మంచి మాట

శివరాత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్వ జగత్తు శివమయం. శివపార్వతులు ఆదిదంపతులు. శివాని సర్వమంగళ. శివుడు మంగళప్రదుడు. శివుడు విభూతి ధరించి ఆభరణాలుగా పాములను అలంకరించుకొని, పులిచర్మము కట్టుకుని చూపరులకు భీతికొల్పించేటట్లుగా దర్శనం ఇస్తాడు. దేవదానవులు క్షీరసాగరాన్ని మధించినప్పుడు పుట్టిన హాలాహలాన్ని కంఠాన పట్టి నీలకంఠేశ్వరునిగా పేరెన్నికగన్నవాడు. కాని, ఆ శివుడు భోళాశంకరుడు. భక్తులకు వరాలనిచ్చి భక్తవరదుడన్న ఖ్యాతి పొందినవాడు. అహర్నిశమూ ఆ శివుడు శ్రీరామ ధ్యానమగ్నుడై ఉంటాడు.
శివదర్శనం ముక్తిదాయకం. శివనామమే కల్యాణ కారకం. ‘శం’అంటే మేలు అని అర్థం. ‘కర’అంటే కూర్చువాడని అర్థం. ఎల్లరకూ మేలుచేయువాడు కాబట్టి ‘శంకరుడన్నారు’. ఆ స్వామి సర్వాంతర్యామి. భక్తితో ఆర్తిగా పిలిస్తే తనకై తాను వచ్చి ఆదుకుంటాడు. అంతేకాదు శివతత్త్వంలో శివ, రుద్ర, ఈశ్వర అన్ననామాలల్లో రుద్ర అనే శబ్దానికి దుఃఖ నివారకుడుఅని, శివ అంటే మంగళకరుడని , ఈశ్వర అంటే సర్వ నియామకుడని అర్థాలు ఉన్నాయ.
బ్రహ్మవిష్ణువుల మధ్య తలెత్తిన అహంకారాన్ని తన తేజోస్వరూపంతో దూరం చేసిన మహాదేవుడు ఆదిభిక్షువు. లింగోద్భవంతో మహావిష్ణువు బ్రహ్మలకే కాదు సర్వజనావళికి మంగళాలుకలిగాయ. ఆ శివలింగోద్భవాన్ని పురస్కరించుకుని ప్రతి మాసాంతంలోను చతుర్ధశి రోజున మాసశివరాత్రిగా భావించి లింగాభిషేకాలు జరుపుతారు. మాఘమాసంలో కృష్ణ పక్షంలో వచ్చే చతుర్థశినాడే లింగోద్భవం జరిగింది కనుక ఈ రోజున మహాశివరాత్రిగా పరిగణించి శివునకు విశేషార్చనలు, విశేష పూజాదికాలు, విశేషఅభిషేకాలు నిర్వర్తిస్తారు. శివరాత్రినాడు దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు శివనామంతో హోరెత్తుతాయ.ఈ శివరాత్రి పండుగను భారతదేశమందంతటా వారు వీరు అనే భేదమేమి లేకుండా మహోత్సాహంతో ‘ఓం నమశ్శివాయ’ అని పలుకుతూ జరుపుకుంటారు.
శివరాత్రి పర్వదినంనాడు కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేసి పరిశుభ్ర వస్త్రాలు ధరించి దగ్గరలోని శివాలయానికి వెళ్లి స్వామివారికి అభిషేకం చేయడం అనాదిగా వస్తోంది. శివరాత్రినాడు భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షను తరతమభేదం లేకుండా పాటించడం కూడా ఆనవాయతీగా వస్తున్నదే. సాయంత్రం నల్లనువ్వుల పిండితో నలుగుపెట్టుకుని స్నానం చేసి విభూతి ధరించి శివాలయానికి వెళ్లాలి. అక్కడ జరిగే శివపార్వతుల కల్యాణం తిలకిస్తూ జాగరణ చేస్తారు. ఆ తర్వాత లింగోద్భవ కాలంలో శివలింగానికి రుద్రాభిషేకాలు జరుపుతారు.
శివరాత్రివ్రతంనాడు సత్యం, అక్రోధం, బ్రహ్మచర్యం, దయ, క్షమ, లాంటి గుణాలతో ఉపవసించాలి. శివరాత్రి రోజు ప్రాతఃకాలంలోనే పరిశుభ్రమైన నువ్వుల నూనెను శివలింగంపై పోసి, మృత్యుంజయ జపాన్ని చేస్తే, సంతుష్టాంగుడైన ఆ పరమశివుడు అపమృత్యువునుంచి కాపాడతాడని శివపురాణం చెప్తుంది. సర్వసంపదలు వృద్ధిపొందడానికి కొబ్బరి నీళ్లతో అభిషేకించాలని శాస్త్రాలు చెబుతున్నాయి శివపురాణం, భవిష్యపురాణం, లింగపురాణాలు శివరాత్రి ప్రశస్త్యాన్ని విశేషంగా చెప్తున్నాయ ఈ శివరాత్రి వ్రతాన్ని 12 ఏళ్లు గాని, ఇరవై ఏళ్లుకాని చేస్తారు. ఇలా చేయడం వల్ల ఈలోకంలోనూ, పరలోకంలోనూ సుఖ శాంతులు లభిస్తాయని ఈశ్వర సంహిత తెలుపుతోంది.
జగద్గురువు ఆదిశంకరాచార్యుడు, కన్నప్ప, మార్కండేయుడు, శ్రీరాముడు లాంటి ఎందరో భక్తులు శివుణ్ణి నిర్మలమైన మనస్సుతో పూజించారు. శివతత్వాన్ని అర్థం చేసుకొంటే మానవుల్లో మానవత్వం పరిమళిస్తుంది. శివరాత్రి అంతరార్థాన్ని గ్రహిస్తే పశుత్వం వీడి మానవులంతా దివ్యత్వాన్ని పొందుతారు.
శివరాత్రి అనేకాక ప్రతిరోజు శివనామాన్ని జపించేవారికి ఇహలోకంలోను, పరలోకంలోను సంపదలు ఒనగూరుతాయ.

- ఎ. రాజమల్లమ్మ