మంచి మాట

గంగావతరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవిత్ర భారతావనిలో గంగ మహా పవిత్రంగా భావించబడుతున్న పుణ్యనది. గంగకు పురాణ కాలం నుండి ప్రాశస్త్యం వుంది. అసలు దివినుండి భూమీదకు దిగి వచ్చిన గంగావతరణ దృశ్యమే వర్ణించనలవికాని అపూర్వ దృశ్యం. ఈ పౌరాణిక ఇతిహాసం విన్నా, చదివినా ఒడలు పులకించిపోతుంది.
‘గంగాధరా హర నమో నమో!’ అంటూ మహాశివుడిని మనసారా ప్రార్థిస్తాం. దివిలో శ్రీ మహావిష్ణువు పాదాల చెంత జనించిన పవిత్ర గంగ ఈ భారంతావనిపై వైశాఖమాసంలో శుక్లపక్ష సప్తమినాడుఅవతరించింది.
పూర్వం సూర్యవంశంలో జన్మించిన సగరుడనే రాజు వుండేవాడు. ఆ మహారాజుకు కుమారులు అరవైవేల మంది. వీరంతా కపిల మహర్షి శాపానికి గురై అర్థాంతరంగా చనిపోయారు. ఓసారి ఈ వంశీయులు వంశాన్ని నిలపమని మహావిష్ణువును దీనంగా ప్రార్థించారు. విష్ణువు ప్రత్యక్షమై ‘‘మీకు కుమారుడు కలుగుతాడని’’ వరమిచ్చాడు. ఆ దేవుని వరప్రసాదంగా జన్మించినవాడే భగీరధుడు.
సగరుని మనువడైన భగీరథుడు తన పితృదేవతల అకాల మరణాన్ని గురించి తెలుసుకొని వారికి ఉత్తమ గతులను కలిగించాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసమై సృష్టికర్త అయిన బ్రహ్మను దీక్షగా ప్రార్థించాడు. ఆ ధర్మవర్తనుని తపస్సుకు సంతోషించిన చతుర్ముఖుడు సంతసించి అందుకు గంగావతరణం అవసరమని సూచించాడు.
మొక్కవోని దీక్షతో భగీరథుడు గంగాదేవిని ప్రార్థించాడు. సత్యశీలి, లోకరంజకుడు అయిన భగీరథుని తపస్సుకు పులకించిన గంగాదేవి భగీరథుని ముందు ప్రత్యక్షమైంది.
‘‘తల్లీ పరమ పావనీ! నా కోర్కె మన్నించి దివినుండి భువికి దిగివచ్చి నా పితృదేవతల భస్మరాసులపై ప్రవహించి వారికి ఉత్తమ గతులు ప్రసాదించు’’ అంటూ వేడుకున్నాడు.
‘‘నాయనా, నీ సంకల్పానికి సంతోషించాను. నేను ఆకాశం నుండి భూమిపైకి దుమికేటప్పుడు ఈ భూమాత ఒక్కసారిగా భరించడం దుర్లభం. నా ప్రవాహ వేగాన్ని భరించగలిగినవాడు ఆ మహాశివుడు ఒక్కడే. ఆయనను మెప్పించి ఒప్పించగలిగితే నీ కోర్కె తీరుతుంది’’ అని సెలవిచ్చింది. తిరిగి కార్యశూరుడైన భగీరథుడు శివుని గూర్చి తపస్సు ప్రారంభించాడు.
భగీరథుని తపస్సులోని ఆర్తికి కరిగిపోయిన మహాశివుడు సంతోషించి అతని కోర్కెననుసరించి దివినుండి భువికి దూకిన గంగను తన శిరస్సుపై పట్టి, జటాజూటాలతో జలపాతాలను బంధించి ఒక జటపాయను మాత్రమే వదిలాడు. ఆ జటపాయ నుండి గంగ నేలమీదకు ప్రవహించడం మొదలయ్యింది.
పరమానందంతో భగీరథుడు గంగను తన వెంట తీసుకుని వెళుతుండగా జాహ్నముని ఆశ్రమంలోని యజ్ఞశాల మునిగిపోతుంది. అది చూసి ఆగ్రహించిన జాహ్నముని అమాంతం గంగను మింగేశాడు. జరిగిన తప్పు గ్రహించిన భగీరథుడు వెళ్లి ఆ జాహ్నముని పాదాలపై పడి వేడుకొనగా జాహ్నముని తన చెవినుండి గంగను బైటకు వదిలివేశాడు. ఆనాటి నుండి గంగను జాహ్నవి అని కూడా పిలుస్తారు.
ఆ విధంగా గంగను తీసుకువచ్చిన భగీరథుడు తన పితృదేవతల భస్మంపై ఆ పుణ్యజలాలను ప్రవహింపజేయగా వారందరికీ ఉత్తమ గతులు కలిగాయి. గంగోత్పత్తి జరిగిన ఆ గంగా సప్తమినాడు గంగను భక్తిశ్రద్ధలతో పూజించడం జరుగుతున్నది.
పరమ పవిత్రమైన నదిగా భాసిల్లే గంగానదిని పూజించినా, స్నానమాచరించినా సర్వపాపాలు నశిస్తాయి. ఆఖరికి చితాభస్మాలను గంగలో కలిసినా కూడా ఉత్తమ గతులు లభిస్తాయన్నది భారతీయుల ప్రగాఢ విశ్వాసం. అది యుగయుగాలనుండీ జరుగుతున్న గొప్ప సంప్రదాయ కార్యక్రమం.

- పి.వి.రమణకుమార్