మంచి మాట

మానసిక యజ్ఞము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ సనాతన ధర్మశాస్తమ్రులలో వేదములలో ఉపనిషత్తులలో యజ్ఞము యొక్క వైశిష్ట్యము విశేషంగా తెలుపబడినది. వైకుంఠంలోని శేషశయనుడై శ్రీమహావిష్ణువే భగవద్గీతలో అర్జునునికి ప్రకృతి సంరక్షణకు, ప్రజా సంరక్షణకు, దేవతల అనుగ్రహ ప్రాప్తికి యజ్ఞములను గురించి, యజ్ఞ విధానముల గురించి, బోధించి లోకోపకారముగావించినాడు. యుగయుగాలలో మహర్షులు, మహనీయులు, అవతారపురుషులు యజ్ఞములను చేసి, యజ్ఞ్ఫలములను శ్రీమన్నారాయణునికి అందజేసి ఆయన కృపకు పాత్రులైనారు.
యజ్ఞవిధి విధానములను దేవీభావగతంలో వేదవ్యాసుడు జనమేజయునికి వివరించిన విధానము మహనీయమైనది. మునులు మహనీయుల కొరకు సాత్విక యజ్ఞము, రాజుల కోసం రాజసిక యజ్ఞం, దానవులు అనగా రాక్షసుల కొరకు తామస యజ్ఞములు తెలుపబడినవి. జ్ఞానులైనవారి కోసం, వైరాగ్యం అవలంభించినవారికి జ్ఞాన మయ యజ్ఞము తగినది.
మరొక గొప్ప యజ్ఞము మానస యజ్ఞము. లోకంలో వైరాగ్యమును పొందినవారు, మోక్షమును కాంక్షించే పురుషులు, మహాత్ములకు మానసిక యజ్ఞ విధానము తెలుపబడినది. మహాత్ములు ఆచరించే యజ్ఞమునకు ఏ వస్తువుల లోపం ఉండదు. ఒక్క మానస యజ్ఞమునందు తప్ప ఏ ఇతర యజ్ఞమునందైనను సమస్త సాధనలు సమకూరజాలవు. మానసిక యజ్ఞము ఆచరించువారికి ముందుగా మానసిక శుద్ధి కావాలి. వారి మనస్సు సర్వదా గుణరహితమై ఉండాలి. అలాంటి పురుషుడే ఈ మానసిక యజ్ఞ నిర్వహణకు అధికారి, అర్హుడు. మనస్సులోనే పలు యోజనాల వైశాల్యముగల మండపం నిర్మించి, అనుబంధంగా సుందరమైన చెట్లను అలంకరించుకోవాలి. మానసికంగా విశాల వేదికను కల్పన చేయాలి. మదిలోనే కర్తవ్యమును పాటిస్తూ, బ్రహ్మను అధర్వుని, హోతను, ప్రస్తోత రూపంలో బ్రాహ్మణశ్రేష్ఠులను నియమించుకోవాలి. ఉద్గాతను, ప్రతిహర్త, ఇతర సదస్యులను కల్పన చేసుకోవాలి. శ్రేష్ఠులైన బ్రాహ్మణులందరకు మానసిక పూజ చేయాలి.
పంచాగ్నులైన ప్రాణ- అపాన - వ్యాన - ఉదాన - సమానములను వేదికపై విధి విధానములతో స్థాపించాలి. పంచాగ్నులైన గార్హపత్యాగ్ని స్థానంలో ప్రాణమును, ఆహవనీయ స్థానమున అపానమును దక్షిణాగ్ని స్థలంలో వ్యానమును, ఆ వసధ్యస్థలంలో సమానమును, సభ్యుని స్థానమునందు ఉదానమును కల్పన చేసుకోవాలి. ఈ పంచాగ్నులన్నియు తేజస్సంపన్నములు. మనసులోనే ద్రవ్యభావన చేయాలి. నిర్గుణమగు మనస్సే యజమానుని కార్యమును నిర్వహించును.
మానసిక యజ్ఞమునకు ప్రధాన దైవము నిర్గుణుడు- అవినాశియగు సాక్షాత్తు పరబ్రహ్మయే. పిదప భగవతి అయిన జగదంబిక నిర్గుణశక్తి రూపమున వచ్చి సదా ఆనందమును, సత్ఫలమును యిస్తుంది. అనుగ్రహిస్తుంది. జగదంబిక కల్యాణ స్వరూపిణగదా! ఆమె వలననే సకల విశ్వం నిలిచి వుంది. ఆ జనని సర్వత్ర వ్యాపించి యున్నది. మానసిక యజ్ఞము చేయు బ్రాహ్మణుడు జగదంబికను తలంచి- కల్పించిన వస్తువులను యజ్ఞ్భండారములను బ్రహ్మాగ్నియందు హవనం చేయాలి. చిత్తము ఏకాగ్రంగా ఉండాలి. నిరాధరముగా, సంకల్ప రహితంగా మనస్సునుంచుకోవాలి. ఈ పవిత్ర మానసిక యజ్ఞ కార్యమును స్వానుభవంతో నిర్వహించాలి. సమాధి స్థితుడై పరబ్రహ్మ స్వరూపిణియైన భగవతిని ధ్యానించి, పరబ్రహ్మను దర్శించాలి. అట్టివేళలోనే అతడు భగవతిని దర్శించగలడు. జగదంబిక దర్శనంతో ఆ పురుషుడు బ్రహ్మజ్ఞాని కాగలడు. మోక్షాన్ని పొందగలడు. సాధన, ఉపాసనలతో కృతకృత్యుడౌతాడు. మానసిక యజ్ఞము సర్వశ్రేష్ఠముగాన, అన్ని యుగములలోని పురుషులు సాధన ద్వారా ఏకాగ్ర చిత్తముతో, పరబ్రహ్మప్రాప్తికొరకు మానసిక యజ్ఞములు ఆచరించాలి. తరించాలి. వ్యాసభగవానుడు జనమేజయునికి మానసిక యజ్ఞ వైశిష్ట్యమును దెలిపి తద్వారా పొందే ఫలితము అద్భుతమనీ తెలియజేశాడు.

-పి.వి.సీతారామమూర్తి