మనలో - మనం

మనలో మనం (ఎడిటర్‌తో ముఖాముఖి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొడ్డపాటి రాజేశ్వరమూర్తి, చిలకలపూడి, బందరు
క్రితం వారం మీరు ‘రేడియో’ను శ్లాఘించారు. ఆ ఆకాశవాణియే ప్రతిరోజు ఉదయం 8.30 ని.లకు ప్రముఖ వార్తాపత్రికల పతాక శీర్షికలు అంటూ ‘ఈనాడు’ ‘సాక్షి’ ‘ఆంధ్రజ్యోతి’ని పేర్కొంటూ వార్తాప్రసారాలు చేస్తున్నారు. దానిలో మన ప్రముఖమైన ఆంధ్రభూమి లేదేమని నేను చింతిస్తున్నాను.
మేము చింతించడం లేదు.

ఎం.కనకదుర్గ, తెనాలి
రెండు తెలుగు రాష్ట్రాలలో క్రీడాభివృద్ధికి ఎటువంటి కృషి జరగడం లేదు. మైదానాలు లేని విద్యా సంస్థలకు ఆగమేఘాల మీద అనుమతులు ఇస్తున్నారు. క్రీడల్ని నిర్వీర్యం చేసే కార్పొరేట్ విద్యా విధానాన్ని తలకెత్తుకున్నారు. ఎందరో జాతీయ స్థాయిలో ఆడిన తెలుగు క్రీడాకారులు చాలీచాలని జీతాలతో దుర్లభమైన జీవితం గడుపుతుంటే వారి దుస్థితి పాలకులకు పట్టదా?
ఔను. విద్యలాగే క్రీడల విషయంలోనూ మనకు సరైన విధానమంటూ లేదు. మన పాలకులకు గిట్టుబాటు కాని ఇలాంటి విషయాలు పట్టవు.

ఎ.వి.సోమయాజులు, కాకినాడ
బడిపిల్లల్ని భారీ ర్యాలీలు పెట్టి ఎండలో రోడ్లపై తిప్పేకంటే, మున్సిపాలిటీ పారిశుద్ధ్య వర్కర్ల చేత దోమలుండే గుంటల్లో ఆ దోమలు నశించే మందులు జల్లిస్తే మేలు కదా?
ఈ ఊరేగింపులు మాని దోమలుండే ప్రాంతాలలో పాదయాత్ర చేస్తున్నట్లు నేతాశ్రీలు ముందుగా చెప్తే బ్లీచింగ్ పౌడర్లు, దోమలు లేకుండా కాలువల్లో మందులు నగర పాలక సంస్థ వారు వేస్తారు. ఆ రకంగా సామాన్య ప్రజలకు ఉపయోగపడ్తారు. కాదంటారా?
ఏలిన వారికి కావలసింది పబ్లిసిటీ.

పాక్‌కు చైనా అండా? చైనా విషయంలో నెహ్రూగార్ని విమర్శించే బిజెపి నేతలు ఎందుకు అంత ఎక్కువగా చైనా సందర్శనలు చేస్తారు? కేంద్రాన్ని మించిపోయి ఎ.పి సి.ఎం.గారు, మంత్రులు వరస విమాన ప్రయాణాలు చైనాకి చేసారేమిటి?
అనుభవం అయితేగానీ చైనా తత్వం బోధపడదు. దానికి ఇంకా టైముంది.

బి.ఆర్.సి.మూర్తి, విజయవాడ
రామాయణ, భారతాలు కల్పిత కథలని హిందువులే అనటం ఈ దేశ దౌర్భాగ్యం కాదా? నాస్తికులు హిందువులు కారా?
కారు. హిందూ ధర్మాన్ని అంగీకరించని వారిని హిందువులుగా గుర్తించకూడదు. తామూ హిందువులమేనని చెప్పుకుంటూ హిందూ మతం మీద, సంప్రదాయాల మీద రాళ్లేసే వారిని సహించకూడదు. హిందూ జాతికి మగటిమి రానంతవరకూ రాళ్ల దెబ్బలు తప్పవు.

స్వాతంత్య్ర సమరయోధులకు పింఛన్ పెంపుని ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. ఈనాటికి వారిలో ఎందరు సజీవులుగా ఉంటారు?
స్వాతంత్య్రం వచ్చాక పుట్టి స్వాతంత్య్ర సమరయోధులుగా పింఛన్లు పుచ్చుకుంటున్నవారు చాలామందే ఉన్నారు. పాపం, వారి సంగతీ చూడాలి కదా?

రాహుల్ గాంధి వాజపాయిలాగా బ్రహ్మచారిగానే ఉండిపోతాడా ఏమిటండీ?
పెళ్లి కానివారంతా బ్రహ్మచారులు కారు.

వరిగొండ కాంతారావు, హనుమకొండ
‘పాకిస్తాన్ నటీనటులు కళాకారులు. వారు ఉగ్రవాదులు కారు. వారిని గౌరవించవలెను’ అని నటుడు సల్మాన్‌ఖాన్ అన్నట్లుగా వార్తలు వచ్చినవి. తనకు నచ్చని నటిని కథానాయిక స్థానంలో మారిస్తేనే నటిస్తాను అని దర్శక నిర్మాతలను వత్తిడి చేసి ఒప్పుకున్న నటులను సినిమాలోంచి తీసివేయించిన ఘనుడు సల్మాన్‌ఖాన్ అని లోగడ వార్తలు వచ్చినవి. సల్మాన్‌ఖాన్‌కు నచ్చని నటులు కళాకారులు కారా?
‘సుల్తాన్’ ఎంత చెబితే అంత!
ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
ఉత్తరాయణంలోని లేఖల ప్రచురణ మీ నిర్ణయమేనా?
కాదు. వేరే పత్రిక సంపాదకుడి నిర్ణయం!

పాక్‌పై భారత్ యుద్ధం ప్రకటిస్తే పాక్‌కు చైనా అండగా నిలుస్తుందని అప్పుడే చెప్పేసింది. భారత్‌కు ఎవరు అండగా నిలుస్తారో ఎవరూ ప్రకటనలు చేయలేదేమి?
ఆ ఉద్దేశం లేదు కనుక.

అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసేవారు కొన్ని సందర్భాలలో ఒకే వేదిక మీద మాట్లాడతారు. ఈ సంప్రదాయం మనకెందుకు లేదు?
తలకాయలు పగలొచ్చనే భయంచేత! నేతల బండారం బయటపడుతుందన్న కారణంవల్ల!

డొక్కా విరూపాక్షుడు, వక్కలంక
గత కేంద్ర ప్రభుత్వం ‘గరీబ్థ్’్ర పేరిట ఏ.సి. సౌకర్యం, ముప్పది పర్సెంటు ఛార్జీల రాయితీలతో ప్రవేశపెడితే, ఇప్పటి ప్రభుత్వం ఇరవై పర్సెంట్ ఎక్కువ ఛార్జీలతో ఏ.సి. సౌకర్యపు రైళ్లు ప్రవేశపెడుతున్నది. వీటిని ఏమనాలి?
‘అమీర్ రథ్’లు.

కాకుటూరి సుబ్రహ్మణ్యం, కావలి
ఇటీవల ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నుండి టిఆర్‌ఎస్‌లో చేరిన వారి నిర్ణయాన్ని రద్దు చేస్తూ నిర్ణయం చేసి తదుపరి చర్యలు తీసుకోవలసినదిగా స్పీకర్‌ను ఆదేశించింది. స్పీకర్‌కు హైకోర్టు నిర్ణయాన్ని మారుస్తూ చర్య తీసుకొనే అధికారం ఉన్నదా?
అది ఉన్నత రాజ్యాంగ వ్యవస్థలకు సంబంధించిన సున్నిత సమస్య. చెప్పటం కష్టం. చాలా ఏళ్ల కింద యు.పి.లో తమ నిర్ణయాన్ని నిలువరించిన అలహాబాద్ హైకోర్టు జడ్జిలందరికీ ఆ రాష్ట్ర స్పీకర్ అరెస్టు వారంట్లు జారీ చేశారు. సాధారణంగా సభాపతులు కోర్టు తీర్పులను గౌరవిస్తారు.
*

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : మనలో మనం, ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్-500003. e.mail : bhoomisunday@deccanmail.com