మెయిన్ ఫీచర్

సఖియా వివరించవే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సభ్య సమాజంలో యువతులు, మహిళలు ఎదుర్కొంటున్న అవమానాలు, వేధింపుల భారి నుండి మోక్షం కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న నిర్భయ కేంద్రాలను మరింత బలోపేతం చేసేందుకు నిర్ణయించాయి. రెండు నెలల క్రితం వరకు నిర్భయ కేంద్రాలుగా కొనసాగిన వాటికి ‘సఖీ కేంద్రం’ వన్ స్టాప్ సెంటర్‌గా పేరు మార్చారు. ఈ కేంద్రానికి వచ్చే బాధితులకు అన్ని రకాల సేవలు అందించేందుకు అవసరమైన సిబ్బందిని కూడా నియమిస్తున్నారు. స్ర్తి, శిశు సంక్షేమ శాఖ పరిధిలో డిసెంబర్ 11వ తేదీన సంగారెడ్డి జిల్లాలో సఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. జనవరి నెలలోనే 8 మంది బాధితులు వివిధ సమస్యలతో ఈ కేంద్రాన్ని ఆశ్రయించారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా సంగారెడ్డి జిల్లాలో సఖీ కేంద్రాన్ని భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు చేతులమీదుగా ప్రారంభింపజేశారు.
ఈ కేంద్రానికి ప్రధానంగా ఆకతాయిలతో వేధింపులకు గురయ్యే యువతులు, మహిళలు, గృహ హింస, అత్యాచారాలు, బాల్య వివాహాలు, వరకట్న వేధింపులు, ప్రేమ పేరిట వేధింపులు, బాల కార్మికులుగా పని చేస్తున్న బాలురపై ప్రత్యేక దృష్టి సారించి వారికి అవసరమైన సేవలు అందించనున్నారు. సఖీ కేంద్రానికి బాధితులు రాగానే ఇద్దరు సిబ్బందితో వారు ఎదుర్కొనే సమస్యలు ఏమిటో పూర్తి సమాచారాన్ని సేకరిస్తారు. సేకరించిన సమాచారాన్ని సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ (సీఏ)కు సిఫార్సు చేస్తారు.
సీఏ వివరాలను పరిశీలించిన అనంతరం సమస్య కౌన్సిలింగ్ ద్వారా పరిష్కారమవుతుందా లేకా న్యాయపరంగా పరిష్కరించవచ్చా అన్న కోణంలో పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటారు. సాంఘికపరమైన, మానసికపరమైన కౌన్సిలింగ్ ఇవ్వడానికి మరో ఇద్దరు నిపుణులు ఈ కేంద్రంలో అందుబాటులో ఉంటారు. బాహ్య ప్రపంచానికి చెప్పుకోలేని సమస్యలను ఎదుర్కొనే వారు వివరించే వివరాలను ఏ మాత్రం బహిర్గతం చేయకుండా అత్యంత గోప్యంగా ఉండే విధంగా సఖీ కేంద్రం చర్యలు తీసుకుంటుంది. సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు ఇద్దరు లీగల్ కౌన్సిలర్లు కూడా బాధితులకు అండగా నిలుస్తారు. కొంత మంది బాధితులు అపస్మారక పరిస్థితుల్లో కూడా ఉండే అవకాశం ఉన్న దృష్ట్యా వారికి వెంటనే వైద్యం కూడా అందించి విలువైన ప్రాణాలను కాపాడుతారు. ఎక్కడో ఒక సంఘటన చోటు చేసుకుని బాధితురాలు కేంద్రానికి చేరుకోలేని సమయంలో 181 అనే రెస్క్యూ వాహనం ద్వారా సంఘటనా స్థలానికి చేరుకునేందుకు వాహనం అందుబాటులో ఉంది. 181 ఉమెన్ హెల్ప్‌లైన్ నంబర్‌కు బాధితులు ఫోన్ చేసినా హెల్ప్‌లైన్ నుండి సఖీ కేంద్రానికి వెంటనే సమాచారం అందిస్తారు. బాధితులు సఖీ కేంద్రాన్ని ఆశ్రయించిన అనంతరం వారి కుటుంబ పరిస్థితి, జీవన స్థితిగతులను గమనించి ఐదు రోజుల పాటు వసతి సౌకర్యం కూడా సఖీ కేంద్రం ఏర్పాటు చేస్తుంది. కట్టుకోవడానికి బట్టలు, పరచుకోవడానికి, కప్పుకోవడానికి అవసరమైన పక్క బట్టలను వెల్‌కమ్ కిట్ ద్వారా అందించనున్నారు. బాధితులకు రక్షణ కల్పించడానికి సఖీ కేంద్రానికి ఒక ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను అనుసంధానం చేసారు. 14 ఏళ్ల వయస్సులోపు బాలురు ఎదుర్కొనే సమస్యలను బాలల హక్కు చట్టం ద్వారా సఖీ కేంద్రం సేవలు అందించనుంది. బాధితుల బంధువులతో మాట్లాడాల్సిన అవసరం ఉంటే అందుకు కావల్సిన వీడియోకాన్ఫరెన్స్ కేంద్రం సౌకర్యం కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో ప్రస్తుతం అద్దె భవనంలో కొనసాగుతున్న సఖీ కేంద్రానికి పక్కా భవనం నిర్మించడానికి రూ.49 లక్షల నిధులు మంజూరయ్యాయి.
బాలసదనం వద్ద ఉన్న స్థలాన్ని కేటాయించినా తక్కువ విస్తీర్ణంలో ఉండటంతో మంత్రి హరీష్‌రావు సూచనల మేరకు జిల్లా ఆసుపత్రి ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో నిర్మించేందుకు స్ర్తి, శిశు సంక్షేమ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. సఖీ కేంద్రాలను నిర్వహించడానికి అవసరమైన నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందించనున్నాయి. కలెక్టర చైర్‌పర్సన్‌గా కమిటీ ఉంది. ఈ కమిటీలో జిల్లా జడ్జి, ఇతర ముఖ్య అధికారులు సభ్యులుగా ఉంటారు. బాధితుల సమస్యలను ఈ కమిటీ ఎప్పటికప్పుడు సమావేశమై పరిశీలిస్తుంది. బహుళార్థ ప్రయోజనాలతో ఏర్పాటైన సఖీ కేంద్రంపై విస్తృత ప్రచారం నిర్వహిస్తే సమాజంలో ఎన్నో అవమానాలు, వేధింపులు చవిచూస్తున్న యువతులు, మహిళలకు చేదోడుగా నిలుస్తుందని చెప్పవచ్చు.

చిత్రాలు..బాధిత మహిళలకు న్యాయ సేవలు అందించడానికి స్ర్తి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సఖీ కేంద్రం *సఖీ కేంద్రంలో కౌన్సిలింగ్ నిర్వహించేందుకు అవసరమైన ఫర్నిచర్, సిబ్బంది ఏర్పాటు దృశ్యం

- టి.మురళీధర్