మంచి మాట

సముచితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేహ దారుఢ్యానికి ఆహారం ఎంత అవసరమో మానసిక స్థైర్యానికి ఆలోచన అంత అవసరం! ఆకలి తీరినా భుజించడం కొనసాగించడమంటే తినే పదార్ధాల రుచెలా వున్నా అజీర్తికి గురవడం సర్వసామాన్యం. తెలిసిమరీ కొని తెచ్చుకున్న అజీర్తిని తొలగించమని ఏ తీరున ఏ దైవాన్ని ఫ్రార్ధించినా ప్రయోజనం ఉంటుందా? అందుకు వుపయోగపడే మందు మింగుడంవల్ల ప్రయోజనం ఉంటుందా? మితాహారం అమితానందమని, మిత భాషణం భూషణమన్న నిజం నిలకడగా తెలుస్తుంది. జుట్టు ఊడిపోయాక దొరికే దువ్వెనకిగాని, పళ్లూడిపోయాక చేతికందే పటిక బెల్లానికి గానీ ప్రయోజనం ఏముంటుందనే వారు లేకపోలేదు.
జీవితం కోరికల పుట్టని ఒకరు చెబితే అవసరాల గుట్టగా ఇంకొకరు అభవర్ణిస్తారు. కోరిక మనిషిని కుదురుగా వుండనివ్వదు. అవసరం అన్ని వేళల్లా మనిషిని అతలాకుతలం చేస్తుంది. కోరికలు, అవసరాలు తీర్చుకునేందుకు, తీరని వాటి గురించి బాధ పడడమే జీవితమనుకుంటే మనిషై పుట్టినందుకు ఎవరైనా సాధించగలిగేదేమిటి? కోరికలు, అవసరాలు శారీరకమైనవైనా, మానసికమైనవైనా మనిషిని స్థిమితంగా ఉండనీయవు. ఒకనాటి ఆడంబరం నేటి కనీస అవసరమై కూర్చున్నట్టు సమర్ధించుకున్నా కోరికలు తీర్చుకోలేని జీవితం ఎందుకని ప్రశ్నించుకున్నా ఎవరి కొరిగేదీ ఏమీ వుండదు. ఇది చాలదన్నట్టు తన అవసరాలకు, కోరికలకు ఏలోటు లేకుండా రాకుండా చూడాలని భగవంతుని ఫ్రార్ధించేవారు ఎలాగూ ఉంటారు. అవసరాలను తీర్చమని, కోరికలను నెరవేర్చేలా చూడమని ఎంత ప్రాథేయపడినా అదెంతమాత్రం సరైంది కాదనేవారున్నారు. ఏ కోరికను కోరకుండా భగవంతుని ధ్యానించడం, పూజించడం అసలైన భక్తి కాగా అవసరాలను తీరేందుకో కోరికలు నెరవేరేందుకో మొక్కుకునేదైనా మరొకటైనా దైవభక్తి అనిపించుకోదు. భక్తుల అవసరాలను కోరికలు తీర్చి వారి చేత మొక్కులు చెల్లించుకోవడమే భగవంతుని కర్తవ్యం కాదుకదా! ధర్మాచరణములో, మోక్ష సాధనలో ఎవరెంత భక్తిని పెంచుకుంటున్నారో, అనుక్షణం గమనిస్తూ అందుకు తగిన సంకల్పాన్ని నియమ నిష్టల్ని పెంపొందింపచేస్తూ ఆపన్నులను సేవించడంలో తన దర్శన భాగ్యం ఫ్రసాదిస్తున్నాడు. ఎవరి ఆశల మేడ ఎలా ఉన్నా ఇవ్వధగినది మాత్రమే ఇస్తున్నాడు. మది మదిలో కావాల్సినంత ధైర్యాన్ని నింపుతున్నాడు.
నిజానికి దైనందిన జీవితమంతా స్నేహాలు, బంధుత్వాలతో ముడిపడి ఉందా? వాటి ముసుగులో అవసరాలు, కోరికలు పెత్తనం చేస్తున్నాయా? అటువంటి పరిస్థితుల్లో దైవ చింతనకు అవకాశమెక్కడ? ఎంతసేపూ నీ ఇంటికొస్తే ఏమిస్తావు? నా ఇంటికివస్తే ఏమి తెస్తావు? అన ధోరణిలో జీవనం సాగించేవారు ఎదుటివారి చీత్కారాలను లెక్కచేయకుండా బాగున్నామని భ్రమించడం తప్ప తమ జీవన విధానంలో ఎటువంటి ఆత్మగౌరవం ఫ్రతిబింబించదు. ఎవరి పుట్టుక వారి చేతిలో లేదన్నది నూరుపాళ్ల నిజమైనా ఎవరి జీవన విధానం నిస్సందేహంగా వారి ఆలోచనలను అనుసరించే వుంటుందనేది నిర్వివాదాంశం. తినే ఆహారం ఖర్చుతో కూడుకున్నదైనా మేలుచేసే ఆలోచనలకు ఖర్చుతో ఎంతమాత్రం పనిలేదు.
ఏ ఇరువురి జీవన విధానం ఒకేలా ఉండవు. ఆమాటకొస్తే ఏ ఇరువురి మాట తీరు సైతం ఒకలా ఉండదు. ఎదుటివారు తనను విన్నా వినకపోయినా చెప్పవలసిన దానికన్నా ఎక్కువ చేప్పేదొకరైతే తననువినాలని ఆసక్తి చూపే వారికి సైతం మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయేమో అన్నట్టుగా వుండేవారు ఇంకొకరు. ఎవరి తీరెలావున్నా నలుగురు నడిచిందే దారన్నది లోకం బలంగా విశ్వశిస్తుంది. లోకమేమని విశ్వసించినా భగవంతుని విశ్వసించేవారు నిస్సందేహంగా సత్యాన్ని విశ్వసిస్తారు. ధర్మాన్ని ఆచరిస్తారు. న్యాయాన్ని నమ్ముకుంటారు. ఫ్రతినిత్యం వాటిని తమ ఆ లోచనలో, జీవన విధానంలో ప్రతిబింబించేలా జాగ్రత్తపడుతుంటారు. అన్నింటిని మించి మంచి జరిగినా చెడు జరిగినా మోదమైనా ఖేదమైనా స్థిర చిత్తంతో స్వీకరిస్తుంటారు. సముచితమైన ఆలోచనలతో, సముచితమైన నిర్ణయాలతో తోటివారికి మార్గనిర్దేశం చేస్తూనే ఉంటారు.
**

రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక,
36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003

- కొల్లు రంగారావు