మెయిన్ ఫీచర్

ప్రేమ అనంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాళ్ళిద్దరూ ప్రపంచంలో అతి పొట్టి జంట.. ఒక్కొక్కరి పొడవు మూడడుగుల లోపే.. దక్షిణ అమెరికా బ్రెజిల్ దేశానికి చెందిన పాలో గాబ్రియల్ డసిల్వా బరోస్ (34.8 అంగుళాలు), కత్యూసియా హోషినో (34.2 అంగుళాలు) ఆకారాలు కూడా మరగుజ్జు లక్షణాలతోనే ఉంటాయి కానీ, ఇవేవీ వాళ్ల జీవనానికి కానీ, ప్రేమకు కానీ అడ్డంకులు కాలేదు. పైగా ప్రపంచంలో ‘అతి పొట్టి’ జంటగా గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించాలన్నది వాళ్ళ ఆశ, ఆశయం!
దయాస్ట్ఫ్రోక్ డైస్‌ప్లాసియా డ్వార్ఫిజమ్ జబ్బుతో ఉన్న పాలో వయసు సుమారు 32 ఏళ్ళు. లీగల్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. తనకోసం ప్రత్యేకంగా తయారుచేసుకున్న కారు ఉపయోగిస్తాడు. తన స్వస్థలం ఇటాపెవా పట్టణానికి మేయర్ కావాలన్నది అతడి చిరకాల వాంఛ. ‘గౌరవం అనేది ఒక్క రోజులనే సంపాదించగలిగేది కాదు. ఎంతో కష్టపడితేగాని లభించేది కాదు’ అనేది అతడి అభిమతం. ఇక సుమారు 27 ఏళ్ళ కత్యూసియా ఎకొండ్రోప్లాసియా డ్వార్ఫిజమ్‌తో బాధపడుతోంది. తన ఎత్తుకు సరిపడేటట్టుగా నిర్మించుకున్న సొంత బ్యూటీపార్లర్‌ను నడుపుతోంది. ‘ఇది నా చిరకాల వాంఛ’- ఎన్నో ఏళ్ళనుంచి అనుకుంటున్నా. నా మరుగుజ్జుతనంవల్ల ఇప్పటికి కానీ సాధ్యం కాలేదు. సంవత్సరాల తరబడి నాకు తగ్గట్టుగా అవసరమయ్యే సామగ్రిని సమకూర్చుకున్న తర్వాత ఈ పార్లర్ కల నెరవేర్చుకున్నాను అంటుందామె.
ఈ జంట దాదాపు పది సంవత్సరాల కింద సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకుంది. ఆమెను మొదటిసారి చూసినప్పుడే ఎంతో అందంగా కనిపించిందని అంటాడు పాలో. అయితే, అతడి ప్రేమ వ్యవహారం చాలా రోజులపాటు ఏకపక్షంగానే నడిచింది. రెండు మూడు రోజుల సంభాషణలతోనే ఈ వ్యవహారానికి కత్యూసియా తెరదించేది. మొదట్లో అతడి వెకిలి రాతలు (పోస్టులు) యావగింపు కలిగించాయామెకు. కానీ తానెంత సున్నితంగా వ్యవహరించినా పోకిరిలా ప్రవర్తిస్తున్నానని ఆమె అనుకొని కొన్నాళ్ళపాటు తను దూరం చేసేసిందని, కానీ ఏడాదిన్నర తర్వాత తనతో మళ్లీ సంభాషణలు కొనసాగించిందని వివరించాడు పాలో. ఇది జరిగిన రెండు నెలల తర్వాత 186 మైళ్ల దూరంలో వున్న ఆమె స్వస్థలం లొండ్రినా వెళ్లి కత్యూసియాను ముఖాముఖిగా కలుసుకున్నాడు పాలో! ఇలా చూడగానే ఆమె సౌందర్యానికి తన్మయత్వం పొంది ముగ్ధుడైపోయాడు. కానీ నారింజ రంగు చొక్కా జీన్స్ ప్యాంటు, నల్లకళ్లాద్దాలతో ప్రత్యక్షమైన పాలో తనకు ఏమాత్రం నచ్చలేదని కానీ, ఆ తర్వాత అతడు తనకు ఇష్టమైనట్లుగా మారడం ప్రేమకు దారితీసిందని ఆమె చెబుతుంది.
బ్రెజిల్ దేశంలోని ఇటాపెవా పట్టణంలో ప్రస్తుతం వాళ్ళిద్దరూ సహజీవనం చేస్తున్నారు. తామిద్దరం మిగిలిన జంటల్లానే జీవిస్తున్నామని, కాకపోతే పొట్టిదనం ఒక్కటే సమస్యగా ఉంటోందని, ఒకరిమీదొకరికి గల స్నేహం, అభిమానం, ప్రేమ తమ సాంగత్యంలో అతి ముఖ్యమైన అంశాలని అంటాడు పాలో. ‘ఆమె ప్రతి విషయంలో నన్ను సమర్థిస్తుంది.. నా కోసం పోరాడుతోంది.. అందరు జంటల్లాగే మేము కూడా పోట్లాడుకుంటాం.. అలా పోట్లాడుకొనే జంట నిజమైన జంటే కాదు.. మా ఆలోచనలు, అభిప్రాయాలు, భావాలు పరస్పరం కలుస్తాయి’ అని చెప్పుకొచ్చాడు.
నిరాడంబరత్వం పాలో ప్రధాన లక్షణం.. మేమిద్దరం ఒకేలా ఉండకపోయినా ఇద్దరిమధ్య ఏమైనా సమస్యలు తలెత్తితే ఇద్దరూ కూల్‌గా ఎదురెదురుగా కూర్చుని ఆ సమస్య గురించి చర్చించి పరిష్కరించుకుంటాం.. క్షణికావేశం నా లక్షణం.. కానీ, పాలో ఎంతో సహనపరుడు.. అదే అమితంగా నచ్చిన లక్షణం అంటోంది కత్యూసియా.
జంటగా ప్రయాణాలు చేయడం, ఊళ్ళో కలిసి తిరగడం, హోటళ్ళలో జపానీయుల ఆహారం, ఐస్‌క్రీం తినడం వాళ్ళకు ఎంతో ఇష్టం. షాపింగ్‌కు వెళ్లిపుడు సామాన్ల కోసం ఒక చిన్న ట్రాలీని సమకూర్చున్నారు. అయినప్పటికీ షాపుల్లో, ఏటిఎం మిషన్లలో, పబ్లిక్ బాత్ల్రూం సదుపాయాలు వాళ్లకు అందుబాటులో ఉండవు. మరీ ముఖ్యంగా బఫె డిన్నర్లలో టేబ్ళుమీద ఉన్న ఆహార పదార్థాలు వీళ్ళకు అందుబాటులో ఉండవు.
సమాజంలో తాము మరుగుజ్జుగా ఉండడంతో ఎంతో వివక్షకు గురవుతున్నామని, రోజూ వీధిలోకి వెళ్లినపుడల్లా ప్రతీ ఒక్కరూ తమను చూసి గుసగుసలాడుకోవడం మాకు ఇబ్బందికరంగా అనిపిస్తోంది. అయినప్పటికీ ఇదంతా మాకు అలవాటుగా మారిపోయిందని, దీంతో ఆ అవహేళనలను అంతగా పట్టించుకోవడంలేదని వాళ్ళంటున్నారు.
ఇప్పటికి దాదాపు తొమ్మిది సంవత్సరాలు సహజీవనం సాగిస్తున్న పాలో, కత్యూసియా పెళ్లి చేసుకోలనుకుంటున్నారు. కానీ దురదృష్టవశాత్తూ వివాహం కూడా సమస్యగా మారే ప్రమాదం లేకపోలేదన్నది ఆమె భయం! ఎందుకంటే, గర్భస్థ శిశువును మోసే శక్తి తన గర్భసంచికి ఉండకపోవచ్చని ఆమె సందేహ పడుతోంది. ఏదేమైనా జరిగేది జరగకపోదని, సరైన సమయం వస్తేనేగానీ, అనుకున్నవి ఫలించవని అనుకుంటూ ఈ ఇద్దరూ కలిసి బతికేస్తున్నారు! ‘తలచుకుంటే ఏదీ అసాధ్యం కాదు’ అనేది వాళ్ళ ఆత్మవిశ్వాసం! అందరిలాగే ఓ సొంతిల్లు, పెంపుడు కుక్కలు, తమకు సరిపోయే సౌకర్యాలు సమకూర్చుకోవాలన్నది వాళ్ళ ఆశయం! సంతానం కలిగినా లేకపోయినా హాయిగా జీవించడం వారి ఆకాంక్ష.

-గున్న కృష్ణమూర్తి