మనలో - మనం

మనలో-మనం - ఎడిటర్‌తో ముఖాముఖి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్.ఆర్.లక్ష్మి, సికిందరాబాద్
భారత్, పాక్‌లు తమ ఆయుధ సామాగ్రిని తగ్గించుకోవాలని, అమెరికా అధ్యక్షులు ఒబామాగారు సలహా ఇచ్చారు. పాక్‌కు ఈ యుద్ధ సామాగ్రిని అమెరికాయే అమ్మి వ్యాపారం చేస్తున్నదిగా.
యుద్ధం చేయడం ద్వారా ఆయుధాల నిల్వను తగ్గించుకోవాలని వారి ఉద్దేశమేమో!

ట్రంప్ మహాశయుడు అధ్యక్షుడయితే ఈ అమ్మకాలను ఆపగలడా?
ఆపడు. ఆపలేడు.

యశ్వంతరావు శేషగిరిరావు, ధవళేశ్వరం
షాంఘై నుంచి న్యూయార్క్ వరకూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహా ఎతె్తైన కట్టడాలకి లేని వాస్తు మన దేశంలోని చచ్చు పెంకుటిళ్లకు అవసరమా?
వాళ్ల వాస్తు వేరు - మనది వేరు.

బావన సీతారాం, మందసా, కమలాపురం
వెయ్యి మంది జనాభా ఉన్న గ్రామాల్లో కూడా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూతబడుతున్నాయి గదా! ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్న పిల్లల కుటుంబాల తెల్లకార్డులు ప్రభుత్వం రద్దు చేస్తే అధిక శాతం ప్రాథమిక పాఠశాలలు పల్లెల్లో నిలబడతాయి గదా! ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవచ్చంటారా?
అక్కడికి పిల్లల్ని ఎందుకు పంపడం లేదు అని గమనించి, చేయాల్సింది చేస్తే చాలు. ప్రభుత్వాల చేతకానితనానికి ప్రజలకెందుకు దండన?

గంటి వినాయకరావు, వక్కలంక
ఎంఎల్‌ఏలూ, ఎమ్మెల్సీలు జీతాల పెంపుపై ఇద్దరు ఎమ్మెల్సీలు ఆక్షేపణ తెలిపారని తెల్సి ప్రజల గురించి ఆలోచించేవారు ఇంకా ఉన్నారని సంతోషంగా ఉంది. మీ కామెంట్ ప్లీజ్?
ఆ ఇద్దరు కూడా పెరిగిన జీతాలను వద్దనరు.

భారీ వ్యయ ప్రయాసలతో యమునా నదీ తీరంలో ‘క్రతువు’ నిర్వహించిన శ్రీశ్రీ రవిశంకర్‌కూ, భారత ప్రజలకూ ఒరిగింది ఏమిటి?
ఒక మెగా షోను చూసిన తృప్తి. రాళ్ళేసే వాళ్లకు చేతినిండా పని.

డి.ఎస్.శంకర్, వక్కలంక
కథాపరంగా, సంగీతపరంగా, పాత్రధారుల ప్రతిభపరంగా ఇలా గతంలో ఎన్నో గొప్ప తెలుగు సినిమాలు వచ్చాయి. కొన్ని సందేశపరంగా వున్నవీ వచ్చాయి. వాటిలో దేనికీ రాని ‘స్వర్ణకమలం’ ‘బాహుబలి’ని వరించడం ఆశ్చర్యంగా లేదూ?
లేదు.

ఎ.నాగేశ్వరరావు, కాశీబుగ్గ
కలకత్తాలో బ్రిడ్జి కూలి చాలా మంది చనిపోయారు. ఎవరి తప్పిదమో తెలీకుండా ఉంది. వారి కట్టడంలో లోపమా? చనిపోయిన వారి పాప ఫలమా?
పాలకుల పాపకర్మం.

డి.సూర్యకాంతం, వి.లంక
మూడు, నాలుగు వందల మంది ఎక్కే విమానంలో ప్రవేశించేటపుడు ఎన్నో భద్రతా చర్యలు, ఒక్కో రైల్లో సుమారు పదిహేను వందలు ఎక్కుతున్నా అక్కడ ఇలాంటి చర్యలు కనపడవు. ఎందువల్ల?
విమానాల్లో ఎక్కేవి ఖరీదైన ప్రాణాలు కాబోలు.

సి.ప్రతాప్, శ్రీకాకుళం
మానవులు నిత్యం ఆహార నియమాలు, ప్రకృతి నియమాలు, మానవతా ధర్మాలు, సాంఘిక నియమాలు ఆఖరుకు ట్రాఫిక్ నియమాలు కూడా ఉల్లంఘించి జీవిస్తుండడం వల్లనే అనేక సమస్యల సుడిగుండంలో పడి కొట్టుమిట్టాడుతున్నారు. సుఖమయ, శాంతిమయ జీవనానికి మార్గం ఏమిటో దయచేసి తెలియజేయండి.
తెలిపారు కదా?

బొడ్డపాటి రాజేశ్వరమూర్తి, బందరు
డెక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి దిన, వార పత్రిక రచయిత (త్రు)లు పారితోషికాల కోసం పదేపదే ఉత్తరాలు వ్రాస్తున్నారు. నాకు రావలసిన పారితోషికాలు (దిన, వార పత్రికల నుండి) నేను ఇష్టపూర్వకంగా వదిలివేస్తున్నాను. కంట్రిబ్యూషన్ చేస్తూనే ఉంటాను. అది నా హాబీ. ఇది త్యాగం, స్వోత్కర్ష కాదని మనవి చేసుకుంటున్నాను.
కాదా?

పుల్లా దుర్గారావు, గొల్లలమామిడాడ
సంప్రదాయం కంటే రాజ్యాంగమే ఉన్నతమైనది అంటూ హిందూ దేవాలయాలలోకి మహిళల ప్రవేశంపై ఆంక్షలు ఎత్తివేసిన న్యాయమూర్తులు మసీదులలోనికి ముస్లిం మహిళలకూ ప్రవేశార్హత కల్పించే దిశగా చర్యలకు ఆదేశిస్తే సమన్యాయం అవుతుందిగా.
అవుతుంది. కాని జరగదు. మన దేశంలో హిందువులు రెండో తరగతి పౌరులు. ముస్లింలు కారు.

వాసా వెంకటేశ్, సింహాచలం
గత కొన్ని సంవత్సరాల నుండి మన తెలుగు ఛానల్స్‌లో జ్యోతిషం, వాస్తు... వగైరా వగైరా వంటి షోలు బాగా పెరిగిపోతున్నాయి. ఒకరేమో పాచికలు వేసి, మరొకరు లాప్‌టాప్‌లో చూసి, ఇంకొకరు తమలపాకులు తీసి భవిష్యత్తు చెబుతున్నారు. ఇవి అసలు మన శాస్త్రాల్లో ఒక భాగమేనా? లేక కాలమానంలో పుట్టుకొచ్చిన కొత్త విద్యలా?
పొట్ట కోసం పాట్లు. అవి వెర్రి వేషాలు.

గుండు రమణయ్య, పెద్దాపూర్, కరీంనగర్
అగ్రిగోల్డ్ బాధితుల పరిస్థితి ఏమిటి? వారికి పరిష్కారం లభించేనా?
కొంచెం లేటుగా.

ఎం.కనకదుర్గ, తెనాలి
రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటనా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ, ఇష్టం వచ్చిన విధంగా ప్రకటనలు చేస్తూ, అనవసర వివాదాలు సృష్టిస్తూ, వివిధ వర్గాలు, మతాల మద్య విభేదాలు, వైషమ్యాలు రగిలిస్తూ తద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించడంలో వివిధ రాజకీయ పార్టీలు ఒక తానులో గుడ్డలని నిరూపించుకుంటున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే తెల్లవారి విభజించు - పాలించు అన్న సూత్రాన్ని ఉపయోగించి ప్రజలను విడగొట్టేందుకు కూడా వీరు వెనుకాడరని నాకనిపిస్తోంది. మీరేమంటారు?
కరెక్ట్.

*

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : మనలో మనం, ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్-500003
e.mail : bhoomisunday@deccanmail.com