మెయన్ ఫీచర్

జడ్జీల మధ్య భూసేకరణ చిచ్చు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్వోన్నత న్యాయస్థానంలోనే క్రమశిక్షణ అంశం చర్చకు రావడం, న్యాయవ్యవస్థలో క్రమశిక్షణ లోపిస్తే వ్యవస్థలకు నష్టమని ముగ్గురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానించడంతో- మరో మారు సుప్రీం జడ్జీల మధ్య ‘స్నేహం’పై చర్చ మొదలైంది. ‘్భసేకరణ- పునరావాసం- పునర్నిర్మాణం- 2013’ చట్టం అమలుకు సంబంధించిన కేసులో ముగ్గురు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్‌ఎం లోథా, జస్టిస్ లోకూర్, జస్టిస్ జోసఫ్‌లతో కూడిన ధర్మాసనం 2014లో ఇచ్చిన తీర్పుకు భి న్నంగా తాజాగా జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎకె గోయల్, జస్టిస్ మోహన్ ఎం శంతన్ గౌడర్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. ఆ తీర్పును మదన్ బి లోకూర్ నేతృత్వంలోని మరో ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ పక్కన పెడుతూ అరుణ్ మిశ్రా బెంచ్ వ్యవహరించిన తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
నిర్ణీత అయిదేళ్ల వ్యవధిలో నష్టపరిహారాన్ని పొందకపోవడం అనేది భూ సేకరణను రద్దు చేయడానికి ప్రాతిపదిక కాదంటూ ఫిబ్రవరి 8న త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై లోకూర్, కురియన్ జోసెఫ్, దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం ఫిబ్రవరి 21న వ్యాఖ్యానించింది. ఆ తీర్పు అమలును దాదాపు నిలుపుదల చేసింది. నష్టపరిహారం చెల్లించకపోవడం అనే కారణంతో భూ సేకరణ రద్దు చేయవచ్చని 2014లో సుప్రీం ధర్మాసనం తీర్పు చెప్పింది. ఈ అంశంపై భిన్నాభిప్రాయం ఉంటే దానిని విస్తృత ధర్మాసనానికి నివేదించాల్సిందేనని తాజాగా మరో ధర్మాసనం అభిప్రాయపడింది. న్యాయస్థానం అంతా ఒక్కటే అని చెప్పడానికి క్రమశిక్షణ అవసరమని పేర్కొంది. విస్తృత ధర్మాసనమే ఈ అంశంపై విచారణ జరపాలా? వద్దా? అనేది తేలేవరకూ భూసేకరణ కేసులను వాయిదా వేయాలని తాజా ధర్మాసనం పేర్కొంది. సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ లేవనెత్తిన అంశాలను ప్రస్తావిస్తూ ఫిబ్రవరి 8న త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును ప్రాతిపదికగా చేసుకుని హైకోర్టులు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదని ఆదేశించింది. ఈ అంశంపై తదుపరి విచారణను మార్చి 7వ తేదీకి వాయిదా వేసింది. పరిస్థితులను సమీక్షించిన సుప్రీం ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ఈ పిటిషన్లపై విచారణకు ఐదుగురు సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు.
కేసుకు సంబంధించిన అంశాలను చూస్తే పేదలు, రైతులకు చెందిన భూమి సేకరణ, పునరావాసం, పునర్నిర్మాణంపై దృష్టిపెట్టినట్టు అర్థమవుతుంది. కాని లోగుట్టులోకి వెళితే వివిధ ధర్మాసనాల్లో ఉన్న న్యాయమూర్తుల ఆలోచనల తీరు స్పష్టం అవుతుంది. ఇటీవల సుప్రీంలో రోస్టర్‌కు సంబంధించి వివాదం జరిగినపుడు జూనియర్ న్యాయమూర్తులకు సీరియస్ కేసులను అప్పగించడంపై చర్చ జరిగింది. ఈ చర్చ తర్వాత కొద్ది రోజులకు సద్దుమణిగిందని అంతా భావించిన తరుణంలో 2014 తీర్పుకు భిన్నమైన తీర్పును త్రిసభ్య ధర్మాసనం ఇవ్వడం వెంటనే 13 రోజుల వ్యవధిలో మరో ధర్మాసనం- త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును తప్పుపట్టడంలో చట్టపరమైన అంశాలే కాక, న్యాయమూర్తుల మధ్య ముసలం వెలుగులోకి వచ్చింది.
మన దేశంలో పౌరులకు ఉన్నన్ని న్యాయమార్గాలు ప్రపంచంలో ఎక్కడా లేవనే చెప్పాలి. మున్సిఫ్ కోర్టులు, జిల్లా కోర్టులు, ట్రిబ్యునళ్లు, లోకాయుక్త, హైకోర్టులు, రాజ్యాంగ ధర్మాసనాలు, చివరికి సుప్రీంలో పూర్తిస్థాయి రాజ్యాంగ ధర్మాసనం వరకూ ఎన్నో అవకాశాలను రాజ్యాంగం అందుబాటులో ఉంచింది. ఏక సభ్య న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును ఇద్దరు లేదా ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ మరింత లోతైన అధ్యయనం చేసి ఆ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును కొట్టి వేయడం లేదా సవరించడం లేదా సమర్ధించడం జరుగుతుంది. అక్కడా న్యాయం జరగలేదని భావించినపుడు పూర్తిస్థాయి రాజ్యాంగ ధర్మాసనం ముందు సవాలు చేయవచ్చు, ఆ అవకాశం కూడా ముగిసిన తర్వాత సుప్రీంను, అందులోని ఇద్దరు సభ్యుల బెంచ్, ముగ్గురు సభ్యుల బెంచ్, ఐదుగురు సభ్యుల బెంచ్ ముందు సవాలు చేసే అవకాశం ఉంది. చివరికి పూర్తిస్థాయి బెంచ్ ముందు పిటిషన్ దాఖలు చేయొచ్చు. ఒక న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును సవరించాలంటే మళ్లీ ఇద్దరు లేదా ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ ముందే జరగాలి. ముగ్గురు జడ్జీలు ఇచ్చిన తీర్పును సవరించాలంటే ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ లేదా ఏడుగురు అంతకంటే తీవ్రమైన అంశాల్లో 11 మంది న్యాయమూర్తుల బెంచ్ ముందుకు వెళ్తుంది. ఇదంతా నిబంధనల పరంగానే కాకుండా ఒక సంప్రదాయంగాను కొనసాగుతోంది.
కొత్త ధర్మాసనం
సంప్రదాయానికి భిన్నంగా రాజ్యాంగ ధర్మాసనాలు వ్యవహరించడంతో తాజా వివాదం తలెత్తింది. భూ సేకరణ కేసుల్లో భిన్న ధర్మాసనాలు విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో ‘న్యాయ క్రమశిక్షణ’ దెబ్బతింటుందన్న త్రిసభ్య ధర్మాసనం ఆందోళనపై ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మార్చి 6 నుండి వాదనలను వింటుంది. పరిహారం చెల్లించకపోవడాన్ని కారణంగా చూపుతూ భూ సేకరణ రద్దు చేయవచ్చని 2014లో సుప్రీం త్రిసభ్య ధర్మాసనం తీర్పు చెప్పింది. ప్రభుత్వ ఖజానాలో సొమ్ము జమ చేయకపోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని పేర్కొంది. ఈ తీర్పును కొట్టి వేస్తూ ఫిబ్రవరి 8న మరో త్రిసభ్య ధర్మాసనం 2:1 మెజార్టీతో తీర్పు చెప్పింది. పూణె మున్సిపల్ కార్పొరేషన్ వెర్సస్ హరక్‌చంద్ మిసిరిమాల్ సోలంకీ కేసు విచారణకు వచ్చినపుడు 2014 నాటి తీర్పులో భూ సేకరణకు సంబంధించిన చట్టాన్ని సరిగా పరిగణనలోకి తీసుకోలేదని అరుణ్ మిశ్రా బెంచ్ పే ర్కొంది. ఐదేళ్లలోగా పరిహారాన్ని అంగీకరించడంలో భూ యజమాని చేసిన జాప్యం వల్ల భూ సేకరణను రద్దు చేయడం సరికాదంది, ఒక ప్రభుత్వ సంస్థ సేకరించిన భూమికి పరిహారాన్ని భూ యజమానికి బేషరతుగా అందజేసినపుడు దానిని అతడు తిరస్కరించినా, ప్రభుత్వ సంస్థ బాధ్యత పూర్తయినట్టేనని స్పష్టం చేసింది. పరిహారాన్ని తిరస్కరించిన వ్యక్తి ఆ సొమ్మును కోర్టులో జమ చేయలేదని కానీ, తనకు చెల్లించలేదని కానీ అభ్యంతరం వ్యక్తం చేయజాలరని పేర్కొంది. భూ సేకరణ రద్దును అటువంటి వారు కోరలేరని కూడా పేర్కొంది.
స్టేట్ ఆఫ్ హర్యానా వెర్సస్ మెసర్స్ జిడి గోయంకా టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (స్పెషల్ లీవ్ పిటిషన్ 8453/2017) పిటిషన్ సుప్రీంలో ఫిబ్రవరి 21న విచారణకు వచ్చినపుడు లోకూర్ నేతృత్వంలోని మరో త్రిసభ్య ధర్మాసనం భూ సేకరణ చట్టాన్ని అన్వయించే అంశంలో అరుణ్ మిశ్రా ధర్మాసనం వెలువరించిన తీర్పును తప్పుపట్టింది. అరుణ్ మిశ్రా బెంచ్ న్యాయ క్రమశిక్షణను ఉల్లంఘించి, నిర్లక్ష్యంగా వ్యవహరించిందని లోకూర్ ధర్మాసనం పేర్కొంది. భిన్నాభిప్రాయం ఉంటే విస్తృత ధర్మాసనానికి నివేదించాల్సి ఉందని, క్రమశిక్షణను పాటించకుంటే న్యాయవ్యవస్థ తెరమరుగవుతుందని వ్యాఖ్యానించింది. ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించడంపై తుది నిర్ణయం వెలువడే వరకూ భూ సేకరణ చట్టం-2013లో న్యాయబద్ధమైన పరిహారం, పారదర్శకతలకు సంబంధించి సెక్షన్ 24పై ఎలాంటి కేసులనూ విచారించరాదని హైకోర్టులకు సూచించింది. ఈ నెల 8 నాటి తీర్పుపై దాదాపుగా ‘స్టే’ విధించింది. ఫిబ్రవరి 22న భూ సేకరణపై మరో కేసు అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ఆ ముందు రోజే జస్టిస్ లోకూర్ ధర్మాసనం వెలువరించిన తీర్పుతో విచిత్ర పరిస్థితి ఎదురవడంతో ఈ కేసు విచారణకు సంబంధించి ప్రధాన న్యాయమూర్తి సరైన ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలంటూ కోరారు. ఈ నేపథ్యంలోనే ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. ఇందులో ప్రధాన న్యాయమూర్తితో పాటు ఏకే సిక్రీ, ఏఏం జాన్ విల్కర్, డీవై చంద్రచూడ్, అశోక్‌భాన్‌లు ఉంటారు.
1757లో ప్లాసీ యుద్ధంతో మొదలై బ్రిటిష్ ప్రభుత్వం భారత భూభాగాన్ని అంచెలంచెలుగా చేజిక్కించుకుంది. ఆ క్రమంలోనే సరకు రవాణాకు రైల్వే లైన్లు, రోడ్ల నిర్మాణానికి, పాలనాపరమైన అవసరాలకు భూ సేకరణ చేపట్టింది. దేశం అంతటికీ వర్తించేలా 1894లో భూ సేకరణ చట్టం చేశారు. 1899 ఫిబ్రవరి 1న ఈ చట్టం అమలులోకి వ చ్చింది. ఈ చట్టానికి తొలి సవరణ సెక్షన్ 5ఎ బ్రిటిష్ కాలంలోనే 1923లో జరిగింది. బలవంతపు భూ సేకరణను ఆనాడే రైతులు ప్రతిఘటించినపుడు అభ్యంతరాలు తెలపడానికి భూ యజమానులకు అవకాశం కల్పిస్తూ చట్ట సవరణ చేశారు. సహాయ నిరాకరణ ఉద్యమ ప్రభావంతో కాంగ్రెస్ ప్రతినిధులు స్థానిక ప్రభుత్వాల్లో ఉండటం వల్ల ఆ సవరణ జరిగింది. అప్పటి నుండి ఇంతవరకూ ఆ చట్టానికి 17 సార్లు సవరణలు జరిగాయి. కీలకమైన సవరణలు 1960 దశకంలో చేశాక ప్రైవేటు అవసరాలకు సైతం భూ సేకరణ మొదలైంది. పదేళ్ల క్రితం వరకూ 1894 నాటి చట్టం ఆధారంగానే భూ సేకరణ జరిగేది. 2004 వరకూ 2.5 కోట్ల హెక్టార్ల భూమిని సేకరించగా ఆరుకోట్ల మందికి పైగా నిర్వాసితులుగా మారారని అంచనా. వారిలో గిరిజనులు నలభై శాతం కాగా, దళితులు, బిసిలు చెందిన వారు మరో 20శాతం మంది ఉన్నారు. దేశ జనాభాలో గిరిజనులు 8 శాతం కాగా నిర్వాసితులైన వారిలో గిరిజనులు 40 శాతం మంది ఉండటం గమనార్హం. ఇంత వరకూ నిర్వాసితులైన వారిలో కేవలం 3 శాతం మందికి మాత్రమే ప్రభుత్వాలు పునరావాసం కల్పించాయని పార్లమెంటరీ స్థారుూ సంఘం నివేదిక పేర్కొంది.
కేంద్రప్రభుత్వం అనేక కసరత్తులు చేసి పునరావాస పునర్నిర్మాణ విధానాన్ని 2007 అక్టోబర్ 31న గెజిట్‌లో ప్రకటించింది. విధానానికి చట్టబద్ధత ఉండదు కనుక అప్పటి ప్రభుత్వం 2009 ఫిబ్రవరి 25వ తేదీన లోక్‌సభలో బిల్లు పెట్టి ఆమోదం పొందింది. రాజ్యసభ ఆమోదం పొందక ముందే లోక్‌సభ రద్దు కావడంతో ఆ బిల్లు మురిగిపోయింది. 14వ లోక్‌సభలో 2009లో సవరించిన బిల్లును 2011 సెప్టెంబర్ 7న లోక్‌సభలో ప్రవేశపెట్టారు, అయితే దానికి 2013 ఆగస్టు 29న లోక్‌సభలో, సెప్టెంబర్ 4న రాజ్యసభలో ఆమోదం లభించింది. 2004-05లో కసరత్తు ప్రారంభమైన పునరావాస విధానం ఆ తర్వాత బిల్లు రూపొంది చట్టంగా మారడానికి తొమ్మిదేళ్లు పట్టింది. 2016లో ఎన్‌డీఏ ప్రభుత్వం భూ సేకరణ చట్టంలో మార్పులు ప్రతిపాదించడంతో ఈ చట్టంలోని సెక్షన్ 24(2)పై చర్చ మొదలైంది. పూర్తి రాజ్యాంగ ధర్మాసనం ఈ నిబంధనలను ఎలా నిర్వచిస్తుందో వేచి చూడాలి. ఈలోగా న్యాయమూర్తుల మధ్య ‘స్నేహం’ కుదుటపడుతుందని ఆశించడం గొంతెమ్మ కోరిక కానేకాదు.

-బీవీ ప్రసాద్ 98499 98090