మెయన్ ఫీచర్

వచ్చే ఎన్నికల్లో అవినీతే ప్రధానాంశం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం అరెస్ట్‌తో జాతీయ స్థాయిలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. లండన్ నుంచి చెన్నైకు చేరుకున్న కార్తీని మనీ లాండరింగ్ కేసులో ఎయిర్‌పోర్ట్‌లోనే సిబిఐ అధికారులు హడావుడిగా అరెస్టు చేయడంతో- అవినీతి పట్ల తాము కఠినంగా ఉన్నామన్న సందేశాన్ని ప్రజలకు ఇవ్వడానికి మోదీ ప్రభుత్వం యత్నించినట్టు స్పష్టమవుతోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఒకరోజు ముందు కార్తీని అరెస్ట్ చేయడం ద్వారా రాజకీయ లబ్ది కోసం ప్రభుత్వం ఆతృతతో ఉన్నట్లు భావించాల్సి ఉంది. ఇప్పటికే ఈడితో పాటు సిబిఐ పలుమార్లు కార్తీని విచారించడం, ఆయన విదేశీ ప్రయాణాలు చేయకుండా ‘లుక్ అవుట్’ నోటీసులు జారీ చేయడం గత చరిత్ర. గత నవంబర్‌లో తన కుమార్తెను కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చేర్పించేందుకు కార్తీకి సుప్రీంకోర్టు అనమతినిచ్చింది.
అవినీతి, నల్లధనంపై రాజీలేని పోరాటం జరుపుతానని, నిజాయితీతో కూడిన పాలన అందిస్తానని వాగ్దానం చేసి 2014 ఎన్నికల్లో మోదీ అధికారంలోకి వచ్చారు. కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నా అవినీతి వదలడం లేదనే సంకేతం ఇచ్చే ప్రయత్నం చేయడం మినహా గత మూడున్నరేళ్లలో ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరించడం లేదని విమర్శలున్నాయి. గత పదిరోజుల్లోనే రూ.30 వేల కోట్ల విలువకు పైబడిన కుంభకోణాలు బయటపడినా కేంద్రం నోరు మెదపడమే లేదు. ఈ కుంభకోణాలకు పాల్పడిన వారు విదేశాలకు చెక్కేసినా ప్రభుత్వం నిస్సహాయంగా ఉంటోంది. సిబిఐ విచారణకు సహకరిస్తున్న కార్తీని దేశానికి తిరిగి వచ్చిన సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌లోనే అరెస్ట్ చేయడం సహజంగానే రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. వరుసగా బ్యాంకింగ్ కుంభకోణాలు వెలుగులోకి రావడం, రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం నేపథ్యంలో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. దీంతో అవినీతి అంశం తిరిగి దేశంలో ప్రధాన చర్చనీయాంశమైంది. ఒక విధంగా తమ వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఈ అరెస్ట్ జరిగినదని అనుమానాలకు సైతం ప్రభుత్వం ఆస్కారం కల్పిస్తున్నదని చెప్పక తప్పదు.
చట్టానికి ఎవరూ అతీతులు కాదనే విషయాన్ని కార్తీ అరెస్ట్ స్పష్టం చేస్తోందని ఈ చర్యను సమర్ధించుకొనేందుకు బీజేపీ యత్నిస్తోంది. మిగిలిన ఆరోపణల విషయంలో అంత పారదర్శకంగా, క్రియాశీలకంగా ప్రభుత్వం వ్యవహరించకపోవడం ప్రజల దృష్టిని ఆకట్టుకొనక మానదు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా కుమారిడిపై వచ్చిన ఆరోపణల విషయంలో గాని, అమిత్ షాను సొహోబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసు నుంచి తప్పించిన అంశంలో గాని, ఈ కేసు నుండి అమిత్‌షాను తప్పించడానికి నిరాకరించిన సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి లోయ అనుమానాస్పద మృతిపై గాని కనీస విచారణకు ముందుకు రాకపోవడంతో అవినీతి మరకలు మోదీ సర్కారుకు అంటుకొనక తప్పడం లేదు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడిన ‘డైమండ్ కింగ్’ నీరవ్ మోదీ తాను విచారణకు భారత్ వచ్చే ప్రసక్తి లేదని సిబిఐకి ధైర్యంగా చెప్పగలగడం, తాను ప్రస్తుతం ఎక్కడ ఉన్నానో కూడా దర్యాప్తు ఏజెన్సీలకు అంతుబట్టకుండా చేయడం గమనిస్తే ఎవరి అండదండలు లేకుండా ఇంతగా బరితెగించే ప్రయత్నం చేయరని భావించవలసి వస్తున్నది. విజయ్ మాల్యా సైతం ఇంతగా బరితెగించి వాదనలు చేయడం లేదు, ఇంత తలపొగరుగా వ్యవహరించటం లేదు. ఇలాంటి సంఘటనలు సహజంగానే మోదీ ప్రభుత్వానికి మచ్చలు తెస్తున్నాయి.
రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో బోఫోర్స్ తుపాకుల కొనుగోలుపై వచ్చిన అవినీతి ఆరోపణలు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుదిపి వేసాయి. 1989 ఎన్నికలలో బోఫోర్స్ కుంభకోణం కారణంగానే కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందడం తెలిసిందే. పి.వి. నరసింహారావు సైతం చారిత్రాత్మకమైన ఆర్థిక సంస్కరణల ద్వారా ప్రజల జీవితాలలో నూతన వెలుగులను రగిలింప చేసినా, ఆయన పాలనలో జరిగిన పలు అవినీతి కుంభకోణాల వల్లే 1996లో కాంగ్రెస్ ఓటమి చెందవలసి వచ్చింది. 2009 ఎన్నికల్లో మన్మోహన్ సింగ్ పరిపాలనకు సానుకూలంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. బహుశా జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత ప్రభుత్వ పనితీరును బట్టి ప్రజలు ఓట్లు వేసిన ఏకైక సందర్భం ఇదేనని చెప్పవచ్చు. అయితే, ఆ తరువాత వరుసగా వెలుగులోకి వచ్చిన అవినీతి కుంభకోణాల కారణంగా యుపిఏ ప్రభుత్వ పాలన మసకబారి 2014లో అధికారం కోల్పోయింది. అవినీతికి ఆస్కారం లేని ‘అచ్ఛాదిన్’ (మంచిరోజు) తీసుకొస్తానని భరోసా ఇవ్వడం ద్వారా గత సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి అనూహ్యమైన విజయం సాధించడాన్ని మనమంతా చూసాము. ప్రధాని పదవిని చేపట్టాక మోదీ అనేక వినూత్న పథకాలు తీసుకొచ్చి, ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు.
ఆ తరువాత పలు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో- అభివృద్ధి అజెండాతో, తన పాలనను చూసి ఓట్లు వేయమని మోడీ ప్రజలను కోరుతూ వచ్చారు. కానీ- గుజరాత్ ఎన్నికల నుండి త్వరలో ఎన్నికలు జరగబోతున్న కర్ణాటకలో సహితం ‘అభివృద్ధి అజెండా’ను బిజెపి ముందుకు తీసుకు వెళ్లడం లేదు. పుష్కరకాలం పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ సాధించారని చెబుతున్న అద్భుత ఫలితాలనే ‘గుజరాత్ మోడల్’ పేరుతో దేశం అంతా విశేష ప్రచారం కల్పించారు. ఇప్పుడు అటువంటి ధీమా బీజేపీ నాయకత్వంలో కనిపించడం లేదు. 2002 గుజరాత్ మత కలహాల అనంతరం ‘హిందూ హృదయ సామ్రాట్’గా ప్రఖ్యాతి వహించిన మోదీ తనను తాను ‘అభివృద్ధికి నమూనా’గా మలచు కోవడానికి విశేష ప్రయత్నం చేసారు. తనపై ‘హిందుత్వ ముద్ర’ చెరిపి వేసుకొనే ప్రయత్నం చేశారు. అటువంటి ప్రయత్నాలే ఆయనకు 2014 ఎన్నికలలో విశేషంగా ఉపకరించాయి. మోదీ పట్ల ప్రజలలో ఎన్నో ఆశలను రగిలింప చేశాయి. ఆయనను అభివృద్ధికి నమూనాగా ప్రజలు చూడడం ప్రారంభించారు. సుమారు గత నాలుగేళ్ల పాలనలో ఆయన మాటలు కార్యరూపం దాల్చక పోవడం, ఉపాధి అవకాశాలు మెరుగు పడకపోవడం, వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకు పోవడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఖాయిలా పడటం, నల్లధనం- అవినీతి నిర్మూలన నినాదంగానే మిగిలి పోవడంతో నేడు ‘మోదీ మోడల్’ అంతగా పనిచేయడం లేదు.
అందుకనే పలు రాష్ట్రాల్లో మోదీ కన్నా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రచారం చేయాలనీ బిజెపి కార్యకర్తలు డిమాండ్ చేయడం కనిపిస్తున్నది. మోదీ ప్రభుత్వానికి ప్రజానీకంలో ఆదరణ పెద్దఎత్తున తగ్గుతోందని సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీ (సిసిడిఎస్) అధ్యయనం వెల్లడించడం బిజెపి నాయకత్వానికి ఆందోళన కలిగిస్తున్నది. ఈ సంస్థకు చెందిన లోక్‌నీతి రీసెర్చ్ ప్రోగ్రామ్‌కు చెందిన కొందరు పరిశోధకులు ఒక మీడియా సంస్థ సహకారంతో జాతీయ స్థాయిలో నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
సిఎస్‌డిఎస్ అధ్యయనం ప్రకారం 2014లో యుపిఏ-2 ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కంటే మోదీ సర్కారుపై ప్రజల అసంతృప్తి ఎక్కువగా ఉంది. నోట్ల రద్దు, జిఎస్‌టి తదితర అంశాలు ఈ ప్రభుత్వం పట్ల ప్రజలలో నైరాశ్యం నెలకొనడానికి దారితీస్తున్నాయి. మోదీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో పెద్దగా కనిపించని అసంతృప్తి 2016 నుండి పెరగడం కనిపించింది. 2017 అర్ధ సంవత్సరం తరువాత ఈప్రక్రియ మరింత వేగవంతమవుతున్నది. గత ఏడాది వేసవి తరువాత మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి తీవ్ర స్థాయిలో పెరిగిన విషయాన్ని ఈ సర్వే స్పష్టం చేసింది. మంచి రోజులు తెస్తామన్న హామీ నెరవేర్చటంలో మోదీ విఫలమయ్యారన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో జరిగిన ఉప ఎన్నికలలో బిజెపి అభ్యర్థులు పరాజయానికి గురి కావడం, వచ్చే ఏడాది ఎన్నికల్లో అధికారంలోకి రాగలమనికొంటున్న ఒడిశాలో జరిగిన ఒక ఉపఎన్నికలో అధికార పక్షం కన్నా తాము బాగా వెనుకబడటం వంటివి సహజంగానే బిజెపి నాయకత్వానికి ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ఒక వ్యాఖ్య ఆసక్తి కలిగిస్తున్నది. ‘వచ్చే ఎన్నికలలో నేను ప్రధానిని కాకపోవచ్చు. కానీ మోదీ తిరిగి ప్రధాని కావడం మాత్రం సాధ్యం కాదు’ అని ఆయన చెప్పారు. ఇటువంటి అభిప్రాయం ఇప్పుడు పలు మార్గాలలో వ్యక్తం అవుతున్నది. బిజెపికి సొంతంగా పూర్తి ఆధిక్యత లభించనిదే ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యం కాదన్న అభిప్రాయం నేడు పలువర్గాల్లో వినిపిస్తోంది.
2019 ఎన్నికలకు ‘మిషన్ 350’ని లక్ష్యంగా అమిత్ షా ప్రకటించినా, ఆ దిశలో బిజెపి చెప్పుకోదగిన ముందడుగు వేయలేకపోతున్నది. కర్ణాటక ఎన్నికల తర్వాత పుదుచ్చేరిలో మినహా దేశంలో కాంగ్రెస్ మరెక్కడా అధికారంలో ఉండదని అమిత్ షా చెప్పడం సంచలనం కలిగించింది. బిజెపి బాగా దెబ్బతిన్న పంజాబ్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ మొత్తం ప్రభుత్వానే్న బిజెపిలో విలీనం చేస్తారన్న సంకేతాలను వ్యాప్తి చేస్తున్నారు. ఆ విధంగా చేయడం ద్వారా దేశంలో కాంగ్రెస్ ఉనికే లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినా బిజెపిలో అభద్రతా భావం కనిపిస్తున్నది. ఇప్పుడున్న లోక్‌సభ సీట్లను తిరిగి గెల్చుకోగలమనే దృఢమైన విశ్వాసం ఆ పార్టీ నాయకత్వంలో వెల్లడి కావడం లేదు. బిజెపితో పొత్తు కొనసాగిస్తే తాము రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందనే ఆందోళన చంద్రబాబు నాయుడు, నితీష్‌కుమార్ వంటి వారిలో కలుగుతోంది. దీంతో బిజెపి మిత్రుల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉంది. కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపురలలో మినహా 2014 తర్వాత బిజెపి మరెక్కడా చెప్పుకోదగిన రీతిలో తనబలాన్ని పెంచుకోలేక పోతున్నది. ప్రస్తుతం అధికారంలో ఉన్న రాజస్థాన్, హర్యానా, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో ఆ పార్టీ పట్టుకోల్పోతున్నది. ఈ పరిస్థితులు ఒకవిధంగా మోదీ రాజకీయ నాయకత్వానికి పెను సవాల్ విసురుతున్నాయి.
కాగా, మోదీ అవినీతి పరుడని ఆయన రాజకీయ ప్రత్యర్థులు సైతం ఆరోపించే సాహసం చేయడం లేదు. తాను నీతివంతుడైనప్పటికీ నీతివంతమైన పాలనను ఆయన అందించలేక పోతున్నారని అభిప్రాయం వ్యాపిస్తున్నది. రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం మోదీ నిజాయితీకి ఒక మచ్చగా మారుతున్నది. గతంలో యుపిఏ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం నమూనాను పక్కన బెట్టి, మోదీ హయాంలో మరోసారి చర్చలు జరగటంతో దీనిపై మెరుగైన ధరకు తేలికయిన షరతులతో తాజా ఒప్పందం కుదుర్చుకున్నామని ప్రభుత్వం చెబుతూ వస్తున్నది. యుపిఎ-2 హయాంలో ఒక్కో విమానానికి కుదిరిన ధరకన్నా రు.526 కోట్లు తక్కువ ధరతో తాము ఒప్పందం కుదుర్చుకున్నామని మోదీ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, తాజా ఒప్పందంలో రూ.670 కోట్ల మేర అధికంగా చెల్లించేందుకు మోదీ అంగీకరించినట్లు తెలుస్తోంది. ‘జాతీయ భద్రత’ పేరుతో ప్రభుత్వం ఈ ఒప్పందం వివరాల పరిశీలనను దాటవేస్తున్నది. దానితో అనుమానాలకు మరింతగా బలం చేకూరుతుంది. మోదీ స్వయంగా ఈ విమానాల తయారీ సంస్థ డస్సాల్ట్‌తో చర్చలు జరపటం, అధిక ధర చెల్లించేందుకు అంగీకరించటం, ప్రభుత్వ రంగంలోని హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్‌ను పక్కనబెట్టి ఓ కార్పొరేట్ సంస్థకు పెద్దపీట వేయటం వంటి చర్యలు అనేక ప్రశ్నలకు తావిస్తున్నాయి. సైనిక ఉత్పత్తుల రంగంలో అనుభవం లేని ప్రైవేట్ సంస్థకు ఏ ప్రాతిపదికన ఈ కాంట్రాక్ట్ అప్పగించారన్న ప్రశ్నకు మాత్రం ప్రభుత్వం నుండి సమాధానం లేదు.
ఏది ఏమైనా ‘అభివృద్ధి అజెండా’తో 2019 ఎన్నికలకు వెళ్లాలనే ప్రధాని మోదీ ఆశ నెరవేరేటట్లు కనిపించడం లేదు. అందుకే మరోసారి అవినీతి అంతమే రాబోయే ఎన్నికలకు ప్రధానాంశంగా మారుతున్నట్లు స్పష్టం అవుతున్నది

- చలసాని నరేంద్ర సెల్ : 98495 69050