మంచి మాట

యత్నము - కార్యసిద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యుద్ధము ద్వారా భ్రాతృజన మరణానికి కారకుడనవుతానని, విషాదంతో అలమటిస్తున్న అర్జునుడికి భగవాన్ శ్రీకృష్ణుడు కర్తవ్యాన్ని గీతద్వారా ప్రబోధించాడు. యుద్ధములో మరణించినచో వీర స్వర్గము, జయుడైనచో సకల రాజ్యభోగాలు సంప్రాప్తిస్తాయని యుద్ధం చేయవలెనన్న నిర్ణయాన్ని గైకొనుమని ఆదేశించాడు. అనిశ్చిత స్థితిలో, సందిగ్ధ పరిస్థితిలో, సతమతమవుతున్న అర్జునుడికి దిశానిర్దేశనం చేసి అనేక ధర్మ సూక్ష్మాలను బోధించి కార్యోన్ముఖుడిని చేసాడు గీతాచార్యుడు. యుద్ధాన్ని చేసి విజయుడు రాజ్యలక్ష్మిని వరించాడు.
ఒక పని చేయడానికి పూనుకోవాలా! వద్దా! పర్యవసానాలేమిటి? ఆశించిన ఫలితం దక్కుతుందా? అపజయం తప్పదా! అన్న సందిగ్ధ పరిస్థితి మనందరికీ కలిగేదే. స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయం తీసుకోలేక మానసిక వ్యధ అనుభవిస్తున్న తరుణంలో మిత్రవాక్యం, లేక ఆప్తవాక్యం ఉపకరిస్తుంది. శ్రేయోభిలాషులైన బంధుమిత్రులు మాత్రమే సరైన సలహాలిచ్చి విజయానికి పరోక్షంగా కారణమవుతారు.
కానీ కొందరు వ్యక్తులు మంచిని నటిస్తూ తప్పుడు సలహాలు ఇవ్వడం లేదా నిరాశను నిరుత్సాహాన్ని కలగచేస్తారు. కార్య సాధకుడికి కూడ ప్రయత్న భంగం కలగచేస్తారు. ఇటువంటి వారి విషయంలో జాగ్రత్తగా మెలగాలి.
ఆత్మబుద్ధిఃసుఖంచైవ, పరబుద్ధిఃప్రళయాంతకః అన్న ఆర్యోక్తిని అనుసరించి తమ శక్తియుక్తులను ఒడ్డి, స్పురించిన మంచి ఆలోచనలను ఆచరణలో పెట్టి విజయాల్ని అనేకులు సాధిస్తారు. మిత్ర వాక్యమును ఆలకించక వేటగాడి వలలో చిక్కుకుని ప్రాణహానిని కొని తెచ్చుకున్న పావురాల దృష్టాంతాన్ని పంచతంత్రలో మనకు కనిపిస్తుంది. పోగాలము దాపురించినవారు దీపనిర్వాణ గంథమును, అరుంధతిని, మిత్ర వాక్యమును మూర్కొనరు, కనరు వినరు అని పరవస్తు చిన్నయసూరి తెలియజేసారు. అశాంతి, అసంతృప్తితో రగులుతున్న సమయాల్లో మిత్రవాక్యం ఒక ఔషధంలాగ పనిచేసి ఉత్సాహాన్ని, కార్యనిర్వహణ శక్తిని కలగచేయవచ్చును.
సీతాపహరణ అనంతరం రామలక్ష్మణులు సీతానే్వషణకు బయలుదేరారు. రాముడిని అమిత దుఃఖం ఆవరించింది.సూర్యుడిని, గౌతమీ నదిని సీత జాడ ఎక్కడ అని అడిగాడు. సమాధానం రాక విలపించసాగాడు. అప్పుడు లక్ష్మణుడు శోకం నీకు తగదు. ధైర్యంతో ఉత్సాహంతో సీతను వెదుకుదామని ధైర్య వచనాలు చెప్పాడు. అలాగే రాముడు అతిక్రోధుడై సీతను అపహరించిన రాక్షసుడెవరో తెలియక సమస్త ప్రాణికోటిని భస్మం చేసే అస్త్రాన్ని సంధించాలని ప్రయత్నిచాడు. అప్పుడు కూడా లక్ష్మణుడు భూతదయ గల నీకు క్రోధం తగదని వారించాడు. ఇలా తమ్ముడి హితవాక్యాలు రాముడిని కార్యోన్ముఖుని గావించాయి.
నూరు యోజనాల సముద్రాన్ని దాటి లంకలో సీతను చూచిరాగల సమర్ధుడివి అమిత బలసంపన్నుడివి, గొప్ప ప్రతిభ, వాక్చాతుర్యం గలవాడవు నీవే అని హనుమంతుని ప్రోత్సహించాడు జాంబవంతుడు. ఇంద్రుడికి, సూర్యుడికి, సర్వభూతాలకు నమస్కరించి సముద్రాన్ని లంఘించి లంకను చేరాడు వాయునందనుడు. లంకలో అన్ని ప్రదేశాలను గాలించాడు. అశోకవనానికి వెళ్లక ముందు సీత జాడ కన్పించలేదని నిరాశపడ్డాడు. చితి పేర్చుకుని మరణిస్తాను కానీ సీత జాడ తెలుసుకోకుండా కిష్కందకు వెళ్లనని దృఢ నిశ్చయంతో అశోక వనానికి వె ళ్లి జానకి దర్శనం చేసుకున్నాడు. రామకథాగానం చేసి ఆమెను ఆకర్షించాడు. అంగుళీయకము ఇచ్చి తనను నమ్మమని ప్రార్ధించాడు. సీతమ్మతల్లి అతని వాక్చాతుర్యాన్ని సంస్కారాన్ని గ్రహించి అతనితో సంభాషించి చూడామణిని గుర్తుగా ఇవ్వగా తీసుకుని, రావణుని కూడా చూచి, లంకాదహనం చేసి, తిరిగి వచ్చి సీత జాడను రాముడికి నివేదించాడు. ఈప్రయత్నంలో ఎన్నో ఆటంకాలను, అభ్యంతరాలను ఎదుర్కొన్నా చివరకు విజయాన్ని సాధించాడు. కర్తవ్యాన్ని విస్మరించి వెనుదిరగలేదు ఆంజనేయుడు.
కర్తవ్య విముఖత మనిషి అభివృద్ధికి గొడ్డలిపెట్టులాంటిది. కర్తవ్యపాలన చేయని ప్రభువును ప్రజలు తిరస్కరిస్తారు. సమాజం, కర్తవ్యాన్ని మరిచిన మనిషిని హీనంగా చూస్తుంది. కార్యదీక్ష ఒక్కటే మనిషిని ఉన్నత శిఖరాలకు చేర్చుతుంది.

- వై.వి.రమణారావు