మెయన్ ఫీచర్

జయ జయ శంకర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నకర్మణా న ప్రజాయా ధనేన త్యాగే నైకేన అమృత్వ మానషుః - అని ఆర్ష సంప్రదాయం. ఒక వ్యక్తిగాని, ఒక సంస్థగాని త్యాగం వల్ల మాత్రమే అమృతత్వాన్ని పొందగలగడం సాధ్యం. తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురంలో శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి శివైక్యం చెందడం ద్వారా తాను అమృతత్వం సాధించడంతోపాటు భారత జాతికి అమృతమయమైన ఒక సందేశాన్ని అందించారు. కంచి కామకోటి పీఠానికి 69వ పీఠాధిపతిగా జయేంద్ర సరస్వతి తన 18వ ఏట పట్ట్భాషిక్తులైనారు. ఈ సంఘటన 1954వ సంవత్సరం మార్చి నెల 24న జరిగింది. అంతకుముందు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి కంచి పీఠాధిపతిగా ఉన్నారు. వారికి ‘నడిచే దైవం’ అని పేరు. అలాంటి మహాపురుషుని స్థానాన్ని స్వీకరించాలన్నా, ఆ పరంపరను సమున్నతంగా కొనసాగించాలన్నా అది దైవాంశ సంభూతులకు మాత్రమే సాధ్యం. తమిళనాడులోని మన్నార్‌గుడి ప్రాంతంలోని ఇదుర్‌విక్కి అనే ప్రాంతంలో ఒక సనాతన సంప్రదాయ శైవ కుటుంబంలో సుబ్రహ్మణ్య మహాదేవ అయ్యర్ అనే పిల్లవాడు 1935వ సంవత్సరంలో జన్మించాడు. ఆ కుర్రాడే తరువాతి కాలంలో జయేంద్ర సరస్వతిగా సుప్రసిద్ధులైనారు. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాములవారి అడుగుజాడలలో జయేంద్ర సరస్వతి పయనించి హిందూ ధర్మానికి ఎనలేని సేవ చేశారు. ఆయన దృష్టిలో మానవులంతా సమానమే. అదే నిజమైన సనాతన ధర్మ సందేశం. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఒకటి ఉంది. తత్పూర్వ పీఠాధిపతులు ఇతర ఆధ్యాత్మిక గురువులు మోక్ష పురుషార్థాన్ని గురించి ఎక్కువగా ప్రవచిస్తూ వుండేవారు. జయేంద్ర సరస్వతి ‘మానవ సేవయే మాధవసేవ’ అన్న సందేశాన్ని నమ్మారు. కళ్ల ఎదురుగా కన్పడుతూ వున్న ఈ జనతా జనార్దనుణ్ణి ఆరాధించడమే మోక్ష సాధన అన్న అంశాన్ని నమ్మిన పీఠాధిపతులలో జయేంద్ర సరస్వతి అగ్రగణ్యులు. సేవ వేరు, శివారాధన వేరు అని ఆయన భావించలేదు. ఈ కారణం చేతనే జయేంద్ర సరస్వతుల వారి ఆధ్వర్యంలో అసంఖ్యాకమైన విద్యాలయాలు, వైద్యాలయాలు, వృద్ధాశ్రమాలు, గోశాలలు- ఇలా ఒకటేమిటి? అనేకమైన సేవా సంస్థలు ఏర్పడ్డాయి. చెన్నైలోని శంకర నేత్రాలయ, అస్సాంలోని గౌహతి ప్రాంతంలోని నేత్రాలయం వీరి సేవలకు ప్రత్యక్ష నిదర్శనాలు. హిందూ ధర్మం విశ్వవ్యాప్తమైనది అని ఎందరో నమ్మారు. నిజమే కానీ జయేంద్ర సరస్వతి దానిని ఆచరణలో చూపించారు.
హిందూత్వం సంకుచితమైనది కాదు. అది జాతి కుల మత వర్గ వర్ణ లింగ భేదాలకు అతీతంగా ‘సర్వేజనా సుఖినోభవంతు’ అనే సందేశాన్ని అందించింది. ఇదే నిజమైన వైదికభావన. దీనిని మనస్ఫూర్తిగా నమ్మినవాడు జయేంద్ర సరస్వతి. ఈ కారణం చేతనే ఆయన చివరి శ్వాస విడిచేవరకూ సేవా కార్యక్రమాలలోనే నిమగ్నమై ఉన్నాడు. తమిళనాడులోని రాజకీయ పక్షాలకు ఇది రుచించలేదు. ఎందుకంటే, తమ ద్రవిడోద్యమానికి ఈ హిందూ సంస్థలు అడ్డం వస్తున్నాయని భావించారు. అందువల్లనే వారు కుట్రలు పన్నారు. చంద్రశేఖరేంద్ర స్వాములవారిమీద ఆంక్షలు విధించారు. దేవుడు లేడు అంటూ ప్రచారం చేశారు. జయేంద్ర సరస్వతి మీద హత్యాభియోగాలు నమోదు చేశారు. కోర్టుకు ఈడ్చారు. జైల్లో పెట్టి ఆయనకు సంప్రదాయ విరుద్ధంగా అక్కడి తిండి తినిపించారు. అవేవి స్వాములవారు పట్టించుకోలేదు. ఎందుకంటే, ఆయన దేహి, వేరు దేహం వేరు అని భావించినవాడు. జయేంద్ర సరస్వతిని అవమానించడంలో కరుణానిధికి ఏ విధంగానూ జయలలిత తీసిపోలేదు. ఈ విధంగా తమ ద్రవిడ రాజకీయాలకు అడ్డం వచ్చే ఒక తృతీయ ఆర్ష శక్తిని తొక్కిపెట్టాలని వారు ప్రయత్నించారు. కానీ కడిగిన ముత్యంలాగా జయేంద్ర సరస్వతి కోర్టుకేసులనుండి బయటపడ్డారు. ఎవరైతే ఆయనమీద అభియోగాలు మోపారో వారు దారుణంగా చనిపోయారు.
జయేంద్ర సరస్వతి ఒక దశలో సన్యాస ఆశ్రమాన్ని కూడా అతిక్రమించి సమాజంలో విలీనం కావాలని ప్రయత్నించారు. ఆయన తలకావేరి వద్దకు వెళ్లి దండకమండలాలను విసర్జించడం ఒక దశలో చాలా వివాదాస్పదమయింది. అంతేకాదు, హిందూ దేవాలయాల్లో శతాబ్దాలుగా బ్రాహ్మణులే పూజారులుగా ఉండేవారు. అయితే జయేంద్ర సరస్వతి అందుకు భిన్నంగా పూజ చేసే అధికారం సత్వగుణ సంపన్నుడైన ఎవరికైనా ఉంటుంది అని భావించారు. ఇలా మానవీయమైన లక్షణాలతో జయేంద్ర సరస్వతి చేసిన కొన్ని పనులు సంచలనాలను సృష్టించాయి. ఏ విధంగా చూసినా భారతదేశంలోని సమకాలీనమైన పీఠాధిపతులందరూ చేసిన హిందూ సమాజ సేవతో పోల్చిచూసినట్లయితే జయేంద్ర సరస్వతి అగ్రశ్రేణిలో ఉంటారనేది నిస్సందేహం.
జయేంద్ర సరస్వతి తమిళనాడులో మాత్రమే కాకుండా మొత్తం భారతదేశం అంతటా తన సందేశాన్ని వినిపించారు. హైదరాబాద్‌కు సంబంధించినంతవరకూ ప్రతి సంవత్సరం వారు కోటిదీపోత్సవంలో తమ అమృత సందేశాన్ని వినిపిస్తూ ఉండేవారు. భారతదేశంలోని ధార్మిక సంస్థలన్నింటినీ ఒకే వేదికమీదకు తీసుకురావాలని ఆయన భావించారు. హిందూ మతం నుండి అన్యమతాల్లోనికి ధనాన్ని ప్రలోభంగా చూపి కొందరు చేసే మతాంతరీకరణలను ఆయన అంగీకరించలేదు. ‘స్వధర్మే నిధనం శ్రేయహాః పరధర్మో భయావహః’అనే గీతా వాక్యాన్ని జయేంద్ర సరస్వతి నమ్మారు. ‘హిందువుగా పుట్టినందుకు గర్వించు. హిందువుగానే జీవించు’ అని ఆనాడు స్వామి వివేకానంద ఇచ్చిన పిలుపునే జయేంద్ర సరస్వతి 20వ శతాబ్దంలో తిరిగి వినిపించారు. ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ తన పర్యటనలను ఆయన ఆపలేదు. 82వ సంవత్సరంలో శ్వాసకోశ వ్యాధితో తుదిశ్వాస విడిచేవరకూ వారు సమాజ సేవలోనే నిమగ్నమై ఉన్నారు.
భారతదేశంలో ఆదిశంకరులు ప్రవచించిన తత్వానికి అద్వైతము అని పేరు. ప్రధానంగా శృంగేరి, ద్వారక, పూరి, జ్యోతిర్మఠ్ అనేవి నాలుగు ముఖ్య అద్వైత కేంద్రాలు. ఆ తరువాత కంచి కామకోటి పీఠం ఐదవ కేంద్రంగా ప్రసిద్ధిలోనికి వచ్చింది. ఇక్కడ వైదిక సంప్రదాయ ప్రచార ప్రబోధములు, పఠన పాఠనములు జరుగుతూ ఉంటాయి. వేదమును అభ్యసింపజేసే నిమిత్తము పాఠశాలలు పెట్టారు. వైదిక ధర్మ ప్రచారకులను సృష్టించారు. ఈనాటి సంక్లిష్ట సమాజంలో ఇది చాలా కష్టమైన పని. ఏ ధర్మమైనా పుస్తకములమీద ఆధారపడి వుండదు. దాన్ని ప్రబోధించే ధర్మాధిపతులమీదా, ఆచరించే భక్తుల గుణశీలములమీద ఆధారపడి వుంటుంది. ఆ విధంగా చూచినప్పుడు కంచి పీఠం యొక్క ఘనత శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి, వారి తరువాత వచ్చిన జయేంద్ర సరస్వతి స్వాములవారి యొక్క వ్యక్తిత్వములమీదనే పరిఢవిల్లిందని మనం విశ్వసింపవచ్చు. భారత రాష్టప్రతులు ఎవరు ప్రమాణ స్వీకారం చేసినా వారు 1950వ దశకం నుండి నేటి వరకూ కంచి పీఠానికి వచ్చి స్వాములవారి ఆశీస్సులు స్వీకరించి వెళ్లడం పరిపాటిగా మారింది. దేశంలోని ప్రముఖ రాజకీయవేత్తలందరూ స్వాములవారి ఆశీస్సులను అందుకుని థార్మికంగా పరిపాలించాలి అనే స్ఫూర్తిని పొందారు. కొద్దిరోజుల క్రితమే తమిళనాడు గవర్నర్‌గా నియుక్తులైన బన్వరిలాల్ పురోహిత్ కంచి పీఠానికి వచ్చి జయేంద్ర సరస్వతి వారి ఆశీస్సులను స్వీకరించారు.
జయేంద్ర సరస్వతుల తరువాత విజయేంద్ర సరస్వతి ఆ బాధ్యతను స్వీకరిస్తున్నారు. ఇది చాలా గురుతరమైనది. ఆదిశంకరుల అడుగుజాడలలో జయేంద్ర సరస్వతులవారి స్ఫూర్తితో భారతమాతను విశ్వగురువుగా చాటేందుకు కంచిపీఠం నిరవధికంగా కృషిచేస్తుంది అని ఆశిద్దాం. జయేంద్ర సరస్వతి మృతి సృష్టి సహజమే అయినప్పటికీ వారు వెలిగించిన సనాతన జ్యోతి నిరంతరమైనది. చిరంతనమైనది.

- డా. ముదిగొండ శివప్రసాద్ ఫోన్: 040- 27425668