మెయిన్ ఫీచర్

మంచి స్నేహానికి దారి నిర్మొహమాటమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ రోజు సరిత తన భర్త కొలీగ్ కల్పనని డిన్నర్‌కి పిలిచింది. కల్పన తన భర్తతో కలిసి అనుకున్న సమయానికి సరిత ఇంటికి వచ్చింది. సరిత, భర్త వినయ్, కల్పన దంపతులు నలుగురూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా భోజనం కానిస్తున్నారు. ఇంతలో సంభాషణ కల్పన, వినయ్‌ల ఆఫీసు విషయాలవైపు మళ్లింది. అంతే కొలీగ్స్ ఇద్దరూ చుట్టుప్రక్కల వున్నవాళ్ళని కూడా మర్చిపోయి ఆఫీసు పాలిటిక్స్ గురించి విరామం లేకుండా చర్చించుకోవడం మొదలుపెట్టారు. సరిత, కల్పన భర్త ఒకరి మొహం ఒకరు చూస్తూ కూర్చుండిపోయారు. ఆ తర్వాత గడిచిన రోజుల్లో రెండు కుటుంబాలల్లోనూ ఎప్పుడూ ఎదురుకాని ప్రశ్నలు, అనుమానాలు మొదలయ్యాయి.
వృత్తిరీత్యా ప్రతి రంగంలో స్ర్తి పురుషులు కలిసి పనిచేస్తున్నారు. మగవాళ్ళతో ఉండటం, కలిసి పనిచెయ్యడానికి నిరాకరించడం సమంజసం కాదు. అది అన్‌ప్రొఫెషనల్ కూడా. అలాగని ఆఫీసు పరిసరాలను ఆసరాగా తీసుకుని వృత్తిపరమైన సంబంధాలను వ్యక్తిగత సంబంధాలుగా మార్చాలని చూడటం చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీయొచ్చు. ఆఫీస్ కొలీగ్స్‌తో ఒక స్నేహపూరితమైన సంబంధాన్ని కొనసాగించడంలో తప్పులేదు. అది వృత్తికి అవసరం కూడా. కానీ దాని పరిధి ఎక్కడవరకు ఉండాలి అనే విషయం తెలిసి ఉండటం చాలా ముఖ్యం. వృత్తిపరమైన జీవితం సాఫీగా సాగాలంటే స్ర్తికి ఈ పరిధులు తెలియడం చాలా అవసరం.
చాలా ఏళ్ళుగా గృహిణిగా ఉన్న తర్వాత ఈమధ్యే ఉమ లెక్చరర్ ఉద్యోగం సంపాదించింది. దీనితో ఒక్కసారిగా తన ముందు ఒక కొత్త ప్రపంచం అవతరించింది. అంతా వింతగా, కొత్తగా ఉంది. చుట్టూ మగ కొలీగ్స్. ఇంతమంది మగవారిమధ్య పనిచేయడం కొత్తలో బెరుకుగా అనిపించినా, వాళ్ళందరూ తనమీద చూపించే అటెన్షన్స్, వాళ్ళు తనకి సహాయం చేయడం, సలహాలు ఇవ్వడం, తనని పొగడటం- ఇవన్నీ రాను రాను తనకి నచ్చుతున్నాయి. తనకి తెలియకుండానే తను తన భర్తని తన కొలీగ్స్‌తో పోల్చి చూడడం మొదలుపెట్టింది. అప్పటివరకు సంతోషంగా సాగిన కాపురం అసంతృప్తులు, అనుమానాలతో అల్లకల్లోలమైపోయింది.
పాశ్చాత్య దేశాలతో పోల్చి చూసినపుడు మన దేశంలో వర్కింగ్ కండిషన్స్ చాలా భిన్నంగా వుంటాయి. వివిధ రంగాల్లో పని చెయ్యడానికి స్ర్తిలు భారతదేశంలో అనేక దశాబ్దాల క్రితమే ఇంటినుండి బయటకు అడుగుపెట్టినప్పటికీ వాళ్ళు పనిచేసే సంస్థలు లేదా ఆఫీసులో మగవాళ్ళు స్ర్తిలతో ప్రవర్తించే తీరులో కానీ, ఆడవాళ్ళు మగవాళ్ళతో ప్రవర్తించే తీరులో కానీ ప్రొఫెషనల్ తీరు సరిగ్గా అలవడలేదనే అనిపిస్తుంది. ఇల్లు, పిల్లలని చూసుకోవటం పూర్తిగా ఆడవాళ్ల బాధ్యతే అని ఇప్పటికీ మగవాళ్ళు నమ్ముతారు. ఇలాగే రోజంతా ఉద్యోగం చేసొచ్చినా సరే భర్తని కాస్త సహాయం చెయ్యమని అడిగే హక్కు కూడా వాళ్ళకు లేదనే మనస్తతత్వంతో ఉన్న స్ర్తిలు కూడా ఉంటారు. ఇంట్లో పని, ఆఫీసులో పని రెండూ కలిసి స్ర్తిలో వత్తిడి పెంచుతుంది. ఆఫీసుకు వెళ్లగానే వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ప్రపంచంలో అడుగుపెట్టినట్టు అనిపిస్తుంది స్ర్తిలకి. నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, పనిచేసే స్వేచ్ఛ, ఆ పనికి వారికి దక్కే గుర్తింపు ఇవన్నీ వాళ్ళకు రిలీప్‌గా వుంటుంది. ఇంటి దగ్గర నిర్లక్ష్యానికి గురై ఆఫీసులో ప్రత్యేకమైన గుర్తింపు పొందే సందర్భాలలో ఆఫీస్ స్నేహాలు ఒక అడుగు ముందుకు వేసి, ప్రత్యేక అనుబంధాలుగా మారే అవకాశాలు లేకపోలేదు. పర్యవసానంగా తెలిసీ తెలియకుండా కుటుంబం, ఉద్యోగం అన్నిటికీ మించి మనశ్శాంతి అన్నీ రిస్క్‌లో పడిపోతాయి.
శుక్రవారం సాయంత్రం ఆఫీసు నుండి బయలుదేరే హడావిడిలో ఉండగా శ్రేయా టీమ్‌మేట్ ఆకాష్ తన దగ్గరకు వచ్చి రేపు సాయంత్రం మూవీకి వెళదామా శ్రేయా అని అడిగాడు. గుడ్ ఐడియా, పనిలో పనిగా నీ భార్యని కూడా కలిసినట్టు ఉంటుంది. తను కూడా వస్తుందిగా మూవీకి? అని అడిగేసరికి ఆకాష్‌కి మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు. శ్రేయతో ఒక్కడే మూవీకి వెళదామనుకున్నాడే కానీ, భార్య ఒకవైపు, శ్రేయ ఒకవైపు, తను మధ్యలో కూర్చుని మూవీ చూడాలనే ఆలోచనే చెమట్లు పట్టించాయి. శ్రేయ పెళ్లి చేసుకోలేదు. ఇప్పట్లో చేసుకోవాలనే ఉద్దేశ్యమూ లేదు. సింగిల్‌గా ఉండటంలో ఉండే కష్టసుఖాలు దానికే ఉంటాయి. తన నిర్ణయాలు తను తీసుకునే స్వేచ్ఛ, ఒకరి అనుమతి కోసం ఎదురుచూడకుండా తన కలలను సాకారం చేసుకునే స్వేచ్ఛ అలాగే పూర్తి బాధ్యత కూడా తనదే. 24 గంటలూ తను అప్రమత్తంగా ఉండాలి. ‘‘డ్రాప్ చేయమంటావా, కాఫీకి వెళదామా, ఏంటి నీరసంగా ఉన్నావు, హాస్పిటల్‌కి తోడు రమ్మంటావా’’- ఇలా తన కొలీగ్స్ ఏదో ఒక వంకతో తనకి దగ్గరవ్వాలని చూసేవాళ్ళే. వీటన్నిటికీ తను ఎన్నుకున్న మార్గం ఒక్కటే. కాదు, వద్దు అని చెప్పాలనుకున్నప్పుడు నిర్భయంగా, నిర్మొహమాటంగా వద్దు అని చెప్పటమే.
ప్రతి బంధానికి ఒక పరిధి ఉంటుంది. అది స్నేహం కావచ్చు, చుట్టరికం కావచ్చు లేక వృత్తిపరమైన బంధాలు కావచ్చు. ఎదుటివారు మన నుండి ఏమి ఆశించవచ్చు, వాళ్ళు మనతో ఎలా ప్రవర్తించాలి అని తెలియజేసేవి ఈ పరిధులే. మనతోపాటు పనిచేసే కొలీగ్స్‌కి మరీ వ్యక్తిగతమైన కాంప్లిమెంట్స్ కానీ, కంప్లెంట్స్‌గానీ చేసే అవకాశం ఇవ్వకూడదు. అలాగే చెయ్యకూడదు కూడా. మనతో కలిసి పనిచేస్తున్నారు కదా అని అతి చనువుతో వాళ్ళని ప్రతి విషయంలో వారి మీద ఆధారపడకండి. మీరు వారిని గుడ్డిగా నమ్ముతున్నారనే అభిప్రాయాన్ని కలగజేయకండి. మీ మేల్ కొలీగ్స్‌తో మీకు ఎటువంటి అసౌకర్యం కలిగినా మీ తోటి స్ర్తి కొలీగ్స్‌తో ఆ విషయాలను కచ్చితంగా పంచుకోండి. ఆఫీస్ గాసిప్స్ ద్వారా ఆ విషయం అతి త్వరలో తప్పుచేస్తున్న వ్యక్తికి కచ్చితంగా చేరుకుంటుంది. జాగ్రత్తపడతాడు. మీ ఉద్యోగం, మీ వ్యక్తిత్వంలోని ఒక ముఖ్యమైన భాగం. వృత్తిపరమైన జీవితంలో మీరు చూపించే విలువల సారాంశమే మీ వ్యక్తిత్వం. అద్దంలో చూసుకుంటే మీ మీద మీకు గర్వం కలిగేలా ఉండాలి మీ ప్రవర్తన. మీ ఉద్యోగాన్ని ప్రేమించండి, మీ ఆఫీసులో మీరు గడిపే ప్రతి క్షణాన్ని ఆనందించండి, ఆస్వాదించండి. కాని ఒక్కటి గుర్తుపెట్టుకోండి- రోజు ముగిసే సమయానికి మీ కోసం ఎదురుచూస్తున్న మీ కుటుంబం దగ్గరకు మీరు ఎటువంటి అపరాధభావం లేకుండా తిరిగి వెళ్లగలగాలి.
........................................................................................................................
మాతృభూమికి రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003

-సంజీవనీ కుసుమ్