మనలో - మనం

మనలో మనం (ఎడిటర్‌తో ముఖాముఖి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాండ్రంగి కొండలరావు, పొందూరు
తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా ఉత్తరాది ఐఎఎస్ అధికారిని నియమించడం సమంజసమేనా? తెలుగు వారికి అన్యాయం జరిగిందంటారా?
ఇప్పటిదాకా ఇ.ఓ.లుగా ఉన్న తెలుగువారు తెలుగుతనానికి ఊడబొడిచిందేమిటి? ఉత్తరాదివాళ్లు రావడం వల్ల కొత్తగా కొల్లబోయేదేమిటి?

పుష్యమీసాగర్ (ఇ-మెయల్)
ఇటీవలే ఓ మంత్రిగారి కుమారుడు అతి వేగంతో పిల్లర్‌ని ఢీకొట్టి దుర్మరణం పాలయ్యాడు. ఎంతో విద్యావంతుడుగా పేరుగాంచిన వాడికి రోడ్‌పై అతి వేగం ప్రమాదకరమని, సేఫ్టీబెల్ట్ ధరించాలని తెలియదా? మన రహదారులకు హై-ఎండ్ వెహికల్‌ని తట్టుకునే సామర్థ్యం లేదని తెలిసికూడా తల్లిదండ్రులు ఇంపోర్టెడ్ కార్లని తమ బిడ్డలకి అందించి వారిని కావాలనే చంపేసుకున్నట్టు కాదా?
ఔను.

తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం కూడా ఇలాంటి ప్రమాదాలకి తావు ఇస్తుంది కదా?
అర్ధరాత్రి ఒళ్లెరగకుండా కారుతోలి ప్రాణం తీసుకునేవాడిని ప్రభుత్వ శాఖలు ఎలా ఆపగలవు?

కె. సుజాత, ఏలూరు
బాహుబలి-2...?
గొప్ప కామెడీ.

ఉప్పు సత్యనారాయణ, తెనాలి
‘బాహుబలి’ చిత్రానికి కోట్లు వెచ్చించి అంతర్జాతీయ స్థాయలో హడావిడి చేశారు. రాచరికపు వ్యవస్థపై గతంలోనే ఎన్నో చిత్రాలు నిర్మించి విజయవంతంగా నేటికీ చరిత్రలో చిరస్థాయగా నిలిచాయ. వాటి కళాత్మక విలువలతో పోలిస్తే ‘బాహుబలి’ స్థాయ ఎంత?
అరవయ్యేళ్ల కిందటి మాయాబజార్ ముందు దిగదుడుపునకు కూడా పనికిరాదు.

భూతనాథ్, వి.లంక
ఇకమీదట తెలుగు సినిమా చరిత్రను గురించి చెప్పవలసి వస్తే బాహుబలి ముందు, బాహుబలి తర్వాత అని చెప్పాలని ఒక విజ్ఞుడు అన్నారు. మనం కూడా ఆ విజ్ఞత ప్రదర్శించవలసిందేనా?
మార్కెటింగు మాయాజాలంలో ఈ ఇచ్చకాలొక భాగం. పట్టించుకోనక్కర్లేదు.

కాకుటూరి సుబ్రహ్మణ్యం, మామిళ్లగూడెం, ఖమ్మం
బమ్మెర పోతనగారి ఏకశిలానగరం ‘మాది’ అని వైఎస్‌ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట వాసులు, ‘మాదే’ అని వరంగల్లు నివాసులు అంటున్నారు. మీరు ఎవరితో ఏకీభవిస్తారు? ఆధారాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయ?
పనికిమాలిన పేచీ. తెలంగాణ పోతన, ఆంధ్ర పోతన వేరు వేరు అనుకుంటే సరి.

పొట్టి వెంకట శివప్రసాద రావు, అద్దంకి
నిర్భయ ఉరి నిందితుల తరపున వారి న్యాయవాది రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామనడం, తీర్పు పట్ల కోర్టుపై ఆయన వ్యాఖ్యలు సమంజసమేనంటారా? న్యాయవాది ఎపి సింగ్ తీరు వృత్తిపట్ల ధర్మమా? సంపాదన కోసం మానవత, నైతికతకు తిలోదకాలిచ్చారా? అన్యాయానికి న్యాయం చేయమనేగా?
మనం అనుసరిస్తున్న న్యాయ విధానమే ఉరి పడ్డ వారికి శిక్ష తప్పించుకునేందుకు అనేక అవకాశాలు ఇచ్చింది. న్యాయవాది తప్పులేదు.

ఎ. వెంకటస్వామి, కర్నూల్
స్వాతంత్య్రం వచ్చి 68 సంవత్సరాలైనా ఇంకా రిజర్వేషన్లా?
ఇనే్నళ్ల మన వైఫల్యానికి సిగ్గుచేటు.

కోవూరు వెంకటేశ్వర ప్రసాదరావు, కందుకూరు
స్వచ్ఛ్భారత్ పిలుస్తోంది! ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు వివిధ సన్నివేశాలతో ఆరోగ్య సంబంధిత, సంఘ సేవ అంశాల స్ఫూర్తితో అన్ని భాషలతో చలనచిత్రం నిర్మిస్తే ప్రత్యక్ష ప్రభంజనమై మార్పు తెస్తుంది కదా?
సినిమా స్క్రిప్టులోనైతే మార్పు కనిపిస్తుంది.

ఎల్. ప్రపుల్లచంద్ర, ధర్మవరం
ఆంధ్రభూమి సంస్థ నుండి సినీ వారపత్రిక గతంలో వచ్చేది కదండీ... మళ్లీ ప్రారంభించే ఐడియా ఏమైనా ఉందాండీ?
ఎప్పుడు వచ్చిందండి?

ఎన్. రామలక్ష్మి, సికిందరాబాద్
రాబోయే ఎన్నికల కోసం ఇప్పట్నించే సన్నాహాలు అంత అవసరమంటారా?
వేడిలో వేడి. ఖ

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
మనలో మనం,
ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక,
36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్ - 500003.

: email :
sundaymag@andhrabhoomi.net