మంచి మాట

ప్రేరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాజంలో ఒక వ్యక్తి ఉన్నత శిఖరాల నధిరోహించడం అంత తేలిక కాదు. అట్లాగే వ్యక్తులందరూ ఒకలా ఉండరు. శైశవదశ నుండి, విద్యార్థి, ఉద్యోగి దశల తరువాత జీవితపు చివరి దశలలో మంచి వ్యక్తిగా మిగిలిపోవడం ఎన్నో అంశాలమీద ఆధారపడి ఉంటుంది.
పాఠశాలకు ప్రాథమిక విద్యకోసం, కళాశాలకు ఉన్నత విద్య కోసం వెళ్లకముందు చిన్న పిల్లలకు ఇంట్లో తల్లిదండ్రులు, తోబుట్టువులే ప్రేరణ అవుతారు. ఏమి చేయాలి, ఏమి చేయకూడదు.. మొదలు- ఏది మంచి, ఏది చెడు అనేది కూడా వాళ్లనుండే పిల్లలు తెలుసుకొని ప్రేరణ చెంది ఉత్తేజితులవుతారు.
తరువాత గురువులే విద్యార్థులకు విద్యను బోధించి అన్ని రంగాలలో ముందుకు వెళ్లడానికి ప్రేరణ కల్పిస్తారు. ప్రేరణవల్ల పిల్లలు ఉత్తేజితులవుతారు. ఆ పిమ్మట ఆయా రంగాలలో ప్రావీణ్యం సంపాదించి, మంచి స్థానాలలో స్థిరపడతారు. గురువులు బోధిస్తారు, వివరిస్తారు, నిరూపిస్తారు, మనసులో చెరిగిపోని ముద్ర వేస్తారు.
దీనినుండి అర్థమయ్యేదేమంటే ప్రేరణవలన వ్యక్తులు తమ కర్తవ్యంమీద ఆసక్తి కలిగి ప్రబలుతుంది. ఈ ఉత్తేజంతో, ఉద్దీపనం చెంది సంఘంలో మిగిలినవారిని కూడా సుందరమైన భవిష్యత్తువైపు నడపడానికి ఉద్యుక్తులవుతారు.
మహాభారతంలో చూస్తే ఏకలవ్యుడు గురువు దగ్గర విలువిద్యను అభ్యసించకపోయినా, ద్రోణాచార్యుని గురించి తెలుసుకొని తనంత తానే ప్రేరణ పొంది, ఆయన విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకొని, ఎంతో దీక్షతో విలువిద్యను నేర్చుకొంటాడు. అందులో అర్జునుడంతటివాడవుతాడు. చివరకు ద్రోణాచార్యుని స్వార్థంవలన, తన బొటనవేలిని గురుదక్షిణగా సమర్పించి ఆ ఇతిహాసంలో గొప్పవాడిగా మిగిలిపోతాడు.
రామాయణంలో, విశ్వామిత్రుని అనుసరించి వెళ్లిన రామలక్ష్మణులు, ఆ మహర్షి ఇచ్చిన ప్రేరణతోనే ఉత్తేజితులై ఆయా దివ్యాస్త్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, శక్తి సంపన్నులవుతారు. తదనంతరం లంక దగ్గర జరిగిన యుద్ధంలో రావణుని దునుమాడి పుణ్యపురుషులుగా పేర్గాంచారు.
క్రౌంచ పక్షులను బాణాలతో కొట్టిన నిషాదుడు, ఆ తర్వాత భగవత్ప్రేరణలోనే తన స్వభావాన్ని మార్చుకొని, తపశ్శక్తితో సాధన చేసి మహారామాయణ కావ్యాన్ని రచించి వాల్మీకిగా రూపాంతరం చెందటం- ప్రేరణ, ఉత్తేజము, వికాసాల కలయికగాక మరేమిటి? విద్యార్థి దశలోనే, నరేంద్రుడు (వివేకానందుడు), అబ్రహం లింకన్ వంటివారిని ఆదర్శంగా చేసుకొని ప్రేరణ పొంది, మానసిక పరిపక్వత సాధించగలిగితే ప్రతి విద్యార్థి తప్పనిసరిగా జీవితంలో ఉన్నత స్థానాలకు చేరతాడు. ఇక్కడ అతడు తన హక్కులకన్నా బాధ్యత, కర్తవ్యం, విధి నిర్వహణ వంటి అంశాలపై దృష్టి సారిస్తే, నిరంతర కృషి సాగిస్తే తప్పకుండా మరెంతమందికో స్ఫూర్తి ప్రదాత అవుతాడు.
మనిషికి జీవితం ఒక పోరాటమనిపిస్తే, ధైర్యంతో పోరాడి గెలవాలి. జీవిత సారాన్ని, జీవిత సౌందర్యాన్ని, జీవిత మాధుర్యాన్ని, జీవిత లక్ష్యాన్ని, జీవిత సాఫల్యాన్ని, చివరకు జీవిత గమ్యాన్ని, వేర్వేరు ప్రేరణల ద్వారా లభించిన మానసికోల్లాసంతో సాకారం చేసుకోగలగాలి. ఈ ప్రేరణల ద్వారా కలిగిన నైతిక స్థైర్యంతో, జీవితంలో- ప్రేమను ఆస్వాదించి, దుఃఖాన్ని ఎదుర్కొని, అధిగమించి, వాగ్దానాలను నిలబెట్టుకొని, బాధ్యతలను నిర్వర్తించి, బాధను దిగమింగుకొని, సమస్యలను సవాళ్లను ఎదుర్కొని పరిష్కరించుకోగలగాలి. సవాళ్లను ఎదుర్కొనగలిగిన సత్తాఉన్నవాళ్లు నాయకులవుతారు. ఈ తన బృందంతో పనిచేయంచాలనుకొంటే నాయకుడు ఈ పనిని మనం చేద్దాం అంటాడు. ఎలా చెయ్యాలో నేర్పుతాడు. నాయకుడు చేసిన పనిని పొగడుతాడు. వారిని ప్రోత్సహిస్తాడు. కార్యం సఫలమైతే, సభ్యుల బృందానికి ఆ విజయాన్ని ఆపాదిస్తాడు. విఫలమైతే తానే ప్రధాన బాధ్యత తీసికొంటాడు. ఇట్లాంటి లక్షణాలున్నవారే నాయకులుగా చలామణి అవుతారు. నాయకులే బృందాన్ని సరియైన దారిలో నడించగలరు. అందరినీ ఏకతాటిపై నిల్చోబెట్టగలరు.

- పొత్తూరి రాఘవేంద్రరావు