మనలో - మనం

మనలో-మనం (ఎడిటర్‌తో ముఖాముఖి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బి.ఆర్.సి.మూర్తి, విజయవాడ
మదుపుదారులకు పోస్టల్ శాఖ స్వల్పంగా హెచ్చు వడ్డీ ఇస్తుంటే తమ వ్యాపారం దెబ్బ తినదా అని బ్యాంకుల ఉన్నతాధికారులు వాపోయినట్లు వార్తల్లో చదివాం. ఉద్యోగులకు వేతనాలు భారీగా పెంచుతూ వడ్డీ రేట్లు పోనుపోనూ తగ్గిస్తుంటే డిపాజిటర్లు మాత్రం బాధపడరా?
టార్గెట్ల ప్రకారం డిపాజిట్లు రాకపోతే బ్యాంకు వాళ్లను పైవాళ్లు సతాయిస్తారు. ఆ బాధలో ఏదో అని ఉంటారు. పోనీండి.

గుండు రమణయ్య, పెద్దాపూర్
తెలంగాణ ప్రభుత్వం మళ్లీ ఆస్థాన కవి పదవులను కట్టబెట్టాలని చూస్తోంది. దీనివల్ల ఉపయోగం ఉందా?
ఉంది. ఆ పదవులు పొందేవారికి.

మహమ్మద్ యూసుఫ్, కాజీపేట
అత్యాచారాలకు పాల్పడే కామాంధులకు మర్మాంగాల తొలగింపే సరైన శిక్ష అని మద్రాస్ కోర్టు వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేమిటి?
కుక్కలకు ఫామిలీ ప్లానింగు ఆపరేషను చేయించడం లాంటిదే ఇదీ.

సైకిలు దిగి కారు ఎక్కినా, కారు దిగి సైకిల్ ఎక్కినా, నష్టపోయేదెవరు?
‘చెయ్యి’ నెత్తికి చేరినవారు.

డి.రవీందర్, తిరుపతి
భారతదేశంలో రాజకీయ నాయకుడికి రిటైర్మెంట్ ఎందుకు పెట్టడం లేదు?
పెట్టాల్సింది రాజకీయ నాయకులే కనుక.

పుష్యమీసాగర్, హైదరాబాద్
మహా దిగ్గజం అనబడే ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తిగారు, అరుణ్ శౌరి, ఇంకా హిందీ చిత్రసీమ హీరో అయిన షారుక్ ఖాన్ దేశంలో మత అసహనం పెరిగిపోయింది. ఇది మంచిది కాదు అనడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి. అలాగే సోనియాగాంధీ. దేశంలో మైనారిటీ ప్రజలు అభద్రతా భావంలో ఉన్నారు అంటూ రాష్టప్రతికి ఫిర్యాదుచేసి జోక్యం చేసుకోవాలి అనడం సబబు అంటారా...?
అంతా కాంగ్రెసు మాయ.

పాతబస్తీలోని బార్కాస్‌లో ‘అరబ్ గోరక్ష దళ్ బార్కాస్’ అనే సంస్థ గోవధ నిషేధంపై పోరాటం చేస్తోంది. మతాలకు అతీతంగా చేపడుతున్న ఉద్యమంపై మీ అభిప్రాయం ఏమిటి? ముస్లిం దేశాలలో కనిపించని ఆవు మాంసం దుకాణాలు మరి భారతదేశంలో ఎందుకు? గోమాతని కబేళాలకు తరలించడాన్ని ఏ ప్రభుత్వం ఎందుకు ఆపలేకపోతోంది?
గోభక్తుల్లో చేవలేక. హిందూ సమాజంలో చలనంలేక. హిందూ మతసంస్థలకు మగటిమి లేక.

డి.లక్ష్మి, విజయవాడ
మన భారతదేశంలో చట్టాలు ఉన్నా అమలు చెయ్యడంలో విఫలమై పోతున్నారు. కారణం అమలుపరచే ఆఫీసర్ల లోపమా? చొరవ తీసుకోని ప్రభుత్వాల చేతగానితనమా?
దొంగల చేతికి తాళాలిచ్చి, మొద్దు నిద్రపోతున్న ప్రజల ఉదాసీనత అసలు కారణం.

చర్ల మల్లేశ్వరరావు, కాకరపర్రు, పెరవలి మండలం, ప.గో.
ఈ మధ్య అనుకోకుండా ఒక టీవీ చానల్‌లో ఎన్టీఆర్‌గారి ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమా చూస్తే కొత్త అనుమానం రేకెత్తింది! హరిశ్చంద్రుడు ఇక్ష్వాకు వంశంలో శ్రీరాముడి కంటే ముందు తరం రాజు. ఆయన భార్య, పిల్లలతో దేశాటన చేస్తూ ఒక రాజ్యానికి వెళితే అక్కడ కొందరిని అరబ్ షేక్‌లు కొరడాలతో కొడుతూ చిత్రహింసలు పెడుతూ ఉంటారు. అంటే త్రేతాయుగంలోనే భారతదేశంలో ముస్లింలు ఉన్నారంటారా? అసలు ఈ అనుమానం సినిమా వచ్చిన కొత్తలో ఎవరికీ రాలేదంటారా?
సినిమా కథలకు లాజిక్ అడక్కూడదు.

ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
ఆంధ్రప్రదేశ్‌కు మ(మట్టి) నీ(నీరు) ఇచ్చి ఆఫ్రికాకు అరవై వేల కోట్ల రూపాయలను అప్పనంగా దానం చేయడంలో మోదీగారి ఆంతర్యం ఏమిటో?
ప్రచార లాభం

వెంకయ్య నాయుడుగారు అరవ వాళ్లల్లా లుంగీయే కడతారేమిటి. పంచెకట్టు కడితే తెలుగుతనం ఉట్టిపడేదిగా?
వాళ్ల నెల్లూరు తమిళనాడుకు దగ్గర... అయినా పంచెకట్టును తెలుగు నేతలు దాదాపుగా మానేశారు.

బి.మాధురి, హైదరాబాద్
కథలు, నవలల పోటీలు పెట్టినట్లుగానే అల్పాక్షరాలతో అనల్పార్థాన్నిచ్చే కవితల పోటీ, మినీ కవితల పోటీ నిర్వహించకూడదా?
ఆలోచిద్దాం.

పెయ్యల శ్రీనివాసరావు, అలికాం
మనకు (దేశానికి) స్వాతంత్య్రం వచ్చి ఇనే్నళ్లు గడిచినా, ఎన్ని రకాల ప్రభుత్వాలు మారినా నేటికీ రైల్వేలో సాధారణ ప్రయాణం చేయడం నరకప్రాయంగానే ఉంది. దీనికి పరిష్కార మార్గం లేదా? ఇంకా పేద ప్రయాణీకులు, సాధారణ ప్రయాణీకులు రైలు జనరల్ బోగీలలో ఇబ్బందులు పడవల్సిందేనా? సరైన పరిష్కార మార్గాన్ని సూచించండి.
రైల్వేలను ప్రైవేటు వారికి అప్పగిస్తే ఉపయోగం ఉండొచ్చు... ప్రైవేటు వారొచ్చాక విమానయానం బాగుపడినట్టే.

బొడ్డపాటి రాజేశ్వరమూర్తి, బందరు
ఇటీవల ఆకాశవాణి ఇంటర్వ్యూలో ఒక పెద్ద రచయిత ‘నేను ఇప్పటివరకు ఎన్నో లక్షల కథలు చదివాను. కాని ఒక్కటిలో కూడా ‘శిల్పం’ లేదని వాపోయారు. అలాగైతే పాలగుమ్మి పద్మరాజు గారి ‘గాలివాన’లో కూడా ‘శిల్పం’ లేదని వారి అభిప్రాయమా?
‘గాలివాన’ అంత గొప్ప కథేమీ కాదు.

పి.రామకృష్ణ, రాజమండ్రి
‘ఆరోగ్యం మహాభాగ్యం’ అంటారు కదా! ఈ మధ్య కొంతమంది తమకు వచ్చిన అనారోగ్యాన్ని గురించి, జరిగిన చికిత్స గురించి, అయిన డబ్బు ఖర్చు గురించి, గొప్పగా వర్ణించి చెప్పుకుంటున్నారు. ఇది దేనికి సంకేతం?
వైద్యం వెర్రికి.

డి.ఎస్.ఎస్. వక్కలంక
ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న నాయకుడి చుట్టూ అతని ప్రాణరక్షణ కోసరం తుపాకులతో అంగరక్షకులు ఉండటం ఎలాంటి విచిత్రం?
రహస్య భోజనానికి బందోబస్తుగానేమో.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : మనలో మనం, ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్-500003
e.mail : bhoomisunday@deccanmail.com *