బిజినెస్

జపాన్‌లో ‘మేక్ ఇన్ ఇండియా’ ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1200 బిలియన్ డాలర్ల ప్రత్యేక నిధితో ‘మిషన్ మోడ్’లో పరుగులు
ఇండియా-జపాన్ బిజినెస్ లీడర్స్ ఫోరం సమావేశంలో మోదీ వెల్లడి

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: తమ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం జపాన్‌లో ఉద్యమంలా మారిందని, ఇందుకోసం జపాన్ ప్రత్యేకంగా 1200 కోట్ల డాలర్ల నిధిని ఏర్పాటు చేసిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. న్యూఢిల్లీలో శనివారం ఆయన ఇండియా-జపాన్ బిజినెస్ లీడర్స్ ఫోరం సమావేశంలో ప్రసంగిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఇప్పుడు జపాన్‌లో ఉద్యమంలా మారింది. ఇందుకోసం ప్రత్యేకంగా దాదాపు 1200 కోట్ల డాలర్ల నిధులను కేటాయించినట్లు వారు తెలియజేశారు. భారత్, జపాన్ ఏవిధంగా ముందుకు సాగుతాయన్న విషయాన్ని ఇది స్పష్టం చేస్తోంది’ అని మోదీ అన్నారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కేవలం భారత్‌లోనే కాకుండా జపాన్‌లో సైతం ‘మిషన్ మోడ్’లో పురోగమిస్తోందన్నారు.
జపాన్‌కు మారుతీ కార్ల ఎగుమతి
జపాన్ తొలిసారిగా భారత్ నుంచి కార్లను దిగుమతి చేసుకోనుందని, మారుతీ-సుజుకీ సంస్థ భారత్‌లో తయారు చేస్తున్న కార్లను జపాన్‌కు ఎగుమతి చేస్తుందని తెలిపారు. భారత్-జపాన్ కేవలం బుల్లెట్ రైళ్ల రంగంలోనే కాకుండా అభివృద్ధి విషయంలోనూ కలసికట్టుగా హై-స్పీడ్‌తో ముందుకు సాగుతాయన్నారు. ఇటీవల తాను జపాన్‌లో జరిపిన పర్యటనను మోదీ ఈ సందర్భంగా గుర్తుచేస్తూ, భారత్‌లో 3,500 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడతామని జపాన్ హామీ ఇచ్చిందన్నారు. ‘ఈ సంఖ్యపై అప్పట్లో చాలా మంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. కానీ ఈ పెట్టుబడుల విషయంలో నేడు స్వల్ప కాలంలోనే అనూహ్యమైన పురోగతి జరగడంతో దీని పరిధి ఎంత విస్తృమైనదో క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది’ అని మోదీ అన్నారు. భారత్‌తో పాటు జపాన్‌లో ఆర్థిక సూచికలు మెరుగుపడటాన్ని మోదీ ప్రముఖంగా ప్రస్తావిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఇది ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తోందని, వర్తక, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో విస్తారమైన అవకాశాలకు భారత్ నెలవుగా ఉందన్న విషయం స్పష్టమవుతోందని అన్నారు. భారత్‌లో గత ఏడాది ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ‘జపాన్ ప్లస్’ కార్యక్రమం కూడా చక్కగా పురోగమిస్తోందని మోదీ పేర్కొంటూ, భారత్ కేవలం హైస్పీడ్ రైళ్లనే కాకుండా హైస్పీడ్ అభివృద్ధిని కూడా కోరుకుంటోందన్నారు. ఇరు దేశాల మధ్య గల వివిధ అవకాశాల గురించి ఇండో-జపాన్ బిజినెస్ ఫోరం చర్చించిందని, ఈ ఫోరం సిఫారసులను అమలు చేసే విషయాన్ని తమ ప్రభుత్వం చురుకుగా పరిశీలిస్తుందని ఆయన స్పష్టం చేశారు. దేశంలో వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు తమ ప్రభుత్వం అనురిస్తున్న వ్యూహం, విధాన నిర్ణయాలను సమర్ధవంతంగా అమలు చేయడం సత్ఫలితాలను ఇస్తోందని మోదీ తెలిపారు.
మోదీపై జపాన్ ప్రధాని ప్రశంసలు
జపాన్ ప్రధాని షింజో ప్రసంగిస్తూ, నరేంద్ర మోదీతో పాటు దేశంలో సంస్కరణల అమలుకు ఆయన చేపడుతున్న చర్యలపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘ఆర్థిక సంస్కరణలను, సరికొత్త విధానాలను అమలు చేయడంలో మోదీ బుల్లెట్ రైలులా దూసుకెళ్తున్నారు. ఆయన అనుసరిస్తున్న సంస్కరణల అజెండా బుల్లెట్ రైలు కంటే సురక్షితమైనది’ అని షింజో అబే పేర్కొంటూ, జపాన్ పెట్టుబడులకు భారత్ ఎంతో ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారిందన్నారు. ఆర్థిక రంగంలో భారత్, జపాన్ కలసికట్టుగా పనిచేయాలని భావిస్తున్నాయని, దీని వల్ల ఇరు దేశాలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ‘జపాన్ బలంగా ఉంటే భారత్‌కు మేలు జరుగుతుంది. భారత్ బలంగా ఉంటే జపాన్‌కు పేలు జరుగుతుంది. కనుక ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని నేను ఆశిస్తున్నా’ అని షింజో అబే స్పష్టం చేశారు.
(చిత్రం) ఇండియా-జపాన్ బిజినెస్ లీడర్స్ ఫోరం సమావేశానికి హాజరైన ప్రతినిధులతో ఇరు దేశాల ప్రధాన మంత్రులు నరేంద్ర మోదీ, షింజో అబే