధార్థం అని పరిశీలించే యంత్రాంగం కమిషన్‌కు ఉందా? ఎన్నికల ప్రక్రియను క్లిష్టతరం చేయడానికే పలు సందర్భాలలో కమిషన్ చర్యలు దోహదపడుతున్నాయి. పొరపాట్లు లేని ఓటర్ల జాబితా తయారు పట్ల మరింత దృష్టి సారించగల్గితే ప్రజాస్వామ్యం మరింత పరిపుష్ఠి కాగలదని గ్రహించాలి.

-చలసాని నరేంద్ర 9849569050