మంచి మాట

కోపతాపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ జీవితం భగవంతుడిచ్చిన గొప్ప వరం. జీవితం మైనం ముద్దలాంటిది. మనం మన చేతులతో జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకుంటామో.. అలాగే మలచబడుతుంది. మంచైనా చెడైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఒక్క మనిషికే సాధ్యం. సకల జీవకోటి రాశిలో మానవ జనే్మ అత్యున్నతమైనది. అలాంటి జీవితాన్ని కేవలం క్షణికమైన సుఖాలకోసం.. వెంటరాని ఆస్తి అంతస్థుల హోదాల మైకంలో మనిషి జీవితాన్ని నరకం చేసుకుంటున్నాడు. అలాంటి జీవితం ఎందుకు? ఎవరికోసం? ఏదైనా మనం చేసే పనులవల్లే మనం పోయినా కూడా పది కాలాలు తల్చుకునేలా చేస్తాయి. అంతేకాని, ఈ సకల చరాచర సృష్టిలో ఏది శాశ్వతం కాదు. ఈ విశాల జగతిలో అంతా భగవంతుని లీలామాయామయమే. మనిషి కేవలం నిమిత్తమాత్రుడే.
మన భారతావని ఎన్నో విశేషాలకు ఆలవాలం. ఓ పక్క హిమాలయాలు.. నదులు.. సాగరాలు ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరాలు. మన భూమి వేదభూమి.. కర్మభూమి. ఎందరో మహాత్ములకు జన్మనిచ్చిన పుణ్యభూమి. ఎందరో మహర్షులకు పుట్టినిల్లు. వారు కేవలం మనకోసం తరలివచ్చిన భగవంతుని రూపాలు. వారు చూపిన మార్గాలు సదా ఆచరణీయాలు. వారి వాక్కులు మనకు మార్గదర్శకాలు. మన పురాణాలు, వేదాలు ప్రపంచ దేశాలకు సైతం ఆచరణీయాలు. పూర్వమే ఎందరో మహర్షులు గాలిలో తిరిగారు, నీటిపై నడిచారు, ఎన్నో అదృశ్య శక్తులను చూపించారు. అదంతా ఆ భగవంతుడిచ్చిన గొప్ప వరాలు. ఆ భగవంతుడి వారసులమే మనం.
ఈ అనంత విశ్వం ఓనాడు శూన్యం. ఆ శూన్యంలో ఉద్భవించినదే ఓంకారం. ఆ ఓంకార రూపమే భగవంతుడు. భూమి, నీరు, నింగి, వాయువు, నిప్పు అనే పంచభూతాలను మనకు భగవంతుడు ప్రసాదించాడు.
ఆ పంచభూతాలు లేనిదే మనిషి మనుగడ లేదు. పూర్వం ఏమి తెలియని మానవ రూపం దాదాపుగా.. వానర రూపం పోలి వుండేది. కాలానుగుణంగా మనిషిగా రూపం మార్చుకొన్నాడు. ఆ పంచభూతాలను తనకై వినియోగించుకొన్నాడు. మన ప్రాణం వాయు రూపంలో వుంటుందని మనమెరిగిన సత్యం. నిప్పుతో వెలుగును చూశాడు. వంటలు వండుకొన్నాడు. ఆకాశం నుండి వాన పడుతుంది. వాన వాగై, నదై సాగరంలో కలుస్తుంది. నీరు లేని మనిషి జీవితం ఊహించలేం.
మానవుడు తన స్వార్థం కోసం పంచభూతాలను కలుషితం చేసేశాడు. అందుకే కరువులు, కాటకాలు, అతివృష్టి, అనావృష్టి. రూపంలో మనం తల్లడిల్లిపోతున్నాము. మురికినీరుతో పంటలు పండిస్తున్నాము. వాటిని తిని కొత్త రోగాలకు స్వాగతం పలుకుతున్నాము. ఇప్పటికైనా మనం కళ్లు తెరవకపోతే అంతా నాశనమే. సర్వనాశనమే.
ఆ భగవంతుడు గుప్పెడు నీళ్లతో అభిషేకిస్తే పరవశిస్తాడు. రెండు చేతులెత్తి నమ్కరిస్తే వరాలిస్తాడు. ఈ జన్మ తరించాలంటే.. ఆ భగవంతునికి ఆత్మనివేదన చేయాలి. మనస్ఫూర్తిగా హృదయాంజలులు అర్పించాలి. అంతకుమించి ఏమీ కోరడు ఆ భగవంతుడు. మానవ సేవయే మాధవ సేవ అన్నారు మహాత్ములు. సాటి మనిషిని సూటిపోటి మాటలతో మనసు గాయపర్చడం భావ్యం కాదు. మంత్రాలు చదివిన నోటితో తూటాల్లాంటి మాటలు రువ్వడం మానవత్వం కాదు. కొంతమంది దేవుడా దేవుడా అంటూనే తన అనేవారిని సైతం అనరాని, వినరాని మాటలతో దుయ్యబడుతుంటారు. అలాంటివారు ఎన్నటికీ క్షమార్హులు కారు దేవుడి దృష్టిలో. మరికొంతమంది వుంటారు.. తీయని మాటలతో గొంతులు కోస్తారు. ఇలాంటివారిని అసలు నమ్మకూడదు. మనిషిని మనిషిలా చూస్తే చాలు. ఈ కలియుగంలో ఏనాటికైనా మంచి, మానవత్వం విజయం సాధిస్తాయి. అనవసరమైన కోపతాపాలకు పోయి జీవితాలను దుర్భరం చేసుకోవడం భావ్యం కాదు. మన మేలు కోరే ఆత్మీయులయందు సదా కృతజ్ఞతాభావంతో వుండాలి. అపుడే ఈ జన్మకో అర్థం - పరమార్థం. మనిషి మానవత్వంతో పరిమళించాలి. మన భారతావని కీర్తిని దిగంతాల అంచులు దాటించాలి. మన జీవితాలను నందనవనంలో ఆనందాల తీరాలకు చేర్చాలి.

-కురువ శ్రీనివాసులు