మంచి మాట

పరశురామజయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దశరథ రాముడు కల్యాణరాముడై సీతారామునిగా తన బంధు మిత్రసమేతంగా అయోధ్యకు తరలి వస్తుండగా భయోత్పాతం కలిగించేవిధంగా పరశురాముడు ప్రత్యక్షమవుతాడు. పరశురాముడిని చూచి దశరథుడు భయపడి ఆర్ఘ్యపాద్యాదులు సమర్పించి భక్తిని ప్రకటించాడు. ఇపుడు తన కుమారులకు వివాహం చేసుకొని కొత్త కోడళ్ళతో నగర ప్రవేశం చేస్తున్నామని తమను ఆశీర్వదించమని కోరుతాడు. అన్నీ విన్న పరశురాముడు శివుని విల్లు విరిచిన రాముడిని విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టవలసిందిగా కోరుతాడు. ‘‘నేను ఎక్కుపెట్టిన చాపం వృథా పోవడానికి వీలులేదు కనుక నీవు ఏ దిశగా శరప్రయోగం చేయమంటావు’అని అడిగిన రామునితో తన పుణ్యలోకాలవైపు బాణాన్ని ఎక్కుపెట్టమని చెప్పి తాను మహేంద్రగిరులవైపు తపస్సుకై తరలివెళ్లిన పరశురాముడు రేణుకాదేవి, జమదగ్నుల కుమారుడు. అమేయబలసంపన్నుడు. మాతృభక్తి కలవాడు.
రేణుకాదేవి ఒకసారి నదీనీటిని తీసుకొని రావడానికి వెళ్లి అక్కడ గంధర్వుల జరిపే కేళివిలాసాలను చూస్తూ కాలయాపన చేస్తుంది. దీనికి నొచ్చుకున్న జమదగ్ని తల్లి తలను నరికివేయమని తన పుత్రులకు చెబుతాడు. పరశురాముడు వెంటనే తన తల్లి తలను నరికివేస్తాడు. తనకిష్టమొచ్చిన పనిని చేసిన పుత్రుడిని చూచి ఆనందించి నీకిష్టమైన కోరికను కోరుకోమని జమదగ్ని అంటే తన తల్లిని బతికించమని వేడుకుంటాడు. అంతటి మాతృప్రేమ గల ధీశాలి పరశురాముడు.
మహావిష్ణువు సృజియంచుకున్న దశావతారాల్లోనిదే పరశురామావతారం అంటారు. ఈ అవతారాన్ని ఆవేశవతారంగా చెప్తారు. స్కంధ,బ్రహ్మండపురాణాలు పరశురామ జయంతిని వైశాఖ ద్వితీయగా చెబుతాయ. కార్తవీర్యార్జ్జునుడు దత్తాత్రేయుని మెప్పించి వేయ చేతులను సంపాదించుకున్నట్టివాడు. అతడు ఒకనాడు తన సైన్యసమేతంగా వేటకు వెళ్లి అక్కడ అలసిపోయ దగ్గరలోని జమదగ్ని ఆశ్రమానికి వెళ్తాడు. అట్లా అలసిన కార్తవీర్యార్జ్జునుడికి సకల సౌకర్యాలతో విందునిస్తాడు జమదగ్ని. ఇలాంటి షడ్రసోపేతమైన విందు నివ్వడానికి కామధేనువు బిడ్డ కారణమని తెలుసుకొని ఆ ధేనువును తనకివ్వమని అడుగుతాడు. ఇవ్వనన్న జమదగ్ని మాట వినక తానే బలవంతంగా గోవును తీసుకొని వెళ్లిపోతాడు. పరశురాముడు ఇంటికి వచ్చి జరిగిన విషయం తెలుసుకొన్నాడు. కోపోద్రిక్తుడయ్యాడు. వెంటనే కార్తవీర్యార్జునుని దగ్గరకు వెళ్లి అతని బాహువులు నరికి తన తండ్రి పెంచుకునే కామధేనువును తిరిగి తీసుకొని వస్తాడు.
ఈవిషయం తెలుసుకొన్న కార్తవీర్యార్జునుని కొడుకులు పరశురాముడు లేని సమయం చూచి జమదగ్ని ఆశ్రమానికి వచ్చి ధ్యానంలో కూర్చుని ఉన్న జమదగ్ని తల నరికి తమ వెంట తీసుకొని వెళ్తారు. తిరిగి పరశురాముడు వచ్చి కార్తవీర్యార్జునులతో పోరాడి తన తండ్రి తలను తెచ్చి అతికించి జమదగ్నిని పునర్జీవితుడిని చేసిన ధీశాలి పరశురాముడు. శమంతకమనే ఐదు సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపిన క్షాత్రతేజం గలవాడు పరశురాముడు. అటువంటి బలశాలి 21 సార్లు దండెత్తి అవినీతి, అన్యాయపరులైన క్షత్రియులను మట్టుపెట్టాడు.తాను యుద్ధం చేసి గెలిచిన భూమి నంతా కశ్యపమహర్షికి దానం చేసి తాను నిరాడంబరంగా తపస్సు వెడలిన పరమ మునివరేణ్యుడు పరశురాముడు. వైశాఖద్వితీయనాడు పరశురాముని స్మరించి ఆర్ఘ్యపాద్యాదులు చేయాలని వ్రతగ్రంథాలు చెబుతున్నాయ. గంగాదేవి అభ్యర్థన మేరకు భీష్మునికి అస్తవ్రిద్యలు నేర్పాడు. పరశురాముని దగ్గర తాను బ్రాహ్మణుడినని నమ్మించి కర్ణుడు కూడా అస్త్ర విద్యలు నేర్చుకున్నాడు. కాని సంగతి తెలసుకొన్న పరశురాముడు కోపావేశంతో కర్ణుడికి యుద్ధ సమయంలో నీవు నేర్చుకున్న విద్యలేవీ నీకు అక్కరకు రావు అని శాపమిచ్చాడు.
కేరళ లోని తిరువనంతపురం దగ్గర తిరువళ్లంలో నది ఒడ్డున ఒక పురాతన పరశురామాలయం ఉంది. ఇక్కడ పితృదేవతలను పూజించడం ఆచారంగా ఉంది. ఉడిపి, కొల్లూరు, గోకర్ణం, కుక్కి సుబ్రహ్మణ్యేశ్వరుడు, శంకర నారాయణ కుంభాసి, కోటేశ్వర క్షేత్రాలను పరశురామ క్షేత్రాలని అంటారు.

చివుకుల రామమోహన్