మనలో - మనం

మనలో-మనం (ఎడిటర్‌తో ముఖాముఖి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డి.వెంకట్రావు, ఉయ్యూరు
పది లక్షల కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణం జరుగుతోందని తెలిసి కూడా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఒకటో ధృతరాష్ట్రుడయ్యారు. ఇప్పటికీ మండుతున్న ఆ బొగ్గు సెగ తగులుతూనే ఉంది. అలాగే ఏ.పికి ప్రత్యేక హోదాపై తన కేంద్ర మంత్రులే తలో మాట మాట్లాడుతున్నారని తెలిసి కూడా ప్రస్తుత ప్రధాని మోదీ రెండో ధృతరాష్ట్రుడయ్యారు.
పోలిక బాగాలేదు.

హోదా ఎపిసోడ్‌లో చంద్రబాబుది శకుని పాత్రా? దుర్యోధన పాత్రా?
ఆయనా ధృతరాష్ట్రుడి టైపే.

బి.ఆర్.సి.మూర్తి, సూర్యారావుపేట
రెండ్రోజుల్లో భారీ వర్షాలని పేపర్లో రాస్తారు. రెండ్రోజుల తర్వాత కూడా అదే వార్త. కానీ ఎండలు మండిపోతున్నాయ్. ఎక్కడుంది లోపం?
ఋతు చక్రాన్ని గతి తప్పించిన మానవుడిలో.

రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం రైతుల నుండి తీసుకున్న భూముల్ని తను అధికారంలోకి వస్తే ఇచ్చేస్తానంటున్నాడు జగన్. ఇది ఎలా సాధ్యం? కట్టిన వాటిని పడగొడ్తారా?
కట్టేలోగానే వచ్చేస్తానని కుర్రవాడి ఊహ కాబోలు.

బి.రాజేశ్వరమూర్తి, చిలకలపూడి, బందరు
విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవర్తకాగ్రేసరులైన శ్రీ రామానుజుల వారు, వారి గురువులు రహస్యంగా చెవిలో చెప్పిన అష్టాక్షరీ మంత్రం, శ్రీరంగ స్వామి గుడి గోపుర శిఖరంపైకి ఎక్కి ‘ప్రజలారా! ఈ మంత్రం పఠించండి. తరించండి’ అని బాహాటంగా ప్రకటిస్తే ఈనాటి వారు దేవతా మంత్రం గురుముఖతః చెప్పించుకోవాలి అనడంలో డబ్బు దండుకోవడానికే అని విమర్శిస్తున్నారు. ఏమంటారు?
రామానుజుల వారు ఆ పని చేసింది తన సుదీర్ఘ జీవితంలో ఒక్కసారే. అదీ వ్యక్తి బాగుకంటే సమాజం బాగు శ్రేష్ఠమన్న పాఠాన్ని లోకానికి ఉపదేశించేందుకే. మంత్రోపదేశం గుడిగోపురం ఎక్కి సామూహికంగా చేయాలని దాని అర్థం కాదు. అది గురుముఖతః జరగాల్సిందే.

ఆర్.కె., హైదరాబాద్
శాస్ర్తియ సంగీతంలో బి.ఏ, ఎం.ఏ. డిప్లొమా పట్టాలు పొందిన కళాకారులు, వేదికలపై, వివాహాలలో సినీ సంగీతం ఆలపించే దురవస్థకు కారణం శాస్ర్తియ సంగీతంలో ప్రోత్సాహ రాహిత్యమే కారణమా? కష్టపడి నేర్చిన విద్య వృధా కదా!
ఔను. ఒకప్పుడు మన సమాజంలో కలవారి ఇంట్లో పెళ్లి జరిగితే ఆ వేడుకల్లో పాట కచేరో, డాన్స్ ప్రోగ్రామో మరొకటో పెట్టించేవాళ్లు. ఇప్పుడు ఆ ఆనవాయితీ పోయింది. జనాలకు సినిమా పిచ్చి ముదిరింది.

పొట్టి లక్ష్మీసుజాత, అద్దంకి
ప్రభుత్వం ఇంటికో మరుగుదొడ్డికి రుణాలిచ్చి ప్రోత్సహించి నిర్మిస్తే స్వచ్ఛ భారత్ సాధించినట్లేనా? వీధికో మరుగుదొడ్డి, టాయిలెట్స్ ఏర్పాటు చేస్తే అనుకున్న లక్ష్యం నిర్దేశిత సమయంలో పరిపూర్ణమైన పరిశుభ్రత భారత్ సాధించగలదు కదా? ఇవేమీ లేకుండానే పేపర్లల్లో, సినిమా హాళ్లల్లో ప్రకటనలు ఇస్తే కోట్లు దండుగ తప్ప లక్ష్యం నెరవేరుతుందా?
ఇలాంటి వాటికి ప్రచారమూ అవసరమే. కనీసం వీధికో మరుగుదొడ్డి దేశమంతటా ఏర్పరచగలిగినా గొప్పే.
యం.ఎస్., సికిందరాబాద్
దేముడిని బుల్లితెరకెక్కించి వేళాపాళా లేకుండా పూజాదులు నిర్వహించవచ్చా? అపచారం కాదా?
ఆలయ నియమాలు, ఆగమాలు ప్రచార మాధ్యమాలకు వర్తించనక్కర్లేదు. అలాగని సాయంత్రం సుప్రభాతమో, ఉదయం పవళింపు సేవనో చూపెడితే తప్పే.

అనదాసు సత్యనారాయణ, పెద్దాపురం, తూ.గో.జిల్లా
తింటే గారెలు తినాలి. చేస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగమే చేయాలి. ఉదయం 11 గం. ఆఫీసుకు వెళ్లవచ్చు. ఒంటి గంటకు భోజనానికి వెళ్లి కునుకు తీసి మరల 3 గంటలకు ఆఫీస్‌కి వచ్చి ఐదు గంటలకు ఇంటికి వెళ్లిపోవచ్చు. ఎవరు ఎక్కడ ఏ పని చేస్తున్నారో, ఉద్యోగాలు ఎలా వెలగబెట్టుచున్నారో చూచే నాథుడు లేడు. ఎవరి గోల వారిది. ఎవరి వ్యాపారం వారిది. ఇది నేటి ఉద్యోగ భారతం.
ఉద్యోగుల్లోనూ గడియారం చూసుకోకుండా కష్టపడేవాళ్లు ఉన్నారు. అలాంటి వారు ఉన్నారు కాబట్టే ప్రభుత్వం ఈ మాత్రమైనా నడుస్తున్నది. మీరన్నట్టు సర్కారీ కొలువును సోమరి సత్రంలా భావించే వాళ్లూ చాలామందే ఉన్నారు. వారి సంఖ్యే ఎక్కువ.

కోడూరి శ్రీరాములు, కోడూరు, అనంతపురం జిల్లా
హిందూ మతంలోని దేవుళ్లను తగ్గించి ఒకే దేవుని ప్రార్థించుట అసాధ్యం. ఎందుకంటే వివిధ మనోభావాలను ఏకీకృతము చేయలేము. కాని కుల వ్యవస్థ అనేది లేకపోతే హిందూ మతము ప్రపంచములోనే అతి పెద్దదిగాను, విశిష్టమైనదిగానూ రూపాంతరము చెందును గదా! ఇది ప్రయత్నిస్తే సాధ్యమయ్యే పనే గదా!
హిందూ మతానికి కులమే బలం. దాన్ని ఎవరూ కూల్చలేరు. ఎవరు ఎన్ని కబుర్లు చెప్పినా ప్రతిదీ కులం దృష్టితోనే ఆలోచిస్తారు. కులరహిత సమాజం గురించి లెక్చర్లిచ్చే వాళ్లలో కూడా చాలామంది తమ పిల్లలకు తమ కులంలోనే సంబంధాలు వెదుకుతారు. గిట్టని వాళ్లని కులం పేరుతోనే దూషిస్తారు. మన నిలువెల్లా ఉన్నది హిపోక్రసీ.

పుష్యమీ సాగర్, హైదరాబాద్
దేశాలను గడగడలాడిస్తున్న ‘పనామా పత్రాల’ కేసులో మన దేశంలో కూడా పెద్దపెద్ద వ్యాపారవేత్తలు వున్నారని తెలిసింది... సక్రమంగా పన్నులు చెల్లించాలని చెప్పే పెద్ద అధికారులు, రాజకీయవేత్తలు.. దేశాధిపతులు.. క్రీడాకారులు వారు, వీరు అని కాదు. ప్రతి రంగంలో అవినీతి ఇంతలా పాకిపోయింది... తెలిసినవే ఇవి అయితే, తెలియని కుంభకోణాలు మరెన్నో... దీనికి అంతు లేదు అంటారా..?
అవినీతి పునాది అయిన రాజకీయ వ్యవస్థ వల్ల అవినీతి అంతం కావటం కల్ల. ప్రభుత్వాన్ని నడిపేవారు నీతిమంతులు అయితే రాజకీయ అవినీతి తగ్గుతుంది. సమాజంలోని ఇతర రంగాల అవినీతి షరా మామూలే.

కేరళలో పుట్టంగళ్ అమ్మవారి ఉత్సవాల్లో బాణాసంచా పేలడం.. వందలాది మంది గాయపడటం... 100కుపైగా చనిపోవడం విచారం.. ఇది మానవ తప్పిదం అయితే ఎవరు బాధ్యులు... దేవాలయ ప్రాంగణంలో పేలుడు పదార్థాలు ప్రమాదకరం అని తెలిసి కూడా పెద్ద మొత్తంలో నిలువ ఉంచడం తప్పు కదా...
చూస్తే అది మామూలు ప్రమాదంలా లేదు. విద్రోహ చర్యేమో అని నా అనుమానం. పూర్తి వివరాలు బయటికి వచ్చినట్టు లేదు.
*
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : మనలో మనం, ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్-500003
e.mail : bhoomisunday@deccanmail.com